భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కన్నుల పండువగా సాగుతోంది. కార్తీక మాసాన హైదరాబాద్ జంట నగర ప్రజలను ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం గురువారం ఏడోరోజుకు చేరింది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఏడోరోజు వేలాది మంది భక్తులు కోటి దీపోత్సవం ప్రాంగణానికి తరలివచ్చారు. ఏడోరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అందజేశారు.
ఏడోరోజు సందర్భంగా తొలుత శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి, శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో అనుగ్రహ భాషణం జరిగింది. అనంతరం బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ప్రవచనామృతం నిర్వహించారు. ఆ తర్వాత వేదిరపై ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపుల పూజను నిర్వహించారు. మరోవైపు భక్తులతో శ్రీవెంకటేశ్వర విగ్రహాలకు ముడుపుల పూజను చేయించారు.
అనంతరం ఏడోరోజు కోటి దీపోత్సవానికి తలమానికంగా అత్యంత వైభవంగా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని కోటి దీపోత్సవం వేదికపై వేదమంత్రోచ్ఛరణల నడుమ వేదపండితులు ఘనంగా జరిపించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని భక్తులను ఆశీర్వదించేందుకు వేదిక ప్రాంగణమంతా ఊరేగించారు. ఈ సందర్భంగా గోవింద నామాలతో యావత్తు వేదిక ప్రాంగణం మార్మోగింది. అనంతరం కోటి దీపోత్సవానికి తరలివచ్చిన భక్తజనం కోటి దీపార్చన నిర్వహించారు.
ఇక కోటి దీపోత్సవం కార్యక్రమంలో లింగోద్భవ ఘట్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారు లింగోద్భవం సన్నివేశాన్ని కన్నులారా చూసి తరించడమే తప్ప మాటల్లో చెప్పడం వీలుకాదు.
అనంతరం నిర్వహించిన సప్తహారతి ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చింది. మంగళవాయిద్యాలు, నృత్యాలతో శోభయమానంగా మారింది. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తితో కార్తీకమాసాన కోటి దీపోత్సవ వేడుకల్లో పాల్గొని పునీతులయ్యారనే చెప్పాలి.