వైసీపీకి బిగ్ షాక్..! గ్రేటర్ విశాఖ పీఠంపై కూటమి గురి..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకు నేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన వెంటనే మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం విస్త్రతంగా జరిగింది. అయితే, సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.. ఆ గడువు మార్చి 18తో ముగుస్తుంది. దీంతో కూటమి పార్టీలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంటేషన్‌లోకి తెచ్చేశాయి. ఇప్పటికే వైసీపీ చేతిలో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఎన్డీఏ పక్షాలు కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం వంతు వచ్చింది. ఈ దిశగా చాలా తర్జనభర్జనలే జరిగాయి. సంఖ్యా బలం తక్కువగా వుండటం, బీసీ మహిళను అర్ధాంతరంగా పదవి నుంచి దించేస్తే ఎదురయ్యే నెగెటివ్ పబ్లిసిటీ వంటివి కూటమి పెద్దలు ఆలోచిస్తూ వచ్చారు. పైగా,ఏడాది కాలం కోసం అధికారం చేపడితే.. ఉన్న సమయం అంతా పట్టుసాధించడానికే సరిపోతుంది. ఈ లోపు ఎన్నికలను ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అధికార పార్టీపై వుండే సాధారణ వ్యతిరేకత ఎదురైతే మొదటికే మోసం అనే కోణంలోనూ చర్చ జరిగింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వాటికి ఆమోదం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్, రెగ్యులేషన్ యాక్డ్- 2025 డ్రాఫ్ట్ బిల్లును అఫ్రూవ్ చేసింది.. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్లకు ఇది వర్తింప జేయనున్నారు.. ఇక, సీఆర్డీఏ పరిధిలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు భూములు కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో ఎన్- 10 నుంచి ఎన్ 13 వరకు… E1 జంక్షన్ నుండి సీఆర్డీఏ సరిహద్దుల వరకు 1082 కోట్ల రూపాయలతో 400KV DC లైన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, బుడమేరు డివిజన్ కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ యంత్రాల రిపేర్లకు పరిపాలన అనుమతి జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఏపీలో స్టార్ట్ అప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 4.0కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. ప్రభుత్వ హామీ మేరకు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్‌లకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్… రాజధాని అమరావతి పునఃనిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోడీని ఆహ్వానించడం.. ఏపీ – తెలంగాణ మధ్య జల వివాదాలు.. మంత్రుల జిల్లా పర్యటనలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది..
వల్లభనేని వంశీకి మరో షాక్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన తుది విచారణ చేపడతామని పేర్కొంది.. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. ఈ కేసు దర్యాప్తు దశలో ఉందని వంశీకి బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది.. న్యాయమూర్తికి విన్నవించారు.. కిడ్నాప్ కేసులో కీలక ఆధారాలు ఉన్నాయని.. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయవద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు.. దీంతో, తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి.. మరోవైపు.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగియడంతో వల్లభనేని వంశీ మోహన్‌ని వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.. వంశీ రిమాండ్‌ను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. వంశీ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20వ తేదీన తుది విచారణ చేపట్టనున్నరట్టు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.. దీంతో, ఇటు రిమాండ్ ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించడం.. మరోవైపు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా వాయిదా పడడంతో.. వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది..
కేబినెట్ ముగిసిన తర్వాత సీఎం-డిప్యూటీ సీఎం ప్రత్యేక భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.. అయితే, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఛాంబర్ వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.. మరోవైపు ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ టూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న ఆయన.. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రధానిని ఆహ్వానించడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మారిన వైఎస్‌ఆర్ జిల్లా పేరు.. కేబినెట్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.. వైఎస్‌ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. అయితే, గతంలో కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. నేటి కేబినెట్ లో వైఎస్ఆర్ పేరుకు అదనంగా కడప పేరును చేరుస్తూ తీర్మానం చేశారు.. కాగా, ఉమ్మడి ఏపీకి రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెలికాఫ్టర్ దుర్ఘటనలో మరణించారు. ఈ నేపథ్యంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత వైఎస్‌ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పలు ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్ పేరు పెట్టడంతో పాటు.. వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న పేరును అందులోని కడపను తీసి వేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చేశారు.. అయితే, ఇప్పుడు కూటమి సర్కార్.. వైఎస్‌ఆర్ జిల్లాను మళ్లీ వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది..
బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..
బీసీ రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42 శాతం రిజ్వరేషన్లు కల్పించేలా బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ సందర్భంగా బీసీ అండ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ బిల్లు దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు. ఇక, బీసీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాట్లాడిన ఆయన.. స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కల్పించడం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.. ఈ నిర్ణయం దేశానికే ఒక ఆదర్శం అన్నారు. ఇక, బ్యాక్ వర్డ్ క్లాస్ అంటే సమాజానికి బ్యాక్ బోన్ అని పేర్కొన్నారు. బీసీ బిల్లును పక్కాగా రూపొందించాం.. బీసీ బిల్లుపై 15 మంది మాట్లాడారు.. అసెంబ్లీలో బీసీ బిల్లుపై సమగ్రంగా చర్చ జరిగింది.. బీసీ బిల్లుకు మతమపరమైన రంగు పూయొద్దని కోరారు. బీసీ బిల్లుకు న్యాయపరమైన చిక్కులు రాకపోవచ్చని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
కిస్మత్ పురలో ఉదయం హైడ్రా కూల్చివేతలు.. సాయంత్రానికి సీసీ రోడ్డు..
హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్ పురలో రెండు కాలనీలను కలిపే రహదారికపై అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. దీంతో పాటు సాయంత్రానికి అక్కడ సిమ్మెంట్ రోడ్డును వేశారు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు. అయితే, ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ – శ్రీ హర్షిత్ లే ఔట్‌ల మధ్య ఉన్న రోడ్డును ఆక్రమించి కట్టడంతో.. రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేతతో పరిసర కాలనీలకు రోడ్డు క్లియర్ అయింది. అయితే, రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను గత ఆరు నెలల క్రితం మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు. అయినా, మళ్ళీ తిరిగి అక్రమంగా శ్రీ హర్షిత్ లేఔట్ నిర్వాహకులు రోడ్డు నిర్మించారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో స్థాయిలో విచారించి రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను ఈరోజు ఉదయం హైడ్రా తొలగించింది. దీంతో పాటు మున్సిపాలిటీ అధికారులతో కలిసి సాయంత్రం వరకు సిమ్మెంట్ రోడ్డు వేయడంతో పరిసర ప్రాంతాల కాలనీలకు లైన్ క్లియర్ అయింది.
డీలిమిటేషన్పై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు..
మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి డిలిమిటేషన్ పై చిత్తశుద్ధి లేదు అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం లేదు.. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీ లిమిటేషన్ పై చెప్పాల్సింది గట్టిగా చెప్తాం.. ఇవాళ్టి అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టారో స్పష్టత లేదు అని వారు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న వివక్ష, అన్యాయంపై మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నామని హరీష్ రావు, కేటీఆర్ తెలిపారు. ఇక, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కంటే ముందే మేము గొంతు ఎత్తామని కేటీఆర్, హరీష్ రావు చెప్పుకొచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పాలసీపై కేంద్రానికి మేము చెప్తామని తెలిపారు. అలాగే, ఈ నెల 22వ తేదీన తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశంకు మా ప్రతినిధుల బృందం హాజరవుతుందని వెల్లడించారు.
నవంబర్‌లో వివాహం, డిసెంబర్‌లో విడిపోయాం.. కోర్టులో చెప్పిన రన్యా రావు భర్త
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి అరెస్టు నుండి మినహాయింపు కోరాడు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అతనికి కర్ణాటక హైకోర్టు గత మంగళవారం ఉపశమనం ఇచ్చింది. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా.. జతిన్ హుక్కేరి న్యాయవాది ప్రభులింగ నవాద్గి కోర్టులో తన క్లయింట్ వాదనను వినిపించారు. నవంబర్‌లో రన్యా రావుతో వివాహం చేసుకున్న జతిన్.. డిసెంబర్ నుండి విడివిడిగా జీవించడం ప్రారంభిచారని న్యాయవాది తెలిపారు. కొన్ని సమస్యల కారణంగా ఇద్దరూ విడిగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నట్లు న్యాయవాది ప్రభులింగ నవాద్గి కోర్టుకు చెప్పారు. ఇదిలా ఉండగా.. రన్యా రావు బెయిల్ పిటిషన్ పై సెషన్స్ కోర్టులో విచారణ మార్చి 19కు వాయిదా పడింది. కోర్టు, DRI న్యాయవాదికి అభ్యంతరాలు దాఖలు చేయాలని ఆదేశించింది. అభ్యంతరాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి చర్యలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది. కాగా.. మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రన్యా రావు నుంచి రూ.12.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. ఆమె నివాసంలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల విలువైన భారతీయ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాధమిక ఆధారాలతో రన్యా రావును పోలీసులు అరెస్టు చేశారు.
