నేడే భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్.. గెలిచేదెవరో..!
ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర సమరానికి సమయం అసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్.. రోజు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడబోతుంది. ఈ ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశం అని చెప్పాలి. అయితే, న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఆ టీమ్ ను ఓడించాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌పై కివీస్‌కు మంచి గణంకాలు ఉన్నాయి. అదే నాకౌట్ మ్యాచ్‌ల్లోనైతే ఆ జట్టు ఆధిక్యం 3-1తో ఉంది. మరోవైపు తన అన్ని మ్యాచ్‌లనూ దుబాయ్‌లో భారత్ ఆడడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతోందంటూ ప్రచారం జరుగుతుంది. భారత్‌తో గ్రూప్ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ కు ఇప్పటికే ఇక్కడ పరిస్థితులపై ఓ అవగాహన వచ్చింది. ఫైనల్లో స్పిన్నే మ్యాచ్ విజయాన్ని నిర్దేశించనుంది. స్పిన్ అనుకూల పరిస్థితులను ఉపయోగించుకున్న జట్టే పైచేయి సాధిస్తుంది. నలుగురు నాణ్యమైన స్పిన్నర్లతో ఈ విభాగంలో భారత్ బలంగా కనిపిస్తున్నప్పటికీ.. కివీస్ స్పిన్ బౌలింగ్ మెరుగ్గానే ఉంది.
అరుదైన రికార్డుకు దగ్గరలో కోహ్లీ.. మాజీ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి..!
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఈరోజు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ పాకిస్తాన్‌పై సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్‌లో 84 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో పెద్ద రికార్డు సాధించడానికి విరాట్ కోహ్లీకి 55 పరుగులు అవసరం. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో.. కోహ్లీ, కుమార్ సంగక్కరను అధిగమించి రెండవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఫైనల్లో 55 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా అవతరిస్తాడు. కుమార్ సంగక్కర 404 మ్యాచ్‌లలో 14234 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అతను 463 మ్యాచ్‌లలో 18426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 301 మ్యాచ్‌లలో 14180 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో 16 పరుగుల తేడాతో సెంచరీ మిస్ కాకపోతే అది కోహ్లీ 25వ వన్డే సెంచరీ అయ్యేది.
హైదరాబాద్లో ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ఫీవర్.. భారత్ గెలవాలని ఫ్యాన్స్ పూజలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. నేడు దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోబోతున్న భారత్.. ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. హాట్ ఫేవరెట్ చక్ దే ఇండియా స్లోగన్స్ తో హోరెత్తిస్తున్నారు. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ సేన విజయం సాధించాలని అభిమానులు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. అయితే, ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు బిగ్ ఫైట్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల ఫామ్ అద్భుంగా ఉంది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత్, న్యూజిలాండ్ టీమ్స్ సమజ్జీవులుగా ఉన్నాయి. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా ఎక్కడ కివీస్ బ్యాటర్లు తడబడలేదు. అయితే, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా పైనే మొత్తం జట్టు ఆధారపడి ఉంది. లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టును నిలువరించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై భారత్ గంపెడు ఆశలు పెట్టుకుంది. కివీస్ బ్యాటర్లను తమ వైవిధ్యమైన బౌలింగ్ తో కట్టడి చేయడానికి టీమిండియా పెస్ & స్పిన్ యంత్రం సిద్ధమవుతుంది. అయితే, ఈ టోర్నీలో టాస్ కీలకంగా మారింది. ఇక, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో రోహిత్ సారథ్యంలో టీమిండియా ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగనుంది.
కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉంది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి, పార్టీ సీఈసీ సభ్యుడు ఉత్తమకుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండేది. కానీ.. చివరి నిమిషంలో వీరి పర్యటన రద్దయింది. వీరితో ఫోన్ సంభాషణ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. కాగా.. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తును పూర్తి చేసే అవకాశం ఉంది. తెలంగాణ నేతల అభిప్రాయాలను ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు మీనాక్షి నటరాజన్ అందజేయనున్నారు. ఆ తర్వాత అంతిమంగా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీసీ, ఎస్సీ, మైనారిటీ, మహిళ అభ్యర్దులను ఎంపిక చేసే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒప్పందంలో భాగంగా సీపీఐకి ఒక్క ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఈ విడతలో అగ్ర కులాలకు అవకాశం లేనట్లేనని సమాచారం.
‘ది రాజా సాబ్’ రిలీజ్ లేట్‌కి అదే కారణమా..?
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస భారీ చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్నా ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వాల్సిన ‘రాజా సాబ్’ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. ఇక వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి ఈ మూవీకి ఇది మంచి అవకాశం అనుకుంటే, సమ్మర్ రిలీజ్ కూడా లేనట్టుగానే తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు షూట్ చేసిన భాగం మొత్తం మూడు గంటల 30 నిమిషాల ఫుటేజ్ వచ్చినట్లు టాక్. అదీ కాక మేజర్‌గా ఇంకా మూడు పాటలు షూట్ చేయాల్సి ఉందట. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఆ సాంగ్స్ షూటింగ్ పూర్తి అయ్యేలా కనిపించడం లేదు.అందులోను 3 గంటల 30 నిమిషాల సినిమా అంటే అదీ హారర్ జోనర్‌లో రిస్క్ అనే చెప్పాలి. కాబట్టి ఈ సినిమాని ఎడిట్ చేసి నిడివి తగ్గించే పనిలో కూడా ఉన్నారట మూవీ టీమ్. మరి ‘ది రాజాసాబ్’ ఆలస్యానికి కారణం ఇదేనా లేక వేరే ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. దీనికి తోడు జూలై 24న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది అని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
నేడు రెండో రోజు పోసానిని విచారించనున్న పోలీసులు..
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే, రాత్రి 2 గంటలకు కర్నూలు జైలుకు పోసానినీ తీసుకొచ్చారు. కర్నూలు జైలులో ఉన్న అతడ్ని విజయవాడలోని భావానీపురం పోలీసులు పిటి వారెంట్ పై తీసుకువెళ్లి అరెస్టు చేయగా.. మేజిస్ట్రేట్ రిమాండ్ కు ఆదేశించడంతో తిరిగి కర్నూలు జైలుకు తరలించారు. అలాగే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను దూషించారని ఆదోని ట్రీ టౌన్ లో నమోదైన కేసులో అరెస్టై కర్నూలు జైలులో పోసాని కృష్ణ మురళి ఉన్నారు. రేపు పోసాని బెయిల్ పిటిషన్ పై కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే కస్టడీ కోరిన ఆదోని పోలీసుల పిటిషన్ పై తీర్పును మేజిస్ట్రేట్ రిజర్వు చేయగా.. పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.