ఏపీలో తుది ఓటర్ల జాబితా ప్రకటన.. ఎన్ని ఓట్లు పెరిగాయంటే..?
ఏపీలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.. ఆ తుది జాబితా ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447కు పెరిగింది.. అందులో పురుష ఓటర్ల సంఖ్య 2,03,52,816గా ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,84,231గా ఉంది.. ఇక, థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 3400గా ప్రకటించింది ఈసీ.. వెలగపూడి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి ఈ జాబితాను విడుదల చేశారు.. ఈ నెల 1వ తేదీని ఈ జాబితాకు సంబంధించిన అర్హత తేదీగా నిర్ణయించినట్టు ఈసీ పేర్కొంది.. గతంలో పోలిస్తే పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,165 నుండి 46,397కి పెరిగింది. ముసాయిదా ఓటర్ల జాబితాలు గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన ప్రచురించబడ్డాయి.. అయితే, అభ్యంతరాలను 28 నవంబర్ 2024 వరకు స్వీకరించామని.. అభ్యంతరాలకు పరిష్కారం చూపి, కొత్త ఓటర్లను చేర్చిన తర్వాత తుది ఓటర్ల జాబితాలు 6 జనవరి 2025న ప్రచురించినట్టు ఈసీ పేర్కొంది.. దీంతో.. గతంలో 2,02,83,021 ఉన్న పురుష ఓటర్ల సంఖ్య 2,02,88,543కి పెరగగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,67,377 నుంచి 2,10,81,814 చేరింది.. ఇక థర్డ్ జెండర్ ఓట్లు 3,394 నుంచి 3,400కి పెరగగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 4,13,53,792 నుంచి 4,13,73,757 పెరిగినట్టు ఈసీ పేర్కొంది.. సర్వీస్‌లో ఉన్న పురుషు ఓటర్లు 64,273.. మహిళా ఓటర్లు 2,417.. ఇతర సర్వీసుల్లో ఉన్న ఓటర్లలో పురుషులు 2,03,52,816 మంది.. మహిళా ఓటర్లు 2,10,84,231.. థర్డ్ జెండర్ 3,400గా ఉండడంతో.. మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,20,935 నుంచి 4,14,40,447కి పెరిగినట్టు స్పష్టం చేసింది ఏపీ ఎన్నికల కమిషన్..
కుప్పంలో ఉచిత సౌర విద్యుత్ పథకం ప్రారంభం.. ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తా..!
మరోసారి తన సొంత జిల్లా.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు.. ఐదేళ్ళుగా గంజాయి రాష్ట్రంగా ఏపీని వైసీపీ మార్చింది.. యువతరాన్ని నాశనం చేసింది.. ఏపీలో గంజాయి లేకుండా చెయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 150 సేవలు తీసుకుని వస్తున్నాం.. ఇంటి నుండే ప్రతిసేవ పొందేలా చేస్తాం. ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పును కుప్పానికి, రాష్ట్రానికి తీసుకుని వస్తాను.. కుప్పానికి రాబోయే రోజుల్నీ మంచి రోజులే అన్నారు. గండికోట నుండి కుప్పంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తాం అన్నారు.. నేను రాకపోయినా మీరు నన్ను గెలిస్తూ వచ్చారు.. కానీ, ఐదేళ్లుగా కుప్పాన్ని నాశనం చేశారు.. అడ్డదిడ్డంగా దోచుకున్నారు. ఇకపై కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ.. 25 ప్రశ్నలు సంధించిన ఈడీ..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఈడీ విచారణ ముగిసింది.. కాకినాడ సీ పోర్టు, సెజ్ కేసులో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సాయిరెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు.. కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాయిరెడ్డిని ప్రశ్నించారు అధికారులు.. ఇక, విచారణ అనంతరం ఈడీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ నన్ను విచారించింది.. 25 ప్రశ్నలు అడిగారు.. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది.. కేవీ రావు నాకు తెలియదు అని చెప్పాను.. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు… కాకినాడ సీ పోర్ట్ విషయంలో కేవీ రావుకు ఎక్కడ నేను ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. ఇక, కేవీ రావును తిరుమలకు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పాను.. నేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధం అన్నారు విజయసాయిరెడ్డి.. మే నెల 2020లో నేను ఫోన్ చేశానని కేవీ రావు చెబుతున్నాడు.. కాల్ డేటా తీసి చూడండి.. నేను ఎక్కడ కూడా కేవీకి ఫోన్ చేయలేదు అన్నారు.. అంతేకాదు.. కేవీ రావును ఈడీ విచారణకు పిలవండి అని కోరినట్టు వెల్లడించారు.. రంగనాథ్ కంపెనీని ప్రభుత్వానికి ఎవరు పరిచయం చేశారని ఈడీ ప్రశ్నించింది.. నాకు సంబంధం లేదు అని చెప్పాను.. నేను ఒక సాధారణ మైన ఎంపీని మాత్రమే.. శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవరు ఆపాయింట్ చేశారో నాకు తెలియదు అని చెప్పాను. శరత్ చంద్ర రెడ్డితో ఉన్న సంబంధాలు కూడా అడిగారు.. కుటుంబ రీలేషన్ అని చెప్పాను అని పేర్కొన్నారు..
