కరోనాపై పోరులో భారత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో వంద కోట్ల టీకాల మైలురాయిని దాటేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. అవకాశాలను, వనరులను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 5.01 కోట్ల డోసుల టీకాలను ఇచ్చారు. సోమవారానికి అది మరింత పెరగనుంది.
ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసులు టీకాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉంది. తాజాగా ఐదు కోట్ల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే మిగతా పెద్ద రాష్ట్రాలకంటే ఏపీలోనే ఎక్కువ శాతం మందికి టీకాలిచ్చామని అధికారులు అంటున్నారు. గతంలో కోవిడ్ టెస్టుల్లోనూ ఏపీ ప్రత్యేకత సాధించింది.
వ్యాక్సినేషన్ ఆరంభంలో దేశంలో తొలి మూడు నెలలు టీకాలు తీసుకునేందుకు ప్రజలు పెద్దగా ముందుకు రాలేదు. ఏప్రిల్ నుంచి కేసులు పెరగడంతో ఒక్కసారిగా టీకాకు డిమాండ్ బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వార్డు/గ్రామ సచివాలయాల వ్యవస్థ ఉండటం, వాలంటీర్లు చురుకుగా పనిచేస్తుండడంతో వ్యాక్సినేషన్ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. ఎక్కువ మంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నారు.
క్షేత్రస్థాయిలో టీకాలు వేగంగా అందరికీ ఇవ్వగలగడం, గ్రామాల్లోనూ ప్రజలు ముందుకు వస్తుండడంతో వ్యాక్సినేషన్ అద్భుతంగా సాగుతోంది. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ టీకాల ప్రక్రియ నమోదు అవుతోంది. హెల్త్‌కేర్ వర్కర్లు.. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారు, ఐదేళ్లలోపు చిన్నారులు తల్లులకు టీకాల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 18–44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది.
దేశంలో 5 కోట్ల టీకా డోసులు దాటిన రాష్ట్రాలు
ఉత్తర ప్రదేశ్ 12.54 కోట్లు
మహారాష్ట్ర 9..52 కోట్లు
గుజరాత్ 6.87 కోట్లు
రాజస్థాన్ 6.15 కోట్లు
కర్నాటక 6.33 కోట్లు
మధ్యప్రదేశ్ 6.85 కోట్లు
పశ్చిమబెంగాల్ 7.2 కోట్లు
బీహార్ 6.47 కోట్లు
తమిళనాడు 5.65 కోట్లు
ఆంధ్రప్రదేశ్ 5.01 కోట్లు