గ్రూప్-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది.. అయితే నిన్ననే లేఖ రాసినా ప్రభుత్వ అభ్యర్థనపై ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ వర్గాలు స్పందించలేదు.. ప్రభుత్వ లేఖను APPSC పట్టించుకోకపోవడంపై అభ్యర్ధులు విస్మయంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇక, లక్ష మంది ఆందోళనను ఏపీపీఎస్సీ పెద్దలు అర్థం చేసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది.. అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించాలంటున్నారు గ్రూప్ 2 అభ్యర్థులు.. ప్రభుత్వం స్పందించినా.. ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల అభ్యర్థుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. గ్రూప్-2 మెయిన్స్‌పై ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. రోస్టర్ తప్పులను సరిదిద్ది గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని సూచిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై జగన్ కీలక నిర్ణయం..
ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి.. తొలిరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.. ఇక, ఈ నెల 28వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం.. అయితే, ఈసారి అయినా.. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదా? అనే చర్చ సాగుతోన్న సమయంలో.. సమావేశాలకు హాజరవ్వడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.. అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతున్నారు వైఎస్ జగన్.. శాసన సభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది..
రేపే ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష.. రోడ్డెక్కిన అభ్యర్థులు..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షపై ఉత్కంఠ నెలకొంది.. అసలు పరీక్ష ఉంటుందా? లేదా? అనే అయోమయంతో గందరగోళంలో ఉన్నారు గ్రూప్-2 అభ్యర్థులు.. అయితే, షెడ్యూల్ ప్రకారం రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుంది.. రోస్టర్ సమస్య పరిష్కరించేవరకు ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఏపీ ప్రభుత్వం.. కానీ, సర్కార్ లేఖపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా స్పందించలేదు.. మరోవైపు, గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ఇక, పరీక్షలు యథావిధిగా జరుగుతాయని.. కొన్ని జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.. దీంతో, గ్రూప్ -2 అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.. విశాఖపట్నంలో తమ పోరును ఉధృతం చేశారు గ్రూప్-2 అభ్యర్థులు.. ఇసుక తోట జంక్షన్ లో జాతీయ రహదారిని దిగ్భందించి నిరసనకు దిగారు.. దాంతో, భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన అడ్డుకునేందుకు పోలీసులులు ప్రయత్నించారు.. దీంతో, పోలీసులకు అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ఎగ్జామ్ బాయ్ కాట్ చేయాలి అంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు గ్రూప్-2 అభ్యర్థులు..
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్.. పూర్తిస్థాయి సహకారం ఉంటుందని హామీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన విషయం విదితమే కాగా.. ఆ ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని.. ఇక, జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి ఫోన్‌లో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు తెలంగాణ సీఎం.. ఇక, సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని కూడా ప్రధాని వివరించారు.. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌ను పంపిస్తామని సీఎంకు చెప్పారు ప్రధాని మోడీ.. క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చేందుకు… పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ..
ఉద్యమాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది..
కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరస విజయాలతో బీజేపీ దూసుకుపోతుంది.. వరసగా కాంగ్రెస్ ఓటమి చవిచూస్తుంది.. ఓటమిలో రికార్డు సృష్టిస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ కుటుంబం మీద రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకం.. హామీలు అమలు చేయలేక అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అభాసుపాలు అయ్యారని తెలిపారు. మంత్రులు ఒకరి పై ఒకరు పొట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కాంగ్రెస్ అరువు తెచ్చుకొని డబ్బుల మూటలతో బరిలోకి దించిందని లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ కు అడుకట్ట వేయకపోతే తెలంగాణ ప్రమాదంలో పడుతుంది.. గెలిస్తే రేవంత్ రెడ్డి తన అబద్ధపు మాటలకు ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటాడన్నారు. తెలంగాణ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది.. ఆలోచించి ఓటు వేయండని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులది త్యాగాల చరిత్ర.. ఉద్యమాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఎంపీ లక్ష్మణ్ దుయ్యబట్టారు.
