ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్..! టీడీపీ, జనసేన ఓవైపు..! బీజేపీ మరోవైపు..?
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏపీటీఎఫ్ తరపున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘు వర్మకు టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించాయి. రఘు వర్మకు ఓట్లేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశాయి. అయితే , కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. PRTU నుంచి పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడుకి ఇప్పటికే RSS మద్దతు ప్రకటించింది. శ్రీనివాసులు నాయుడు తరపున బీజేపీ నేత మాధవ్ సహా పలువురు ప్రచారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు ఉమ్మడిగా వ్యవహరించాల్సిన చోట వేరువేరు అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారియింది.. అయితే, బీజేపీ కూడా కూటమి బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. మరోవైపు, ఆర్.ఎస్.ఎస్. నిర్ణయం మేరకు బీజేపీ నాయకత్వం ఇప్పటికీ శ్రీనివాసులు నాయుడు పక్షాన నిలిచింది. కూటమి పార్టీల మధ్య తొలిసారి ఇటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో రావడం ఇదే తొలిసారి.
వంశీ కేసులో పొన్నవోలు కీలక వ్యాఖ్యలు..
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కోర్టులో కీలక వాదనలు జరిగాయి.. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని.. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సత్య వర్ధన్.. ఎవరు దాడి చేశారు..? ఎక్కడ దాడి చేశాడు..? అనేది చెబుతారు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.. ఇక, ఈ కేసు విచారణ తర్వాత వంశీ కేసులో వాదనలు వినిపించిన మాజీ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించాం అన్నారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారన్న ఆయన.. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు.. సీన్ రీ కనస్ట్రక్ట్ కోసం సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి.. వంశీ అవసరం లేదన్నారు.. ఇక, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదన్నారు పొన్నవోలు.. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన అని పేర్కొన్నారు.. కేసుతో నాకు ఏ సంబంధమూ లేదు అని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారని వెల్లడించారు.. కారుకి నాకు సంబంధం లేదని అఫిడవిట్ లో వంశీ తెలిపారు.. ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉందని పేర్కొన్నారు. కేసు వెనక్కి తీసుకొంటూ సత్యవర్ధన్ స్టేట్ మెంట్ ఇస్తే.. అతనిపై కూడా ఈ నెల 11న కేసు నమోదు చేశారని తెలిపారు మాజీ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి.
మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి.. ప్రపంచం మొత్తం ఇప్పుడు మన వైపు చూస్తోంది..
హిందూ ధర్మం సనాతన ధర్మం.. మానవ సేవే మాధవ సేవ.. సాటి మనుషులకు, సమాజానికి సేవ చేస్తే, ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతోందన్నారు మంత్రి నారా లోకేష్. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్‌పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుందన్నారు.. మన సంస్కృతిలో ఆలయాలు, పండుగలు, పూజలు అనేది కీలకమైన భాగం అని వెల్లడించారు.. ఎంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చినా మానవ సమాజాన్ని నడిపించేది ఆ దేవదేవుడే. ఇస్రో శాస్త్రవేత్తలు సైతం.. వారి ప్రయోగం సక్సెస్ కావాలని చెంగాలమ్మ ఆలయంలోనో.. తిరుమల శ్రీవారి ఆలయంలోనో ముందు రోజు పూజలు చేస్తారు. నమ్మకం మాత్రమే గాక ఇదొక నిజం. అందుకే ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు, దేవాలయ వ్యవస్థలు, సంస్ధలు కృషి చేయాలి.. దీని ద్వారా సమాజంలో మంచిని పెంచవచ్చన్నారు.
మంత్రుల పేషీల్లో ఫేక్ నియామకాలు..! వెలుగులోకి సంచలన విషయాలు..