ఇండియాలో రైల్వే ఛార్జీలు పాకిస్తాన్, శ్రీలంక కంటే తక్కువ..
భారత రైల్వే ప్రయాణీకుల ఛార్జీలు పాశ్చాత్య దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ పనితీరుపై సభలో జరిగిన చర్చకు వైష్ణవ్ సమాధానమిస్తూ.. పొరుగు దేశాల కంటే భారతదేశంలో రైలు ప్రయాణీకుల ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక రైల్వే ఛార్జీలను ప్రస్తావించారు. అక్కడ రైల్వే ఛార్జీలు భారతదేశం కంటే 10-15 శాతం ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వేలు తమ ప్రయాణీకులకు అతి తక్కువ ధరలకు సురక్షితమైన, నాణ్యమైన సౌకర్యాలను అందించడానికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. మరోవైపు.. విద్యుదీకరణ కారణంగా రైల్వేలు ప్రయోజనాలను పెంచుకొని.. ప్రయాణీకుల సంఖ్య, సరుకు రవాణా పెరిగినా.. ఇంధన ఖర్చులు స్థిరంగా ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణపై బిజెపి ఎంపీలు ప్రశంసలు కురిపించారు. రైల్వే స్టేషన్లు ఇప్పుడు విమానాశ్రయాల మాదిరిగా మారాయని అన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌గా మారాయని.. దేశంలో 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని.. బుల్లెట్ రైలు కల కూడా త్వరలో సాకారం అవుతుందని ఆయన అన్నారు. హైడ్రోజన్ శక్తితో రైళ్లను నడపడానికి ప్రయోగాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ సంజయ్ సేథ్ తెలిపారు.
19 మంది మావోలు లొంగుబాటు.. 9 మందిపై రూ.28 లక్షల రివార్డ్
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 19 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ. 28 లక్షల రివార్డు ఉంది. పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ అధికారుల ముందు వీరు లొంగిపోయారు. వారు తమ మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ చెందడం, సీనియర్ క్యాడర్లు అమాయక గిరిజనులను దోపిడీ చేయడం, నిషేధిత సంస్థలో పెరుగుతున్న విభేదాల కారణంగా వారు లొంగిపోయినట్లు చెప్పారు. కాగా.. ఈ విషయాన్ని బీజాపూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లందరూ ఆంధ్ర ఒడిశా బోర్డర్ (AOB) డివిజన్, మావోయిస్టుల పామెడ్ ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో ఉన్నారని యాదవ్ పేర్కొన్నారు. లొంగిపోయిన నక్సలైట్లలో దేవ పదం (30), అతని భార్య దులే కలాము (28) మావోయిస్టు బెటాలియన్ నంబర్ 1లో సీనియర్ సభ్యులుగా ఉంది. వారి తలపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. ఇక, ఏరియా కమిటీ సభ్యుడు సురేష్ కట్టం (21) తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. అలాగే లొంగిపోయిన నక్సలైట్లలో ఒక్కో తలపై రూ. 2 లక్షల రివార్డు ఉండగా, ఐదుగురు నక్సలైట్ల తలపై ఒక్కొక్కరికి రూ. 1 లక్ష రివార్డు ఉంది.
ఐపీఎల్‌లో అమ్ముడుపోని శార్దూల్ ఠాకూర్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఈ జట్టులోకి..!
