ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై తాజాగా టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. వరుసగా నానిపై ఎదురు దాడికి దిగుతున్నారు ఏపీ మంత్రులు… ఇక, నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సినీ హీరోలు పారితోషకం తగ్గించుకుంటే.. టికెట్ల ధరలు మరింత తగ్గుతాయని తెలిపారు. మరోవైపు.. హీరో నాని ఎవరో నాకు తెలియదంటూ ఎద్దేవా చేసిన మంత్రి అనిల్.. నాకు తెలిసింది కొడాలి నాని మాత్రమే నంటూ చమత్కరించారు.. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా మధ్యలోకి లాగారు అనిల్ కుమార్ యాదవ్.. పవన్ కల్యాణ్ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారన్న ఆయన.. ఆ మోజులో పడి నేను కూడా చాలా తగలేశానన్నారు.. అమ్మా నాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బును కొందరు యువకులు క్రేజ్ కోసం సినిమాలకు ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
ఇక, వకీల్‌సాబ్, భీమ్లా నాయక్ సినిమాకు అయిన ఖర్చెంత? పవన్ రెమ్యూనరేషన్ ఎంత? అని ప్రశ్నించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్… పవన్ కల్యాణ్ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకుంటే ఈ టికెట్ ధరలతో నష్టమే ఉండదన్న ఆయన.. సినిమాకయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయి, ఆ నలుగురు తీసుకునే కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి మేం పర్మిషన్ ఇవ్వాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు ఆవేశపడి జేబులు గుల్ల చేసుకోవద్దు అంటూ సూచించిన ఆయన.. చారిత్రక, సందేశాత్మక సినిమాలకు గతంలో రేట్లు పెంచుకునేవారు.. కానీ, ఇప్పుడు అన్ని సినిమాలకు పెంచడం ఏంటి? అని ప్రశ్నించారు. కాగా, సినిమా టికెట్ల వివాదంపై తాజాగా స్పందించిన హీరో నాని.. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందన్న నానీ.. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. ప్రభుత్వం కావాలని వారిని అవమానిస్తుందన్నారు. దీంతో.. వరుసగా మంత్రులు నానిపై ఎదురుదాడికి దిగుతున్న సంగతి తెలిసిందే.. సోషల్ మీడియాలోనూ నాని వ్యాఖ్యలపై రచ్చ నడుస్తోంది.