మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని.. కేఏ పాల్ వార్నింగ్..
మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. ఏపీ హైకోర్టుకు వెళ్తున్న తన వెహికల్ ఆపడంపై మండిపడ్డ ఆయన.. కరకట్ట రోడ్డుపై తన వెహికల్ ఆపడం ఏంటి? అని ప్రశ్నించారు.. ఏపీ హైకోర్టు కోర్టు 17లో నా మేటర్ ఉంది.. 20 నిముషాలు సమయం కోరాను.. బెంగుళూరు నుండి ఫైట్లు లేక ఆలస్యం అయ్యిందన్నారు.. ఏపీ హైకోర్టుకు నన్ను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.. మిగిలిన వెహికిల్స్ అటు నుండి పంపండి.. కానీ, నా ఒక్క వెహికిల్ కోర్టుకు పంపండి అని కోరారు.. చంద్రబాబు నాయుడు మీరు వీవీవీఐపీ అయి ఉండొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని అన్నారు.. నేను అని తెలిశాక కూడా నన్ను అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నేను కోర్టుకు వెళ్లాలి.. వెంటనే నన్న వదిలిపెట్టండి అంటూ వీడియో రిలీజ్ చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..
రెండు దశాబ్దాల రోడ్డు వెతలకు పరిష్కారం చూపిన పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొన్ని అంశాలపై వెంటనే స్పందిస్తారు.. తక్షణమే పరిష్కార మార్గం చూపిస్తారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయం స్పష్టమైంది.. ఇప్పుడు.. పోలవరం నియోజకవర్గ ప్రజల రెండు దశాబ్దాల రోడ్డు సమస్యకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్దపీట వేశారు. ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటన సందర్భంగా ప్రజలు వినిపించిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని, మొత్తం రూ. 7 కోట్లు 60 లక్షల నిధులను మంజూరు చేశారు. పోలవరం నియోజకవర్గంలోని తిమ్మనకుంట–గవరవరం రోడ్డు గత 20 ఏళ్లుగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. రోజూ ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళ ఒకరు పవన్ కల్యాణ్‌కు పర్యటనలో విన్నవించుకున్నారు. ఆమె ఆవేదన విన్న పవన్ వెంటనే స్పందించి.. 9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 7 కోట్లు అనుమతి ఇచ్చారు. పల్లె పండగ 2.0 కింద సాస్కీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇక, యర్రంపేట ప్రాంత రైతులు పంట పొలాలకు రాకపోకలు, రవాణా, మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కొంటున్నారని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. పంట పొలాల మధ్య 3 కిలో మీటర్ల డొంక రోడ్డు నిర్మాణానికి రూ. 60 లక్షలు మంజూరు చేశారు. రైతుల అవసరాలు, గ్రామాల కనెక్టివిటీ, రవాణా సౌకర్యం—ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ఫీల్డ్ విసిట్స్‌లో వచ్చిన సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరిస్తున్నారు. కాగా, పర్యటనల్లో ప్రజలు చెప్పిన సమస్యలు వెంటనే పరిష్కార దిశగా వెళ్లడం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పాలనలో వేగం, బాధ్యతను స్పష్టంగా చూపుతోంది. రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు ప్రజల్లో హర్షాన్ని కలిగించింది.
వరద బాధితులకు గుడ్‌న్యూస్.. పరిహారం కోసం నిధుల విడుదల..
గోదావరి వరదలతో నష్టపోయిన బాధితులకు పరిహారం విడుదల చేసేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గోదావరి వరదల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12.85 కోట్ల నిధులు విడుదల చేసింది.. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గోదావరి నదిలో ఏర్పడిన వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో భారీ నష్టాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు పరిహారం అందించే దిశగా తక్షణ చర్యలు చేపట్టింది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని బాధితులకు సహాయం చేయడానికి రూ.12.85 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులను వరదల వల్ల పునరావాస కేంద్రాలు, సహాయక కేంద్రాల్లో ఉన్న బాధితుల నిత్యావసరాల కోసం.. నష్టపోయిన ఇళ్ల కోసం నేరుగా నిధులు పంపిణీ.. నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా బాధితుల ఖాతాల్లోకి పంపించడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా వరద బాధితుల జీవితాలను సత్వర రీహాబిలిటేషన్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ఈ ప్రణాళికను పర్యవేక్షిస్తూ, తదుపరి నెలల్లో కూడా అవసరమైతే అదనపు సహాయం అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
వైసీపీకి గుడ్‌బైపై విడదల రజిని క్లారిటీ..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజని.. వైసీపీని వీడేందుకు సిద్ధం అవుతున్నారని.. త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారని.. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ పెద్ద ప్రచారమే జరిగింది.. దీంతో, విడదల రజిని.. వైసీపీకి బైబై చెబితే.. ఏ పార్టీలో చేరతారు అనే ప్రచారం కూడా సాగింది.. అయితే, ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి విడదల రజిని.. బీసీ మహిళపై తప్పుడు ప్రచారం చేయడమే తెలుగుదేశం పార్టీ నేతల లక్ష్యం అని మండిపడ్డారు.. తాను చిలకలూరిపేట నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.. అసలు సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు విడుదల రజని.. ఇక, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేపట్టాం.. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 64 వేల 511 సంతకాలు సేకరించాం.. సేకరించిన సంతకాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందన్నారు రజని.. చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరం అన్నారు.. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారకుడు ఒక పోలీసు కుమారుడే… ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. పోలీసు ఉద్యోగి కొడుకు ఉన్నాడు కాబట్టే పోలీసుల వ్యవస్థ కేసు విచారణలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.. వైసీపీ నేతలను టార్గెట్ చేసి వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసులకు తెలుసు అని ఫైర్ అయ్యారు.. ఐదు కుటుంబాల్లో విషాదం నింపిన వారిని కఠినంగా శిక్షించాలి.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి విడదల రజిని..
