“శక్తి”యాప్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. ఎలా పనిచేస్తుందంటే..?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన ‘శక్తి’ యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం.. శక్తి యాప్ ఎలా పనిచేస్తుంది..? పలు అధునాతన భద్రతా ఫీచర్లను ఈ “శక్తి” యాప్‌కు జోడించిది ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్.. మహిళలకు ఆపద కాలంలో అత్యవసర సహాయం అందించేందుకు “శక్తి” యాప్ కీలకంగా పనిచేయనుంది.. వన్ టచ్ SOS బటన్- వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుంది. Shake Trigger/Hand Gesture SoS- యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్ పంపించవచ్చు. దీని ద్వారా లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లోకేషన్, 10 సెకన్ల ఆడియో, వీడియో కంట్రోల్ రూమ్ కి పంపబడుతుంది.. తద్వారా పోలీసు అధికారుల తక్షణమే స్పందించేందుకు దోహదం చేస్తోంది..
బాబువి డైవర్షన్ పాలిటిక్స్.. అందుకే ఇదంతా..?
ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై స్పందిస్తూ.. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరు.. కానీ, రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట.. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కేబినెట్ లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు.. కానీ, ఇతర అంశాలపై చర్చించారంటూ ఎద్దేవా చేశారు.. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు.. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.. హామీలకు పంగనామాలు పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం.. విజయవాడ, తిరుపతి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులు వరుసుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు.. వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా పనిచేసే రంగన్న వివేకా హత్య కేసులు ప్రధాన సాక్షి అన్నారు. అయితే, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సిట్ బృందంలో ఇద్దరు డీఎస్పీలతో పాటు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, పదిమంది కానిస్టేబుల్స్ ఉంటారని ఆయన వివరించారు.. రంగన్న మృతిని హై ప్రొఫైల్ మర్డర్ గా ఆయన పేర్కొన్నారు. మరింత లోతుగా విచారణ చేపట్టడం కోసం సిట్ బృందం ఆధ్వర్యంలో నిపుణుల చేత రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయించాలని నిర్ణయించారు. శనివారం కడప వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుచేత రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహానికి మరోసారి వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహించారు. మూడు రోజుల క్రితం రంగన్న చికిత్స పొందుతూ అనారోగ్యంతో కడప రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి రిమ్స్ లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.. ఆ తర్వాత బంధువులు పులివెందుల బాకరాపురం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, రంగన్న భార్య సుశీలమ్మ చేసిన ఆరోపణపైన సందేహాల నివృత్తి కోసం పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు.. పులివెందుల ఆర్డీవో సమక్షంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికి తీసి శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై క్షుణ్ణంగా వైద్య బృందం పరిశీలించారు. మృతదేహం నుంచి తల వెంట్రుకలు, కాలిగోళ్లు, చేతి గోళ్లు మరికొన్ని అవయవాలు సేకరించారు. మృతదేహం నుంచి సేకరించిన అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. పోస్టుమార్టం నిర్వహించే సమయంలో రంగన్న భార్య సుశీలమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఈ పోస్టుమార్టం జరిగే ప్రాంతానికి 300 మీటర్ల దూరం నుంచి ఎవరిని లోపలికి రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించి రంగన్న మృతదేహానికి మరోసారి రీపోస్టుమార్టం నిర్వహించారు…
ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం.. వారి ఆట కట్టు..!
