నెల్లూరులో చంద్రబాబు సెల్ఫీ దిగిన ఇళ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిచేశాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు మేము సిద్ధం అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 30 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి ప్రకటించారు. గత టిడిపి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా మధ్యలోనే వదిలేసిందని విమర్శించారు. తండ్రి, కొడుకులు టిడ్కో ఇళ్ళ సెల్ఫీలు దిగి అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాజ్ మహల్, చార్మినార్ ముందు చంద్రబాబు, లోకేష్‌లు సెల్ఫీలు తీసుకుని మేమే కట్టామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం కోసం పోరాడుతోంది ఒక జగన్ మాత్రమేనని చెప్పారు. రూపాయికే టిడ్కో ఇళ్లను పేదలకి అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ది అని తెలిపారు. టిడ్కో ఇళ్ళ పై టిడిపి రూ. 18,00 కోట్ల భారాన్ని వైసిపి ప్రభుత్వం భరించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేజ్ 2, పేజ్ 3 టిడ్కో ఇళ్లను అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు డిసెంబర్ నాటికి అందిస్తామని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు.
ALso Read:Minister Sidiri: ఈనెల 19న మూలపేట పోర్ట్‌కు సీఎం శంకుస్థాపన
కాగా, ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. గడిచిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? అంటూ నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ళ సముదాయం వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగారు. తమ ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే వేలాది టిడ్కో ఇళ్ళు కట్టామని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు అంటూ అక్కడ సెల్పీ దిగారు.