కడప మేయర్‌పై అనర్హత వేటు.. అసలు కారణం ఇదేనా..?
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదలైన కుర్చీ గోల.. ఇప్పుడు ఆ మేయర్ మెడకు ఉచ్చు బిగించిందా? ఎమ్మెల్యే మేయర్ ను టార్గెట్ చేస్తూ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలంటూ విజిలెన్స్ కు ఫిర్యాదు చేయడం… ఇప్పుడు ఆ మేయర్ స్థానానికే ముప్పు తెచ్చి పెట్టిందా ? ఇప్పుడు కడప మేయర్‌పై వేటుతో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి.. అయితే, కడప వైఎస్ కుటుంబానికి గత 25 సంవత్సరాలుగా కంచుకోట.. నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కడప కార్పొరేషన్ లో వారి కుటుంబం చెప్పిందే వేదం.. వారి అనుయాయులే అక్కడ కార్పొరేటర్లు.. 2006లో కడప మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి మూడు పర్యాయాలు జరిగిన కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబం చెప్పిన వ్యక్తిలే మేయర్‌గా కొనసాగుతూ వస్తున్నారు. అయితే, కడపలో రెండుసార్లు మేయర్ పగ్గాలు చేపట్టారు కొత్తమద్ది సురేష్ బాబు.. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో 25 సంవత్సరాల తరువాత టీడీపీ అభ్యర్థి కడపలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.. కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో కడప ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి వచ్చారు. మొదటి సమావేశంలో అంతా సాఫీగానే జరిగింది. రెండవ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నుంచి గోల మొదలైంది.. గత ఏడాది నవంబర్ 7న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదికపైన ఎమ్మెల్యేకి సీటు లేకుండా చేశారు, మేయర్ సురేష్ బాబు.. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి వేదికపై సీటు లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారట.. గత 20 సంవత్సరాలుగా మున్సిపల్ సమావేశ వేదికపై ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించి ఇప్పుడు ఎందుకు సీటు వేయలేదు అంటూ ఆమె మేయర్ ను ప్రశ్నించారు.. ఇక్కడి నుంచి మొదలైన మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవి మధ్య మాటల యుద్ధం ఫిర్యాదుల వరకు వెళ్లింది..
సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఏపీ సర్కార్ కమిటీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల ఖరారుపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం… హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సమాచార శాఖ కార్యదర్శి, ఆర్ధిక శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, సినీ నిర్మాత వివేక్ కుచిభట్ల సభ్యులుగా ఉంటారు. సినిమా టికెట్ ధరలు పెంచాలని గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్.. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి సినిమా టికెట్ల వ్యవహారంపై రచ్చ జరుగుతూ వచ్చింది.. కొన్ని సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం.. మరికొన్ని సినిమాలకు ఇవ్వకపోవడంపై కూడా చర్చ సాగింది.. ఇక, సినిమా టికెట్ ధరలు పెంచాలని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో అనేక వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.. ప్రస్తుతం కొత్త సినిమా అయితే చాలు భారీగా పెరుగుతున్నాయి సినిమా టికెట్ల ధరలు. ఈ నేపథ్యంలో ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం.. సినిమా టికెట్ల ధరలను ఖరారు చేయడంపై దృష్టి సారించింది.. అందులో భాగంగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణ లాంటి తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.. ఆ తర్వాత ఆ సినియా థియేటర్ల కేటగిరీని పట్టి.. సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు..
టీటీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయాలు.. పార్టీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్..
తెలుగుదేశం పొలిట్‌బ్యూరో.. పార్టీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయాన్ని కలిపిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని భారీగా పెంచినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. 12 అంశాల అజెండాతో పొలిట్ బ్యూరో జరిగింది.. పహల్గామ్‌లో ఉగ్రదాడిని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించిందని తెలిపారు.. ఇక, టీడీపీ కార్యకర్తలకు కల్పించే బీమా సౌకర్యాన్ని రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు. త్వరలో అన్నదాత సుఖీభవ మొదటి విడత చెల్లిస్తాం.. ఇక నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తున్నాం.. ఏ నెలలో ఏ పథకం వస్తుంది అనేది క్యాలండర్ లో ఉంటుందని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు మూడు పర్యాయాలు అంటే ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగినవాళ్లు తప్పుకోవాలని పొలిట్ బ్యూరో లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు అచ్చెన్నాయుడు.. మండల పార్టీ అధ్యక్షులు అంతకన్నా పెద్ద పదవిలోకి అయినా వెళ్లాలి.. లేదా వేరే కమిటీలో ఉండాలని సూచించారు.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని రకాల కమిటీలు మహానాడు లోపు పూర్తి అవుతాయని తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని అభినందిస్తూ తీర్మానం చేసింది తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో. ఇక, దీపం 2 పథకం ద్వారా ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది.. అలాగే జూన్ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
జనసేన ఎంపీకి లోక్‌సభలో కీలక పోస్టు..
జనసేన ఎంపీకీ లోక్‌సభలో కీలక పోస్టు దక్కింది.. లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు జనసేన పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. అయితే, బాలశౌరికి ఈ పోస్టు కొత్త కాదు.. గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలు లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఆయన పనిచేశారు.. చైర్మన్ తో పాటు 15 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. ఈ కమిటీలో కార్తీ చిదంబరం, మాజీ మంత్రి ఏ.రాజా, బెంగాల్ నుంచి మొహిత్రి మొవ్వా, ఎన్‌కే ప్రేమచంద్, తెలంగాణ నుంచి బీజేపీ తరఫున రఘునందన రావు తదితరులు ఉన్నారు.. మరోవైపు.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో లోకసభలో జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా ఉన్నారు ఎంపీ బాలశౌరి. ఇప్పుడు ఆయనకు లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మరోసారి బాధ్యతలు అప్పగించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఇక, లోకసభ సబార్డినేట్ లేజీస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మరోసారి తనకు అవకాశం కల్పించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ బాలశౌరి.. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు..