అదే గంగానది ప్రత్యేకత.. కోట్ల మంది స్నానం చేసినా స్వచ్ఛంగా నీరు..
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ అద్భుత జన సంగమం ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తోంది. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇప్పటికే 50 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. గంగా నది నీరు తాగేంత స్వచ్ఛంగా ఉన్నాయని చెప్పారు. తాజాగా, ఓ అధ్యయనం గంగా నది నీటి స్వచ్ఛత గురించి సంచలన విషయాన్ని వెల్లడించింది. ప్రముఖ శాస్త్రవేత్త అజయ్ సోంకర్ గంగా నది గురించి సంచలనాత్మక విషయాన్ని ఆవిష్కరించారు. నదిలోని ‘‘బ్యాక్టీరియోఫేజ్’’లు గంగాని సహజంగా శుద్ధి చేస్తున్నట్లు తేల్చారు. 1100 రకాల బ్యాక్టీరియోఫేజ్‌లు కాలుష్యాన్ని తగ్గించి, నీటిని శుద్ధి చేస్తున్నాయని, వాటి సంఖ్య కన్నా 50 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములను చంపుతున్నాయని, వాటి RNAని కూడా మారస్తున్నట్లు వెల్లడించారు. బ్యాక్టీరియోఫేజ్‌లు తాము అంతమయ్యే ముందు కాలుష్యాలను, హానికరమైన బ్యాక్టీరియాలను తొలగించినట్లు ఆయన చెప్పారు. గంగా నదికి సముద్ర జలాలకు ఉండే శక్తి ఉందని ప్రశంసించారు. గంగానికి ఈ బ్యాక్టీరియోఫేజ్‌లు ‘‘సెక్యూరిటీ గార్డులు’’గా వ్యవహరించి శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో జెలెన్ స్కీ అంత ముఖ్యం కాదు..
డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారం నుంచి తాను ఎన్నికైన వెంటనే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో శాంతి చర్చలపై మాట్లాడారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా శాంతి స్థాపనపై చర్చించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జెలెన్ స్కీని నియంతగా పోల్చుతూ, ఉక్రెయిన్‌ని నాశనం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ, యుద్ధాన్ని ముగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు అమెరికా నాయకత్వం వహిస్తుందని ట్రంప్ చెప్పారు. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరిగే చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హాజరుకావడం తప్పనిసరి అని తాను భావించడం లేదని ట్రంప్ శుక్రవారం అన్నారు. అతడు మూడు సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నాడు, అతడికి ఒప్పందాలు చేసుకోవడం అతడికి చాలా కష్టం అని ట్రంప్ అన్నారు.
టెల్ అవీవ్‌ని నాశనం చేస్తామన్న ఇరాన్.. సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయిల్..
ఎప్పుడైతే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసిందో అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో నిత్యం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా ఇరాన్, హమాస్, హిజ్బుల్లా కలిసి పనిచేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్‌కి భారీ హెచ్చరికలు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయిల్‌ని నాశనం చేస్తామని ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) జనరల్ ఇబ్రహీం జబ్బారి నుండి తాజా హెచ్చరికలు వచ్చాయి. ‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 సరైన సమయంలో, ఖచ్చితత్వంతో ఇజ్రాయిల్‌ని నాశనం చేయడానికి, టెల్ అవీవ్-హైఫాలను నేలమట్టం చేయడానికి నిర్వహిస్తాము’’ అని మేజర్ జనరల్ జబ్బారి హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియర్ సార్ స్పందించారు. ‘‘ యూదు ప్రజలు చరిత్ర నుంచి ఏదైనా నేర్చుకున్నారంటే అది ఇదే. మీ శత్రువు మిమ్మల్ని నానశం చేస్తామని చెబితే నమ్మంది- మేము అందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని అన్నారు.
