గడిచిన 580 ఏళ్లలో ఆకాశంలో ఎన్నడూ చోటుచేసుకోని అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈనెల 19న సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఆకాశంలో దర్శనమివ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్ దేబిప్రసాద్ దురై శనివారం వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం ఈనెల 19న మధ్యాహ్నం 12:48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:17 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. మొత్తం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్ల పాటు పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: కేరళలో వివాదంగా మారిన ‘చీర’
చంద్రోదయం తర్వాత గ్రహణంలోని చిట్టచివరి ఘట్టం మాత్రమే దర్శనమిస్తుందని.. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని భూమి నీడ 97 శాతం మేర కప్పేస్తుందని దేబిప్రసాద్ దురై వెల్లడించారు. కాగా ఇలాంటి చంద్రగ్రహణం 580 ఏళ్ల కిందట అంటే 1440, ఫిబ్రవరి 18వ తేదీన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు చూడటం మిస్ అయితే మళ్లీ 2,269 సంవత్సరం ఫిబ్రవరి 8 వరకు వేచి చూడాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు.