శ్రీవారిపై కాసుల వర్షం.. వరుసగా పదో నెల 100 కోట్లు దాటిన హుండీ ఆదాయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై కనకవర్గం, కాసుల వర్షం కురుస్తూనే ఉంది.. శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్‌ను దాటింది.. శ్రీనివాసుడి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలను దాటడం ఇది వరుసగా 10వ నెల కావడం విశేషం.. డిసెంబర్ నెలలో హుండీ ద్వారా ఇప్పటికే శ్రీవారికి 120.3 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించారు భక్తులు.. ఈ నెలలో ఐదు సార్లు ఏకంగా 5 కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండి ఆదాయం… ఈ నెల 27వ తేదీన శ్రీవారికి రోండో అత్యధిక ఆదాయంగా 5.88 కోట్ల రూపాయలు లభ్యం అయ్యాయి.. కరోనా ఆంక్షల సడలింపు తర్వాత వరుసగా భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది.. ఇదే సమయంలో.. హుండీ ఆదాయం కూడా పెరిగిపోయింది.. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా ప్రతీ నెల 100 కోట్ల మార్క్ ని దాటేస్తోంది శ్రీవారి హుండీ ఆదాయం.. ఆగస్టు నెలలో అత్యధికంగా శ్రీవారికి హుండి ద్వారా రూ.140.34 కోట్ల రూపాయల ఆదాయం లభ్యం అయ్యింది.. ఇక, ఇదే ఏడాది జూలై 4వ తేదీన శ్రీవారికి ఒక్కరోజులో అత్యధికంగా 6.14 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం సమర్పించారు భక్తులు.. మొత్తంగా వరుసగా 10వ నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 మార్క్‌ను దాటడం విశేషంగా చెప్పుకోవాలి.. ఈ నెల ఇప్పటికే రూ.120.3 కోట్ల ఆదాయం రాగా.. ఈ నెల ముగింపునకు అది ఎంత వరకు చేరుతుందో చూడాలి.
సంక్రాంతి లక్కీ డ్రా..! మంత్రి అంబటిపై పోలీసులకు ఫిర్యాదు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో లక్కీ డ్రా పేరుతో టికెట్లు విక్రయిస్తున్నారంటూ మండిపడుతున్నారు జనసేన నేతలు.. ఈ విషయంలో మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్‌లో మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ నేతలు.. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు విక్రయిస్తున్నారని.. నియోజకవర్గంలో విచ్చలవిడిగా లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయని అంటున్నారు.. అసలు ఈ టికెట్ల విక్రయానికి సచివాలయలు టికెట్స్ కౌంటర్లుగా మారిపోయాయని.. వాలెంటిర్ల ద్వారానే ఈ లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలు సాగిస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.. లక్కీ డ్రాలు చట్ట విరుద్ధం.. అయినా, సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో ఈ టికెట్లు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు.. లక్కీ డ్రా టికెట్లుపై పోలీసులు వెంటనే స్పందించాలని.. మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. లక్కీ డ్రా నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ విషయంపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంటేశ్వరావు ఆధ్వర్యంలో సత్తెనపల్లి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. అయితే, ఈ లక్కీ డ్రా వ్యవహారంపై మంత్రి అంబటి రాంబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎలాగైనా.. ఎన్ని కష్టాలు భరించైనా సొంత ఊరికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు తెలుగు ప్రజలు.. దీంతో, పండు సీజన్‌లో విమానాలు, రైళ్లు, బస్సులు.. ఇలా ఏవి ఆశ్రయించినా ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. దీంతో, సొంత వాహనాల్లో కూడా ఊరికి వెళ్లేవారు ఉన్నారు.. అయితే, సంక్రాంతి పండుగకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే… ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.. అయినా, ప్రయాణికుల నుంచి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దీంతో, ప్రయాణికులకు మరికొంత ఉపశమనం కలిగించేలా.. మరో 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. గతంలో ప్రకటించిన రైళ్లకు ఈ సర్వీసులు అదనం.
రాజకీయ పరిజ్ఞానం లేని లోకేష్ నీకెందుకు పాదయాత్ర..?
నారా లోకేష్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఎన్ఆర్ పురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ పరిజ్ఞానం లేని లోకేష్ నీకెందుకు ఈ పాదయాత్ర..? అని ప్రశ్నించారు.. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తావ్ ఈ పాదయాత్ర..? అని నిలదీసిన ఆయన.. వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని నువ్వు ముఖ్యమంత్రి అయిపోవాలని పగటి కలలు కంటున్నావు అంటూ ఎద్దేవా చేశారు.. నువ్వు ఎన్ని జన్మలెత్తినా వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవని జోస్యం చెప్పారు.. ఇక, మీ తండ్రి సొంత మామ (ఎన్టీఆర్)ని వెన్నుపోటు పొడిచాడు.. నువ్వు మీ తండ్రిని వెన్నుపోటుపోవడానికి సిద్ధమయ్యావా?.. అందుకేనా ఈ యాత్ర..? అంటూ సెటైర్లు వేశారు. ఇక, నువ్వు మీ తండ్రి చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, మీరందరూ కలిసి ఎన్ని యాత్రలు చేసినా ప్రజల ఎవ్వరూ మిమ్ములను నమ్మే పరిస్థితులో లేరని.. కులాలను మతాలను విభజించి పాలించడం చంద్రబాబు నాయుడుకి అలవాటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
మూసుకుపోయిన శ్రీనగర్-లేహ్ రోడ్డు
జమ్మూలో కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా మంచు కురుస్తోంది. దాంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో ఎక్కడపడితే అక్కడ మంచు మేటలు వేస్తోంది. తాజాగా శ్రీనగర్-లేహ్ రహదారి కొన్ని కిలోమీటర్ల మేర మంచులో కూరుకుపోయింది. విపరీతంగా కురియడంతో ఆ రోడ్డుపై మంచు పెద్దఎత్తున పేరుకుపోయింది. దాంతో ఆ రోడ్డు వెంబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డును క్లియర్ చేసేందుకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు.
సాకర్ కింగ్ పీలేకు.. ప్రధాని మోదీ సంతాపం
సాకర్ కింగ్ పీలే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. అతని అత్యుత్తమ క్రీడా ప్రదర్శనలు, విజయం రాబోయే తరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయన్నారు. పీలే మరణం క్రీడా ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణించారు మోదీ. అతని అత్యుత్తమ క్రీడా ప్రదర్శనలు, విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో రాశారు.
మానేరులో పడవ మునక.. ఏడుగురు గల్లంతు
బీహార్‌లోని పాట్నాలో నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. మీడియా కథనాల ప్రకారం, పాట్నా జిల్లాలోని మానేర్ వద్ద శుక్రవారం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదం తర్వాత ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. పడవలో 14 మంది ఉన్నారు. ఏడుగురిని సురక్షితంగా రక్షించగా, మరో ఏడుగురు గల్లంతైనట్లు పోలీసు అధికారి తెలిపారు.
సందీప్ రెడ్డి వంగ ‘అనిమల్’ ఫస్ట్ లుక్ వస్తోంది…
విజయ్ దేవరకొండని రౌడీ హీరోగా మార్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. లవ్ స్టొరీ సినిమాల్లో ఒక కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో ‘కబీర్’ టైటిల్ తో రీమేక్ చేశాడు సందీప్. హిందీలో కూడా సూపర్ హిట్ అయిన కబీర్ మూవీపై కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతూ… ‘సినిమాలో వయోలెన్స్ ఎక్కువగా ఉందంటూ’ కామెంట్స్ చేశారు. ఈ మాటలు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో, ‘అసలు వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో తన నెక్స్ట్ సినిమాలో చూపిస్తానంటూ ఓపెన్ స్టేట్మెంట్’ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అన్నట్లు గానే సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ తో ‘అనిమల్’ అనే సినిమాని అనౌన్స్ చేశాడు. పేరులో ‘అనిమల్’ ఉండడంతో, సందీప్ రెడ్డి తన సినిమాపై వచ్చిన విమర్శలని అసలు మర్చిపోయినట్లు లేడని అంతా అనుకున్నారు. ఈ మాటని నిజం చేస్తూ ఇటివలే ‘అనిమల్’ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి రణబీర్ కపూర్ ఫోటో ఒకటి లీక్ అయ్యి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రణబీర్ కపూర్ బియర్డ్ లుక్ లో, చాలా రగ్గడ్ గా కనిపిస్తున్నాడు. రక్తం అంటుకున్న చొక్కాలో రణబీర్ కపూర్ ముందెన్నడూ చూడనంత డెడ్లీ లుక్ తో ఉన్నాడు. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ, సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ తో అసలు ఎలాంటి సినిమా ప్లాన్ చేశాడు అంటూ అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ‘అనిమల్’ మూవీని 2023 ఆగస్టులో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ‘ఫస్ట్ లుక్’ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31న ‘అనిమల్’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి సందీప్ రెడ్డి వంగ అండ్ టీం నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
చైనాలో మహమ్మారి విజృంభణ.. ఆందోళనలో డబ్ల్యూహెచ్‌వో
చైనాలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడిలించిన తర్వాత వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో చైనాలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చైనాలో ఎదరవుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో కరోనా నియంత్రణ, హైరిస్క్ ఉన్న వ్యక్తులకు వ్యాక్సినేషన్‌పై చర్యలు చేపట్టాలని సూచించారు. చైనా ఆరోగ్య వ్యవస్థల పరిరక్షణకు తమ వంతు సహాయసహకారాలు అందజేస్తామని ప్రకటించారు.