రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. కర్నూలు జిల్లా పర్యటనకు రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడంతో పవన్ కల్యాణ్ పర్యటన ముగియనుంది.. రేపు ఉదయం 9.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. ఇక, కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి పూడిచెర్ల చేరుకోనున్నారు పవన్.. పూడిచెర్లలో ఫారంపాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రైతు సూర రాజన్న పొలంలో ఫారం పాండ్‌కు భూమి పూజ చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.. ఇక, పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని గురువారం రోజు కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, భద్రత గురించి ఎస్పీతో చర్చించారు. సుమారు సభకు 4వేల మంది వరకు హాజరు కానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, పూడిచర్లలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కర్నూలు ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
సీఎం చంద్రబాబుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల లేఖ..
ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హత నిర్ధారణ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖ రాశారు.. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అర్హత నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కు అనుగుణంగా రాష్ట్రంలో కుడా నిర్ణయం తీసుకోవాలని సీఎంను లేఖలో కోరారు.. క్రిమీ లేయర్ ఓబీసీ రిజర్వేషన్ లకు సంబంధించిన అంశం.. ఓబీసీల వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా ఎక్కువగా ఉండడంతో పాటు 40 ఏళ్ల లోపు ఉద్యోగం ఉన్న గ్రూప్ A అధికారుల పిల్లలు క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారు. క్రిమీ లేయర్ వర్తిస్తే వారు సామాజికంగా బాగా అభివృద్ధి దిశలో ఉన్నట్టుగా పరిగణించి ఎలాంటి రిజర్వేషన్లు అమలు కావు. కల్నల్ లేదా ఇతర హోదాలో ఉన్నవారి పిల్లలకు కూడా ఈ రిజర్వేషన్లు ఉండవు. 8 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు నాన్ క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల వర్గీకరణను వేతన శ్రేణుల ఆధారంగా ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ అర్హతను నిర్ధారించడానికి సరైన ప్రాతిపదిక ఉండాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. ఇతర బీసీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించాల్సిన అవసరాన్ని లేఖలో పేర్కొన్నారు.. టీడీపీ బీసీ శాసనసభ్యులు, ప్రస్తుత రాష్ట్ర వర్గీకరణ వ్యవస్థ స్థిరంగా లేకపోవడంతో ఓబీసీ రిజర్వేషన్ల అర్హతను నిర్ధారించడంలో అస్పష్టత, సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు..
బెయిల్ వచ్చినా పోసాని విడుదలకు కలగని మోక్షం..!
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదలకు మోక్షం మాత్రం కలగడంలేదు.. వైసీపీ హయాంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని.. కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను.. వారి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించిన వ్యవహారంలో.. పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి.. పీటీ వారెంట్లపై పలు పీఎస్‌లు, కోర్టులు, జైళ్లను తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఇప్పటికే కొన్ని కేసుల్లో.. ఈ రోజు సీఐడీ కేసులో బెయిల్ రావడంతో.. పోసాని విడుదలకు మార్గం సుగమం అయినట్టు అయ్యింది.. కానీ, పోసాని కృష్ణమురళి జైలు నుండి విడుదల ఇంకా ఆలస్యం అవుతోంది.. గుంటూరు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ వచ్చినా.. జైలు నుండి విడుదలకు మోక్షం కలగడం లేదు.. అయితే, ఈ రోజు బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో జైలు నుండి పోసాని కృష్ణ మురళి విడుదల కాలేకపోయారు.. రేపు విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు.. మరోవైపు, బెయిల్ వచ్చినా పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే వరకు అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు.. ఏ క్షణంలో పీటీ వారెంట్‌తో.. ఏ స్టేషన్ పోలీసులు వస్తారో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కానీ, ప్రస్తుతానికి ఎలాంటి కేసులు లేవని చెబుతున్నారు న్యాయవాదులు.. కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై వివిధ ప్రాంతాల్లో మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి.. అయితే, ఇప్పటికే కొన్ని కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయినా.. మరికొన్ని కేసుల్లో రిమాండ్‌లో ఉండడం.. అన్ని కేసులో బెయిట్ దక్కకపోడం.. మరికొన్ని కేసుల్లో 35 (3) Bns ఫాలో అవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. పోసాని జైళ్లలోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే రేపు గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల అవుతారని చెబుతున్నారు.
గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది..
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది అని ఆరోపించారు. వాళ్ల హయాంలో బడ్జెట్‌లో 38 శాతం ఖర్చు పెట్టలేదు, ఆ నిధులను ఎవరికి కేటాయించారు అని అడిగారు. పదేళ్ల పాటు బడ్జెట్‌లలో చాలా నిధుల్ని ఖర్చు పెట్టలేదు, ఆ నిధులకు సంబంధిత వర్గాలకు ఇవ్వలేదు.. వాళ్ల హయాంలో బడ్జెట్ వాస్తవానికి విరుద్ధంగా ఉంది.. బడ్జెట్ ఊహల్లోనో, భ్రమల్లోనో ఉండకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించింది.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని మా ప్రభుత్వం భావించింది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక, మీలాగా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మీలాగా పెంచితే.. ఈసారి బడ్జెట్ 4 లక్షల 18 వేల కోట్లు అయ్యేది.. మేము అలా చేయకుండా వాస్తవాల మీద బడ్జెట్ పెట్టామన్నారు. మీకు ఆదాయం ఉన్నా.. లేకున్నా పెంచుకుంటూ పోయారు.. మీలాగే మేము కూడా ప్రజలను భ్రమల్లో పెట్టొద్దని వాస్తవాలు చెప్పుతున్నాం.. పెడతాం అంటే వస్తారు.. కొడతాం అంటే పారిపోతారు పేదలు, సామన్య ప్రజలు.. ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు.. చేయాల్సింది చెప్ధమని.. బడ్జెట్ కుదించి పెట్టాం.. చేయగలిగేవే బడ్జెట్ లో పెట్టాం.. హరీష్ రావు చెప్పిన మాటలు విన్నాకా.. ఇవన్నీ చెప్పాలని డిసైడ్ అయ్యా.. మీకు డిసిప్లేన్ లేదంటూ మండిపడ్డారు. అందుకే అడ్డగోలుగా ఖర్చు చేశారు.. జీఎస్టీ గ్రోత్ దేశం కంటే తక్కువ ఉంది అన్నాడు హరీష్ రావు.. బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ 8.4గా ఉంది.. ఇప్పుడు జీఎస్టీ 12.3 శాతం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయించాలి..