ప్రజల భద్రత మరింత పెంచేందుకు ఏలూరు పోలీసుల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రోడ్లపై ఇష్టానుసారం పార్కింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై, నిర్మాణస్య ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే దొంగలపై మాత్రమే కాదు ఊరేగింపులు, వేడుకల వద్ద అల్లర్లకు పాల్పడే ఆకతాయిలను గుర్తించేందుకు డ్రోన్ల సాయంతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఏలూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. ఎక్కువైన రోడ్లు ఆపై ట్రాఫిక్ సమస్య. అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ తో నిత్యం వేలాది మంది ప్రయాణించే రోడ్లపై వాహనదారులు అసౌకర్యానికి గురవుతూనే ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కడం మాత్రం వాహన దారులకు కష్టంగా మారుతుంది.. ఇదే సమయంలో నగరంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న చెయిన్ స్నాచింగులు, చోరీలు , ఆకతాయిలా అల్లరి గొడవలు వంటి అనేక సమస్యలు పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ శివ కిషోర్ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. నిత్యం రద్దీగా ఉండే కూడళ్ళలో, ఊరేగింపులు, వీఐపీ మూమెంట్, నిర్మాణష్య ప్రాంతాలు ఇలా అన్నిచోట్ల నిరంతరం డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో 33 శాతం మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు.. సీఎం కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో బస్సులు అద్దెకు పెట్టుకునే వారని.. కానీ మా ఆత్మ బంధువులు మీరు.. అందుకే ఆర్టీసీ బస్సులు కాంట్రాక్టు మీకే ఇచ్చామని మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 150 బస్సులు ఇవాళ రోడ్డు మీదకు వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్.. కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని.. ఇవాళ..సీతక్క… సురేఖ మంత్రులు అయ్యారన్నారు. 33 శాతం మహిళలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారని చెప్పారు. మీలో నైపుణ్యం ఉన్న మహిళలకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపిస్తామన్నారు.
మారిషస్ దేశ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు దేశాలు కూడా అనేక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం, వాణిజ్యం పెంపు, వివిధ రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. శనివారం జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, కెపాసిటీ బిల్డింగ్, ద్వైపాక్షిక వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం మరియు చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి రంగాలలో ఇరుపక్షాలు అనేక ఒప్పందాలపై సంతకం చేస్తాయని అన్నారు. మారిషస్‌ని సముద్ర పొరుగు దేశంగా మారిషస్‌ని మిస్రీ అభివర్ణించారు. గత 10 ఏళ్లలో రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయని ఆయన అన్నారు.
మత మార్పిడులు చేసే వారిని ఉరితీస్తాం.. ఎంపీ సీఎం వార్నింగ్..
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సోమవారం మత మార్పిడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మత మార్పిడుల కేసుల్లో మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ దీనిపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కలిగి ఉందని అన్నారు. మైనర్లపై అత్యాచారానికి శిక్ష విధించినట్లే, బాలికల్ని మతం మార్చిన వారికి కూడా మరణశిక్ష విధించే నిబంధనల్ని తమ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆయన చెప్పారు. ‘‘అమాయకమైన కూతుళ్లను అత్యాచారం చేసే వారిపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో మరణశిక్ష విధించే నిబంధనలను రూపొందించారు. దీనికి తోడు మతమార్పిడులకు పాల్పడే వారికి కూడా మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టంలో మరణశిక్ష విధించే నిబంధనను కూడా ప్రవేశపెడతాము’’ అని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన అన్నారు.
“రాహుల్ గాంధీనే మాకు పెద్ద ఆస్తి”.. గుజరాత్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
రాహుల్ గాంధీ గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుజరాత్‌లో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వస్తే 40 మంది వరకు నాయకులను తొలగించేందుకు కాంగ్రెస్ సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి కొందరు కాంగ్రెస్ నేతలు రహస్యం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది. గుజరాత్ ప్రజలతో మనం కనెక్ట్ కావాలంటే ప్రజలతో ఉండే నాయకులను, ప్రజలకు దూరంగా ఉండే నాయకులను గుర్తించాలని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తెగ ట్రోల్ చేస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ‘‘బీజేపీకి అతిపెద్ద ఆస్తి’’ అని అభివర్ణించారు. ‘‘అతను(రాహుల్ గాంధీ) తనను తాను, తన పార్టీని ట్రోల్ చేసుకుంటున్నాడు. తనను తాను అద్దంలో చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా నిజాయితీ చర్య. రాహుల్ గాంధీ గుజరాత్‌లో గెలవలేకపోతున్నానని, మార్గం చూపించలేకపోతున్నానని ఒప్పుకున్నాడు… కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వివాహాలలో నృత్యం చేయించిన రేసు గుర్రాలలా ఉన్నారని, మరికొందరు పోటీలలో పరుగెత్తడానికి తయారు చేసిన పెళ్లి గుర్రాలలా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. మీ పార్టీ కార్యకర్తలు జంతువులా..? కనీసం పార్టీ కార్యకర్తల్ని మనుషులుగా చూడండి, మీరు గుర్రాలుగా పిలుస్తున్నారు’’ అని పూనావాలా అన్నారు.
