రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. 48 గంటల్లోనే డబ్బులు..!
రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పర్యటనలో ఆయన రైతుభరోసా కేంద్రం ప్రారంభించారు.. అనంతరం రైసు మిల్లును కూడా పరిశీలించి, ధాన్యం సేకరణపై రైతులతో మాట్లాడారు.. అక్కడ రైతులకు టెక్నాలజీపై ఉన్న అనుభవం అడిగి తెలుసుకున్నారు.. ఫోన్ లో మెసేజ్ లు చదవడం పై రైతుల అవగాహన ఏ పాటిదో అడిగి తెలుసుకున్నారు.. ధాన్యం సేకరణపైన ప్రత్యేక దృష్టి సారించారు.. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
శ్రీవారి భక్తులకు గమనిక.. మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల మార్పు..
కలియు ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్య గమనిక.. వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలు ఖరారు చేసిన నేపథ్యంలో.. మార్చి నెల శ్రీవాణి, ఎస్ఈడీ కోటా విడుదల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.. దీనికి సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అలాగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.. ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీల్లో మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. డిసెంబర్ 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు పేర్కొంది.. ఇక, డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తామని.. అదే, రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది టీటీడీ.. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఏర్పాట్లపై టీటీడీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది.. ఏర్పాట్లపై రివ్యూ సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో.. కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే..
కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు..
ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ECIR నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది. కాగా.. గురవారం ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు.. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు.
మిస్టరీగా మారిన యువతి మిస్సింగ్ కేసు.. 50 రోజులు దాటినా లభించని ఆచూకీ
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నుంచి మిస్సింగ్ అయిన యువతి కేసు మిస్టరీగా మారింది. ఆమె కనిపించకుండా పోయి 50 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. హాస్టల్ నుంచి తన మామయ్య ఇంటికి అని బయలుదేరిన విద్యార్థిని మధ్యలోనే అదృశ్యం అయింది. మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినా నేటికీ జాడ దొరకకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీ నగర్‌కు చెందిన సౌమ్య కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. మలక్ పేట్‌లోని బీసీ హాస్టల్‌లో ఉంటున్న సౌమ్య.. అక్టోబర్ 31న చింతల్‌కుంటలో ఉంటున్న తన మేనమామ ప్రహ్లాద్‌కు ఫోన్ చేసి సాయంత్రం ఇంటికి వస్తానని తెలిపింది. 6 గంటలకు మరోసారి కాల్ చేసి హాస్టల్ నుంచి బయలుదేరానని చెప్పింది. రాత్రైనా సౌమ్య ఇంటికి రాకపోవడంతో తన మేనమామ కంగారుపడ్డాడు. వెంటనే అమ్మాయి స్నేహితులకు, బంధువులకు కాల్ చేసి సౌమ్య గురించి ఆరా తీశాడు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మరుసటి రోజు తల్లిదండ్రులు అలివేలు, ఆంజనేయులు హాస్టల్‌కు వెళ్లి తన కూతురు గురించి వాకాబు చేశారు. 31వ తేదీన సాయంత్రమే హాస్టల్ నుంచి వెళ్లిందని సిబ్బంది చెప్పారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నవంబర్ ఒకటవ తేదీన మలక్ పేట్ పోలీస్ స్టేషన్‌లో సౌమ్య మిస్సింగ్ అయిందని ఫిర్యాదు చేశారు. అంతేకాక ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులుకు వివరాలు అందించారు.
చట్టాలు భర్తలను దోచుకునే సాధనాలు కాదు.. భరణంపై సుప్రీం కీలక వ్యాఖ్య
బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ ఆత్మహత్య తర్వాత.. మహిళలు చట్టాలను ఉపయోగించుకుని చేస్తున్న అరాచకాలు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. తన భార్య, అత్త కుటుంబ సభ్యులు పెట్టిన వేధింపులను 90 నిమిషాల వీడియో ద్వారా.. 40 పేజీల లేఖలో తెలియజేసి అతుల్ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మహిళలు చట్టాలను అడ్డం పెట్టుకుని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. తాజాగా భరణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ చట్టాలలోని నిబంధనలు మహిళలను రక్షించడానికి మాత్రమేనని, అంతేతప్ప వారి భర్తలను శిక్షించడం, బెదిరించడం, ఆధిపత్యం చెలాయించడం లేదా బలవంతంగా వసూలు చేయడానికి కాదని సుప్రీంకోర్టు వ్యా్ఖ్యానించింది. విడిపోయిన భార్యకు ఒక నెలలో రూ.12 కోట్ల శాశ్వత భరణం చెల్లించాలంటూ ధర్మాసనం ఆదేశించింది. విడిపోయిన భార్య.. తన భర్త సంపాదన నుంచి సమానమైన శాశ్వత భరణం కోరింది. ఈ మేరకు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలు బలవంతంగా భర్తల నుంచి వసూలు చేయడానికి ఉద్దేశించినవి కావని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, పంకజ్ మిథాల్ మాట్లాడుతూ.. హిందూ వివాహాన్ని ఒక పవిత్రమైన బంధంగా పరిగణిస్తారని.. ఒక కుటుంబానికి పునాదిగా పరిగణించబడతారన్నారు. అంతేతప్ప వివాహ వ్యవస్థ ‘‘వాణిజ్య వెంచర్’’ కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. మహిళలు తమ చేతుల్లో ఉన్న చట్టాలను సంక్షేమానికి ఉపయోగించుకోవాలి కానీ.. భర్తలను శిక్షించడం కోసమో.. బెదిరించడం కోసమో.. లేదంటే ఆదిపత్యం చెలాయించడం కోసమో కాదని బెంచ్ పేర్కొంది. పోలీసు అధికారులు కూడా కొన్నిసార్లు సెలెక్టివ్ కేసుల్లో త్వరగా చర్య తీసుకుంటారని.. భర్త లేదా అతని బంధువులను కూడా అరెస్టు చేస్తున్నారని బెంచ్ ధ్వజమెత్తింది.