HMPVపై ఏపీ సర్కార్ అలెర్ట్.. సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో వెలుగు చూసిన ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. భారత్‌లో అధికారికంగా HMPV మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. గైడ్‌లైన్స్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్ళపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్ధేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు..
2 రోజుల్లో భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. రియల్ ఎస్టేట్ పెరిగేలా నిబంధనలు..
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఆథారిటీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ డ్రైవ్ నిర్వహించారు.. ప్రతి దరఖాస్తుకు సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అధికారులను వివరణ అడిగారు మంత్రి.. భవనాలు, ప్లాట్లు కొనుగోలుచేసేవారు ప్రకటనలు చూసి మోసపోకుండా ఉండేలా చూడటమే రెరా లక్ష్యం అన్నారు.. కేంద్ర చట్టం ప్రకారం రాష్ట్రంలో 2016లో రెరా చట్టం అమల్లోకి వచ్చింది.. అప్పటి నుంచి కేంద్రం ఇచ్చిన నిబంధనలు రాష్ట్రంలో తూ,చ. తప్పకుండా అమలుచేసేలా ముందుకెళ్తున్నామన్నారు. రెరాలో ఇప్పటివరకూ 167 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి.. కొన్ని దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం అన్నారు మంత్రి నారాయణ.. రాష్ట్రం నలుమూలల నుంచి 30 మంది క్లయింట్లు, బిల్డర్లు, డెవలపర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చారు.. ఆయా దరఖాస్తులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశాం.. పెండింగ్ అప్లికేషన్లు అన్నీ ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను కూడా కొన్ని పరిశీలీంచాం.. అయితే రెరా నిబంధనలు మరింత సరళతరం చేసేలా కమిటీ వేసి ముందుకెళ్తామన్నారు మంత్రి నారాయణ.. రెరా అనుమతులు ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లో జరిగేలా త్వరలో మార్పులు చేస్తున్నామన్నారు. 167 దరఖాస్తు లు పెండింగ్‌లో ఉండగా ఈనెలాఖరుకు పరిష్కరించాలని ఆదేశించాం.. గత ప్రభుత్వంలో బిల్డర్లు, డెవలపర్లుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరగాలనేది సీఎం చంద్దరబాబు లక్ష్యమని.. అందుకు అనుగుణంగా భవన, లేఅవుట్ల అనుమతులను సరళతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
బీఆర్‌ఎస్ శకం ముగిసింది.. కేటీఆర్ జైలుకు పోక తప్పదు
తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ పార్టీనే ఉండదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారన్నారు. తండ్రీకొడుకులు తప్ప బీఆర్ఎస్‌లో ఎవ్వరూ ఉండరని పేర్కొన్నారు. దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని.. ఆయన జైలుకు పోక తప్పదని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీకి అసలు అడ్డులేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ము తిన్న వారికి శిక్ష తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో పెద్ద క్రైమ్ చేశారని.. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని పూడ్చేపనిలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అధికారం కోల్పోయిన అక్కసుతో దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక్క కుర్చీ కోసం ముగ్గురు కొట్లాడుతున్నారు. అధ్యక్ష పదవి కోసం ఆ ముగ్గురు పోటీ పడుతున్నారు. హరీశ్ రావు వేరే పార్టీ చూసుకోవాల్సిందే. ఈ-కారు రేస్‌లో కేటీఆర్ అడ్డంగా దొరికారు. పనికి రాని కేసు అంటూనే కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు. ప్రపంచంలోనే అత్యంత ప్రజా ధనం దుర్వినియోగం, దోపిడీ చేసిన కుటుంబం కేసీఆర్ కుటుంబం. వాళ్ల పాలనలో దోపిడీ లేని రంగం లేదు. ఫాంహౌస్‌కు పరిమితం అయినా కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా అవసరమా? బీజేపీ మతం పేరిట ఓట్లు అడుగుతుంది. కులం, మతం పేరిట ఓట్లు అడగడం వల్ల రాబోయే తరాలు ఇబ్బంది పడతారు.’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
మోడీతో కొట్లాడి ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చా
