ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. అజెండాలోని 14 అంశాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గ సమావేశం.. ముఖ్యంగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్‌లో మార్పు చేర్పుల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. కేడర్ రేషనలైజేషన్ పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ.. పౌరసేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా కేడర్ లో మార్పు చేర్పులకు నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు, కుప్పం నియోజకవర్గంలో రూ.5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుపై వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.. సెంట్రల్ పూల్ లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం కేబినెట్ కు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు సమర్పించగా.. వాటికి ఆమోదముద్ర వేసింది.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం కోసం ఉచితంగా 27 ఎకరాల భూమి కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. మరోవైపు, రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి ఉచితంగా 10 ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. గీతకులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో నాలుగు దుకాణాల్ని సొండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను ఆమోదించింది కేబినెట్ . 2024-29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
పోసానికి షాకిచ్చిన నరసరావుపేట కోర్టు..
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ ఇచ్చింది నరసరావుపేట కోర్టు.. పోసానిని ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి.. పోసానిని రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నరసరావుపేట కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. శనివారం, ఆదివారం.. రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీకి అనుమతించింది.. మరోవైపు.. పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును ఈ నెల 10వ తేదీన ఇచ్చే అవకాశం ఉంది.. కాగా, పోసానికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. పవన్ కల్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో గత నెల 24వ తేదీన కేసు నమోదు అయ్యింది.. ఈ కేసులో గత నెల 28వ తేదీన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29వ తేదీన రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. అయితే, గత సోమవారం పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. పోసాని న్యాయవాదులు కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ లపై గత వారం రోజులలో రెండుసార్లు కడప మొబైల్ కోర్టు లో విచారణ జరిగింది.. సుదీర్ఘ విచారణ అనంతరం పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ పోసాని బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగిసింది.. ఇప్పుడు కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసినా.. నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ వస్తేనే పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేసినా.. పోసాని మళ్లీ పై కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు.
వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి మృతి.. ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతి ఇప్పుడు చర్చగా మారింది.. ఇవాళ ఏకంగా ఏపీ కేబినెట్ భేటీలోనూ ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.. ఇప్పటివరకు వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులుగా, నిందితులుగా ఉన్నవారిలో నలుగురు చనిపోవడంపై డీజీపీ వివరణ కోరింది కేబినెట్.. అయితే, ఒక్కో మరణం గురుంచి కేబినెట్ కు వివరించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. దీంతో, ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించింది కేబినెట్ సమావేశం.. వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే.. రంగయ్యను పోలీసులు చంపారంటూ ప్రసారం కావటంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తం చేశారు.. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అందుకే తాను పదే పదే చెప్తూ వస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోవైపు, పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారనే విషయాన్ని గుర్తుచేశారు ఏపీ సీఎం.. ఇక, వాచ్‌మెన్ రంగయ్య మృతి ముమ్మాటికీ అనుమాన్పదమే అన్నారు సీఎం చంద్రబాబు.. అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయినట్టు తెలిపారు కేబినెట్‌కు వివరణ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..
జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అప్పటి వరకు వైసీపీలో ఉన్న కొందరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఇలా.. చాలా మంది ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. కూటమి పార్టీలో చేరుతున్నారు.. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలో పలువురు నేతలు చేరిపోయారు.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జనసేనలో చేరిపోయారు.. గతంలోనే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన.. ఈ నెల 3వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా పెండెం దొరబాబు చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ రోజు అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు పెండెం దొరబాబు.. పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్ధానిక నేతలు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.. మరికొందరు నేతలు.. కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి నాదెండ్ల మనోహర్..