ఆస్పత్రులు ‘‘ఆధునిక సమాజంలో దేవాలయాలు’’.. దాడులు చేస్తే సహించొద్దు..
ఆసుపత్రులు “ఆధునిక సమాజంలోని దేవాలయాలు” అని, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా విధ్వంసం నుండి రక్షించబడాలని కేరళ హైకోర్టు నొక్కి చెప్పింది. డిసెంబర్ 07న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రి ధ్వంసం చేసి, రూ. 10,000 నష్టానికి కారణమైన కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. బెయిల్ షరతుల్లో భాగంగా, నిందితుడు కోర్టుకు రూ. 10,000 డిపాజిట్ చేయాలని, ఒక వేళ నిర్దోషిగా తేలితే ఆ డబ్బులను తిరిగి పొందుతాడని, నేరం రుజువైతే ఈ మొత్తాన్ని ఆస్పత్రికి జరిగిన నష్టాన్ని భర్త ఉపయోగించబడుతుందని కోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేయడానికి ఇలాంటి షరతులను చేర్చేందుకు రాష్ట్ర శాసనసభ ‘‘కేరళ హెల్త్‌కేర్ సర్వీస్ పర్సన్స్ అండ్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ (హింస నిరోధం మరియు ఆస్తులకు నష్టం) చట్టం, 2012’’లో సవరణలు చేయాలని జస్టిస్ కున్హికృష్ణన్ సూచించారు.
కొత్త ఈవీ చేతక్ లాంచ్ చేసిన బజాజ్.. ఫీచర్లు ఇదిగో..
ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది.. 2024కి గుడ్‌బై చెప్పి.. 2025కి ఆహ్వానం పలకబోతోన్న వేళ.. ఈవీ రంగంలో కొత్త వెహికల్స్ రాబోతున్నాయి.. ఈవీ కార్లు, ఈవీ స్కూటర్లు, ఈవీ బైక్‌లు ఇలా.. మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. ఇక, మరో అడుగు ముందుకు వేసిన బజాజ్ సంస్థ కొత్త చేతక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ధర రూ.1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2025 బజాజ్ చేతక్ 35 సిరీస్ లాంచ్ చేసింది.. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లలో అనేక పెద్ద మార్పులను తీసుకువచ్చింది. కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.. కొత్త అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది, కొత్త ఫీచర్లను కూడా జోడించారు.. బజాజ్ చేతక్ 35 సిరీస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో అనేక పెద్ద మార్పులను తీసుకువచ్చింది. 2025 బజాజ్ చేతక్ ఇప్పుడు మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది.. 3501, 3502 మరియు 3503ను విడుదల చేసింది.. కొత్త చేతక్ 3503 ధర రూ. 1.20 లక్షలు కాగా, 3502 ధర రూ. 1.27 లక్షలు. టాప్-స్పెక్ చేతక్ 3501 ధరను ప్రకటించాల్సి ఉంది.. వీటిని ఆన్‌లైన్‌లో మరియు దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లలో బుకింగ్ ప్రారంభించింది.. అంతే కాదు ఈ నెల చివరి నుండి 3501 వేరియంట్‌ల డెలివరీ కూడా ప్రారంభించబోతోంది.. జనవరి 2025 నుండి 3502 వేరియంట్లు వినియోగదారులకు అందజేసేందుకు సిద్ధమైంది..
అల్లు అర్జున్ కి మరో షాక్.. హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు
ఈ డిసెంబర్ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాదులో ఉన్న సింగిల్ స్క్రీన్స్ తో పాటు కొన్ని మల్టీప్లెక్స్ లలో పుష్ప సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు. అందులో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం, హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలిసి ఆ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలి వచ్చారు. అల్లు అర్జున్ ను కలిసేందుకు ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే తాజాగా చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయం మీద షోకాజు నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షో కాజ్ నోటీసులు జారీ చేశారు.. ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్సు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే తాజాగా ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై NHRCకి ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారం మోజులో పడి ప్రజల ప్రాణాలు తీశారని ఫిర్యాదుదారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అని పేర్కొన్న ఫిర్యాదు దారు పుష్ప-2 చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎంతైనా రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ చేంజర్’ అబ్బా!
రిలీజ్ కంటే ముందే రామ్ చరణ్ తేజ అనేక రికార్డులు బద్దలు కొట్టే విధంగా దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా బయలుదేరి వెళ్లారు రామ్ చరణ్, సినిమా నిర్మాత దిల్ రాజు. తాజాగా రామ్ చరణ్ కటౌట్ ఒకటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అదేంటంటే విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్ లో 250 అడుగుల భారీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ కటౌట్ లాంచ్ చేయబోతున్నారు. ఇది ఇండియాలోనే ఒక లార్జెస్ట్ కటౌట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు 230 ఫీట్లతో రికార్డు ఉండేది. దాన్ని మరో 20 అడుగులతో ఈ రాంచరణ్ కటౌట్ బ్రేక్ చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.