ప్రధాని మోడీ ఓ కర్మ యోగి.. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు..
చాలా మంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణాన్ని పునరావృతం చేయగలరు.. కానీ అన్ని నడకలు పరివర్తనను తీసుకురాలేవు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక, ఉన్నత లక్ష్యం లేని నడక ప్రజానీకాన్ని ప్రేరేపించదు.. దేశాన్ని ఏకం చేయదన్నారు. భారతదేశం వైవిధ్యం, చైతన్యాన్ని కలిగి ఉంది.. అది అర్థమవ్వాలంటే.. ఆత్మతో నిమగ్నమవ్వాలి అని సూచించారు. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భౌతిక ప్రయాణం అవసరం లేకుండా.. ఈ సారాంశాన్ని అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అచంచలమైన దృఢ నిశ్చయంతో ప్రధాని వ్యవహరించారు.. మోడీ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని శక్తివంతమైన, స్థిరమైన స్థానాన్ని పటిష్టం చేశాయన్నారు. అలాగే, తమిళనాడులోని సనాతన ధర్మానికి పవిత్ర చిహ్నమైన సెంగోల్‌ను ఢిల్లీలోని పార్లమెంట్‌లో ప్రతిష్టించడంతో మన ఐక్యత, సంప్రదాయానికి గల గౌరవానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఏపీలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రాబోయే రెండ్రోజుల పాటు భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వెల్లడించింది. అలాగే, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొనింది. ఇక, అక్టోబర్ 4వ తేదీన అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
పేదల జోలికొస్తే ఖబర్దార్! .. హైడ్రా చర్యలపై కిషన్ రెడ్డి ఫైర్
మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా కల్పించారు మూసీ సుందరీకరణలో నిర్వాసితులవుతున్న కుటుంబాలను బాధితులను పరామర్శించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో నిర్వాసితులను స్వయంగా కలిసి, వారి గోడును ఆవేదనను విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ధ్వంసరచన కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని కేంద్ర అన్నారు. హైడ్రా పేరిట సర్కారు సాగిస్తున్న పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తోందని తెలిపారు. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు కండ్లముందే చెదిరిపోతుంటే ప్రజలు గుండెబరువుతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చేసేందుకు అధికారులు మార్క్ చేశారని, బాధిత ప్రజలు కేంద్రమంత్రికి గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల బాధ చూస్తుంటే ఆవేదన కలుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు పేదల ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లు రావాలంటే… తమపై నుంచి పోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా పేద ప్రజలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు
పండగపూట కూడా తమ వెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూస్తున్నాడని కేటీఆర్‌ను మంత్రి సీతక్క విమర్శించారు. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారన్నారు. “మా బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుంది.. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది.. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం, కష్టం, నిజాయితీ ముందు నువ్వెంత..? రాహుల్ గాంధీని అనే స్థాయి కేటీఆర్‌ది కాదు. బీసీ, ఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా.. స్వతంత్రంగా ఎదిగాం. మేం సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ్మ ప్రాంతాల నుంచి వచ్చాం.. ఎందుకు మా మీద అక్కస్సు. వరదల్లో మునిగి ప్రజలు నష్టపోవద్దని ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. బీఆర్ఎస్.. ప్రజల ఇళ్లను కూలగొట్టి బుల్డోజర్ ప్రభుత్వం నడిపారు. మా ప్రభుత్వంలో ప్రజలే స్వచ్ఛందంగా కూల్చుకుంటున్నారు. మూసి కూల్చివేతల అంశంలో.. పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారు.” అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మమ్మల్ని అసభ్యకరంగా దూషించి మమ్మల్ని శిఖండి అని ఎట్లా అంటారు..? అని సీతక్క ప్రశ్నించారు. “గత మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు.. మేం నామినేట్ చేస్తే.. అప్పనంగా వచ్చినోళ్ళం కాదు.. ప్రజలను చేత ఎన్నుకున్న మంత్రులం. వెంటపడి మమ్మల్ని వేధిస్తున్నారు దుర్మార్గులు. పనికట్టుకొని సినిమా వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది.. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడారు.
దయచేసి చిన్నచూపు చూడకండి.. కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత
మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించింది. తన విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించింది. సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చింది. “స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొంది.