ప్రధాని మోడీతో కొట్లాడి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మెట్రో రైలును తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఫ్లై ఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. మోడీతో కొట్లాడాల్సి వస్తే కొట్లాడతా.. అసదుద్దీన్‌తో కలవాల్సి వస్తే కలుస్తామని తెలిపారు. అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్ అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించారని.. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ ఏర్పడ్డాక రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించుకున్నట్లు వెల్లడించారు. మనకు మనమే సాటి అని చెప్పుకోవడానికి ఇదొక్కటి చాలు అనితెలిపారు. ‘‘హైదరాబాద్ నగర అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. మెట్రో రైలు, రోడ్ల విస్తరణ, శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ప్రాధాన్యతగా పెట్టుకున్నాం. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు శివరేజ్ పనులు ప్రారంభించాం. మూసీ నదిని పునరుజీవింపజేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిజాం కాలంలో కాలంలో నిర్మించిన ఉస్మాన్, హిమాయత్ సాగర్‌లను నిర్మించి తాగునీటి సమస్యలు లేకుండా చేశారు. హైదరాబాద్ లేక్ సిటీగా ఉండేది. నిజాం చేసిన అభివృద్ధిని కాపాడుకుంటే ప్రపంచంలో హైదరాబాద్ బెస్ట్ నగరంగా ఉండేది. చిన్న వర్షం వచ్చినా ట్రాఫిక్, వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అక్బరుద్దీన్ చిన్నప్పటి స్నేహితుడు. హైదరాబాద్ డెవలప్‌మెంట్ కోసం ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తాయి. చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ ప్రారంభ సమయంలో మోడీతో మాట్లాడాను. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం సహకరించాలని కోరాం. ప్రధాని, మేము వేర్వేరు పార్టీల్లో ఉన్న కూడా నగర అభివృద్ధి కోసం, పనుల కోసం మాట్లాడాను. రీజినల్ రింగ్ రోడ్ ఏర్పడితే మరింత డెవలప్ అవుతుంది. రీజినల్ రింగ్ రోడ్‌కు కలిపి రీజినల్ రింగ్ రైల్ కూడా కావాలని ప్రధాని కోరాను.’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఓల్డ్ సిటీ అందమైన నగరం.. ఒలింపిక్స్‌లో మెడల్స్ తెచ్చే ప్లేయర్స్ ఉన్నారు
ఓల్డ్ సిటీ చాలా అందమైన నగరమని.. ఇక్కడ ఉండే ప్రజలంతా ప్రేమానురాగాలతో ఉంటారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఓల్డ్ సిటీలో ఇంత పెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించడం ఆనందంగా ఉంది. రూ.301 కోట్లతో శివరేజ్ పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. వర్షం నీరు, మురుగు నీరు కలవకుండా వేర్వేరు లైన్ ఏర్పాటు చేయడం సంతోషం. మురుగు నీరును కూడా బాగు చేయడానికి ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని.. దీంతో మూసీలో మురుగు లేకుండా చేయడానికి అవకాశం కలుగుతుంది.’’అని వివరించారు. గత ప్రభుత్వం ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తామని అన్నారని.. కానీ చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీకి ప్రతి రోజు వేల సంఖ్యలో టూరిస్ట్‌లు వస్తారని.. ఓల్డ్ సిటీని మరింత డెవలప్ చేస్తే టూరిజం మరింత పెరిగే అవకాశం ఉందని సూచించారు. ప్రభుత్వం తీసుకొస్తామన్న టూరిజం పాలసీలో మక్కా మసీదుతో పాటు ఇతర మసీదులను కూడా చేర్చితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఓల్డ్ సిటీలో కూడా హైరేంజ్ అపార్ట్‌మెంట్ కల్చర్ వస్తుందన్నారు. కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టిసారించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. సిటీలో ఉన్న స్టేడియాలను పొలిటికల్ పార్టీ మీటింగ్స్ ఇవ్వకుండా స్పోర్ట్స్‌ను పెంచే విధంగా ఉండాలన్నారు. ఓల్డ్ సిటీ నుంచి ఒలంపిక్స్‌లో మెడల్స్ తీసుకువచ్చే ఫుడ్ బాల్ ప్లేయర్స్ ఉన్నారని.. వారికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఓల్డ్ సిటీలో హిందూ- ముస్లిం అనే తేడా లేకుండా కలిసిమెలిసి ఉంటారన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకొస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి అక్బరుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు.
