ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సూపర్ సిక్స్‌కు గ్రీన్ సిగ్నల్..
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్‌లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. అందులో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి.. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిలో 100 పడకలు చేయడానికి కేబినెట్ నిర్ణయించిందన్నారు.. అమరావతిలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. కొత్త టెండర్లతో పనులు జరుగుతాయని వివరించారు మంత్రి పార్థసారథి.. A M R U D A చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం లో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు . పారిశ్రామిక వేత్తలు తమ పనులు సగంలో ఆపి వెళ్లిపోయారు. రుణాలు ఇచ్చే బ్యాంక్‌లు కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదన్నారు.. ఇక, కడప జిల్లాలో టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రెవెన్యూ సదస్సులకు సంబంధించి కేబినెట్‌లో చర్చ జరిగింది. 22 ఏ ల్యాండ్ సర్వే వివాదాలపై చర్చ జరిగింది.. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు.. రెవెన్యూశాఖ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఆర్ధిక క్రమశిక్షణ సరిగ్గా లేక గత ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో కి నెట్టిందని ఆరోపించారు.. ఇక, నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. వచ్చే విద్యాసంవత్సరం లో డీఎస్సీ నిర్వహణకు సిద్ధం అయ్యింది.. డీఎస్సీ నిర్వహనతో పాటు.. తల్లికి వందనం కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉంటుందని తెలిపారు మంత్రి పార్థసారథి..
ఈ నెల 8న ఏపీకి ప్రధాని మోడీ.. మంత్రుల కమిటీ ఏర్పాటు
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈ నెల విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించారు.. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు మోడీ.. అయితే, ఈ నెల 8 తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు.. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి.. ఈ విషయాన్ని వెల్లడించారు.. విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.. ఎన్టీపీసీ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.. రూ.65,370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఎన్టీపీసీ పెడుతోంది.. 2500 ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్ కు కూడా ప్రధాని ప్రారంభిస్తారు.. నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా పీఎం మోడీ శంకుస్థాపన చేస్తారు.. బల్క్ డ్రగ్ పార్కులో రూ.11,542 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు పార్థసారథి.. ఇక, జనవరి 8 తేదీన ప్రధాని మోడీ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ నుంచే ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు మంత్రి పార్థసారథి.. అంతకుముందు విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తారు.. నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో ఉంటుందని తెలిపారు.. మరోవైపు.. వచ్చే విద్య సంవత్సరం లోగా తల్లికి వందనం పథకం అందించేందుకు కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది.. రైతులకు ఇచ్చే ఆర్ధిక సాయం అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని కేంద్రంతో పాటే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. కేంద్ర సాయంతో కలిపి రూ.20 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం.. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్ధిక సాయం రూ.20 వేలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని వెల్లడించారు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి..
కేబినెట్ సమావేశంలో సీఎం సీరియస్..
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, మంత్రి వర్గ సమావేశంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతోన్న విషయం విదితమే కాగా.. ఈ సదస్సులో భూ సమస్యలు లక్షలాదిగా వెలుగు చూస్తున్నాయి.. అయితే, రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ వచ్చిందట.. కానీ, ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.. దీంతో, త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. కానీ, మనకు ఓపిక ఉంది.. ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారు అని సీఎం నిలదీసినట్టుగా చెబుతున్నారు.. 22A భూములు, ఇళ్ల స్థలాలు వెంటనే ఎందుకు పరిస్కరించలేదు అని సీఎం ప్రశ్నించగా.. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారట..
విజయవాడ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్.. పుస్తకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
విజయవాడలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారాయన.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ బుక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పుస్తకాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు.. కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడను.. కానీ, పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను అంటూ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు.. జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకం.. పుస్తకాలను నా సంపదగా భావిస్తాను అన్నారు పవన్ కల్యాణ్.. నా దగ్గర ఉన్న పుస్తకాలు ఎవరికైనా ఇవ్వడానికి ఆలోచిస్తానన్న ఆయన.. నా జీవితంలో పుస్తకాలు లేకపోతే ఏమైపోయే వాడినో అని పేర్కొన్నారు.. నాకు ఏమి కావాలో అది నేర్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడ్డాయి.. రెండు చోట్లా ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం నిలబడేలా చేశాయన్నారు.. చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా.. పుస్తకాలు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు.. ఏదైనా రాయడానికి చాలా శక్తి అవసరం అన్నారు.. తెలుగు సరిగ్గా నేర్చుకొనందుకు ఈరోజు నేను బాధపడుతున్నా.. స్కూల్ లో విద్యార్థులకి తెలుగు వ్యాకరణం నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.. ఇంగ్లీష్ ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుంది అనడం సరికాదన్నారు.. ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృ బాధ చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రో.. సీఎం సమీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. 2017 వరకు 100 శాతం నిధులు కేంద్రం భరించే విధానం అమలులో లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కత్తాలో 16 కిలో మీటర్ల మేర ప్రాజెక్టు చేపట్టారు. రూ.8,565 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రైల్వే శాఖలు కోల్‌కత్తా ప్రాజెక్టును చేపట్టాయి. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో పాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సీఎం అన్నారు. ఆ చట్ట ప్రకారమయినా.. లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర సాయం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైవోవర్ ఆపైన మెట్రో వస్తుంది. విశాఖలో మొదటి స్టేజ్ లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రామవరప్పాడురింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో త్వరతిగతిన సంప్రదింపులు పూర్తి చేసి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పనిచేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం..
