విక్టరీ వెంకటేశ్ లేటెస్ట్ మూవీ ‘నారప్ప’కు అన్ని వర్గాల నుండి చక్కని ప్రశంసలు దక్కుతున్నాయి. తమిళ ‘అసురన్’తో పోల్చకుండా చూస్తే… నిజంగానే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప అనుభూతిని కలిగించిందని అందరూ అంటున్నారు. మరీ ముఖ్యంగా వెంకటేశ్ నట జీవితంలో ఇదే ప్రత్యేక చిత్రమని అభినందిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను సినీ ప్రముఖులు సైతం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. వీరిందరి అభినందనలూ ఒక ఎత్తు అయితే… వెంకటేశ్ మేనల్లుడు నాగచైతన్య భార్య సమంత ఈ సినిమా గురించి పెట్టిన కామెంట్ మరో ఎత్తు. బుధవారం సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ‘నారప్ప’ మూవీ పోస్టర్ ను పెట్టి, వెంకటేశ్ దగ్గుబాటిని ఉద్దేశించి, ‘వావ్… వావ్ వ్ వ్ వ్ వ్’ అంటూ పోస్ట్ పెట్టింది. స్టీట్ అండ్ సింపుల్ గా ఆ సినిమాను, అందులో కీలక పాత్ర పోషించిన చిన్నాన వెంకటేశ్ ను సమంత అలా ప్రశంసించేసింది.
నాగార్జున, నాగచైతన్య చిత్రాలు విడుదలైన వెంటనే తన స్పందనను సోషల్ మీడియా ద్వారా తెలియచేయడం సమంతకు అలవాటే. అందుకే ఆమె అభిమానులంతా ‘నారప్ప’ విషయంలో సమంత ఎలా స్పందిస్తుందా? అని ఎదురుచూశారు. దానికి తగ్గట్టుగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమంత తన ఫీలింగ్స్ చెప్పేసింది. ఇక ‘నారప్ప’ చిత్రం తీసిన సురేశ్ ప్రొడక్షన్స్ సమంతకు ఓ రకంగా ఓన్ ప్రొడక్షన్ లాంటిదే. ఆ బ్యానర్ లో ఇప్పటికే ‘ఈగ, ఓ బేబీ’ వంటి సినిమాల్లో నటించింది సమంత. అలానే ‘నారప్ప’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ , ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలలో నటించింది. ఆ రకంగా సమంతకు ‘నారప్ప’ కథానాయకుడు వెంకటేశే కాదు… దర్శక నిర్మాతలూ కావాల్సిన వారే! సో… అందుకే ఈ స్టార్ హీరోయిన్ ఏ మాత్రం లేట్ చేయకుండా తన ప్రశంసలు ఈ చిత్రానికి అందించిందని అనుకోవచ్చు.