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు ప్రమోషన్లు..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి లో పౌర సేవలు మరింత ఈజీ అవడం కావడం కోసం ఉద్యోగుల ప్రమోషన్ చానెల్స్ లో మార్పుకోసం చేసింది ప్రభుత్వం. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..ఇక నుంచి సింగిల్ కేడర్ గానే ఎంపీడీఓ డీఎల్పీఓలను మార్చారు. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఎంపీడీఓల రిక్రూట్మెంట్ ను రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గందరగోళానికి కారణం అవుతున్న కేడర్ రేషనలైజేషన్ ప్రక్రియకు రాష్ట్ర కేబినెట్ అమోదం తెలిపింది. ఈమేరకు గ్రామీణాభివృద్ధి శాఖలోని సర్వీసు నిబంధనల పునర్వవస్థీకరణకు కేబినెట్ తీర్మానించింది. ఎంపీడీవో, డీఎల్పీఓలను సింగిల్ కేడర్ గా మార్చేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. పోస్టులను అప్ గ్రేడ్ చేయటం ద్వారా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిప్యూటీ సీఈఓను ఒకే కేడర్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎంపీడీఓల నియామకాన్ని ఏపీపీపీఎస్సీ ద్వారా జరిగే ప్రత్యక్ష నియామకాల నుంచి తప్పిస్తూ కేబినెట్ ఆమోదించింది.. డీడీవో, డీపీవో, డిప్యూటీ సీఈవోలకు సంబంధించి మొత్తం ఖాళీల్లో మూడోవంతు ఖాళీలను ప్రత్యక్ష నియామకం ద్వారా చేయాలని నిర్ణయించారు. మిగిలిన రెండు వంతుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జెడ్పీసీఈవోల పోస్టుల్లో 50 శాతం మేర ఐఎఎస్ ల ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నా వారు లేక పోతే పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు తీర్మానం చేశారు. మొత్తంగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను బలోపేతం చేసేలా ఈ సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది. మరోవైపు ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. కుప్పం నియోజకవర్గంలో రూ.5.34 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ పూల్ లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను సృష్టించేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది.
నగరవాసులకు జీహెచ్‌ఎంసీ శుభవార్త.. వాటిపై భారీ డిస్కౌంట్
భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ (GHMC) శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపులో వడ్డీపై 90 శాతం డిస్కౌంట్‌తో ఓటీఎస్ అవకాశం కల్పిస్తుంది. బకాయిదారులకు బల్దియా ఓటీఎస్ అవకాశం కల్పించింది. ఈ నెలాఖరు వరకు పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి ఈ ఆఫర్ వర్తించనుంది. 10 శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తి పన్నును చెల్లించే వెసులుబాటు కల్పించనుంది జీహెచ్ఎంసీ. ఓటీఎస్ ద్వారా పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను బకాయిలు దాదాపు రూ.4 వేల వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉన్నాయి. మిగిలిన రూ. 1000 కోట్లు గ్రేటర్లోని సుమారు 2 లక్షల మంది నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలకు వడ్డీ కలిపితే.. రూ.2,500 కోట్ల వరకు అవుతోంది. ఓటీఎస్ స్కీమ్ ద్వారా 90 శాతం వడ్డీ డిస్కౌంట్ ఇస్తే రూ.1,150 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. తొలిసారిగా 2020లో ఓటీఎస్‌ను అమలు చేశారు. 2020 నుంచి 2024 మార్చి వరకు మూడుసార్లు ఓటీఎస్ అమలు చేశారు. అందులో రూ.320 కోట్లు రాబట్టింది. అయితే మరోసారి ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నారు. ఈ స్కీమ్ కింద ఆస్తి పన్ను బకాయిదారులు కేవలం 10 శాతం వడ్డీతో పెండింగ్ బకాయిలు చెల్లిస్తే సరిపోతుంది. 2024లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా పెండింగ్ పెట్టిన వారికి ఓటీఎస్ కింద డిస్కౌంట్ ఇచ్చి కనీసం రూ.500 కోట్లు వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.
మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు మహిళలందరికీ శుభ దినం అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఫ్రీ ప్రయాణం నుంచి బస్సు ఓనర్లుగా మహిళలను మార్చాం.. పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని సీతక్క చెప్పారు. ఇందిరా శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించామన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. 21 వేల కోట్లకు పైగా రుణాలిచ్చాం.. వడ్డీలు, చక్ర వడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలి కాకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వంలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్-కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్‌లోని లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం రేపుతోంది. హాస్టల్‌లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో.. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా.. హాస్టల్ నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. స్పై కెమెరాలోని పలు చిప్స్ ను పోలీసులు పరిశీలించారు. గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా ఘటనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఇంట్లో భార్య, తల్లి గొడవ పడుతున్నారని మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట ఇంట్లో స్పై కెమెరా పెట్టాడు. అనంతరం.. ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అమెజాన్‌లో ఓ కెమెరాను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత హాస్టల్ కిచెన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. అంతటితో ఆగకుండా.. ఎవరికి తెలియకుండా అమ్మాయిల రూమ్‌లో కెమెరా పెట్టాడు మహేశ్వరరావు. కాగా.. ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ బాగోతం బయటపడింది.
ఊబకాయాన్ని ఓడించి.. ఫిట్‌గా ఉండేందుకు మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలిలో పర్యటించారు. సిల్వాసాలో నమో ఆసుపత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.2,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన ఆయన ఊబకాయం సమస్యను ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడుతారని ప్రధానమంత్రి ఒక నివేదికను ఉటంకిస్తూ అన్నారు. ప్రధానమంత్రి ఈ గణాంకాలను ప్రమాదకరమైనవిగా అభివర్ణించారు. స్థూలకాయాన్ని ఓడించడానికి ప్రధాని మోడీ ప్రజలకు ఒక మంత్రాన్ని కూడా చెప్పారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు మారోసారి గుర్తు చేశారు. ప్రజలు వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు జీవనశైలిపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ప్రభుత్వం దేశవ్యాప్తంగా 25 వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభిస్తుందని… తద్వారా ప్రజలు సరసమైన, నాణ్యమైన జనరిక్ ఔషధాలను పొందగలరన్నారు.
“యూకే ఉదాసీనత”.. జైశంకర్ భద్రతా ఉల్లంఘనపై భారత్ కామెంట్స్..
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఆయన ఓ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే సమయంలో ఖలిస్తానీలు నినాదాలు చేయడంతో పాటు ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని జైశంకర్ సమీపంలోకి రావడం, కారుని అడ్డుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై యూకే ప్రకటనపై భారత్ శుక్రవారం స్పందించింది. యూకే ఉదాసీనతను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. ‘‘ఈ విషయంపై యూకే విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను మేము గమనించినప్పటికీ, దాని నిజాయితీపై మా అభిప్రాయం, మునుపటి సందర్భాలలో నిందితులపై తీసుకున్న చర్యలపై ఆధారపడి ఉంటుంది’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.
అమాంతం పెరిగిన జెలెన్ స్కీ ప్రజాదరణ.. ట్రంప్ ప్రధాన కారణం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ప్రజామోదం రేటింగ్ అమాంతం పెరిగింది. శుక్రవారం ప్రచురించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన అప్రూవల్ రేటింగ్ మరో 10 శాతం పెరిగినట్లు తేలింది. కీవ్ ఇంటర్నేషల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన పోల్‌లో, ఉక్రెయిన్లలో 67 శాతం మంది జెలెన్ స్కీని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గత నెల ఇది 57 శాతం ఉంది. ఎప్పుడైతే జెలెన్ స్కీని ట్రంప్ ‘‘నియంత’’ అని పిలిచాడో అప్పటి నుంచి ఆయన రేటింగ్ పెరిగింది. తాజా పోల్ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 4 మధ్య నిర్వహించబడింది. ఫిబ్రవరి 28న అమెరికా పర్యటనకు వెళ్లిన జెలెన్ స్కీ, ట్రంప్‌తో ‘‘ఖనిజ ఒప్పందం’’పై చర్చించారు. వీరిద్దరి మధ్య మీడియా లైవ్‌లోనే వాగ్వాదం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ట్రంప్ బృందం జెలెన్ స్కీ పై మాత్రమే కాకుండా, ఉక్రెయిన్లపై వ్యక్తిగత దాడిగా అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 29 శాతం మంది అతడిని నమ్మడం లేదని చెప్పారు.
జక్కన్న సినిమాలో మహేష్ పేరు లీక్!?
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎస్ ఎస్ ఎం బి 29 అని సంభోదిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు జరిగింది. అసలు సినిమా సెట్స్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా రాజమౌళి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ప్రస్తుతానికి ఈ ఇండోర్ షూటింగ్ పూర్తయి సినిమా యూనిట్ అంతా అవుట్డోర్ షూటింగ్ కోసం ఒడిస్సాలోని ఈస్ట్రన్ ఘాట్స్ కు వెళ్ళింది. కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్ అక్కడే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియానా జోన్స్ తరహాలో సాగే ఈ కథలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ పేరు ఇదే అంటూ రుద్రా అనే పేరు వైరల్ అవుతోంది. రాజమౌళి సినిమా గురించి ఎన్నో కండిషన్స్ పెట్టాడు కాబట్టి లీకైన ఈ పేరు నిజం అని చెప్పలేం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. సినిమా షూటింగ్ సహా సినిమా అప్డేట్స్ కూడా బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న రాజమౌళి దానికి తగ్గట్టు అగ్రిమెంట్స్ కూడా చేయించాడు.
రామ్ పోతినేని ఎవరి ‘తాలూకా’నో తెలుసా?
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న సినిమాకి నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మార్చి 15 జరిగే ఈ షూట్ లో కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాతో రామ్ రైటర్ గా మారాడు. ఈ సినిమాలో సందర్భానుసారం వచ్చే ప్రేమ గీతాన్ని రామ్ పోతినేని స్వయంగా రాసాడట. పాట చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఇక ఈ సినిమాకి ఒక ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ సినిమాకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది.