తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని ఆయన అన్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే ఉద్యోగ కేటాయింపు లు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని, 41 నెలలు ఏమి చేయకుండా ఇప్పుడు అగమాగం కేటాయింపు లు చేస్తున్నారని మండిపడ్డారు. సీనియర్లకు జూనియర్లకు పంచాయతీ పెట్టిస్తున్నారని, స్థానికత కోసమే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇప్పుడు ఆ స్థానికతను తుంగలో తొక్కారని ఆయన అన్నారు. ఒక జిల్లా ఉద్యోగి మరో జిల్లాకు కేటాయిస్తున్నారని, ఉద్యోగుల పాపం ఊరికే పోదు కేసీఆర్ అంటూ సంజయ్ ధ్వజమెత్తారు.