ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నాయి. వైసీపీ దాడులకు నిరసనగా రేపు (అక్టోబర్ 20) ఏపీ వ్యాప్తంగా బంద్ చేయాలని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం దారుణమని, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రాజకీయ పార్టీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్య సూచనలు చేశారు. అందరూ సంయమనం పాటించాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రమంతటా అదనపు బలగాలు మోహరించినట్లు ఆయన తెలిపారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.