టాలీవుడ్లో హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ విజయాల్లో ముఖ్యంగా ఇద్దరు డైరెక్టర్లకు సింహ భాగం ఉంది. గతంలో బాలయ్య-బి.గోపాల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేది. వీరిద్దరి కాంబోలో చాలా హిట్లు ఉన్నాయి. లారీడ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలం కావడంతో ఆ తర్వాత వీరి కాంబినేషన్ మళ్లీ కనిపించలేదు.
Read Also: “అఖండ” సినిమాపై చంద్రబాబు స్పెషల్ ట్వీట్
కట్ చేస్తే.. బి.గోపాల్ స్థానంలో బాలయ్యకు ఇప్పుడు బోయపాటి శ్రీను వరుస హిట్లు అందిస్తున్నాడు. సింహా, లెజెండ్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను అందుకున్న వీరి జోడి ఇప్పుడు తాజాగా ‘అఖండ’ సినిమాతో తెలుగు పరిశ్రమకు మళ్లీ పాతరోజులను గుర్తుకుతెస్తున్నారు. దీంతో వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్లను అందుకుంది. ముఖ్యంగా అఖండ సినిమాలో బాలయ్య నటన, డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుత కాలంలో వెండితెరపై బాలయ్యను ఎలా చూపించాలో ఒక్క బోయపాటికే తెలుసు అని సినీ విశ్లేషకులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అఖండ సినిమా ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతున్నట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. అఖండ జోరు చూస్తుంటే… తొలి వీకెండ్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.