కేబినెట్ తర్వాత మంత్రులతో విడిగా సీఎం భేటీ.. ఎప్పుడూ చూడలేదు.. ఇదో కొత్త ట్రెండ్..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు గంటల పాటు ఈ సమావేశం సాగింది. జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీఆర్‌ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులను ప్రశ్నించారు సీఎం… ప్రతీ ఒక్కరికీ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ చెబుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. బ్యూరోక్రసీ ఆలస్యం కావడం వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. మరోవైపు.. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం వివిధ అంశాలపై మంత్రులతో చర్చించారు.. బియ్యం, భూ దురాక్రమణ మాఫీయా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అన్నింటినీ అరికాడతామని స్పష్టం చేశారు.. కాకినాడ పోర్ట్ ను బలవంతంగా లాక్కొనారు.. కాకినాడ సెజ్ కూడా లాగేసుకున్నారు.. పోర్ట్ లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో వాళ్లు లాక్కొన్నారని ఆరోపించారు.. ఆస్తులను లాగసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్… ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడలేదన్నారు సీఎం.. వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారు.. ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నాం.. పథకాలు మీద అభిప్రాయ సేకరణ చేయిస్తున్నాం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్ సిగ్నల్..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి.. రాష్ట్ర ఆర్ధిక స్ధితి మెరుగు పరచడానికి కావాల్సిన పాలసీలు ఆమోదించారు.. గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, ఎకానమీ, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అభివృద్ధి కి గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఆలోచన సీఎం చంద్రబాబుదన్న ఆయన.. MNCలలో పని చేస్తున్నారు చాలామంది… కానీ, ఇళ్ళవద్దే పని చేస్తున్నారు.. కోవర్కింగ్ స్పేస్ డెవలప్ చేస్తే.. వారికి ఇన్సెంటివ్ ఇస్తాం అన్నారు.. నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ ను కూడా డెవలప్ చేయచ్చు.. కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్ కి 50 శాతం కాస్ట్ లో సబ్సిడీ ఇస్తాం.. సీటుకు 2000 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందన్నారు.. గ్రామాలలో 1000 స్క్వేర్ ఫీట్ లో కోవర్కింగ్ స్పేస్ ఉంటే వారికి 1000 రూపాయలు ఓ సీటుకు ఇస్తాం,, ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తే 50 శాతం కేపిటల్ సబ్సిడీ ఇస్తాం.. రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేయాలి… యువతకు ఉపాధి భరోసా కల్పించడానికి ఈ పాలసీ అని స్పష్టం చేశారు.. ఇక, అపారల్ & గార్మెంట్స్ పాలసీ ని కూడా కేబినెట్ ఆమోదించింది అని వెల్లడించారు మంత్రి పార్థసారథి.. వచ్చే ఐదేళ్లలో 10 వేల కోట్ల పెట్టుబడి, 6 లక్షల ఉద్యోగాలు తేవాలని ఆలోచన,, PPP మోడ్ లో 5 టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తాం,, ఏపీ మేరీటైం పాలసీని కూడా కేబినెట్ ఆమోదించిందని తెలిపారు.. పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేసి మేరిటైం హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయం.. పోర్టుల ద్వారా రవాణా 450 మిలియన్ టన్నులు గుజరాత్ చేస్తుంటే.. ఏపీ 180 టన్నులు చేస్తోందన్నారు.. షిప్ బిల్డింగ్ పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన.. సీఎం చంద్రబాబు మెగా షిప్ యార్డు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.. మూడు త్రాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో, ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం లేకపోయింది.. పులివెందుల, డోన్ నియోజకవర్గాలలో మంచినీటి ప్రాజెక్టులు, ఉద్దానం ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదన్ఆనరు.. గత ప్రభుత్వం క్రూరమైన ఆలోచనతో ప్రాజెక్టులు నాశనం చేశారని మండిపడ్డారు.. గత ప్రభుత్వం విధ్వంసకర ఆలోచనలతో రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు..
మందు బాబులకు అలర్ట్.. అక్కడ రెండు రోజులు మద్యం షాపులు బంద్..
మందుబాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఏకంగా రెండు రోజుల పాటు మద్యం షాపులు పూర్తిగా మూతపడనున్నాయి.. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సర్వం సిద్ధం అవుతోంది.. డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 9వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఈ నేపథ్యంలో.. ఈ నెల 4, 5, 9 తేదీలలో సదరు నియోజకవర్గంలో సెలవు దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం.. స్ధానిక సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్టుగా పేర్కొంది సర్కార్.. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులు మద్యం షాపులు మూతపడనున్నాయి.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సాయంత్రం 4 గంటల నుంచి వైన్స్‌లు, బార్లు ఇతర మద్యం షాపులు మూసివేశారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు మద్యం షాపులు మూసివేశారు నిర్వహకులు.. ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని విక్రయిస్తే చట్ట రీత్యా నేరమని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు..
మరోసారి పోలవరం పర్యటనకు సీఎం.. ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్ ప్రకటన..!
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించి.. ఇప్పటి వరకు జరిగిన పనులపై సమీక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, మరోసారి పోలవరం పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం.. అంతేకాదు.. ఈ పర్యటనలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పునర్‌నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నారు.. ఇరిగేషన్ శాఖలో పలు ప్రాజెక్టులపై, ప్రధానంగా పోలవరంపై సీఎం రివ్యూ నిర్వహించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పోలవరాన్ని యజ్ఞం లాగా పునర్నిర్మాణం చేయాలని చర్చించాం.. ఈ నెల 2వ వారం సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఉంటుంది.. ఈ పర్యటనలోనే పోలవరం నిర్మాణం షెడ్యూల్ ను సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు.. ఈసీఆర్ఎఫ్ ఎలా పూర్తి చేస్తాం..? ఎప్పుడు పూర్తి చేస్తాం..? అనే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు తెలిపారు మంత్రి నిమ్మల.. షెడ్యూల్ ప్రకటన తేదీ నుంచి అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.. గత పాలనలో డయాఫ్రం వాల్ పూర్తిగా విధ్వంసం అయింది.. మెయిన్ డ్యాం ప్రాంతంలో భారీ గుంతలు పడ్డాయి.. భౌగోళికంగా పోలవరం ప్రాజెక్టుకు ఉపయోగపడేవి అన్నీ పాడైపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, 2025లో పోలవరం పనులు పూర్తిస్ధాయిలో జరుగుతాయి.. టెక్నికల్ అనుమతులు కూడా సూత్రప్రాయంగా వచ్చాయి.. డయాఫ్రం వాల్ కు సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణానికి సూత్రప్రాయంగా ఇంజనీర్లు అంగీకరించారు.. చంద్రబాబు ప్రకటించిన దగ్గర నుంచి సమయం వృధా చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తాం అని స్పష్టం చేశారు.. డిసెంబర్‌లోనే పోలవరం గ్రౌండ్ వర్కులు పూర్తి చేస్తాం.. పోలవరం ఆర్ & ఆర్, భూసేకరణ పరిస్ధితులను అధిగమిస్తాం.. వెంటనే ఆర్ & ఆర్ లో కాలనీల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తాం అని వెల్లడించారు..
ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్..! విచారణ రేపటికి వాయిదా..
ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జత్వానీ కేసులో ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్.. అయితే, బాధితురాలు తరపున వాదనలు వినిపించారు పీపీ లక్ష్మీనారాయణ, న్యాయవాది నర్రా శ్రీనివాస్.. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని.. బాధితురాలు జత్వానీ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీనారాయణ వాదించారు.. కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పాత్ర ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. బాధితురాలు, తల్లి, తండ్రిని పోలీసులు టార్చర్‌కి గురిచేశారని పేర్కొన్నారు.. మరోవైపు.. నిందితుడు కుక్కల విద్యాసాగర్ తరుపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు కొనసాగించారు.. విద్యాసాగర్ 75 రోజులుగా జైలులో ఉన్నారని.. ఇప్పటికైనా బెయిల్ మంజూరు చేయాలని విద్యాసాగర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.. అయితే, ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగింది
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు ఎన్టీఆర్ మార్గ్ లో నిర్వహించిన హైదరాబాద్ రైజింగ్ సభలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు కాదు నువ్వు, నీ కుటుంబం గుడిసె వేసుకొని జీవించి చూపించన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి ఒక రోజు మూసి తీరంలో నిద్ర చేసి తర్వాత విలాసమైన ప్యాలెస్ లో ఉండటం సరికాదని, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలు బాగుపడటం బీఆర్‌ఎస్‌కి ఇష్టం లేదన్నారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ నగర అభివృద్ధికి పది పైసలు ఖర్చు చేయలేదన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగిందని, మూసిని జీవ నదిగా మార్చాలని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు భట్టి విక్రమార్క. ఢిల్లీ లాంటి ముప్పు రావొద్దని కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, దేశం గర్వించే విధంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ ను మార్చాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని, నక్లెస్ రోడ్డులో జరిగిన తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
తెలంగాణకు మణిహారంగా 360 కి.మీ రీజనల్ రింగ్‌రోడ్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులనే ప్రస్తావిస్తూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరంలో ట్యాంక్ బండ్, శిల్పారామం, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి పట్ల పలు విమర్శలు వ్యక్తం చేస్తూ, సిటీలో కనీస డ్రైనేజీ వ్యవస్థ కూడా పూరణ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చరిత్రను విమర్శిస్తూ, ట్యాంక్ బండ్ నీటిని “కొబ్బరి నీళ్లుగా మార్చడమో” అన్న కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించిన వెధవ పనులు, , ఫామ్ హౌసులలో కొమ్మోలు పడిన వారికి సంబంధించి మాట్లాడటం కూడా “దండగ” అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని చెప్పారు. అలాగే, నగరంలో ఆక్రమణలు నివారించేందుకు హైడ్రా (HYDRA) రంగప్రవేశం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి మీద కూడా విమర్శలు గుప్పిస్తూ, ఆయన నాలుగు సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అయినప్పటికీ తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజలకు కిషన్ రెడ్డి సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దక్షిణ కొరియాలో “ఎమర్జెన్సీ” విధింపు.. నార్త్ కొరియా మద్దతుదారులే టార్గెట్..
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం ఆ దేశంలో ‘‘ ఎమర్జెన్సీ మార్షల్ లా’’ ప్రకటించారు. బడ్జెట్ బిల్లుపై పార్లమెంట్‌లో వాగ్వాదం మధ్య దేశాన్ని ‘‘కమ్యూనిస్ట్ శక్తుల’’ నుంచి రక్షించడానికి ఈ చర్య అవసరమని చెప్పారు. విపక్ష పార్టీలు ఉత్తర కొరియా వైపు సానుభూతి చూపిస్తున్నాయని, ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘‘ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ శక్తుల నుండి ఎదురయ్యే బెదిరింపుల నుండి ఉదారవాద దక్షిణ కొరియాను రక్షించడానికి మరియు రాష్ట్ర వ్యతిరేక అంశాలను నిర్మూలించడానికి అత్యవసర మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తున్నాను’’ అని యూన్ దేశాన్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రజల జీవనోపాధితో సంబంధం లేకుండా ప్రతిపక్ష పార్టీ అభిశంసనలు, ప్రత్యేక దర్యాప్తులు, న్యాయం నుంచి తమ నాయకులను రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలు పాలనను స్తంభింపచేస్తున్నాయని మండిపడ్డారు. “మన జాతీయ అసెంబ్లీ నేరస్థులకు స్వర్గధామంగా మారింది, ఇది న్యాయ మరియు పరిపాలనా వ్యవస్థలను స్తంభింపజేయడానికి, మన ఉదారవాద ప్రజాస్వామ్య క్రమాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అధ్యక్షుడు అన్నారు.
కెనడా అమెరికాలో “51వ రాష్ట్రం” కావాలి.. ట్రూడోతో డొనాల్డ్ ట్రంప్..
ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో విందులో వీరిద్దరు పాల్గొన్నారు. ఇరువురు మధ్య చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అధిక సుంకాలను నివారించేందుకు కెనడాను యునైడెట్ స్టేట్స్‌లో “51వ రాష్ట్రం”గా చేయడంపై జోక్ చేశారు. కెనడా వలసదారులు, డ్రగ్స్ సరిహద్దును దాటి అమెరికాలోకి రావడాన్ని నివారించకపోతే కెనడియన్ దిగుమతులపై అధిక సుంకాలు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్‌కి చెందిన ప్రైవేట్ ఎస్టేట్ మార్ ఏ లాగోలో కెనడియన్ పీఎం జస్టిన్ ట్రూడోతో చర్చించారు. సరిహద్దుల్లో నియంత్రణపై ట్రూడో ట్రంప్‌కి ప్రావిస్ చేశాడు. కెనడా మొత్తం వస్తువులు, సేవల్లో 75 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఒక వేళ అమెరికా సుంకాలను విధిస్తే, కెనడా తీవ్రంగా నష్టపోతుంది. కెనడా తన డిమాండ్లను నిర్వహించకపోతే, సరిహద్దు సమస్యలను నియంత్రించడం, వాణిజ్య లోటును చెల్లించడం వంటివి చేయకుంటే, కెనడా అమెరికాలో మరో రాష్ట్రంగా మారాలి, ట్రూడో రాష్ట్ర గవర్నర్‌గా ఉంటారని ట్రంప్ కఠినంగానే చమత్కరించారు.
