ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం జవాద్తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. జవాద్ తుఫాన్ ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిలోమీటర్లు, పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది.
అనంతరం తీరాన్ని ఆనుకుని కదులుతూ దిశమార్చుకుని ఒడిశాలోని పూరీ వైపుగా మరలే సూచనలు ఉన్నాయి.ప్రస్తుతం ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర కోస్తాంధ్రవైపు కదులుతోంది.ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది.ఉత్తర కోస్తా తీరప్రాంతాల్లో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్టెల్లా చెప్పారు.
ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు వున్నాయని హెచ్చరించారు. చాలా చోట్ల 20 సెంటిమీటర్లకు పైగా అధిక వర్షపాతం నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తున ఎగసిపడే ప్రమాదముంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాం.
ఉత్తర కోస్తాంధ్రలోని అన్ని పోర్టులకూ హెచ్చరికలు జారీ అయ్యాయి.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ వివరించారు. తుఫాన్ దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అంటూ సూచనలు చేస్తున్నారు.