ప్రస్తుతం అనసూయ అన్న పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా అనసూయ మురిపించిన వైనం- వెండితెరపై రంగమ్మత్తగా ఆమె వెలిగిపోయిన తీరు నవతరం ప్రేక్షకులను కట్టిపడేసింది. పట్టుదలే ఉంటే అనుకున్నది సాధించవచ్చు అన్నది అనసూయను చూస్తే అర్థమవుతుందని ఇటీవలే ఆమె సహ వ్యాఖ్యాతలే వ్యాఖ్యానించడం విశేషం. అనసూయ కెరీర్ ను చూస్తే అది నిజమనిపించక మానదు.
అనుకోకుండానే…అనసూయ…
ఎప్పుడో 2003లో జూ.యన్టీఆర్ ‘నాగ’లో కాసేపు తెరపై తళుక్కుమన్న అనసూయ, తరువాతి రోజుల్లో ఇంతలా ఆకట్టుకుంటుందని ఆ నాడు ఎవరూ ఊహించి ఉండరు. ‘నాగ’లో తళుక్కుమన్న అనసూయ ఎందుకనో నటన మీద మోజు పెంచుకోలేదు. ఎంచక్కా చదువుకొని 2008లో ఎమ్.బి.ఏ. పట్టా పుచ్చుకుంది. తరువాత ‘సాక్షి టీవీ’లో యాంకర్ గా కనిపించింది. ఆ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా మొదలెట్టారు. ఆ సినిమా ఓపెనింగ్ కు శ్రీదేవి ముఖ్యఅతిథి. ఆ ప్రారంభోత్సవంలో అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అప్పుడే రామ్ గోపాల్ వర్మ అనసూయలోని స్పార్క్ చూసి నటిగా అవకాశమిస్తానన్నారు. కానీ, అప్పట్లో అనసూయకు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదు. అందువల్ల రాము ఇచ్చిన ఆఫర్ ను అందిపుచ్చుకోలేదు. తరువాత బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో తన వ్యాఖ్యానంతో అలరించిన అనసూయకు ‘జబర్దస్త్’ మంచిపేరు సంపాదించి పెట్టింది. ఆ తరువాత సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు రావడం మొదలెట్టాయి.
వెండితెరపై…
‘నాగ’ తరువాత దాదాపు పదమూడేళ్ళకు నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’లో అనసూయ బుజ్జి పాత్రలో కనిపించింది. అందులోనే అనసూయ అందం అయస్కాంతంలా జనాన్ని ఆకర్షించింది. వెంటనే ‘క్షణం’లో ఏసీపీ పాత్రలో మెప్పించింది. ఇక ‘విన్నర్’ సినిమాలో ఆమె పేరుతోనే “సూయ…సూయ… అనసూయ…” సాంగ్ రూపొందింది. దీనిని బట్టే ఆమెకు ఎలాంటి క్రేజ్ లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఆపై కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ కనువిందు చేసింది అనసూయ. ఎన్ని చేసినా, ఆమెకు నటిగా మంచి మార్కులు సంపాదించిపెట్టింది రామ్ చరణ్ ‘రంగస్థలం’ అని చెప్పక తప్పదు. అందులో రంగమ్మత్తగా అనసూయ పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించింది. చిరంజీవి ‘ఆచార్య’, రవితేజ ‘కిలాడి’, అల్లు అర్జున్ ‘పుష్ప’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రాలలో అనసూయ కనిపించనుంది. వీటితో పాటు ‘భీష్మ పర్వం’ అనే మళయాళ సినిమాలోనూ నటిస్తోంది. మరి ఈ సినిమాలు వెలుగు చూశాక అనసూయ క్రేజ్ మరెంతగా పెరుగుతుందో చూడాలి.