రేపు టీడీపీ కీలక సమావేశం.. ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం..
ఆదివారం రోజు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుండి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. సుమారు నెల రోజుల పాటు కూటమి పార్టీ నేతల ప్రచారం కొనసాగనుంది.. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా దీని ద్వారా ప్రచారం చేయనున్నారు.. అయితే, ఈ కార్యక్రమం ఎలా ఉండాలి..? ప్రజలకు ఎలాంటి విషాలు వెల్లడించాలి.. కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు ఏంటి..? చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి.. తదితర అంశాలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్..
సీన్ రివర్స్..! మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారుల కొలతలు..
2019 ఎన్నికల్లో గెలిచాక పెద్దారెడ్డి ఏం చేశారో.. వాటన్నింటికీ సేమ్ అదే తరహాలోనే రివర్స్ అటాక్ మొదలవుతోంది. కొలత కాస్త ఎక్కువే ఉంటుంది కానీ.. తగ్గే ప్రసక్తే లేదని అంటున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి. అప్పట్లోనే ఏమేమి చేశారో లెక్కలు రాసుకుని మరీ వడ్డీతో సహా చెల్లించేందుకు జేసీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు తాజాగా పెద్దారెడ్డి ఇంటికి గురి పెట్టారు.. అసలు పెద్దారెడ్డి వైపుకు జేసీ ఎందుకు చూశారంటే.. 2023 సెప్టెంబర్‌లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహారీగోడను 27 లక్షలతో అధికారులు నిర్మించే ప్రయత్నం చేశారు. అది సరిగ్గా జేసీ ఇంటికి ఎదురుగా ఉంది. ఈ కాంపౌండ్ వాల్ రోడ్డులో ముందుకు వచ్చి నిర్మిస్తున్నారనే జేసీ అభ్యంతరం చెప్పారు. 2022 మాస్టర్ ప్లాన్ ప్రకారం కాలేజీ నుంచి వరకు 60 అడుగుల రోడ్ ఉందని.. ఆ మేరకు స్థలాన్ని విడి పెట్టి ప్రహరీ నిర్మించాలని సూచించారు. రోడ్డు విస్తరణ చేపడితే గోడను కూల్చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే అప్పట్లో జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ ధ్వంసం చేశారు. అది ఎవరు చేశారో తెలియదు.. కానీ, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తోపాటు మరో 13 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణంపై ఏకంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు జేసీ.. దీంతో నిర్మాణం ఆగిపోయింది. అయితే, తాజాగా ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా వ్యవహరాలు సాగుతున్నాయి. పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి.. ఇళ్లు నిర్మించారని జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆక్రమణలంటూ పట్టణంలో వైసీపీ నాయకులే టార్గెట్ కూల్చివేతలు, నోటీసులు ఇచ్చే ప్రక్రియ సాగుతోంది. తాజాగా, ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉంటున్న ఇంటితో పాటు సమీపంలోని పలు ఇళ్లకు సంబంధించిన కొలతలు వేశారు.
ఈ-స్టాంపుల స్కామ్‌ను ఛేదించిన పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరుడు సహా ముగ్గురి అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ-స్టాంపుల కుంభకోణాన్ని అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అనుచరుడు ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్.. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో నకిలీ ఈ స్టాంప్ బాగోతం బయటపడిందని తెలిపారు. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కళ్యాణదుర్గంలో మీసేవ నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు బోయ ఎర్రప్ప ఇప్పటివరకు దాదాపు 15,851 ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించామన్నారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వంద రూపాయల ఈ స్టాంపులను కొనుగోలు చేసి ఫొటోషాప్ లో లక్ష రూపాయల నకిలీ ఈ స్టాంపులుగా నిందితుడు మీసేవ బాబు మార్చాడని పేర్కొన్నారు.. నిందితుడు మీసేవ బాబు నుంచి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థ దాని అనుబంధ సంస్థలకు 438 నకిలీ ఈ-స్టాంపులను ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు విక్రయించినట్లు గుర్తించాం. నిందితుల నుంచి మూడు సీపీయూలు, మూడు మానిటర్లు, మూడు ప్రింటర్ కం స్కానర్లు, రెండు ప్రింటర్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని.. అలాగే, 88 కాలీ ఈ స్టాంపులను అలాగే వాడిన ఏడు ఈ స్టాంప్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ జగదీష్ చెప్పారు.