రేపు హైఓల్టేజ్ మ్యాచ్.. పాకిస్తాన్ టీంకు కొత్త కోచ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. రేపు భారత్-పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పై ఓటమిని చవి చూసింది. దీంతో.. రేపు టీమిండియాతో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకం కానుంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ టీంకు కొత్త కోచ్‌ను నియమించుకుంది. పాకిస్తాన్ టీం కొత్త కోచ్‌గా ముదస్సర్ నాజర్ బాధ్యతలు చేపట్టారు. రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. ఎలాగైనా భారత్ పై గెలవాలనే ఉద్దేశంతో కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. క్రికెట్ కోచ్‌గా అనుభవం ఉన్న నాజర్‌కు దుబాయ్‌లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. గతంలో పాకిస్తాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్‌గా చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా.. దుబాయ్ లోని ఐసీసీ గ్లోబల్ అకాడమీలోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దుబాయ్ పిచ్ పై భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ విజయానికి అతను కీలకంగా మారతాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. టీం ఇండియాపై నెగ్గాలనే కొత్త కోచ్ ను నియమించుకున్నారు. కోచ్ ఆకిబ్ జావేద్‌ను తప్పించి.. నాజర్‌కు కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
ఫోటో ఇచ్చి అందరికీ పనిచెప్పిన జగ్గూ భాయ్
సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పటికే చాలా మంది స్టార్లుగా మారిపోయారు. ఇక సెలబ్రిటీలకు కూడా ఇది ఓ అద్భుతమైన వేదికగా మారింది. దాంతో చాలా మంది హీరోలు, హీరోయిన్లతో పాటు సపోర్టింగ్ రోల్స్ చేసే నటులు కూడా తమ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అలాంటి వాళ్లలో జగపతిబాబు కూడా ఒకరు. తాజాగా జగపతిబాబు తన ఎక్స్ అకౌంట్‌లో ఓ గ్రూప్ ఫోటోను షేర్ చేసి, అందులో తను ఎక్కడ ఉన్నానో కనుక్కోవాలని అభిమానులకు ఛాలెంజ్ విసిరారు. ఈ ఫోటోని చూసిన ఫ్యాన్స్‌కు మొదట మాత్రం అతడిని గుర్తించడంలో కాస్త కష్టం వచ్చింది. కానీ, చివరికి ఫ్యాన్స్‌నే ఆయన స్థానాన్ని కనుగొన్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికపై ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జగపతి బాబు, కేవలం సినిమాల గురించి కాకుండా తన పర్సనల్ లైఫ్, వెకేషన్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ, తన ఫ్యాన్స్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల తన డైట్ గురించి కూడా కొన్ని పోస్టులు చేసిన జగపతి బాబు, రోడ్‌సైడ్ దాబాలో భోజనం చేసేటప్పుడు తీసిన ఫోటోలు కూడా షేర్ చేసి తన సింప్లిసిటీ జీవితం గురించి తెలియజేశారు.
బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా.. రెహమాన్ కు భారీ రెమ్యునరేషన్.. రెండు చిన్న సినిమాలు తీసేయొచ్చు
రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తొలి సినిమా ‘ఉప్పెన’తో 100కోట్ల విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు, రామ్ చరణ్‌తో సినిమా అనే మాటనే ప్రేక్షకుల మధ్య ఆసక్తిని నెలకొల్పింది. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు తన గురువు చిత్రాల తరహాలో మంచి సినిమా అందిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది విడుదల చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే చాలా కాలం ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు షెడ్యూల్స్‌ను ముమ్మరంగా పూర్తి చేసి, ఆగస్టు నెలలో షూటింగ్‌ను ముగించాలని యోచిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రెహమాన్ ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన పాటలను ట్యూన్ చేసి, ఆయన స్టైల్ సంగీతాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రెహమాన్ ఇచ్చే పారితోషికం సుమారు రూ.8 కోట్లు అని తెలుస్తోంది. రెహమాన్‌తో కలిసి బుచ్చిబాబు ఇప్పటికే కొన్ని పాటలను ముందే సిద్ధం చేసి, రికార్డింగ్ చేయడం ప్రారంభించారని సమాచారం. ఇందువల్ల, సినిమాకు ఆలస్యం లేకుండా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.