నవంబరులో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోకుండా ఉండిపోయాడు. అయితే.. ఇప్పుడు శార్దూల్‌కు ఐపీఎల్ 2025లో ఆడే అవకాశం లభించనుంది. దేశీయ క్రికెట్‌లో బ్యాట్, బంతితో బాగా రాణిస్తున్న శార్దూల్.. ఐపీఎల్‌లో తన ప్రతిభను చూపించే అవకాశం రానుంది. అయితే.. ఈ సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గాయాలతో సతమతమవుతోంది. జట్టులోని ముగ్గురు పేసర్లు గాయపడటంతో శార్దూల్ ఠాకూర్‌కు LSGలో అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్ వంటి ప్రధాన పేసర్లు గాయపడ్డారు. దీంతో.. శార్దూల్‌కు జట్టు తరుఫున ఆడే అవకాశం లభించనుంది. ఈ నేపథ్యంలో శార్దూల్ ఇటీవల LSG శిక్షణా శిబిరంలో కనిపించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. అతను LSG ప్రాక్టీస్ జెర్సీని ధరించి శిక్షణ తీసుకుంటున్నట్లు రిపోర్టులు ఉన్నాయి. శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్‌లో అనేక జట్ల తరపున ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ వంటి జట్లతో ఆడాడు. ఇప్పుడు LSG తరపున ఆడే అవకాశం ఉంది. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ కూడా LSG యజమాని జట్టుగా ఉంది. శార్దూల్ ఇటీవల LSG ఆటగాళ్లతో హోలీ జరుపుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ LSG శిక్షణ కిట్ ధరించిన చిత్రాలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఫ్రాంచైజీ ఇంకా ధృవీకరించలేదు.
ఏంటి రోహిత్.. అంత కోపమెందుకు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని టీమ్స్ లో కొత్త ఆటగాళ్ల రాకతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. టోర్నమెంట్ మొదటి రెండు రోజుల్లోనే రసవత్తరమైన మ్యాచ్‌లు ఉండబోతుండటంతో క్రికెట్ లవర్స్ ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. మార్చి 22న ఐపీఎల్ 2025 గ్రాండ్ ఓపెనింగ్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. మరుసటి రోజు ఐపీఎల్ లో బలమైన జట్లుగా పేరు సాధించిన రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోటీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో చెరో 5 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. అందుకే, వీటి మధ్య జరిగే మ్యాచ్‌కు అపారమైన క్రేజ్ ఉంటుంది కాబోలు. ఐపీఎల్ 2025లో ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ మార్చి 23న చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ రూపొందించిన ప్రోమో వీడియోలో రోహిత్ శర్మ ప్రస్ట్రేషన్ చూపిస్తూ, ముంబై-చెన్నై పోటీపై అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
బుల్లిరాజు భారీ రెమ్యునరేషన్.. రోజుకు ఎంతో తెలుసా..?
బుల్లిరాజు.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు పేరు. ఏదైనా చైల్డ్ పాత్ర ఉందంటే మనోడినే ఫస్ట్ ఛాయిస్ గా తీసుకుంటున్నారంట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మనోడి రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని బుల్లిరాజు ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో అందరికంటే ఎక్కువగా గుర్తింపు వచ్చింది మాత్రం బుల్లిరాజుకే. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. ఓ రీల్ వీడియోతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ వీడియో చూసిన అనిల్ రావిపూడి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో రేవంత్ కెరీర్ మారిపోయింది. ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. డిమాండ్ బాగా ఉండటంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నాడంట. ఒక్క రోజుకు రూ.60 వేల నుంచి పాత్రను బట్టి రూ.లక్ష దాకా డిమాండ్ చేస్తున్నాడంట. నిర్మాతలు కూడా అంత ఇచ్చేందుకు ఓకే చెప్తుండటంతో మనోడు ఇంకా రెచ్చిపోతున్నట్టు సమచారం. ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలనే సామెతను బుల్లిరాజు బాగానే వాడుకుంటున్నాడు.
