తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అంతా సిద్ధం అయింది. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ప్రయోగాత్మకంగా మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు.
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సెంటర్ల వద్ద ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి హాల్‌టికెట్లను నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.
హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం, కళాశాల స్టాంపులు అవసరం లేదు. విద్యార్థి ఫొటో, వివరాలను పరిశీలించి పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని ఇంటర్ అధికారులు తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోనికి అనుమతించరు. విద్యార్ధులు పరీక్షా సమయానికి అరగంట ముందే చేరుకోవాలి.
ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాలేజీల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సెంటర్లకు చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు విద్యార్ధులకు సూచించారు.