మున్సిపల్ శాఖపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. ముఖ్యంగా స్వచ్ఛమైన మంచినీరు.. వేస్ట్ మేనేజ్‌మెంట్, డ్రైనేజ్.. ప్రజలకు ముఖ్యం.. కేంద్రం నుంచి అనేక నిధులు కూడా వస్తున్నాయి.. స్వచ్ఛ భారత్ కు గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదు.. కానీ, ఇప్పుడు అమృత్ స్కీం ముందుకు తీసుకువెళ్లే విధంగా టెండర్లు పిలిచాం.. రాష్ట్రంలో 80 శాతం ఇళ్లకు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.. సీఎం చంద్రబాబు.. ఆర్ధిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు.. డ్రైనేజ్ వాటర్ ను శుద్ధి చేసి బయటకు పంపించాలి.. దీనికి సంబంధించి కూడా కార్యాచరణ రెడీ అవుతోందన్నారు.. అభివృద్ధి చెందిన దేశాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి.. విశాఖ, గుంటూరులో 1400 టన్నుల చెత్త నుంచి విద్యుత్ వస్తోందని తెలిపారు మంత్రి నారాయణ.. విజయవాడ, రాజమండ్రిలో వేస్ట్ టు ఎనర్జీ విషయంలో త్వరలో టెండర్లు పిలుస్తున్నాం అన్నారు.. టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా చర్చ జరిగింది. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను ఇవ్వలేదు.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల 140 కోట్ల బ్యాంక్ రుణాలు కట్టి టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు.. మరోవైపు, మున్సిపల్ కార్మికుల సమస్యపై సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.. మున్సిపల్ కార్మికుల సమస్యపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామన్నారు.. అప్కాస్ పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చిస్తుందన్నారు మంత్రి నారాయణ..
పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. పేదవారికి అండగా నిలబడ్డాడు..
పీజేఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “20 నుంచి 25 ఏళ్లు నగరంలో పీజేఆర్ శకం నడిచింది.. ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకు దెరువుకు వచ్చిన వారిపై ఎవరైనా దౌర్జన్యం చేసినా పీజేఆర్ అడ్డుకునేవారు.. పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. మంత్రిగా నిరంతరం సేవ చేస్తూ.. పేదవారికి అండగా నిలబడ్డాడు.. సీఎల్పీ నాయకుడిగా కూడా పీజేఆర్ ఎనలేని సేవ చేశాడు.. పీజేఆర్ ఇల్లు ప్రజల సమస్యలు తీర్చేందుకు జనతా గ్యారేజి లా ఉండేది.. ప్రభుత్వం మీద పీజేఆర్ చేసిన పోరాటంతోనే కృష్ణా నీటిని నగరానికి రావడానికి కారణం.. నగరానికి త్రాగునీటి అందించిన ఘనత పీజేఆర్ ది.. నగరంలో మంచి నీరు తాగుతున్న అందరూ పీజేఆర్ కి కృతజ్ఞత చెప్పాలి.. అప్పట్లో పీజేఆర్ నాయకత్వం వహించిన ఖైరతాబాద్ అతిపెద్ద నియోజకవర్గం.. ఈ శేరిలింగం పల్లి కూడా ఒక నాడు ఖైరతాబాద్ లో భాగమే.. రాజీవ్ గాంధీ టెక్ పార్క్ ను హైదరాబాద్ కు తెచ్చిన ఘనత పీజేఆర్ ది.. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వచ్చాక దానిని హై టెక్ సిటీగా మార్చాడు.. ఇంత గొప్ప నగరాన్ని అభివృద్ధి పరచడానికి సోనియా గాంధీ ఆద్వర్యంలో మేము ఇప్పుడు ముందుకు వచ్చాము.. ఈ నగరం అతి గొప్ప నగరంగా ఎదగాలి.. ఈ నగరం బెంగళూరు, ముంబాయితో కాదు.. న్యూ యార్క్, టోక్యో లతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తాం.. కార్పొరేటర్లు ఈ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకోవాలి.. ప్రజలకు రాజకీయాలకు సంబంధం లేదు.. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేయాలి.. ఇప్పుడు అభివృద్ధి నీ మత్రమే ప్రజలు చూడాలి..
భక్తులు ప్రయోజనార్థం.. యాదాద్రిలో కూడళ్లకు నామకరణం..
