పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలసి నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ రోజు రోజుకూ ఆసక్తి రేపుతోంది. మొన్న పవన్ కళ్యాణ్ లుంగీ కట్టి, దాన్ని పైకెగ్గొట్టి కొట్టిన డైలాగ్స్ అభిమానులను కిర్రెక్కించాయి. అదే చిత్రంలోని రానా లుక్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. రానా సైతం తనదైన అభినయంతో ఆకట్టుకుంటున్నారు. తన రెగ్యులర్ స్టైల్ గెడ్డంతోనే తానూ లుంగీ కట్టి రగ్గుడ్ లుక్ తో కనిపించారు.
రానా లుక్ టీజర్ లో “నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట… స్టేషన్ లో టాక్ నడుస్తోంది… నేనెవరో తెలుసా?… ధర్మేంద్ర హీరో…” అంటూ రానా చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. “డ్యానీ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్…” అంటూ మరో సీన్ లో జీపుపై నిలబడి రానా చెప్పిన మాటలు కూడా మారుమోగుతున్నాయి. అలా వచ్చిందో లేదో రానా లుక్ టీజర్ జనాన్ని ఆట్టే ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీమ్లా నాయక్ కాగా, డేనియల్ గా రానా నటిస్తున్నారు. ఇందులో ‘డ్యానీ’ అన్నది రానా ముద్దు పేరు. దాదాపు 46 ఏళ్ళ నాటి ‘షోలే’ పేర్లు ‘గబ్బర్ సింగ్, ధర్మేంద్ర’ అన్నవి మళ్ళీ వినిపించేలా రానా టీజర్ సాగుతోంది.
సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ‘భీమ్లా నాయక్’ చిత్రం జనవరి 12న జనం ముందు నిలువనుంది. ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్యారాజేశ్, సముద్ర ఖని నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మళయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘భీమ్లా నాయక్’ తెలుగువారిని ఏ తీరున అలరిస్తుందో చూడాలి.