గ్రామీణ రహదారులకు మహర్దశ.. రూ.2,123 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది.. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల అభివృద్ధికి రూ.2,123 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ఫేజ్ -1లో రూ.2,123 కోట్లు నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కారు.. మొత్తం రహదారులు 1,299 కాగా.. వీటిలో 4 బ్రిడ్జిలు కూడా ఉన్నాయి. మొత్తం 4,007 కిలో మీటర్లు పొడువైన రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.. మొత్తం 26 జిల్లాల్లో రోడ్ల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నారు.. 157 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగనున్నాయి.. 484 మండలాల్లోని 4,007 కిలో మీటర్ల పొడవున గ్రామీణ ప్రాంత రోడ్లను డెవలప్ చేయనుంది ప్రభుత్వం.. దీని కోసం 2,123 కోట్ల రూపాయల వ్యయాన్ని ఖర్చు చేయనుంది.. ఆ మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, గత ప్రభుత్వ హయాంలో రోడ్లను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు గుప్పించారు.. అయితే, ఇప్పుడు కూటమి సర్కార్ హయాంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు..
రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి, వాతావరణ కాలుష్యానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రజారవాణాను మరింత సౌకర్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే దిశగా నగరంలో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికుల అసౌకర్యం తగ్గడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా తోడ్పడనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేయనుండగా, నిర్వహణ బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ విడతల వారీగా కొత్త బస్సులను ప్రవేశపెడుతోంది. తాజా విడతలో భాగంగా తీసుకొస్తున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రజారవాణా వ్యవస్థకు మరింత బలం చేకూర్చనున్నాయి.
ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో గ్రామ పాలనకు సంబంధించి నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. తొలి విడత పోలింగ్ ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27 లక్షల 41 వేల 70 మంది పురుష ఓటర్లు ఉండగా, 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 201 మంది ఇతర (థర్డ్ జెండర్) ఓటర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కఠిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సౌదీలో నాన్-ముస్లింలకు ‘‘మద్యం’’.. కానీ, ఒక్క కండిషన్..
ప్రపంచ మార్పులకు అనుగుణంగా ఇస్లాంకు పుట్టినిల్లుగా ఉన్న సౌదీ అరేబియా కూడా మారాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా సౌదీ ప్రభుత్వం మధ్యం కొనుగోలు నిబంధనల్ని కొంచెం సడలించింది. నెలకు 50,000 రియాల్స్ ($13,300) లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతర విదేశీ నివాసితులు మద్యం కొనుగోళ్లు చేయడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని రియాద్‌లో దేశం మొత్తానికి ఏకైక మద్యం షాప్ మాత్రమే ఉంది. ఇది గతంలో విదేశీ దౌత్యవేత్తల కోసం ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు ఇస్లామేతరులకు కూడా సాలరీ నిబంధనపై అమ్మకాలకు అనుమతించినట్లు తెలుస్తోంది. కొత్త వెసులుబాటు ప్రకారం, మద్యం కొనుగోలు కోసం షాప్‌లోకి ప్రవేశించేవారు తప్పనిసరిగా వారి సాలరీ సర్టిఫికేట్లు చూపించాల్సి ఉంటుంది. రియాద్‌లోని లిక్కర్ స్టోర్ గతంలో విదేశీ రాయబారుల కోసం ఉండగా, ఇప్పుడు ప్రీమియం రెసిడెన్సీ ఉన్న నాన్-ముస్లిం నివాసితులకు కూడా అనుమతి లభించింది. ఈ కొనుగోళ్లను నెలవారీ పాయింట్ బేస్డ్-అలవెన్స్ సిస్టమ్ ద్వారానే చేయవచ్చు. భవిష్యత్తులో సౌదీలోని ఇతర నగరాల్లో కూడా కొత్త లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇండిగోకు కేంద్రం గట్టి షాక్.. 10% విమాన సర్వీసులు కట్ చేస్తూ ఆర్డర్!