ప్రియాంక రోల్ లీక్.. ఇదేం ట్విస్ట్ జక్కన్నా?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘SSMB29’ గురించి రోజుకో కొత్త వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుందని తాజా సమాచారం. అంతేకాదు, ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా లవర్‌గా కనిపించనున్నాడని కూడా టాక్ నడుస్తోంది. అయితే, ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాని నేపథ్యంలో ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజమౌళి తన సినిమాల్లో కేవలం కథ, నటన, టెక్నికల్ అంశాల్లోనే కాకుండా సెట్‌లో క్రమశిక్షణ మరియు పర్యావరణ పరిరక్షణలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని మరోసారి నిరూపితమైంది. ‘SSMB29’ షూటింగ్ లొకేషన్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిర్ణయంతో షూటింగ్ స్థలాన్ని పొల్యూషన్ ఫ్రీగా మార్చేందుకు యూనిట్ సభ్యులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు రాజమౌళి. పర్యావరణ సంరక్షణపై ఈ చిత్ర బృందం చూపిస్తున్న చొరవ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ లో అసలైన స్టార్లు వాళ్లే.. కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ ప్రొడ్యూసర్, దర్శకుడు కరణ్ జోహార్ కు, హీరో కార్తీక్ ఆర్యన్ కు చాలా రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో వీరిపై వరుస కథనాలు కూడా వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ వీరిద్దరూ ఐఫా వేడుకల్లో కలిసి హోస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ వేడుకల్లో కరణ్ జోహార్ కార్తీ్క్ మీద సెటైర్లు వేశాడు. “కార్తీక్ నువ్వు బాలీవుడ్ లో కొత్త విద్యార్థివి. నేను ఎవర్ గ్రీన్ లెక్చరర్ లాంటి వాడిని. బాలీవుడ్ లో నీకు అసలైన రాజసం అంటే చూపిస్తాను. ఖాన్స్, కపూర్స్ మాత్రమే అసలైన బాలీవుడ్ స్టార్లు. మిగతా వాళ్లంతా వాళ్ల సినిమా ప్రాంచైజీలను కాపీ కొడుతున్నారు’ అంటూ సంచలన కామెంట్లు చేశాడు. ఇది కార్తీక్ ఆర్యన్ ను కొంత అసహనానికి గురి చేసింది. కరణ్ కామెంట్స్ కు తనదైన స్టైల్ లో చురకలు అంటించాడు కార్తీక్. బాలీవుడ్ లో రాణించాలంటే ట్యాలెంట్ ఉండాలన్నాడు. తాను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాలు చేస్తున్నట్టు తెలిపాడు. తాను నటించిన భూల్ భులయ్యా-3 హిట్ అయిందని.. కరణ్ డైరెక్ట్ చేసిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2 ప్లాప్ అయిందని సెటైర్ వేశాడు. కార్తీక్ ఆన్సర్ కు కరణ్ ముఖం వాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే స్టేజి మీద భూల్ భులయ్యా సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు కార్తీక్. కరణ్ చేసిన కామెంట్స్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ట్యాలెంట్ తో వచ్చే వారిని అవమానించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఆన్ స్క్రీన్ శ్రీదేవిలా నటించాలని ఉంది
అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు మూడు జనరేషన్స్ ను ఓ ఊపు ఊపేసింది. అందం అంటే శ్రీదేవి.. శ్రీదేవి అంటేనే అందం అన్నట్టు ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకుంది. అలాంటి శ్రీదేవికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత మళ్లీ ఆమె లాంటి హీరోయిన్ తెరమీద కనిపించట్లేదు. అయితే తాజాగా తమన్నా ఆమెను గుర్తు చేసుకుంది. తాజాగా మిల్కీ బ్యూటీ ఓ ఫ్యాషన్ టూర్ లో పాల్గొంది. ఇందులో ఆమెకు యాంకర్ ఓ ప్రశ్న వేసింది. మీరు ఆన్ స్క్రీన్ లో ఎవరి లాగా నటించాలని అనుకుంటున్నారు అని అడిగారు. తమన్నా క్షణం కూడా ఆలోచించకుండా శ్రీదేవి పేరు చెప్పేసింది. “శ్రీదేవి సూపర్ ఐకానిక్. ఆమెకు నేను పెద్ద అభిమానిని. ఆమె లాగా తెరమీద నటించాలని ఉంది. ఆమె అన్ని రకాల పాత్రలు చేసింది. కామెడీ, సీరియస్, డ్రామా ఇలా అన్ని పాత్రలు పోషించింది. అందుకే ఆమెలాగా నాకు తెరమీద పాత్రలు చేయాలని ఉందంటూ చెప్పింది మిల్కీ బ్యూటీ. తమన్నా త్వరలోనే ఓదెల-2 సినిమాతో రాబోతోంది. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఆమె సౌత్ సినిమాలవైపు చూస్తోంది. త్వరలోనే మరో రెండు సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.