ఆపదలో ఉన్న వారిని కాపాడే వాహనానికి ఆపద వచ్చింది. ప్రమాదవశాత్తు 108 వాహనం అగ్ని ప్రమాదానికి గురయి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం రజాసాహెబ్ పేట గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయమైంది. చంద్రశేఖరపురం మండలానికి చెందిన 108 వాహనం పామూరు మండలంలోని బోడవాడ గ్రామంలో ఉన్న వ్యాధిగ్రస్తులను వైద్యశాలకు తరలించేందుకు వెళ్తోంది. ఈ క్రమంలో రజాసాహెబ్ పేట గ్రామం వద్దకు రాగానే వాహనంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
also read:Shocking Incident: బర్త్ డే రోజే చిన్నారి మృతి.. హృదయవిదారక ఘటన
ఈ సందర్భంగా ఇంజన్ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో సిబ్బంది వాహనాన్ని నిలిపి పరుగులు తీశారు. మంటలు ఒక్కసారిగా వాహనాన్ని చుట్టుముట్టి ఎక్కువ అయ్యాయి. దీంతో వాహనంలో అమర్చి ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ప్రమాదం వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా 108 వాహనంలో మంటలు చెలరేగడం, సిలిండర్లు పేలడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.