నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపై తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఈ రోజు (జూన్ 11న) నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్కు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్ కి ఆయన చేరుకోనున్నారు. కాగా, ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కి కేసీఆర్ బయల్దేరి రానున్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న పలువురు ఇంజినీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ ను విచారణకు పిలిచింది. కాళేశ్వరం కమిషన్ ఏయే ప్రశ్నలు వేస్తుంది? దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది? ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది.
ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..!
ములుగు జిల్లా నేడు అధికారిక పర్యటనకు వేదిక కానుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు మంత్రులు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాకు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఉదయం 10:20కి ములుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో ఇందిరమ్మ కాలనీకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది స్థానిక ప్రజలకు వసతుల కల్పనలో ముందడుగు కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తర్వాత 10:45కి ఇంచర్ల గ్రామంలోని ఎమ్మార్ ఫంక్షన్ హాల్ వద్ద ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పటాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వందలాది మంది పేద ప్రజలకు ఇంటి కల నెరవేరనున్నది. మధ్యాహ్నం 12:15 గంటలకు మంత్రులు ములుగు మండలం పత్తిపల్లి గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామానికి వెళ్లి మధ్యాహ్నం 12:15 నుంచి 1:15 గంటల వరకు భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొననున్నారు.
ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు..!
తెలంగాణలో భారీ అవినీతికి సంబంధించి మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్‌కు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ప్రస్తుతం చొప్పదండిలోని SRSP క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఇరిగేషన్ CAD డివిజన్ 8లో పనిచేశారు. ఆయన గతంలో అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులలో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనూ పని చేసారు. ఇరిగేషన్ శాఖలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన నూనె శ్రీధర్ వాటిలో అక్రమంగా వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ చర్యలు ప్రారంభించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఆయన నివాసాల వద్ద, ఇతర సంబంధిత ప్రదేశాలపై కూడా ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఇక దాడిలో ఎటువంటి ఆస్తులను గుర్తించారో తెలియాల్సి ఉంది.
నేడు ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన.. రైతులకు పరామర్శ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. పొదిలిలో పర్యటన కొనసాగనుంది. పొగాకు రైతులను పరామర్శించనున్నారు. అనంతరం పొదిలి పొగాకు బోర్డును సందర్శించి అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. జగన్ పర్యటన కోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. 1. బుధవారం ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11 గంటలకు పొదిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా పొగాకు బోర్డుకు చేరుకుంటారు. 2. ఉదమం. 11.25 నుంచి మధ్యాహ్నం 12.25 వరకు పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడతారు. 3. మధ్యాహ్నం 12.25 గంటలకు పొగాకు బోర్డు నుంచి తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
4. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలికాప్టర్‌లో తాడేపల్లి బయలుదేరి వెళ్తారు.
కృష్ణానదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా
కృష్ణానదిపై యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డుకు ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మెగా ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. యోగా భారతీయ వారసత్వ సంపద.. ఈ యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర-2025 నిర్వహిస్తుంది అని వెల్లడించారు. అయితే, యోగాని నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. అప్పుడే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలం… యోగాంధ్ర- 2025లో భాగంగా వరల్డ్ రికార్డ్ సాధించేందుకు యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్ లో పాల్గొన్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.. ఇటీవల విజయవాడలో జరిగిన డ్రోన్ షోలో వరల్డ్ రికార్డ్ సృష్టించాం.. ఇప్పుడు యోగాతో మరో వరల్డ్ రికార్డ్ సృష్టించబోతున్నామని కేశినేని చిన్ని తెలిపారు.
ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్య సందేశం పంపించారు.. ప్రతిపక్షాలను ప్రశంసించిన మోడీ
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో దౌత్య బృందాలు విజయం సాధించాయని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు అధికార-ప్రతిపక్షాలతో కూడిన ఏడు బృందాలను ఆయా దేశాలకు కేంద్రం పంపించింది. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ అధినేతలకు వివరించారు. అయితే మంగళవారం ప్రధాని మోడీ తన నివాసంలో దౌత్య బృందాలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దౌత్య బృందాలతో ప్రత్యేకంగా చర్చించారు. దౌత్య బృందాలను ప్రత్యేకంగా మోడీ ప్రశంసించారు. దౌత్య బృందంలో ఇంత మంది ప్రతిపక్ష సభ్యులు ఉండడం గొప్ప విషయం అని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందని ప్రపంచానికి ఒక పెద్ద సందేశం పంపించినట్లు మోడీ పేర్కొ్న్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పర్యటనలు మరిన్ని ఉండాలని అభిప్రాయపడ్డారు. దౌత్య బృందాలు.. 33 విదేశీ రాజధానులు, యూరోపియన్ యూనియన్‌ను సందర్శించారు. ఈ బృందంలో తాజా ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ దౌత్యవేత్తలు కూడా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ రైట్స్ కోసం భారీ డిమాండ్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబెకా జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు. అయితే మూవీకి ఉన్న హైప్, కాంబినేషన్‌ను బట్టి.. కొన్ని డబ్బింగ్ చిత్రాలు తెలుగులో భారీ బిజినెస్ చేస్తుంటాయి. ‘2.O’ , ‘కేజీఎఫ్-2’ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.70 కోట్లకు పైగా బిజినెస్ చేశాయి. కానీ ముందు నుంచి కూడా రజినీకాంత్ నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో రూ.20-30 కోట్ల బిజినెస్ చేశాయి. కాగా ఇప్పుడు ఆయన నెక్స్ట్ ‘కూలీ’ మూవీ బిజినెస్ అంతకుమించిన చేయనుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.. తాజా సమాచారం ప్రకారం ‘కూలీ’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనగా. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, నాగవంశీకి చెందిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రూ.40-45 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి ఈ చిత్ర రైట్స్‌ను దక్కించుకునే అవకాశం కూడా ఉంది.
విజయం కోసం కాస్త ఓపిక పట్టాలి..
ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్‌ల కెరీర్ కాలం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాఫులు పలకరిస్తే కనుక కథానాయికల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజంట్ ఇలాంటి సరిస్థితిలోనే ఉంది పూజా హెగ్డే. గత మూడేళ్లుగా ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇటీవల వచ్చిన ‘రెట్రో’ సైతం డిజాస్టర్‌గా నిలిచింది. వరుస ఫ్లాఫ్‌లు పడుతున్న కూడా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్న పూజాహెగ్డే.. తాజాగా ‘ కెరీర్‌లో ఇదొక బ్యాడ్‌ఫేజ్, కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని విశ్వాసంతో ఉన్నాను. జీవితం సాఫీగా సాగితే అది జీవితం ఎందుకు అవుతుంది. కానీ బాధగా ఉన్న కొన్ని తట్టుకోవాలి తప్పదు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే. కోలివెడ్ స్టార్ హీరో రజనీకాంత్ ‘కూలీ’లో అతిథి పాత్రలో కనిపించనుంది. అలాగే దళపతి విజయ్‌తో కలిసి ‘జన నాయగన్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు.. దీనితో పాటు తమిళంలో ‘కాంచన-4’లో నాయికగా నటిస్తున్నది. ఆ ప్రాజెక్ట్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమాలతో అయిన పూజ కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి..
నేడే WTC ఫైనల్.. ఆసీస్ దూకుడుకి ప్రొటీస్ బ్రేక్ వేయగలదా..?
ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి నేడు లండన్ లోని లార్డ్స్ మైదానంపైనే ఉంది. ఎందుకంటే నేటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) మూడో ఎడిషన్ ఫైనల్ మొదలుకానుంది. 2023-25 సీజన్‌కు సంబంధించిన ఈ టెస్టు మహా సమరంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఈ ఫైనల్‌కు తమ పూర్తి సన్నద్ధతతో సిద్ధమయ్యాయి. ఇదే వేదికపై గతేడాది ఫైనల్ లో భారత్‌పై విజయం సాధించిన ఆసీస్ మరోసారి టైటిల్ గెలుచుకునే ఆశతో బరిలోకి దిగుతోంది. అయితే, ఒక్కరోజు ముందే ఇరుజట్లు వారి ప్లేయింగ్ XI ఆటగాళ్లను ప్రకటించడం విశేషం. ఇక ఇందులో ఆసీస్ జట్టును చూస్తే.. కెమెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఇక మార్నస్ లబుషేన్ ఈసారి ఓపెనర్‌గా ఆడనున్నాడు. ఈ వ్యూహాత్మక మార్పులతో ఆసీస్ దూకుడుగా ఆడేలా కనిపిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కూడా యువ జట్టుతో కాస్త బలంగానే కనిపిస్తోంది.