మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలమైంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో తుఫాన్ ఏపీపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. గత నెల 29న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇప్పుడు వాయుగుండంగా బలపడి ఎల్లుండి తుఫాన్ గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, ఒడిశాలో 4న ఉదయం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, శ్రీకాకుళం, విశాఖ, విజయ నగరం జిల్లాలపై అధిక ప్రభావం ఉండనుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ, ఒడిశా, బెంగాల్ సీఎస్ లతో జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో ముందస్తు జాగ్రత్త లపై పలు సూచనలు, సలహాలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్మీ, నేవీని కూడా సిద్ధం చేసినట్లు కమిటీ వెల్లడించింది. ఇప్పటికే కేంద్రం 32 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది.