వైసీపీ ‘పోరుబాట’.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని ఆరోపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాలను వేయటం దారుణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏకంగా 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాలను విధించడాన్ని ఖండిస్తోంది వైసీపీ.. రేపు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. పెంచిన విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించనున్నారు.
స్పీడందుకున్న రాజధాని అమరావతి పనులు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పునఃనిర్మాణ పనులు స్పీడందుకున్నాయి.. రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బాంక్ నుంచి నిధులు విడుదల అయ్యాయి.. దీంతో, పనుల్లో వేగం పెరిగింది.. 2019లో జరిగిన ఎన్నికలకు ముందే రాజధాని పనులు ఆగిపోయాయి.. అప్పట్లో ఏపీ సచివాలయ శాశ్వత భవనం పునాది, హైకోర్టు ఏర్పాటు కోసం పునాది నిర్మించారు. కానీ, ఆ పునాది ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోయాయి.. వాటిని తోడే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. కాగా, సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.. 40 నుంచి 50 అంతస్థులు ఉండే విధంగా ఏర్పాటు జరిగింది.. సరిగ్గా 2018 డిసెంబర్ 27న నిర్మాణ పనులు ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. బాగా ఎత్తైన రెండు టవర్లు ఏర్పాటు చేయాలని అప్పుడు పనులు ప్రారంభించారు… తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని పనులు ఆగిపోయాయి.. మళ్లీ ఇప్పుడు సరిగ్గా ఇదే టైంకు పనులు ప్రారంభం అవుతున్నాయి. శాశ్వత నిర్మాణాల కోసం వేసిన పునాదిలో ప్రస్తుతం నీళ్లు చేరాయి.. ప్రభుత్వం దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించింది… ఐఐటీ హైదరాబాద్ బృందం నీటి లోపల ఉన్న పునాదులు పరిశీలించింది. పునాదులకు ఎలాంటి ఢోకా లేదని పనులు చేసుకోవచ్చని ఈ బృందం సూచించింది. దీంతో, ట్రాక్టర్ల ఇంజన్‌లకి భారీ మోటార్లు అమర్చి నీటిని తోడే కార్యక్రమం జరుగుతోంది.
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ ఫోకస్.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనంపై అధికారులతో సమీక్షించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపిన ఆయన.. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతిస్తారన్నారు.. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేయబడ్డాయి.. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారని పేర్కొన్నారు..
హెల్మెట్ లేకుండా జనసేన ఎంపీ బైక్ రైడ్.. ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ ట్రోల్స్..!
హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తు హంగామా సృష్టించారు జనసేన నేత, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. అయితే, సోషల్ మీడియాలో మెయిన్ రోడ్డుపై జనసేన ఎంపీ బుల్లెట్ నడుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి.. మోటార్ వాహనాల చట్టనిబంధనలు సక్రమంగా అమలు చేయడం లేదని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించింది కోర్టు.. ఈ సమయంలో ప్రజా ప్రతినిధిగా ఉంటూ.. ఓ ఎంపీ నిబంధనలు పాటించకపోవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి.. ముందు.. వెనక కార్లతో హడావిడి చేస్తూ బుల్లెట్ నడుపుతున్నారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. ఇక, ఎంపీ బైక్ విన్యాసాల కోసం ట్రాఫిక్ ఆపారు పోలీసులు.. ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సింది పోయి సర్కస్ ఫీట్లు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి..
న్యూ ఇయర్ వేడుకలు.. గైడ్‌లైన్స్ విడుదల చేసిన వైజాగ్ సీపీ
ప్రపంచం మొత్తం 2024కి గుడ్‌బై చెప్పి.. 2025కి ఆహ్వానం పలికేందుకు సిద్ధం అవుతోంది.. అయితే, న్యూ ఇయర్ వేడుకలు జరిగే సమయంలో.. ఆయా సిటీల్లో ఎక్కడిక్కడ పలు ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆంక్షలు పెడుతున్నారు.. న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా గైడ్‌లైన్స్ రూపొందింస్తున్నారు.. ఇక, న్యూ ఇయర్ వేడుకలకు సాగర నగరం వైజాగ్ ముస్తాబవుతుండగా.. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు పోలీస్ కమిషనర్.. ఇవెంట్స్ నిర్వహించాలనుకునే వారి నుండి దరఖాస్తులకు ఆహ్వానించారు.. అయితే, అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్.. హోటల్స్, క్లబ్‌లు, పబ్‌ల నిర్వహణలు అర్ధరాత్రి 1 గంట వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఈవెంట్స్ నిర్వహించే వారు.. ఎంట్రీతో పాటు.. ఎగ్జిట్ పాయింట్స్ లో సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు వాడితే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, నోవోటేల్ హోటల్ జంక్షన్, R.K బీచ్ , భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో “షీ-టీమ్స్” లను ఏర్పాటు చేయనున్నారు.. మద్యం తాగి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలుశిక్ష తప్పదని.. డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు లేదా శాశ్వతంగా సస్పెండ్ చేయబడుతుందని పేర్కొన్నారు కమీషనర్ ఆఫ్ పోలీస్ శంఖబ్రత బాగ్చి..
నవంబర్ 14 బాలల దినోత్సవం మార్చాలి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారతీయ సాహసయోధులైన సాహిబ్‌జాదా జొరావర్ సింగ్, సాహిబ్‌జాదా ఫతే సింగ్‌లకు ఘన నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1500 ఏండ్ల క్రితం భారతీయత కోసం, ధర్మం కోసం పదవ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన.. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ బలిదానమయ్యారని తెలిపారు. డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్‌గా గుర్తించడం వారి త్యాగానికి, ధైర్యానికి ఘన నివాళి అని అన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఆ వీరపుత్రులకు ఘన నివాళులర్పిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. వారిద్దరు సిక్కుల పథానికి, ధర్మానికి అంకితమై తమ ప్రాణాలను అర్పించి చిన్న వయసులోనే అమరులైన వీరులు అని కొనియాడారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం.. అదేవిధంగా డిసెంబరు 26న వీర్ బాల్ దివస్ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. ప్రధానమంత్రి మోడీ వీర్ బాల్ దివస్‌ను యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు.
సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు..
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతల బృందం కూడా ఉంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీ తేజ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని తెలిపారు. శ్రీ తేజ్ కోలుకుంటున్నాడు.. వైద్యానికి శ్రీతేజ్ స్పందిస్తున్నారని అన్నారు. శ్రీ తేజ్‌కు స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారన్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామని హరీష్ రావు తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన రేవతికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాను మరణిస్తున్నా.. కొడుకు శ్రీ తేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశామని చెప్పారు. రేవతి అందరి మనసును కరిగేలా చేసిందని హరీష్ రావు తెలిపారు.
ఎన్నికల విధానంపై ప్రజలకు నమ్మకం పోతుంది
ఎన్నికల విధానం, ప్రక్రియ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. గాంధీ-నెహ్రూ వారసత్వం ఉన్న తాము ప్రత్యర్థుల అబద్దాలను తుత్తునియలుగా చేస్తామన్నారు. ఎన్నికల సంఘం తీరుపై పలు అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దేశానికి అవసరమైన కీలక సంస్థలను తన అధీనంలో.. కనుసన్నల్లో మెలిగేలా అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “కేంద్ర ఎన్నికల సంఘం” లాంటి రాజ్యాంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తోందని వ్యాఖ్యానించారు. దీన్ని అడ్డుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. మారిన ఎన్నికల నియమ, నిబంధనలను వెల్లడించాలని కోర్టు ఆదేశించినా.. ఎందుకు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బెళగావి సమావేశాల తర్వాత సరికొత్త ఉత్సాహంతో కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పని చేయాలని.. ప్రత్యర్థుల అబద్దాలను, కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!
మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ తిలేకర్ మామ సతీష్ వాఘ్ హత్య కేసు మిస్టరీ వీడింది. డిసెంబర్ 9న మర్డర్‌కు గురైన సతీష్ వాఘ్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని ఛేదించారు. విచారణలో సంచలన విషయాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. కలకాలం తోడుండాల్సిన అర్ధాంగే ఈ హత్యకు సూత్రధారి, పాత్రధారి అని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రియుడితో సుఖానికి అడ్డొస్తున్నాడని.. మరణశాసనం రాసి.. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసింది దుర్మార్గురాలైన భార్య. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సతీష్ వాఘ్(55).. మోహిని వాఘ్ (48) భార్యాభర్తలు. అయితే సతీష్ వాఘ్ ఇంట్లో అక్షయ్ జవాల్కర్ ( 29) అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. ఆ సమయంలో అక్షయ్ జవాల్కర్‌తో మోహిని వాఘ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడితో జల్సాలు చేస్తోంది. అయితే ఒకరోజు అక్షయ్ జవాల్కర్-మోహిని వాఘ్ బాగోతం.. సతీష్ వాఘ్ కంటిలో పడి మందలించాడు. అంతేకాకుండా మోహిని వాఘ్‌ను కొట్టడం కూడా చేశాడు. అయినా కూడా ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదు. అక్షయ్ జవాల్కర్.. వేరే ఇంటికి మారిపోయినా కూడా అతడితో మోహిని వాఘ్ శారీరక సంబంధం కొనసాగిస్తూనే ఉంది. నిత్యం ప్రియుడితో ఫోన్‌లో టచ్‌లోనే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా సతీష్ వాఘ్ తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో తన సుఖానికి భర్త సతీష్ వాఘ్ అడ్డొస్తున్నాడని చంపేయాలని కుట్ర పన్నింది. అంతే తడువుగా ప్రియుడితో కలిసి కోటి రూపాయులకు కిరాయి హంతకులను పురమాయించింది. అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు చెల్లించారు.
నాల్కోలో 518 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇలా
జాతీయ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) లో ఉద్యోగం పొందాలనుకుంటున్న వారికి ఇది మంచి వార్త. నాల్‌కో నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల కోసం నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నాల్‌కో అధికారిక వెబ్‌సైట్ nalcoindia.com ను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పోస్టుల కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేయనివారు డిసెంబర్ 31, 2024 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 518 పోస్టుల కోసం నియామక ప్రక్రియ జరుగుతుంది.
రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వారిపై ఆదాయపు పన్ను తగ్గింపు..!
మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదికి రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులపై ‘‘ఆదాయపు పన్ను’’ తగ్గించాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని వల్ల దేశవ్యాప్తంగా 10 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ప్రత్యేకించి అధిక జీవన వ్యయాలతో కూడిన నగరవాసులు, ఇంటి అద్దెల మినహాయింపు ఎంచుకునే వారికి కొత్త పన్ను విధానంలో ప్రయోజనం ఉంటుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అదికారిక నిర్ణయం తీసుకోలేదని, వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 01 కన్నా ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు. పన్ను తగ్గింపు వల్ల ఆదాయం తగ్గినప్పటికీ, పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది ప్రజలు కొత్త వ్యవస్థను ఎంచుకునే అవకాశం ఉందని భావిస్తు్నారు. భారతదేశంలో తన ఆదాయపు పన్నులో ఎక్కువ భాగం రూ. 10 లక్షలు సంపాదించే వ్యక్తుల నుంచి పొందుతోంది.
డెబ్యూ మ్యాచ్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన కొర్బిన్ బోష్..
భారత్-ఆస్ట్రేలియా మధ్య 26 డిసెంబర్ నుండి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ ప్రారంభమైంది. ఈ టెస్ట్‌లో 19 ఏళ్ల యువకుడు సామ్ కోన్‌స్టాస్ అద్భుతమైన అర్ధసెంచరీతో తన టెస్ట్ క్రికెట్‌ను ప్రారంభించి సంచలనం రేపాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు, నేడే సౌతాఫ్రికా-పాకిస్థాన్ మధ్య టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభమైంది. సెంట్యూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దానితో పాకిస్థాన్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. కానీ, వారి టాప్ ఆర్డర్ చాలా త్వరగా తడబడింది. కెప్టెన్ షాన్ మాసూద్, సామ్ అయూబ్ త్వరగా అవుట్ అయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు మరిన్ని వికెట్లు కోల్పోయింది. అలా బాబర్ ఆజమ్ కూడా 4 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సౌద్ షకీల్ కూడా 14 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దింతో పాకిస్థాన్ జట్టు 56 పరుగులలోనే 4 వికెట్లు కోల్పోయింది.
గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ సేల్స్ సూపర్
ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అసలు సిసలైన గేమ్ మొదలైనట్టే. జనవరి 10న సినిమా రిలీజ్ కానుండగా ఇప్పటికే అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. యూఎస్‌లో కేవలం ప్రీమియర్ షోలకే పది వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు మరో రెండు వారాల సమయం ఉండటంతో ఈ నెంబర్ మరింతగా పెరిగడం ఖాయం. ఖచ్చితంగా రిలీజ్ వరకు ‘గేమ్ ఛేంజర్’ యూఎస్ ప్రీ సేల్స్ పరంగా రికార్డు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. ఇప్పటికే అమెరికాలో నిర్వహించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు ప్రీమియర్స్ టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే ప్రీ సేల్స్ మరింతగా ఊపందుకోనున్నాయి. సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేలా సాలిడ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ట్రైలర్ కట్‌తో బిజీగా ఉన్నాడు శంకర్. ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే, ఈ ట్రైలర్ లాంచ్ ఎక్కడ చేయనున్నారు? ఎవరు గెస్ట్‌గా వస్తారనే విషయంపై మేకర్స్ సైడ్ రేపో మాపో క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.
కీర్తి సురేష్ షాకింగ్ నిర్ణయం
గత కొన్నాళ్లుగా వస్తున్న పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ హీరోయిన్ కీర్తిసురేశ్ ఇటీవలే తన చిరకాల మిత్రుడు ఆంథోని తటిల్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం మొదట హిందూ సంప్రదాయంలో జరగ్గా.. ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. అయితే.. పెళ్లైన వారానికే సినిమా ప్రమోషన్స్‌లో జాయిన్ అయి హాట్ టాపిక్ అయింది కీర్తి. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్‌తో కలిసి కీర్తిసురేశ్ నటించింని బేబిజాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లి కారణంగా కీర్తి ఈ సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ పెళ్లైనా వారానికే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. దీంతో పెళ్లి తర్వాత కూడా కీర్తి సినిమాలు చేస్తుందని అభిమానులు భావించారు. ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కీర్తి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు తప్పితే కొత్త ప్రాజెక్ట్స్‌కు నో చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాల షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేసింది కీర్తి. దీంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి సంసార జీవితానికే పరిమతమవాలని భావిస్తోందట. మామూలుగా అయితే ఈ మధ్య పెళ్లి చేసుకున్న కియారా అద్వానీ, ఆలియా భట్ లాంటి ముద్దుగుమ్మల లాగే కీర్తి కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు కీర్తి సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు చేస్తుందా, లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
మోక్షజ్ఞ దొరికితే ఎందుకు వదులుతాను..?
గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఎట్టకేలకు ఈ ఏడాదిలో మోక్షు హీరోగా లాంచ్ అవనున్నాడనే గుడ్ న్యూస్ చెప్పి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. హనుమాన్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. ఇదే జోష్‌లో షూటింగ్‌కు రెడీ అయ్యారు. కానీ ఏమైందో ఏమో గానీ ఈ సినిమా పూజా కార్యక్రమం మాత్రం బ్రేక్ పడింది. దీంతో ఈ ప్రాజెక్టే ఆగిపోయిందా అనే సందేహాలు ఉన్నాయి. కానీ మోక్షు దొరికితే మాత్రం వదలని చెబుతున్నాడు మాస్ డైరెక్టర్ బాబీ. బాలకృష్ణ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘డాకు మహారాజ్’కు బాబీ దర్శకత్వం వహించిస సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రమోషన్స్‌లో భాగంగా మోక్షజ్ఞపై బాబీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్య్వూలో బాబీ మాట్లాడుతూ మోక్షజ్ఞ ఓ నాలుగు సార్లు డాకు మహారాజ్‌కి సినిమా సెట్‌కి వచ్చాడు. అతన్ని చూస్తే ఆరడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా ఒదిగి ఉంటాడు, చాలా నేర్చుకోవాలనే తపన ఉంటుందని అనిపిస్తుంది. ఒక డైరెక్టర్‌గా ఇలాంటి కుర్రాడు మనకి దొరికితే బాగుంటుందని అనిపిస్తుంది. అతనితో సినిమా తీయాలనే ఆశ ఉంటుంది, తీసే ఛాన్స్ వస్తే ఎవరూ వద్దనుకోరు. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. ఛాన్స్ అదే వస్తుంది అని అన్నారు. మరి ఫ్యూచర్లో అయినా మోక్షుతో బాబీ సినిమా చేస్తాడేమో చూడాలి.