సినిమా టికెట్ల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది.. సినీ ప్రముఖుల నుంచి వివిధ రాజకీయ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ వ్యవహారంలో కామెంట్లు చేయడంతో పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇక, సినిమా టికెట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే, సినిమా టికెట్ల విష్యూపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును లాంఛనంగా ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రతీ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.. కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇక, పేదవారికి వినోదం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో.. సినిమా టికెట్లపై నిర్ణయం తీసుకున్నా.. రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.. ఓటీఎస్ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారు. ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులేనని.. తమకు ఎన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేసినా అభివృద్ధి జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం-గవర్నర్
ఇక, పెన్షన్ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం.. సంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం అన్నారు సీఎం వైఎస్ జగన్… ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా.. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారని ఫైర్ అయ్యారు.. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా..? విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించిన ఏపీ సీఎం.. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయి. కానీ, అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే అన్నారు… 62 లక్షల మంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేదని విమర్శించిన సీఎం జగన్.. మేం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈనెలలోనే కొత్తగా 1.51 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాం.. గత ప్రభుత్వం పెన్షన్ కోసం రూ.400 కోట్లు ఖర్చు చేస్తే.. మన ప్రభుత్వం రూ.1450 కోట్లు ఖర్చు చేస్తోంది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వంలాగా పెన్షన్‌లో కోత లేదు. కుల,మతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు.. అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్.