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఒకే మంత్రి పేషీలో నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించినట్టు సమాచారం. సోషల్ మీడియా అసిస్టెంట్ నియామక ప్రక్రియ బాధ్యత ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ బయటకు వచ్చింది.. దీంతో నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని పెద్ద కుంభకోణం జరిగిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.. లేని పోస్టుతో జూనియర్ అసిస్టెంట్ పోస్టు సృష్టించి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో బయటకు వచ్చింది.. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ ఆర్డర్ ఎవరిచ్చారు..?ఎలా తయారు చేశారు..? అనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.. మొత్తంగా సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాల పేరుతో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే.. ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ఏడాది పాటు రజతోత్సవ వేడుకలు.. వారం రోజుల్లో నూతన కమిటీలు..
కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు చాలా విస్తృతంగా సమావేశం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ నాటికి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. “ఈ రోజు చాలా విస్తృతంగా, సుదీర్ఘంగా సమావేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మా పార్టీ ముఖ్యులు 30 మంది మాట్లాడారు. తెలంగాణకు ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణ కవచం.. గతంలో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో కేసీఆర్ గుర్తుచేశారు.. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదు.. ఎంతో మంది త్యాగాలు చేసి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. జలదృశ్యంలో మొదలైన పార్టీ 25 ఏట అడుగు పెడుతుంది. సంవత్సరం పాటు రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. గతంలో జరిగిన పోరాటాలు అన్నింటినీ గుర్తు చేస్తూ మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పృశిస్తూ మాకు దిశా నిర్దేశం చేశారు. మాకు అధికారమే పరమావధిగా పనిచేసే ఆలోచన లేదు. రజతోత్సవ నిర్వహణ కోసం వారం రోజుల్లో కొన్ని కమిటీలు వేయబోతున్నారు. పార్టీ సంస్థాగతంగా నిర్మాణము చేయాలి అనుకున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో ప్రతినిధుల సభ ఉంటుంది.” అని మాజీ మంత్రి తెలిపారు.
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు..
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు సందడి చేయనున్నాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ జరుగబోతోంది. తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కి 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ పోటీలకు సంబంధించిన అధికారిక ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక, సంస్కృతి, వారసత్వ, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కలిసి ప్రకటించారు.
పంజాగుట్ట ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట..
ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. రియాల్టర్ చక్రధర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫోన్ టాపింగ్ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. వీరు చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు పంపుతూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి 11 రోజులు అయ్యింది. బిజెపి తన తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని నేడు ప్రకటించింది.26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఒక బిజెపి నాయకుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టునున్నారు. ఇదిలా ఉండగా, చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ రేఖ గుప్తాను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఆమె షాలిమార్ బాగ్ నుండి ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవికి ఎంపికైన రేఖా గుప్త గురించి తెలుసుకుందాం. రేఖ గుప్తా ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యే. ఆమె ప్రస్తుతం ఢిల్లీ బిజెపి ప్రధాన కార్యదర్శిగా, బిజెపి మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. 50 ఏళ్ల రేఖ 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి. రేఖ కుటుంబం 1976లో ఢిల్లీకి మారింది. అప్పటికి ఆమె వయసు రెండేళ్లు మాత్రమే. దీని తరువాత, రేఖ ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య ఢిల్లీలో జరిగింది. రేఖా గుప్తా తన బాల్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరింది. దీని తరువాత, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించడంలో విజయవంతమైంది. 1995–96లో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దీని తరువాత, రేఖ తన చదువును LLB వరకు పూర్తి చేసింది.
కుంభమేళాలో స్నానం చేసిన ట్రంప్, కిమ్, ఎలాన్ మస్క్.. వైరల్ అవుతున్న వీడియో
మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. 45 రోజుల్లో 40 కోట్లకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఈసారి విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో మహా కుంభమేళాకు చేరుకుంటున్నారు. మకర సంక్రాంతి రోజున మూడు కోట్లకు పైగా ప్రజలు స్నానమాచరించారని చెబుతున్నారు. ప్రస్తుతం, మహాకుంభమేళా ఏఐ జనరేటెడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను మహా కుంభమేళాలో చూపించారు. ఏఐ వీడియోలో, ఎలోన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్, కిమ్, మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, విల్ స్మిత్, రిషి సునక్, జెండయా, టామ్ హాలండ్, జాన్ సెనా, జస్టిన్ ట్రూడో వంటి ప్రముఖులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. యూజర్లు ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో సంగంలో స్నానం చేస్తున్నట్లు మొదటగా చూపించారు.