ప్రస్తుతం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఆలయ రూపురేఖలు మారిపోయాయి. అద్భుతమైన గడి నిర్మాణంతో పాటు భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించారు. తాజాగా యాదగిరిగుట్టలో కొత్తగా నిర్మించిన సర్కిల్స్‌కు నామకరణం చేశారు. కృష్ణ శిలతో ఆలయం నిర్మించిన సమయములోనే ఈ సర్కిల్స్ (కూడళ్ళు) ఏర్పాటు చేశారు. కానీ వీటికి పేర్లు పెట్టకపోవడముతో భక్తులు తాము ఎక్కడ ఉన్నామో అర్థంకాని స్థితిలో ఉండేది. అలాగే తమ వాళ్ళను కలవడానికి ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఈ నామకరణం సర్కిల్స్ కు పేర్లు పెట్టడంతో భక్తులకు చాలా సులభం తాము ఎక్కడ ఉన్నామో తెలుస్తోంది. తమ వాళ్ళను కలవడానికి సులువుగా ఉంటుందంటుంది. ఈ పేర్లు కూడా ఎంతో అద్భుతంగా నిర్ణయించారు. శ్రీ యాదఋషి సర్కిల్, శ్రీ హనుమాన్ సర్కిల్, శ్రీరామానుజ సర్కిల్, శ్రీ ప్రహ్లాద సర్కిల్, శ్రీ గరుడ సర్కిల్ వంటి పేర్లతో కూడళ్లకు నామకరణం చేశారు.
మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తప్పిన ప్రమాదం..
మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మెట్ పల్లి మండలం అరపేట్ శివారులో మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్ పల్లి పర్యటన ముగించుకుని ధర్మపురి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమి కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో వాహనంలో వెళ్లిపోయారు. కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు.. కోరుట్ల డిఎస్పీ.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రిపేర్ లో ఉన్న కారును బెల్ట్ కట్టి కోరుట్ల వైపు నుంచి మెట్ పల్లికి తీసుకువెళ్లుతుండగా బెల్ట్ ఊడిపోయి మంత్రి వాహనాన్ని రిపేరులో ఉన్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
‘‘16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు’’.. ప్రధానికి అంతరిక్ష జీవితం గురించి చెప్పిన శుక్లా..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లిన తొలి భారతీయుడిగా, అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా రికార్డ్ క్రియేట్ చేశారు. శనివారం, శుక్లా ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడారు. ‘‘ఈ రోజు మీరు మన మాతృభూమికి దూరంగా ఉన్నారు. కానీ మీరు భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారు’’ని మోడీ, శుక్లాను ప్రశంసించారు. దీనికి సమాధానంగా శుక్లా మాట్లాడూతూ..‘‘ఇది నా ఒక్కడి ప్రయాణం కాదని, మన దేశానికి అని’’ అన్నారు. ఇప్పటి వరకు తాను అంతరిక్షం నుంచి చూసిన వాటిని శుక్లా, ప్రధాని మోడీకి వివరించారు. ‘‘ఐఎస్ఎస్ నుంచి రోజూ 16 సార్లు సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తాం. మన దేశం చాలా గొప్ప వేగంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ ప్రతీదీ భిన్నంగా ఉంది’’ అని అన్నారు. ‘‘మేము ఒక సంవత్సరం శిక్షణ పొందాము మరియు నేను వివిధ వ్యవస్థల గురించి నేర్చుకున్నాను… కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రతిదీ మారిపోయింది… ఇక్కడ, అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేనందున చిన్న విషయాలు కూడా భిన్నంగా ఉంటాయి… ఇక్కడ నిద్రపోవడం ఒక పెద్ద సవాలు… ఈ వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది’’ అని ప్రధానికి వివరించారు.
వచ్చే నెలలో భారీగా బ్యాంక్ సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
మరో రెండ్రోజుల్లో జూన్ నెల ముగిసి జూలై నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. జూలై నెల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూలైలో భారీగా బ్యాంక్ సెలవులు ఉండనున్నాయి. జూలై నెలలో 13 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే ఆదివారం సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. సెలవుల ఎప్పుడుంటాయో తెలుసుకుంటే మీ బ్యాంకు పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవచ్చు.
బిగ్ బాస్-9లోకి ఎవరైనా వెళ్లే ఛాన్స్.. ఇలా చేయండి చాలు..
బిగ్ బాస్ అనేది అతిపెద్ద రియాల్టీ షో. తెలుగు నాట దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద సెలబ్రిటీలు కూడా వెళ్లి అక్కడ అలరిస్తున్నారు. అయితే కొన్ని సీజన్ల నుంచి సామాన్యులకు కూడా ఇక్కడ పెద్ద పీట వేస్తోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్. తాజాగా బిగ్ బాస్-9 కోసం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది బిగ్ బాస్ సంస్థ. ఈ సారి ఎవరైనా బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపింది. ఇంతకు ముందు కామన్ మ్యాన్ కేటగిరీలో ఒకరికి అవకాశం ఇచ్చేవారు. ఈ సారి మాత్రం ఆడిషన్స్ చేసి కంటెస్టెంట్లుగా సామాన్యులను సెలెక్ట్ చేస్తామని చెబుతోంది మేనేజ్ మెంట్. ఎవరైనా సరే తమ ఆడిషన్ ను పంపించొచ్చు అని కోరుతోంది. అందుకోసం https://bb9.jiostar.comలో రిజిస్టర్ కావాలి. తర్వాత మీరు బిగ్ బాస్ లోకి రావడానికి గల కారణాన్ని వివరిస్తూ వీడియో చేసి అందులోనే అప్ లోడ్ చేయాలి. మీ వీడియో మేనేజ్ మెంట్ కు నచ్చితే మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు నాగార్జున. ప్రస్తుతం రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఏపీ సీఎం, డిప్యూటి సీఎం కాళ్ళు పట్టుకుంటా.. ఆదుకోండి!
తెలుగులో పాకీజాగా గుర్తింపు పొంది, కొన్ని సినిమాల్లో నటించిన నటి గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశిస్తూ ఆమె ఒక వీడియో రికార్డు చేసింది. తన పేరు పాకీజా అని, తాను గతంలో కొన్ని కామెడీ రోల్స్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. తన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగాలేదని, ఆర్థిక పరిస్థితి సరిగా లేని నేపథ్యంలో తాను తన సొంత గ్రామమైన తమిళనాడులోని కారైకుడిలో నివసిస్తున్నానని తెలిపింది. తనకు తమిళనాడులో ఆధార్ కార్డు ఉందని, దాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆమె కోరింది. అలాగే, తనను వారిద్దరూ ఆదుకోవాలని, కాళ్లు పట్టుకుంటానని ఆమె మొరపెట్టుకుంది. అంతేకాక, తనకు డబ్బు సహాయం అక్కర్లేదని, తన ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని ఏదైనా సహాయం చేయాలని ఆమె చేతులు జోడించి వేడుకుంది. ఈ మేరకు ఆమె ఒక వీడియో రికార్డు చేసి మీడియా ప్రతినిధులకు షేర్ చేయడం గమనార్హం.
‘సలార్’, ‘పుష్ప2’ల తరువాత ‘కన్నప్ప’కి థియేటర్లు నిండుతున్నాయి!
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మేరకు శనివారం నాడు సినిమా యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఎక్కువగా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ‘సలార్’, ‘పుష్ప’ లాంటి చిత్రాల తరువాత ‘కన్నప్ప’కి కల్వకుర్తి వంటి ఊర్లో థియేటర్లు నిండుతున్నాయి. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ ఇలా అన్ని చోట్లా ప్రభంజనం సృష్టిస్తోంది. ‘కన్నప్ప’ చిత్రం మున్ముందు భారీ విజయాన్ని నమోదు చేయనుంది. క్లైమాక్స్ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి. విష్ణు గారు అద్భుతంగా నటించారు. ఇప్పుడున్న తరం చూడాల్సిన చిత్రమిది. ఇలాంటి సినిమాను తీసుకు వచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.
సూర్య పాత్ర రివీల్ చేసిన వెంకీ అట్లూరి..
తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఆయన టేకింగ్, స్క్రీన్ ప్లేకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య పాత్ర, కథ గురించి హింట్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. వెంకీ అట్లూరి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. సూర్యతో తాను చేయబోయే సినిమా గత సినిమాల కంటే డిఫరెంట్ గా ఉంటుందన్నారు. సూర్య ఇందులో కామన్ మ్యాన్ గా కనిపించరు. సంజయ్ రామస్వామి లాంటి పాత్రలో ఆయన కనిపిస్తారని చెప్పారు వెంకీ. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందన్నారు. ఇలాంటి సినిమాలో సూర్య ఇప్పటి వరకు నటించలేదన్నారు. ఆయనతో చేయబోయే మూవీని అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నట్టు వివరించారు వెంకీ అట్లూరి.
జూలై 3న ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్
సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటైన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కూడా తన సహకారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా పని చేస్తూ.. ప్రతి ఫ్రేమ్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది చిత్ర బృందం.