కొత్త పార్టీ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. పార్టీ పేరు ఇదే..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘జన్ సురాజ్’ పార్టీ (Jan Suraj Party)ని బుధవారం వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం పొందిందని వెల్లడించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. బీహార్‌లో 30 ఏళ్లుగా ఆర్జేడీ, జేడీయూ, బీజేపీలకే ఓట్లు వేస్తు్న్నారని. ఆ సంప్రదాయం అంతం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదని తెలిపారు. జన్ సురాజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్లు తెలిపారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇక మద్యపాన నిషేధాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. పార్టీకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి మనోజ్ భారతి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని నిలిపివేస్తామని.. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని చెప్పారు.
అరబ్ దేశాలతో రష్యా అత్యవసర భేటీ.. తాజా పరిణామాలపై చర్చ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. అత్యవసర సమావేశానికి రావాలని అరబ్ దేశాలను రష్యా ఆహ్వానించింది. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల దాడి చేయడాన్ని అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పూనుకుంది. ఈ సమావేశంలో అరబ్ దేశాలతో రష్యా చర్చిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసేందుకు రెడీ అవుతోంది. ఇరాన్‌కు చెందిన చమురు, అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక ఐడీఎఫ్ అయితే.. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేసేందుకు ప్రణాళిక వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇరాన్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి పశ్చిమాసియా టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఎయిర్‌పోర్టులో పేలిన యూఎస్ బాంబు.. 87 విమానాలు రద్దు
జపాన్‌లో ఊహించని ఘటన చోటు చేసుకొంది. మియాజాకీ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబు హఠాత్తుగా పేలింది. ఇది రెండో ప్రపంచ యుద్ధం (WW-II) నాటి బాంబుగా జపాన్ అధికారులు గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని మియాజాకీ ప్రాంతంలో పాతి పెట్టిన ఈ బాంబు.. ఇన్నేళ్ల తర్వాత పేలింది. దీని కారణంగా ఆ ప్రాంతంలో భారీ రంధ్రం ఏర్పడింది. పేలుడు సమయానికి సమీపంలో విమానాలు ఏమీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని అధికారులు చెప్పారు. గొయ్యి కారణంగా దాదాపు 87కి పైగా విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ప్రకారం… పేలుడు కారణంగా టాక్సీవే మధ్యలో ఏడు మీటర్ల (23 అడుగులు) వెడల్పు మరియు ఒక మీటరు (3.2 అడుగులు) లోతులో రంధ్రం ఏర్పడడం కారణంగా మియాజాకి విమానాశ్రయం రన్‌వేను మూసివేసినట్లు తెలిపారు. జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన బాంబు నిర్వీర్య బృందం.. పేలుడుకు కారణం భూమి ఉపరితలం క్రింద పాతిపెట్టిన అమెరికన్ బాంబు అని తేల్చారు.
‘వేట్టయన్- ద హంటర్’ ట్రైలర్ విడుదల.. రజినీకాంత్ యాక్షన్ వేరేలెవల్ గురూ..
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కానీ.. డబ్బు, అధికారం, పరిచయాల పేరుతో నిందితులు తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నారు. వారందనీ.. ఎన్‌కౌంటర్ లో చంపేయాలని జనాలు కోరుతున్నారు. అచ్చం అలాంటి సీన్ తాజాగా విడుదలైన ‘వేట్టయన్- ద హంటర్’ సినిమా ట్రైలర్ లో కనిపించింది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించారు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ రోజు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. సుభాస్కరన్ నిర్మాతగా ఉన్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న వేట్టయన్ ద హంటర్‌ని రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అయితే ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ పోలీసు పాత్రలో నటించిన ఈ సినిమాలో, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఇందులో విలన్ ఎవరనే దానికిపై క్లారిటీ రావడం లేదు. ఓ అమ్మాయిపై అత్యాచారం జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంగా సాగే కథగా ట్రైలర్ స్పష్టం చేసింది. అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ వ్యతిరేకించే న్యాయమూర్తిగా అమితాబ్.. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ కచ్చితంగా బాధితులకు లభిస్తుందనే పంథాలో కనిపించారు. పోలీస్ ఆఫీసర్, న్యాయమూర్తికి జరిగిన పోరాటంలో తప్పు చేసిన వాడికి పోలీసుగా శిక్షించడాన్ని నా నుంచి ఎవరు ఆపలేరు అని బిగ్‌బీకి రజనీకాంత్ సవాల్ విసరడం ట్రైలర్ లో చూడొచ్చు.