మహా కుంభమేళాలో ‘ఓదెల 2’ టీజర్ లాంఛ్
తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’, 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి ఈ సినిమా సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. నాగ సాధు పాత్రలో తమన్నా ఫెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఇప్పుడు ఓదెల 2 మేకర్స్ ఎక్సైటింగ్ అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 22న కాశీ మహా కుంభమేళాలో లాంచ్ చేయనున్నారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధుగా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులను అలరించేలా బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని పెర్ఫామ్ చేయడానికి తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారని చెబుతున్నారు. ఓదెల2 భారీ బడ్జెట్, హై క్యాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఓదెల 2కి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
హీరోలకు లక్కీ గాళ్ రష్మిక మందన్న!!
ప్రజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి దడ పుడుతోంది. దానికి కారణం రష్మిక మందన్న బ్లాక్ బస్టర్స్ అందుకోవడమే. అలాంటి ఇలాంటి హిట్స్ కాదు.. హీరోల కెరీర్ నే మార్చే హిట్స్. ఎక్కడో కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంటరై.. తక్కువ టైంలో స్టార్ డమ్ తెచ్చుకోవడమే కాదు.. అక్కడి హీరోలకు లక్కీ గాళ్ అయిపోయింది. గుడ్ బాయ్, మిస్టర్ మజ్ను ఫెయిల్యూర్ కాస్త చిరాకు తెప్పించినా.. ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తోన్న హీరోయిన్ అంటే రష్మికనే. లవర్ బాయ్ రణబీర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీ యానిమల్. 900 క్రోర్ ప్లస్ కలెక్షన్లు వసూలు చేసిన యానిమల్ లో గీతాంజలిగా ఆకట్టుకుంది నేషనల్ క్రష్ రష్మిక. ఇక్కడ నుండి పట్టిందల్లా బంగారం అయ్యింది. పుష్ప2తో టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ బెండ్ తీసేందుకు తన వంతు స్టఫ్ ఇచ్చింది అమ్మడు. అంతేనా ఇప్పుడు ఛావా విషయంలో ఇదే మ్యాజిక్ రిపీట్ చేసింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందే ఛావా. విక్కీ కౌశల్ ఫెర్మామెన్స్ కు వంక పెట్టనక్కర్లేదు. ఇక ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక సెంట్ పర్సెంట్ ఫెర్మామెన్స్ అందించి.. బాలీవుడ్ హీరోలకు రియల్ గేమ్ ఛేంజర్ గా మారింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా 150 కోట్లు కొల్లగొట్టి.. రూ. 200 కోట్లకు పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు విక్కీ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ఉరి ఉంది. రూ. 300 ప్లస్ సాధించింది. మరీ ఛావాతో విక్కీ ఈ రికార్డులను తిరగరాస్తాడేమో చూడాలి. అలాగే బాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోలకు లక్కీ లేడీగా మారిన రష్మిక.. సికందర్ తో సల్మాన్ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ మాత్రమే కాకుండా.. వెయ్యి కోట్ల మూవీగా మారుస్తుందో లేదో? ఎందుకుంటే.. ఇప్పటి వరకు త్రీ ఖాన్స్ లో కండల వీరుడు తప్ప మిగిలిన ఇద్దరు థౌజండ్ క్రోర్ మార్క్ చూసిన వాళ్లే. ఈద్ సందర్భంగా విడుదల కాబోతున్న సికందర్ సినిమాతో సల్లూ భాయ్ కి రష్మిక గోల్డెన్ లేడీ మారుతుందేమో వేచి చూడాలి.