నేడు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో నేడు మల్లికార్జున స్వామి కళ్యాణం జరగనుంది. కాశీ జగత్ గురు శ్రీ మల్లికార్జున విశ్వరాజ్య శివచార్య మహా స్వామి ఆధ్వర్యంలో 108 మంది వీర శైవ పండితులచే స్వామివారి కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణోత్సోవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కళ్యాణంతో ప్రారంభం కానున్నాయి.
నేడు నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత.. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద నుంచి భారీ ర్యాలీ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు వెళ్తున్నారు. ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. డిచ్‌పల్లి వద్ద కవితకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. సుభాష్ నగర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ తీయనున్నారు. ఆ తర్వాత ఎస్‌ఎఫ్‌ఎస్ సర్కిల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..
తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఇక, క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి.. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తుల సర్వ దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది. అయితే, శనివారం అర్ధరాత్రి వరకు 78,414 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, కానుకల రూపంలో హుండీలో రూ. 3.45 కోట్లు సమర్పించారు.
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ 60 రాకెట్.. నేడు శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ (సోమవారం) 30వ తేదీన రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేయనున్నారు. 25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు. అయితే, ఈరోజు (డిసెంబర్ 29) రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం.. పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం ఇది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59 ప్రయోగాలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది ఇస్రో.
సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి
సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ముయూన్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం ఒక్కసారిగా పేలిపోయింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని సమాచారం. కాగా, ఇప్పటి వరకు 28 మంది మరణించగా.. మరో 23 మందికి గాయాలు అయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బ్యాంకాక్ నుంచి ముయూన్‌కు వెళ్తుండగా ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్.. టైటిల్ పోరులో పాట్నా, హర్యానా..
రెండు నెలలకు పైగా క్రీడాభిమానులను అలరించిన ప్రొ కబడ్డీ లీగ్–11వ సీజన్ చివరి అంకానికి చేరింది. ఈరోజు (డిసెంబర్ 29) పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా.. హర్యానా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ తుది పోరులో తలపడనుంది. వరుసగా రెండోసారి హర్యానా ఫైనల్ చేరగా.. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను దక్కించుకున్న పట్నా మధ్య రసవత్తరమైన పోరు కొనసాగడం ఖాయం. ఇక, తొలిసారి ఛాంపియన్‌గా నిలవాలనుకుంటున్న హర్యానా స్టీలర్స్‌కు జైదీప్ సారథిగా, మన్‌ప్రీత్ సింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యంతో నేరుగా సెమీస్ కు చేరిన స్టీలర్స్.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని ఫిక్స్ అయింది.
‘కుబేర’ కోసం మరోసారి కొత్త అవతారం ఎత్తిన ధనుష్ ?
ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా, తెరకెక్కుతున్న మరో మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఆడియన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉండడం కూడా కుబేర సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమనే చెప్పాలి. అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు.