అచ్చ తెలుగువాడైన విశాల్ కోలీవుడ్ లో చక్రం తిప్పుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యేడాది అతను నటించిన ‘చక్ర’, ‘ఎనిమి’ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘సామాన్యుడు’ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల కాబోతోంది. దీనితో పాటు తన ‘డిటెక్టివ్’ మూవీకి సీక్వెల్ గా ‘డిటెక్టివ్ -2’ తీస్తూ, ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు విశాల్. అలానే ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ ‘లాఠీ’ పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీలో విశాల్ సరసన సునయన నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతనితో ‘ఎనిమి’ చిత్రం నిర్మించిన ఎస్. వినోద్ కుమార్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. దీనికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి కాగానే ఇది సెట్స్ పైకి వెళ్ళే ఆస్కారం ఉంది.