మూసీ ప్రక్షాళన, మురుగునీటి శుద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన.. శుభ్రమైన తాగునీటి కోసం తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో పట్టణీకరణ వేగంగా పెరిగిపోతుండటంతో.. నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇక, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు, సేవలను అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను గుర్తించి కేంద్రం స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాల కింద నిధులు ఇవ్వడం ఎంతో ప్రశంసనీయమైందన్నారు.
ఇకపై “భాష” పేరుతో విభజన జరగకూడదు..
‘హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు’’ అని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానంలో(ఎన్‌ఈపీ)లో భాగంగా త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడుతో పెరుగుతున్న వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం భాషా సమస్యల్ని తీసుకువస్తున్నాయని ఆరోపించారు. రాజ్యసభలో ప్రసంగించిన అమిత్ షా, ప్రతీ భారతీయ భాష దేశానికి ఒక నిధి లాంటిదని అన్నారు. హిందీ ఏ భారతీయ భాషతోనూ పోటీ పడదని, అది ఇతర భాషలకు స్నేహితుడు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ నుంచి రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్లు వారి సొంత భాషల్లోనే జరుగుతాయని రాజ్యసభకు తెలియజేశారు.
ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్) జిల్లాలోని ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ఔరంగజేబు సమాధిని జాతీయ స్మారక చిహ్నాల జాబితా నుండి తొలగించాలని భారత పురావస్తు సర్వే (ASI)ని ఆదేశించాలని కార్యకర్త కేతన్ తిరోద్కర్ తన పిటిషన్‌లో కోర్టుని కోరారు. ఔరంగజేబు సమాధి ఏఎస్ఐ చట్టం 1958లోని సెక్షన్ 3కి అనుగుణంగా లేదని వాదిస్తోంది. ఈ సెక్షన్ కొన్ని పురాతన స్మారక చిహ్నాలను, పురావస్తు ప్రదేశాలను జాతీయ ప్రాముఖ్యత కలిగినవిగా పేర్కొంటుంది. ఔరంగజేబు సమాధి 14వ శతాబ్ధపు చిష్టి సాధువు షేక్ జైనుద్దీన్ దర్గా సముదాయంలో ఉంది. దీనికి సమీపంలోనే ఔరంగజేబు కొడుకుల్లో ఒకరి సమాధితో పాటు హైదరాబాద్ మొదటి నిజాం అసఫ్ జా 1, అతడి కుమారుడు నాసిర్ జంగ్ సమాధులు కూడా ఉన్నాయి. ఈ సమాధులను కూడా కూల్చివేయాలని పిటిషన్‌లో కోరుతున్నారు.
ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలనం..
రేపటి నుంచి ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం కాబోతుంది. ఈ పండగ కోసం భారత్ అభిమానులే కాకుండా.. అన్ని దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కూడా ఐపీఎల్ కోసం చూస్తున్నారు. కాగా.. రేపు ప్రారంభ మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈసారి అట్టడుగున నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. కోహ్లీకి కూడా తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు.. వారి వల్ల ఆ జట్టుకు పెద్దగా ఒరిగేదేమీ ఉందని తెలిపారు. అందేకే టేబుల్‌లో పదో స్థానంలో నిలిచే అర్హతలు ఈ జట్టుకే ఎక్కువగా ఉన్నాయని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ జట్టుకు భారీ షాక్..
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గైర్హాజరవనున్నట్లు సమాచారం. భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆయన జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జట్టులో ఆటగాడైన మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఈ విషయాన్ని తెలిపింది. కేఎల్ రాహుల్, అతని భార్య బాలీవుడ్ నటి అతియా శెట్టి 2024 నవంబర్‌లో తమ తొలి బిడ్డను ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రాహుల్ ప్రస్తుత సమయాన్ని కుటుంబానికి కేటాయించే అవకాశం ఉందని హీలీ పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్ LSTNR స్పోర్ట్ లో మాట్లాడిన ఆమె, “రాహుల్ మొదటి రెండు మ్యాచ్‌లు మిస్ కావొచ్చు.. అతను జట్టుకు చాలా విలువైన ఆటగాడు. టీ20 క్రికెట్‌లో అతని అనుభవం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఉపయోగపడుతుంది” అని తెలిపింది.
చరణ్ బర్త్‌డే స్పెషల్ రెడీ అవుతోంది!
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఆర్‌సీ 16 మేకర్స్. గేమ్ చేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత, రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ దాదాపు చాలా ఆటలలో ఆటగాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. అయితే, మార్చి 28వ తేదీన రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వడం కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ఫోటోషూట్ నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఫస్ట్ లుక్ లేదా బర్త్‌డే స్పెషల్ పోస్టర్ ఏదైనా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా, అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పటికే ముంబై వెళ్లి వచ్చిన రామ్ చరణ్ తేజ, ప్రస్తుతం ఫోటోషూట్‌లో బిజీగా గడుపుతున్నాడు.