నీరు తగ్గిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టిన సర్కార్..
విజయవాడలోని చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను రప్పించారు మంత్రి నారాయణ. ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 63 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులుగా నియమించారు.. ఇతర మున్సిపాలిటీల నుంచి సుమారు 4 వేల మంది పారిశుధ్య కార్మికులను బెజవాడకు రప్పిస్తోంది ప్రభుత్వం.. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, గుంటూరు కమిషనర్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్.. పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదు..!
మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సరిగా పనిచేయకపోతే.. వారిని తీసివేస్తానంటూ హెచ్చరించారు.. తనకు పనిచేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చిచెప్పారు.. మంత్రులు సరిగ్గా పని చేయకపోతే వారినీ తీసేస్తా… పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదని స్పష్టం చేశారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు.. ఇక, గత ఐదేళ్ల కాలంలో అధికార వ్యవస్థకు పెరాలసిస్ వచ్చిందంటూ దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు.. నాకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారన్న ఆయన.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో సరిగా పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామం.. ఇకపై ఎవ్వరినీ ఊపేక్షించేది లేదు అన్నారు.. అంతేకాదు.. మంత్రులు కూడా సరిగా పనిచేయకపోతే వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. కాగా, వరద ప్రభావానికి గురైనటువంటి ప్రాంతాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రకటించారు. జక్కంపూడి, సింగ్ నగర్, సితార సెంటర్ ప్రాంతాలలోకి ఆయన జేసీబీపై వెళ్లి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 5 అడుగుల లోతు మేర నీళ్లు ఉండడంతో వాహనాలను అక్కడికి పంపడానికి ఇబ్బంది ఏర్పడడంతో.. జేసీబీ వాహనంపై కూర్చుని లోతట్టు ప్రాంతాలలోని ప్రజల కష్టసుఖాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్న సింగ్ నగర్, జక్కంపూడి ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరారు. తాగునీరు ఆహారం సకాలంలో బాధితులకు అందరికీ అందించాలని అధికారులను ఆదేశించారు… ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మంత్రి వీరాంజనేయులు ముఖ్యమంత్రి వెంట ఉండి పరిస్థితులను క్షుణ్ణంగా వివరించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ను దగ్గరుండి వరద బాధితులకు సహాయక చర్యలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.
వరద బాధితులకు రూ.కోటి సాయం ప్రకటించిన వైఎస్ జగన్..
ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. ముఖ్యంగా విజయవాడ ఈ పరిస్థితి నుంచి ఇప్పటికీ కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. వారికి అందుతున్న సాయంపై ఆరా తీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు.. పార్టీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్.. కృష్ణా నదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు జగన్.. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు.. జగన్ దృష్టికి తీసుకెళ్లారు.. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని వారు తెలిపారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారని విమర్శించారు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు.. జేసీబీపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా..
వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి.. ఇలా అన్ని సమయాల్లోనూ ఆయన గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.. ఓ వైపు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూనే మరో వైపు.. క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నారు.. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగింది.. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు.. దాదాపు ఆరు గంటల పాటు కాన్వాయ్ వదిలి జేసీబీ పైనే వరద ప్రాంతాల్లో తిరిగారు.. వరద ప్రాంతాల్లో సీఎం జేసీబీపై వెళ్లడంతో వివిధ ప్రాంతాల్లో ఖాళీ కాన్వాయ్ తిరిగాల్సి వచ్చింది.. సితార సెంటర్ నుంచి ఇతర ప్రాంతాల గుండా నున్న బైపాస్ రోడ్డుకు వెళ్లిన సీఎం కాన్వాయ్. ఆ తర్వాత సీఎంను ఎక్కించుకునేందుకు రామవరప్పాడు మీదుగా నున్న వెళ్లింది.. అయితే.. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా వరద ప్రాంతాల్లోనే చంద్రబాబు పర్యటన కొనసాగింది.. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలించిన సీఎం.. ఆహారం అందుతుందా? లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.. కాలనీల చివర్లో ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై కూడా ఆరా తీశారు సీఎం.. జేసీబీపై స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి చేరుకుంటారో చెప్పకపోవడంతో పాయింట్ టూ పాయింట్ ఛేంజ్ అవుతూ సీఎం కాన్వాయ్ చక్కర్లు కొట్టాల్సి వచ్చింది..
సురక్షిత ప్రాంతాలకు 154 మంది గర్భిణులు.. అత్యవసర కిట్లు పంపిణీ..
విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి.. ఇప్పటికీ చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఇక, వరదల్లో చిక్కుకున్న గర్భిణిలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.. తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిలను వైద్య ఆరోగ్య శాఖ సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవల్ని అందించేందుకు అనేక కార్యక్రమాల్ని చేపట్టిందన్నారు. పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంతో పాటు వీటికి అదనంగా 20 సంచార వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వైద్య సేవల్ని అందించిందన్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 17,538 మంది రోగులు సేవలు పొందారని వివరించారు..
అందుకే నేను ఫీల్డ్‌లోకి రాలేదు.. క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం..
ఆంధ్రప్రదేశ్‌ని భారీ వర్షాలు.. వరదుల అతలాకుతలం చేశాయి.. ముఖ్యంగా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి.. ఇప్పటికే బెజవాడలోని అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి.. అయితే, ఈ సమయంలో.. సహాయక చర్యల్లో విశ్రాంతి లేకుండా పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇదే సమయంలో.. డిప్యూటీ సీఎం ఎక్కడ? ఆయన సహాయక చర్యల్లో పాల్గొనరా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.. దానిపై ఈ రోజు క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహాయక చర్యలకు ఆటంకమనే నేను ఫీల్డ్‌లోకి రాలేదని స్పష్టం చేశారు.. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని నేను అనుకున్నాను.. కానీ, అధికారులు నన్ను సందర్శించవద్దని సూచించారు.. ఇది రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్లకు అసౌకర్యాన్ని కలిగిస్తుందన్నారు.. ఇంత విపత్తు సమయంలో నేను సాయపడాలి.. కానీ, అదనపు బరువు కాకూడదు.. అందుకే నేను క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తాం…
ప్రకృతిని చెర బడితే అది ప్రకోపిస్తుందని.. ప్రకృతి ప్రకోపంతోనే ఉత్తరాఖండ్‌లోనైనా, మన దగ్గరైనా విపత్తులు సంభవిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల సమయంలో వరదలు సంభవించి కాలనీలకే కాలనీలే మునిగిపోవడానికి కారణం చెరువులు, నాలాల ఆక్రమణే కారణమన్నారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ వస్తోందని, కానీ ఎక్కడికక్కడ కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో ఆక్రమణ తొలగింపును ప్రాధాన్యంగా పెట్టుకున్నామని, చెరువులు, నాలాల ఆక్రమణలో ఎంతటి వారున్నా తొలగింపునకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా చెరువులు, నాలాల ఆక్రమణపై నివేదిక రూపొందించుకోవాలని, ఏవైనా కోర్టు కేసులు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో కేవలం ఒక నాలాపై ఆక్రమణలు తొలగిస్తేనే రాం నగర్‌లో ముంపు బారి నుంచి బయటపడిన విషయాన్ని ముఖ్యమంత్రి ఉదాహరించారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి నివాసంలో మంగళవారం విలేకరులతో ఇష్టాగోష్టిలో, మహబూబాబాద్ జిల్లా సమీక్షలో ఈ విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకేరు వాగు పొంగడంతో కారు కొట్టుకుపోయి యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్వినీ, ఆమె తండ్రి మోతీలాల్ మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి నేరుగా సింగరేణి మండలం గంగారాం తండాలోని అశ్వినీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అశ్వినీ, మోతీలాల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశ్వినీ తల్లి నేజీ, ఆమె కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించి ఓదార్చారు. అశ్వినీ అన్న అశోక్‌కు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. కమిషన్ ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. ఛైర్మన్, సభ్యులు రెండేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతోపాటు.. అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్య బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో వెల్లడిచారు. దీనిలో భాగంగానే విద్యాకమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.
ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలి..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేయడంపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికీ అనేక జిల్లాల్లో వరదలు, వానలు తగ్గుముఖం పట్టలేదని సీఎస్ పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్ర స్థాయికి పంపి, తగు జీపీఎస్ కోఆర్డినేట్‌లతో సహా సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు, సిబ్బంది, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలన్నారు. ఈ వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
ఆధారాలను నాశనం చేస్తే దోషిని ఎట్లా నిర్ధారిస్తారు.. 5000 మంది మహిళలు నిరసన..!
ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార, హత్య ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలను ధ్వంసం చేస్తే దోషిని ఎలా నిర్ధారిస్తారంటూ ప్రశ్నించారు. కోల్‌కతా ఘటనకు నిరసనగా దాదాపు 5000 మందికి పైగా మహిళలు వీధుల్లోకి వచ్చారు.. ఈ ప్రదర్శనకు తాము సపోర్టు ప్రకటించామని సువేందు అధికారి వెల్లడించారు. ఇక, ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ విషాదాంతానికి సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక, సారస్వత ఫోరం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా కోల్‌కతా నగరంలో ఈరోజు (మంగళవారం) నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే, కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా కోల్‌కతాలో విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాల నిరసనలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు మహిళలపై నేరాలకు చెక్ పెడుతూ కఠిన చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెండు లేఖలు రాసినా ఎలాంటి రిప్లై ఇవ్వలేదుని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. తన లేఖలపై మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచీ, కేంద్ర ప్రభుత్వం నుంచీ సమాధానం రాలేదని దీదీ వెల్లడించారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 40 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 40 మంది మరణించారు. ఉక్రెయిన్‌లోని పోల్టావాలోని మిలిటరీ ఇన్‌స్టిట్యూట్‌పై రష్యా ప్రారంభించిన దాడిలో 40 మందికి పైగా మరణించారు. 180 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ భవనంపై రష్యా బలగాలు రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఒక వీడియోలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరువైపులా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అలాగే ప్రాణనష్టం కూడా జరిగింది. ఓ వైపు చర్చలు జరుగుతున్న సత్‌ఫలితాలు ఇవ్వడం లేదు. ఇక తాజాగా జరిగిన దాడిలో ఉక్రెయిన్‌లో 40 మంది చనిపోయారు. అలాగే ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతి దాడులు చేస్తోంది.
అభిమానికి పెద్ద గిఫ్ట్ ఇచ్చిన లులూ గ్రూప్ యజమాని.. వీడియో వైరల్
లులూ గ్రూప్ యజమాని ఎంఏ యూసుఫ్ అలీ తన అభిమానికి రాడో వాచ్‌ను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అభిమాని అఫిన్ ఎం అనే యూట్యూబర్. ఈ క్షణాలను అఫిన్ తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియోలో, యూసుఫ్ అలీ ఎఫిన్‌ను కలుసుకుని, అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అతను ఎఫిన్‌కి అద్భుతమైన రాడో వాచ్‌ని బహుమతిగా ఇస్తాడు. రాడో వెబ్‌సైట్ ప్రకారం.. ఈ వాచ్ ధర రూ. 2 లక్షల వరకు ఉంటుంది. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, అఫిన్, ‘యూసుఫ్ అలీ సర్ ఆశ్చర్యం’ అని రాశారు. అఫిన్ లులు గ్రూప్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడ యూసుఫ్ అలీ సాదరంగా స్వాగతం పలికినట్లు వీడియోలో చూడవచ్చు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది. అప్పుడు బిలియనీర్ వ్యాపారవేత్త ఎఫిన్‌కి రాడో వాచీని ఇస్తాడు. ఈ వీడియోపై జనాలు చాలా రియాక్షన్స్ ఇచ్చారు. ఒక వినియోగదారు, ‘వావ్ సోదరా, మీరు దీనికి అర్హులు’ అని రాశారు. మరొక వినియోగదారు ‘జీవితంలో ఒక అందమైన క్షణం. అభినందనలు సోదరా.” అని రాసుకొచ్చాడు.
రంగంలోకి మహేష్.. వరద బాధితుల కోసం కోటి విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సినీ ప్రముఖులు భారీగా విరాళం ప్రకటిస్తున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు సినీ ప్రముఖులు. ముందుగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల విరాళం అందించారు. ఇక విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున సీఎంల సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం అందించగా సిధ్ధూ జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. 30 లక్షల విరాళం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి దర్శకుడు త్రివిక్రమ్ , నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీలు విరాళం ఇచ్చారు. రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ , రాధాకృష్ణ, నాగవంశీ విరాళం ఇచ్చారు. దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ప్రకటించగా నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షల చొప్పు రూ.కోటి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి ప్రకటించగా ఇప్పుడు మహేష్ కూడా రెండు రాష్ట్రాలకు చెరి 50 లక్షల చొప్పున కోటి ప్రకటించారు. అయితే ఆసక్తికరంగా చిన్న హీరోయిన్ అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు చెరి 2.5 లక్షలు చొప్పున ఐదు లక్షలు ప్రకటిచింది.
ఏపీ వరదలు.. పవన్ కోటి విరాళం
ఆంధ్రప్రదేశ్లో వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు వరదలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే విజయవాడ లాంటి చోట్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రభుత్వ యంత్రాంగం, లోకల్ లీడర్లు వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియాతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ముఖ్య ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సానికి చాలా మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది ఆశ్రయాన్ని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపద్యంలో ఎన్నారైలు, ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయనిధికి తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి కూడా దాదాపుగా మూడు కోట్లకు పైగా విరాళాలు ఇప్పటికే ప్రకటించారు.