10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై పాక్ గెలుపు.. సిరీస్ కైవసం
సుఫియాన్ ముకీమ్ డేంజరస్ బౌలింగ్‌తో జింబాబ్వే జట్టును మట్టి కరిపించాడు. రెండో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు పాక్ గెలుపొందింది. దీంతో.. పాకిస్తాన్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అజేయంగా 2-0 ఆధిక్యాన్ని కూడా సాధించింది. సల్మాన్ అగా సారథ్యంలో పాకిస్థాన్ తొలిసారి టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో..12.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ అత్యధికంగా 21 పరుగులు చేశాడు. టి మారుమణి 16 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా జట్టులోని 9 మంది బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. పాకిస్థాన్ తరఫున సుఫియాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2.4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు, అబ్రార్ అహ్మద్, కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కో వికెట్ తీశారు.
చిరంజీవి హీరోగా నాని సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. దసరా సినిమాతో ప్రేక్షకులందరినీ అలరించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఇప్పుడు తెరకెక్కబోతోంది. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాకే శ్రీకాంత్ ఓదెల చిరంజీవి డైరెక్టు చేసే అవకాశం దక్కిం చేసుకున్నాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాని నాని సమర్పించడం. నాని దసరా సినిమాని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడమే ధ్యేయంగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీకాంత్ ఓదెల తన మూడవ సినిమాకే ఆయనని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం గమనార్హం. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానినీ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసేందుకు ఈ సినిమా బాగా ఉపయోగపడింది. ఈ నేపథ్యంలోనే నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన నాని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. తర్వాత సినిమా యూనిట్ నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది.
వరుస కాంట్రవర్సీల్లో శాండిల్ వుడ్
కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియన్ లెవల్లో ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది.. అందులో నో డౌట్. కేజీఎఫ్, కాంతార తెచ్చిన క్రేజ్ శాండిల్ వుడ్‌పై ఫోకస్ పెంచాయి. దీంతో అక్కడ చీమ చిటుక్కుమన్నా ఇండియన్ సినిమా మొత్తం తెలిసిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో పలు కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది కర్ణాటక సినీ పరిశ్రమ. వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే.. బిగ్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. యష్ చేస్తోన్న టాక్సిక్ షూటింగ్ కోసం విత్ అవుట్ గవర్నమెంట్ పర్మిషన్ చెట్లు నరికేశారన్న ఆరోపణలపై నిర్మాతపై కేసు ఫైల్ కావడంతో పాటు.. సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. కాంతారతో హిట్ అందుకున్న రిషబ్ శెట్టి.. దీని ప్రీక్వెల్.. కాంతార2తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్లీ ఈ మూవీ షూటింగ్‌లో ఓ చిన్న ప్రమాదం జరిగింది. యూనిట్ సభ్యులతో వెళుతోన్న మినీ బస్సు బోల్తా పడి కొంత మందికి గాయాలయ్యాయి. షూటింగ్ తాత్కాలిక ఆపేశారు. అయితే ఈ రెండూ ఇష్యూస్‌లో హీరో ఇన్వాల్‌మెంట్ లేదు. కానీ తాజాగా ఓ వివాదం.. హీరో కెరీర్ పైనే ఎఫెక్ట్ చూపేలా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎదుగుతున్న జైద్ ఖాన్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. బెనారస్ మూవీతో ఫేమైన జైద్.. కర్ణాటక మంత్రి జమీర్ సన్. ప్రజెంట్.. కల్ట్ అనే మూవీని చేస్తున్నాడు.