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈడీ అధికారులను రావాలని కోరింది. ఈ క్రమంలో నోటీసులు జారీ చేశారు. 8, 9వ తేదీల్లో బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌లు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు బీఎల్ఎన్ రెడ్డి, రేపు అరవిందకుమార్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే.. వారు హాజరు కాకుండా మరింత సమయం కావాలని కోరారు. మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో సహా హాజరు కావాలని చెప్పడంతో తమకు మూడు వారాలు గడువు కావాలని కోరినా అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి ఈ నెల 8,9 తేదీల్లో విచారణకు తప్పనిసరిగా రావాలని కోరింది. ఈ క్రమంలో.. ఈనెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. ఫార్ములా-ఈ కారు రేసు కేసు విచారణలో ఈడీ దూసుకెళ్తోంది. కారు రేస్ నిర్వహణకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై ఈడీ విదేశీ సంస్థకి లేఖ రాయన్నారు. మరోవైపు ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా.. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీన్ బ్యాంక్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారనే అంశంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఫార్ములా ఈ-కారు రేస్‌లో మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
గులాబీ సైనికుల పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా..
ప్రాణ సమానులైన మన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. గత ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం చేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో తెలిపారు. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా.. మీరు క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపిందని తెలిపారు. తెలంగాణ గ్రామ గ్రామాన ఉన్న గులాబీ సైనికులు.. రాష్ట్ర ప్రజల పక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పాలన వల్ల కష్టకాలంలో ఉన్న రైతుల పక్షాన మీరు పోరాడారు.. నేతన్నల గొంతుకై మీరు నిలిచారు.. మహిళా సమస్యలపై మీరు గర్జించారు.. బడుగు బలహీనవర్గాల ప్రజల గళమయ్యారు.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించారు.. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారును నిలదీశారు.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కేటీఆర్ తెలిపారు.
న్యూ ఓర్లీన్స్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన మోడీ
అగ్ర రాజ్యం అమెరికాలో నూతన సంవత్సరం రోజున జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని మోడీ ఖండించారు. న్యూ ఓర్లీన్స్‌లో ఒక పికప్ ట్రక్కు అత్యంత వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా… పలువురు గాయపడ్డారు. తాజాగా ఈ దాడిని ప్రధాని మోడీ ఖండించారు. పిరికిచర్యగా అభివర్ణించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని.. మృతుల కుటుంబాలు సంతాపం వ్యక్తం చేస్తూ.. దు:ఖంలోంచి బయట పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ధైర్యం, నెమ్మది లభించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ ట్విట్టర్‌లో మోడీ పేర్కొన్నారు. న్యూఇయర్ సందర్భంగా న్యూ ఓర్లీన్స్ ప్రఖ్యాత ఫ్రెంచ్ క్వార్టర్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రజలు ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలోనే ఒక డ్రైవర్ మారణహోమం సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడిని అంతమొందించారు. ఇక ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు కోలుకుంటున్నారు.
పెరిగిన కార్ల ధరలు.. ఏయే కంపెనీలు ఎంతేంత పెంచాయో చూద్దామా?
న్యూ ఇయర్ తర్వాత కారు కొనాలకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఏయే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయో ఒకసారి చూద్దాం. మహీంద్రా భారతదేశంలో తన మొత్తం పోర్ట్‌ఫోలియో ధరలను జనవరి 1, 2025 నుంచి మూడు శాతం వరకు పెంచింది. ఈ కంపెనీ కార్లు ఇప్పుడు గతేడాది కంటే ఖరీదుగా మారాయి. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతీ సుజుకీ కార్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. అన్ని మోడళ్లపై 4 శాతం పెంచుతూ.. కంపెనీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ డిసెంబర్‌లో ధరల పెంపును ప్రకటించింది. ఈ నెల నుంచే కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. మెర్సిడెస్ కంపెనీ తన అన్ని మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలను మూడు శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. 2024లోనే ఈ కారు ధరను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆడి ఇండియా కూడా కార్ల ధరలను 3 శాతం పెంచింది. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన దాదాపు 16 మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అదానీకి అమెరికా షాక్.. సంయుక్త విచారణకు ఆదేశం..
సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలుపుతూ న్యూయార్క్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులను ఉమ్మడి విచారణలో కలిపి విచారించాలని కోర్టు తీర్పు చెప్పింది. అదానీ కేసుల్లో యూఎస్ వర్సెస్ అదానీ(అదానీపై క్రిమనల్ కేసు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) vs అదానీ( అదానీపై సివిల్ కేసు), ఇతరులపై ఉన్న సివిల్ కేసులను కలిపి జాయింట్ క్రిమినల్, సివిల్ విచారణ చేయాలని అమెరికా కోర్టు ఆదేశించింది. న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, షెడ్యూల్స్‌కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. అదానీపై క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న జిల్లా జడ్జ్ నికోలస్ జి గరౌఫీస్‌కి అన్ని కేసులు అప్పగించనున్నారు. కేసుల పునర్విభజన చేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించింది.
మార్కెట్ లోకి కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘గ్లోపిక్స్’
వినోద రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తాం అంటూ మార్కెట్ లోకి కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫాం రాబోతోంది. కొత్త ఓటీటీ సంస్థ “గ్లోపిక్స్’ 2025 ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది. గురువారం (జనవరి 2)న గ్లోపిక్స్ లోగోను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ఓటీటీ సంస్థ అందుబాటులోకి రానుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ గ్లోపిక్స్‌ను విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా.. లోకేష్ సన్నయ్య ఫౌండర్ మెంబర్/సిఎమ్ఓ ఫౌండింగ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. మారుతి రాజీవ్ ఫౌండర్ మెంబర్/సిటిఓ, రూపేశ్ మామిళ్లపల్లి హైదరాబాద్ కంటెంట్ హెడ్‌గా వ్యవహరించనున్నారు. నేడు ఈ లోగోను సౌత్‌లో మూడు చోట్ల ఘనంగా లాంచ్ చేసారు. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఈ లోగోను లాంచ్ చేశారు. ఇక ఈ ఫ్లాట్ ఫాంలో ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాల్టీ షోలు అంటూ 360 డిగ్రీల ఎంటర్టైన్మెంట్‌ను అందించబోతున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోపిక్స్ ఫౌండర్ మెంబర్ మారుతి రాజీవ్ మాట్లాడుతూ.. ‘నేడు మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మన కల్చర్, మన సంస్కృతి, మన మూలాల్లోంచి కథలను గ్లోబల్‌గా అందించేందుకు మా గ్లోపిక్స్‌ను ప్రారంభిస్తున్నాం. మంచి కంటెంట్, కాన్సెప్ట్‌లను అందించేందుకు ఈ కొత్త ఫ్లాట్ ఫాంను తీసుకొస్తున్నామ’ని అన్నారు. గ్లోపిక్స్ ఫౌండింగ్ మెంబర్ లోకేష్ మాట్లాడుతూ.. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అందరికీ అంతా మంచి జరగాలి. మేం మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రాంతీయతను చాటేలా, లోకల్ టాలెంట్, కల్చర్‌ను ఎంకరేజ్ చేసేందుకు గ్లోపిక్స్‌ను స్టార్ట్ చేస్తున్నాం. అన్ని రకాల కంటెంట్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మన కంటెంట్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నామ’ని అన్నారు. గ్లోపిక్స్ హైదరాబాద్ కంటెంట్ హెడ్ రూపేశ్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్, కాన్సెప్ట్‌లను అందించేందుకు ఈ కొత్త ఫ్లాట్ ఫాంను తీసుకొస్తున్నామని అన్నారు.
రిలీజ్ కి రెడీ అవుతున్న మోహన్ లాల్ 1000 కోట్లు
మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “1000 కోట్లు. గతంలో “100 కోట్లు”వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం “1000 కోట్లు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ చిత్రం కేరళ లో డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ” మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 కోట్లు పేరుతో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నాము. మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ మోహన్ లాల్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్ ఓ వీరబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రీ రికార్డింగ్ కార్యక్రమాలు ముగించుకుని చిత్రాన్ని జనవరి ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు. మోహన్ లాల్, కావ్య మాధవన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాతీష్ వేగ, డిఓపి: ప్రదీప్ నాయర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాసింశెట్టి వీరబాబు కాగా నిర్మాతలు: కాసుల శ్రీకర్ గుప్తా, కాసుల రామకృష్ణ.