టీటీడీలో రికార్డు సృష్టించిన అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు మరోసారి టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ ఈవోగా రోండోవసారి నియమితులైన మొదటి అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ రికార్డుకెక్కారు.. గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4వ తేదీ వరకు టీటీడీ ఈవోగా కొనసాగారు సింఘాల్.. గతంలో ఈవోగా సింఘాల్ సమర్థవంతంగా సేవలందించిన నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తాజా బదిలీల్లో టీటీడీ ఈవోగా నియమించింది సర్కార్.. ఇక, ఎల్లుండి టీటీడీ ఈవోగా రోండోవ సారి భాధ్యతలు స్వీకరించనున్నారు అనిల్ కుమార్ సింఘాల్..
కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్.. వెంటనే ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం..
కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం.. సమావేశం మధ్యలోనే జేపీ నడ్డాకు ఫోన చేశారు.. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 వేగన్లు.. ఏపీకి కేటాయించాలని కోరారు.. దీనిపై సానుకూలంగా స్పందించారట నడ్డా.. ఇక, దీంతో, రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి జీవో జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు.. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రి అచ్చెన్నాయుడికి తెలిపారు అధికారులు.. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అచ్చెన్నాయుడు.. ఎరువుల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్లో సీఎం చంద్రబాబు మాట్లాడటం వలనే రాష్ట్రానికి యూరియా కేటాయింపు జరిగిందన్నారు.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.. మరోవైపు, రబీ సీజన్ కు కేంద్రం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.
సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ.. ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు..
ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను మొదటి ఏడాదిలోనే ప్రజలకు అందించిన నేపథ్యంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభను ఈనెల 10న అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. భారీ ఎత్తున ఈ సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు చేశారు.. ఈనెల 10వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ఆ ఒక్కరోజు వాహనదారులు ఈకింది ఆంక్షలు పాటించి పోలీసులతో సహకరించాలని కోరారు జిల్లా ఎస్పీ పి.జగదీష్.. సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు భారీ ఎత్తున ప్రజలు సదరు విజయోత్సవ సభలో పాల్గొనే అవకాశమున్నందున.. వాహనాల రాకపోకలు కొనసాగేందుకు పోలీసు వారు సూచించిన ఆంక్షలు తప్పకుండా పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎస్పీ..
పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగంపై పిటిషన్.. హైకోర్టులో కీలక వాదనలు..!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికార దుర్వినియోగం చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ జరిపింది హైకోర్టు.. ఈ సందర్భంగా.. హైకోర్టులో కీలక వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సినీ ప్రాజెక్ట్ హరిహర వీర మల్లు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దాఖలు చేశారు. అయితే, ప్రభుత్వ పదవిలో ఉన్న మంత్రి తన పదవి, అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు.. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇలాగే తమ స్వప్రయోజనాల కోసం వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు.. రేపు ఇతర మంత్రులు కూడా ఇదే విధంగా తమ సొంత వ్యాపారాలు, కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తే ప్రభుత్వ పరిపాలన పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇది కొనసాగితే ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సేవ కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే పనిచేసే ప్రమాదం ఉందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఇక, వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణ ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది..
సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు.. మూసీ మాత్రం జరగొద్దా?
నల్గొండ ప్రజల కోసమే మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని.. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య మాత్రమే కాకుండా.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందన్నారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? అని సీఎం ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఉస్మాన్‌సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం ఈరోజు శంకుస్థాపన చేశారు. రూ.7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేయనున్నారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్ఠానం.. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు!
తెలంగాణ రాష్ట్ర కమిటీని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ముగ్గురు జనరల్ సెక్రటరీలు (ప్రధాన కార్యదర్శులు), 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటైంది. జనరల్ సెక్రటరీలుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్‌ను నియమించినట్లు తెలంగాణ బిజెపి చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, బండ కార్తీకారెడ్డి.. ఎన్నికయ్యారు. సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్, ఏడు మోర్చాలను అధిష్ఠానం ప్రకటించింది.
పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్.. పొరుగు దేశానికి ఏమైంది..!
పాకిస్థాన్ లాగే బంగ్లాదేశ్ కూడా IMF నుంచి రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకార సంస్థల నుంచి ఆశించిన మొత్తంలో డబ్బు అందడం లేదని ఆర్థిక సలహాదారు డాక్టర్ సలావుద్దీన్ అహ్మద్ అన్నారు. “కనీసం $30 బిలియన్లు అవసరం. బదులుగా, ప్రభుత్వం IMF నుంచి కేవలం ఒకటి నుంచి ఒకటిన్నర బిలియన్ డాలర్లు పొందడానికే ఇబ్బంది పడుతోంది” అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ 2022లో IMFతో $4.7 బిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది. ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2024 వరకు మూడు విడతలుగా బంగ్లాదేశ్ $2.31 బిలియన్లను అందుకుంది. అయితే షరతులు నెరవేర్చకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో IMF నాల్గవ విడత నిధులు విడుదల చేయలేదు. తరువాత వివాదాలు పరిష్కారం అవ్వడంతో.. ఈ ఏడాది జూన్‌లో IMF నాల్గవ, ఐదవ విడతలుగా $1.33 బిలియన్లను విడుదల చేసింది.