కివీస్ జట్టులో ఈ ఐదుగురు డేంజరస్ ప్లేయర్స్.. వీళ్లతోనే టీమిండియాకు ముప్పు!
భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2002, 2013లో టీమిండియా రెండుసార్లు టైటిల్ కైవసం చేసుకుంది. 2000లో జరిగిన రెండవ ఎడిషన్ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా మూడుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కివీస్ జట్టును తేలిగ్గా తీసుకుంటే ముప్పు తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రోహిత్ సేనను ఓడించే కెపాసిటీ కివీస్ కు ఉందని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కివీస్ జట్టులో ఈ ఐదుగురు డేంజరస్ ప్లేయర్స్ అని వీళ్లతోనే టీమిండియాకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఈ ప్లేయర్స్ ను త్వరగా పెవిలియన్ కు చేరిస్తే భారత్ కు విజయం ఖాయమని అంటున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌పై రూ. 5,000 కోట్ల బెట్టింగ్స్.. ఐదుగురు బుకీలు అరెస్టు
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మార్చి 9న భారత్-కివీస్ మధ్య ఫైనల్ పోరు జరుగనున్నది. టైటిలే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వేళ జోరుగా బెట్టింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం దుబాయ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌పై రూ. 5,000 కోట్ల బెట్టింగ్స్ జరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. అంతర్జాతీయ బుకీలకు భారత జట్టు ఫేవరెట్ అని బెట్టింగ్ ముఠాలను ట్రాక్ చేస్తున్న వర్గాలు తెలిపాయి. చాలా మంది బుకీలు అండర్ వరల్డ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, ప్రతి పెద్ద మ్యాచ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బుకీలు దుబాయ్‌లో కలుస్తారని తెలిపారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా ‘డి కంపెనీ’ దుబాయ్‌లో పెద్ద క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లో పాల్గొంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
‘ఛావా’ చూసి ఆ కోటలో నిధుల వేట??
ఛావా సినిమా రిలీజ్ తరువాత నిధి అన్వేషణ గురించి చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి, అసిర్‌గఢ్ కోట దగ్గర, గ్రామస్తులు రాత్రి చీకటిలో నిధి కోసం వెతకడం ప్రారంభించారు. దీనికి కారణం విక్కీ కౌశల్ కొత్త చిత్రం ‘ ఛావా’. అసిర్‌గఢ్ కోట సమీపంలో మొఘలుల దాచిన నిధి గురించి మరోసారి పుకార్లు కలకలం సృష్టించాయి. గత మూడు రోజులుగా, వందలాది మంది గ్రామస్తులు రాత్రి చీకటిలో మొబైల్ టార్చ్ లైట్ వెలుగులో పొలాల్లో తవ్వుతున్నారు. వారు తమకు మొఘల్ బంగారు నాణేలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ పుకారు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో, నిధి కోసం అన్వేషణ మరింత మంది అక్కడికి క్యూ కట్టారు. తవ్వకాలలో మొఘల్ కాలం నాటి పురాతన నాణేలు దొరికాయని కొంతమంది స్థానిక ప్రజలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ప్రజలు పొలాల్లో గుంతలు తవ్వి నాణేల కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి పుకారు కారణంగా, పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పొలాలను తవ్వడం ప్రారంభించారు. నిధి కోసం అన్వేషణ వార్త అందిన వెంటనే నింబోలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొలాల్లో గుంతలు కనిపించాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి నాణేలు లేదా నిధికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదు. బుర్హాన్‌పూర్ ఎస్పీ దేవేంద్ర పాటిదార్ మాట్లాడుతూ, “మేము మొత్తం విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాము, ఎవరైనా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.