HMPV వైరస్‌పై కేంద్రం కీలక ప్రకటన..
మెటాన్యూమోవైరస్(HMPV)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ గురించి ఎవరూ ఆందోళనపడొద్దని, ఇది కొత్త వైరస్ కాదని, దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. 2001లో తొలిసారి గుర్తించిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలను అమలు చేస్తుందని ప్రజలకు హామీ ఇస్తూ నడ్డా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. ఇది 2001లో మొదటిసారిగా గుర్తించబడింది, ఇది చాలా సంవత్సరాల నుండి ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. HMPV గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. శీతాకాలం, వసంత ఋతువులో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది’’ అని జేపీ నడ్డా చెప్పారు.
HMPV వైరస్ భయం వద్దు.. చేయాల్సినవి, చేయకూడని పనులు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కలవరపెడుతోంది. కోవిడ్-19 వ్యాధికి 5 ఏళ్లు ఇటీవల పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా వైరస్ చేదు సమయాన్ని మరిచిపోతున్నారు. ఇంతలో HMPV వైరస్ రావడం ప్రజల్ని భయపెడుతోంది. అయితే, దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వంతో పాటు నిపుణులు చెబుతున్నారు. అంతటి కరోనానే మనం సమర్థవంతంగా తట్టుకున్నామని, దానితో పోలిస్తే కొత్త వైరస్ పెద్దగా ప్రమాదమేమీ కాదని చెబుతున్నారు. అయితే, దీనిని మనం అరికట్టేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బెటర్.
న్యూ ఇయర్ సందర్భంగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన జియో
ప్రస్తుతం దేశంలో జియో (Reliance Jio) అత్యధిక యూజర్లను కలిగి ఉన్న టెలికాం నెట్‌వర్క్‌గా కొనసాగుతుంది. తన యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచుతూ, వారు కోరుకునే ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ప్లాన్‌లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది. ఇకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ఆకట్టుకునే ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో.. తాజాగా మరోమారు ఓ అద్భుతమైన సూపర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిలయన్స్ జియో తాజాగా రూ.1234 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే యూజర్ల కోసం ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. అదనంగా, జియో యాప్‌లను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 336 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 500MB డేటా, ప్రతి 28 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అంటే, ఈ ప్లాన్‌తో యూజర్లు పూర్తిగా 11 నెలలపాటు ప్రయోజనాలను పొందగలరు. అయితే, ఈ ప్లాన్ జియో భారత్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం కాలింగ్ అవసరాలు ఉన్న యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, ఈ ప్లాన్‌లో జియో సినిమా, జియో సావాన్ వంటి యాప్ లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
ఏంటి బ్రో ఇలా దేవాసులా మారిపోయావు.. తప్పతాగిన చాహల్..
గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరు ఇప్పటి వరకు ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. విడాకుల అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుండగానే, చాహల్ తాగి మత్తులో మీడియాకు చిక్కిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాహల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చాహల్ మత్తులో తూలుతూ సరిగా స్పృహలో లేకుండా మద్యం తాగినట్లుగా, ఓ వ్యక్తి సాయంతో పబ్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలు అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి. చాహల్‌ను ఇలా చూడడం చాలా మందికి బాధ కలిగించింది.చాహల్, ధనశ్రీ గతంలో ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో పాటు, చాహల్ తన భార్యతో ఉన్న ఫోటోలను తొలగించారు. ఈ చర్యలు విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చాయి. 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న చాహల్, ధనశ్రీ, తమ మధుర క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో చాలా హ్యాపీ జంటగా కనిపించిన వీరి బంధం ఇప్పుడు ముగిసిపోనుంది. త్వరలో వీరి విడాకుల ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశాలున్నాయి. భారత క్రికెటర్ల జీవితంలో వివాహ బంధం సమస్యల కారణంగా మనోవేదనకు గురైన వారు కొందరున్నారు. హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ వంటి క్రికెటర్లు గతంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చాహల్ కూడా చేరబోతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద చాహల్ జీవితంలో వ్యక్తిగత సమస్యలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అభిమానులు ఈ జంట త్వరగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నారు.
ఇంట్లో ఇల్లాలు పోలీస్ స్టేషన్లో ప్రియురాలు.. వెంకటేష్ హిట్ ఫార్ములా!
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సినిమా ట్రైలర్ ను పరిశీలిస్తే ముందుగా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి కిడ్నాప్ అవుతాడు. ప్రభుత్వ పెద్దలు అందరూ ఆలోచించి మాజీ పోలీసు అధికారి అయిన వెంకటేష్ ను హెల్ప్ అడిగి ఆ కిడ్నాప్ అయిన వ్యక్తిని విడిపించాలి అని కోరతారు. అయితే పోలీస్ ఉద్యోగం మానేసి తన భార్య ఐశ్యర్య రాజేష్ తో హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటాడు. అయితే ఈ ఆపరేషన్ కోసం వెంకటేష్ మాజీ ప్రేయసి మీనాక్షి చౌదరి రంగంలోకి దిగడంతో ఐశ్వర్య కూడా తాను ఈ ఆపరేషన్ కోసం వస్తానంటుంది. వెంకటేష్ లైఫ్ లోకి వచ్చాక భార్య, మాజీ ప్రేయసి మధ్యలో వెంకటేష్ పాత్ర ఎలా నలిగింది? ఆ కిడ్నాప్ కథ ఎలా సుఖంఠం అయింది అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ముందు నుంచి భిన్నంగా చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి హిట్ అని మూవీ టీం గట్టిగా ప్రమోట్ చేస్తోంది.
నటుడు బాలాదిత్యను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్న నెటిజన్లు
ఇటీవల కాలంలో ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య కొద్దిపాటి దూరం ఏర్పడినట్లు అనిపిస్తుండగా దాన్ని దగ్గర చేసే ప్రయత్నాలు కూడ ముమ్మరంగా జరుగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ లో తన పేరు చెప్పలేదనే కక్ష తోనే ఇలా చేశాడంటూ చాలా మంది భావిస్తున్నారు. కానీ అది ఏమాత్రం నిజం కాదని కొందరు అంటున్నారు. పేరు మర్చిపోవడం తప్పే కానీ అంతమాత్రానా సీఎం స్థాయి వ్యక్తి పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశమే లేదు. ఐతే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోకపోయినా ఆయన ఈ ఘటనపై ఇలానే రియాక్ట్ అయ్యి ఉండేవారు. ఎందుకంటే అక్కడ ఓ నిండు ప్రాణం బలైంది. ఇదిలాఉంటే సీఎం రేవంత్ రెడ్డి పేరును ఓ పెద్ద ఈవెంటులో వేదిక మీద మాట్లాడుతూ మర్చిపోయాడు మరో హీరో. గతంలో సినిమాలు చేసి ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన బాలాదిత్య తాజాగా హెచ్.ఐ.సీ.సీ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సభల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
పండుగ ముందే తెచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు ఆన్ లైన్ లో రిలీజ్ చేయగా మరోపక్క నిజామాబాద్ లో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ మీద ఒక లుక్ వేసేయండి మరి.