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్ర అంతరాయానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో కార్యకలాపాలు వరుసగా దెబ్బతింటుండటంతో కేంద్రం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మొత్తం 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని ఇండిగో సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా హాజరయ్యారు. అలాగే ఇండిగో తరఫున సీఈఓ పీటర్ ఎల్బర్స్ పాల్గొన్నారు. ఇండిగో ప్రస్తుతం దేశీయ రూట్లలో నిర్వహిస్తున్న వేల సంఖ్యలో విమాన సర్వీసుల్లో కనీసం 10 శాతం సర్వీసులను తాత్కాలికంగా తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది. పైలట్లు, క్రూ సభ్యులు, టెక్నికల్ సిబ్బందిపై అధిక ఒత్తిడి పడకుండా, ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని, వెంటనే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి.. పీఎం మోడీతో సత్య నాదెళ్ల భేటీ..
మైక్రోసాఫ్ట్ బాస్ సత్య నాదెళ్ల మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిన ఇండియాలో పెడుతున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇది భారతదేశ ఆశయాలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. భారతదేశ ‘‘AI ఫప్ట్ ప్యూచర్’’ నిర్మించేందుకు, డెవలప్ చేసేందుకు $17.5 బిలియన్లు( రూ. 1.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. భారతదేశం AI అవకాశంపై స్ఫూర్తిదాయకమైన సంభాషణలకు సత్యానాదెళ్ల ప్రధాని నరేంద్రమోడీకి థాంక్స్ చెప్పారు. ఆసియాలోనే మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. మోడీతో మీటింగ్ గురించి నాదెళ్ల ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ భారతదేశ ఏఐ అవకాశంపై స్పూర్తిదాయకమైన సంభాషణలకు ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు, దేశ ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి, ఇండియా ఏఐ ఫస్ట్ ఫ్యూచర్‌కు అవసరమైన మౌలికసదుపాయాలు, నైపుణ్యాలు, సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి US$17.5 బిలియన్ల పెట్టుబడి నిబద్ధతకు కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు.
ఉస్తాద్ భగత్‌సింగ్ తర్వాత పవన్ సినిమా ఏంటి?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ పూర్తి కావడంతో, తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. సాధారణంగా, పవన్ కల్యాణ్ ఒక ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టి మరొకరికి ఛాన్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. ఈసారి కూడా అదే ట్విస్ట్ జరగనుందా? ఆయన డేట్స్ కోసం లైన్‌లో ఉన్న ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు? ఎవరికి ముందుగా ఛాన్స్ దక్కుతుంది? ఇప్పుడు చూద్దాం. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ కోసం ఇద్దరు ప్రముఖ నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల క్రితమే రామ్ తళ్లూరి నిర్మాణంలో సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరు వినిపించింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా తెరపైకి వచ్చిన మరో నిర్మాత విశ్వప్రసాద్. ఈయన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రిలీజ్‌కు హెల్ప్ చేసిన నిర్మాత. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ విశ్వప్రసాద్‌కు ఛాన్స్ ఇస్తాడా, లేక ముందుగా కమిట్ అయిన రామ్ తళ్లూరి సినిమాను ప్రారంభిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. ముందే మైండ్లను రెడీ చేస్తున్నాడుగా
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమాల్లో సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్‌ని చివరి వరకు దాచి పెడతారు, కానీ అనిల్ రావిపూడి మాత్రం కథలోని ప్రధాన అంశాలను అందరికీ తెలిసేలా.. పాటల్లోనే కథ మొత్తం చెప్పేస్తున్నాడు. తాజాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం నుంచి ‘శశిరేఖ..’ అనే సాంగ్ రిలీజైంది. ఈ పాట, గతంలో విడుదలైన మరో పాట కథా సారాంశాన్ని బయటపెడుతున్నాయి. ఈ పాటను లవర్స్‌గా ఉన్న ప్రసాద్ (చిరంజీవి), శశిరేఖ (నయనతార) పాడుకునే పాటగా చిత్రీకరించారు. ‘మీసాలపిల్ల..’ పాట: ఇది విడిపోయిన భార్యాభర్తలు లేదా దూరం అయిన ప్రేమికులు పాడుకునే పాటలా ఉంది. చిరంజీవి ప్రసాద్‌గా, నయనతార శశిరేఖగా నటిస్తున్నారు. శశిరేఖ గొప్పింటి అమ్మాయి అని, ఆమె అన్నీ వదిలేసి ప్రసాద్ కోసం వచ్చినట్లుగా కథాంశం పాటల్లో స్పష్టమవుతోంది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోవడం, మళ్లీ కలవడమే సినిమా కథ అనే విషయం పాటల ద్వారా ముందే ప్రేక్షకులకు తెలిసిపోతోంది.