పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగాసెస్, రైతు చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటిపై అధికారపక్షం కూడా పట్టుబడుతుండటంతో.. పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి చర్చలు జరగడంలేదు. అయితే తొలిసారి అధికార, విపక్షాలు.. ఒక్క తాటిపైకి వచ్చాయి. ఓబీసీ జాబితాని నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టే బిల్లుపై అధికార, విపక్షాలు ఒకేమాటపై నిలుస్తున్నాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది.
అయితే, ఈ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని విపక్షాలు వెల్లడించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు చెప్పారు. రేపు, ఎల్లుండి ఉభయసభల్లో ఈ బిల్లుపై చర్చ జరిపి ఆమోదించుకునే యోచనలో ఉంది కేంద్రం. ఇందుకోసం బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.