పేరు మార్చుకున్న ఓయో.. కొత్త పేరు ఏంటో తెలుసా..?
ఓయో కంపెనీ పేరు మారింది. ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ‘ప్రిజం’గా మార్చుకుంది. అయితే ఒక బ్రాండ్‌గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. ఐపీఓ ముంగిట ఒరావెల్ స్టేస్ ఇకపై ‘ప్రిజం లైఫ్’ సంక్షిప్తంగా ‘ప్రిజం’గా కొత్త కార్పొరేట్ గుర్తింపును కొనసాగిస్తుందని బోర్డు ఛైర్మన్, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఓయో షేర్ హోల్డర్లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ పేరు కంపెనీ నిర్వహిస్తున్న అన్ని వ్యాపారాలకు గొడుగు సంస్థగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. తమ ప్లాట్ ఫామ్‌కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రిజం విభిన్న వ్యాపారాలన్నింటికీ గొడుగులా పనిచేస్తుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, కంపెనీ వేర్వేరు బ్రాండ్లను విడిపోకుండా కలుపుతుంది” అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
హార్దిక్ వాచ్ ధర అన్ని కోట్లా.. ఆసియా కప్ ప్రైజ్ మనీకి 10 రెట్లు!
ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2025కి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో టోర్నీ జరగనుండగా.. మొదటి మ్యాచ్ హాంకాంగ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈని ఢీకొట్టనుంది. ఆసియా కప్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న టీమిండియా ప్లేయర్స్.. ముమ్మరంగా సాధన చేస్తున్నారు. భారత ఆటగాళ్లు గత 4-5 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఆసియా కప్ ఆరంభానికి ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లో నిలిచాడు. హార్దిక్ అత్యంత ఖరీదైన వాచ్ ధరించడమే ఇందుకు కారణం. హార్దిక్ పాండ్యా అత్యంత ఖరీదైన వాచ్ ధరించి దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్‌కు వచ్చాడు. అతడు రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్27-04 వాచ్ ధరించాడు. దీని ధర దాదాపుగా రూ.20 కోట్లు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచ్‌లలో రిచర్డ్ మిల్లె ఒకటి. ప్రపంచంలో కేవలం 50 మంది వద్ద మాత్రమే ఈ వాచ్ ఉంది. స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం ఈ వాచ్ తయారు చేయబడింది. ఈ వాచ్ బరువు కేవలం 30 గ్రాములే. ఇది 12,000 G కంటే ఎక్కువ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేని ధర 2250000 యూఎస్ డాలర్లు (20 కోట్ల రూపాయలు).
పాన్ వరల్డ్ మూవీ అవుద్ది.. మిరాయ్ పై టీజీ విశ్వ ప్రసాద్
తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. మిరాయ్ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నాడు. ఇందులో ఉన్న కంటెంట్, విజువల్స్ తో ఒక తెలుగు సినిమా కచ్చితంగా పాన్ ఇండియా స్థాయికి వెళ్తుందన్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది పాన్ వరల్డ్ ప్రాంచైజీగా మారుతుందని ప్రకటించారు.
దుఃఖంలో అరవింద్ ఫ్యామిలీకి అండగా చిరు
అల్లు అరవింద్ తన తల్లి అల్లు కనకరత్నం మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అల్లు కనకరత్నం దశదిన కర్మను హైదరాబాద్‌లో నిర్వహించారు. అల్లు అరవింద్ దుఃఖంలో ఉండగా, ఆయనను పరామర్శించేందుకు సినీ పెద్దలు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే విధంగా, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి సంతాపం వ్యక్తం చేశారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అల్లు కనకరత్నం దశదిన కర్మకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అరవింద్‌కు తన సంతాపం వ్యక్తం చేశారు. నిజానికి, అల్లు కనకరత్నం చనిపోయిన సమయంలో అల్లు అరవింద్ అందుబాటులో లేరు. దీంతో, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆమె భౌతికకాయం వద్దకు వెళ్లి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఇక తాజాగా, చిరంజీవి అల్లు ఫ్యామిలీతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అల్లు అరవింద్‌తో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్‌తో పాటుగా వారి తల్లి కూడా కనిపిస్తున్నారు.