క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సిద్దిపేటకు చెందిన సిరిసిల్ల సాయిచరణ్ (35) అక్యుర్డ్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బారిన పడ్డారు. ఆయనకు భార్య లక్ష్మిప్రసన్న, కుమార్తెలు లక్ష్మి సుసజ్ఞ (6), స్మయ (2 నెలలు), తల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు. ఇంటికి ఆధారమైన సాయిచరణ్ క్యాన్సర్ బారినపడడంతో అతని చికిత్సకు కుటుంబ సభ్యులు సిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లిలోని తమ ఇంటిని విక్రయించారు. అయినప్పటికీ చికిత్సకు అవసరమైనంత డబ్బులు సరిపోకపోవడంతో వారు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని గతంలో కలిసి తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చలించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సాయిచరణ్ చికిత్సకు రూ.5 లక్షలు మంజూరు చేశారు. దాంతో హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సాయిచరణ్‌కు స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయింది. చికిత్సకు అదనంగా వ్యయమైన మరో రూ.7 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ మొత్తాన్ని అధికారులు అందజేశారు. చికిత్స చేయించుకున్న సాయిచరణ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయిచరణ్‌కు సూచించారు.
కాంగ్రెస్ లో మహిళలకు అన్యాయం.. గాంధీ భవన్ ఎదుట మహిళా నేతల ఆందోళన
కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే కేటాయిస్తున్నారంటూ ఆరోపించారు. పలు సంవత్సరాలుగా కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్న తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
జేఎన్‌యూ ఝలక్.. టర్కీ వర్సిటీతో ఒప్పందం రద్దు
ఆపదలో సాయం చేస్తే.. అపన్న హస్తం అందించిన దేశంపైనే కాలు దువ్వింది. ఇదంతా ఎవరి గురించి అంటారా? దాయాది దేశంతో చేతులు కలిపిన తుర్కియే గురించి. ఒకప్పుడు తుర్కియేలో భూకంపం సంభవిస్తే.. భారత్ అపన్న హస్తం అందించింది. అలాంటి సాయం చేసిన దేశంపై కృతజ్ఞత చూపాల్సింది పోయి.. శత్రువుతో చేతులు కలిసి భారత్‌పైనే కాలుదువ్వింది. ఈ యవ్వారం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రజలు.. ‘బాయ్‌కాట్ తుర్కియే’ పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే ఆన్‌లైన్ ఆర్డర్‌లు నిలిచిపోయాయి. తుర్కియే ఉత్పత్తులను భారతీయులను నిషేధిస్తున్నారు. అలాగే పర్యాటకాన్ని కూడా బహిష్కరించారు. తాజాగా జేఎన్‌యూ(జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) చేరింది. జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని జేఎన్‌యూ కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు జేఎన్‌యూ ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. తదుపరి నోటీసు వచ్చేవరకు రద్దు అమల్లో ఉంటుందని విశ్వవిద్యాలయం వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడంపై జేఎన్‌యూ ఈ నిర్ణయం తీసుకుంది. టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది.
భారీగా పాక్ వైమానిక వనరులు ధ్వంసం! ఏ స్థాయిలో అంటే..!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ భారీ స్థాయిలో నష్టపోయినట్లుగా తాజా గణాంకాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళంలో దాదాపు 20 శాతం మౌలిక సదుపాయాలు ధ్వంసం అయినట్లు సమాచారం. దాదాపు డజనకు పైగా వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది. అనేక యుద్ధ విమానాలు కూడా నాశనం అయినట్లుగా సమాచారం. సింధ్‌లోని జంషోరో జిల్లాలోని భోలారి వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో తీవ్రంగా నష్టపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, నలుగురు వైమానిక సిబ్బందితో సహా 50 మందికి పైగా మరణించినట్లు సమాచారం. భారత దళాలు ముఖ్యంగా ఎల్‌వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద బంకర్లు, పాక్ వైమానిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే పాక్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎల్‌వోసీ దగ్గర జరిగిన కాల్పుల్లో పదుల సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయినట్లు భారత సైనిక అధికారులు అంచనా వేస్తున్నారు.
సింధు జలాలపై పాక్ లేఖ.. ఏం కోరిందంటే..!
అనుభవమయితే గానీ తత్వం బోధపడదంటారు పెద్దలు. ఇప్పుడు అచ్చం పాకిస్థాన్ పరిస్థితి అలానే అయింది. భారత్‌పై అనవసరంగా కాలుదువ్విన దాయాది దేశానికి తత్వం బోధపడినట్లుంది. దీంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. సింధు జలాలను భారత్ నిలిపివేయడంతో దాయాది దేశం విలవిలలాడుతోంది. దీంతో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సింధు జలాల నిర్ణయాన్ని పున:సమీక్షించాలంటూ భారత ప్రభుత్వానికి పాకిస్థాన్ లేఖ రాసింది. సింధు జలాల నిలిపివేతతో పాకిస్థాన్‌లో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినట్లు పాక్ జలవనరుల శాఖ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇకపై పాక్‌తో చర్చలంటూ ఉంటే కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనేనని పేర్కొన్నారు. రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్ రాసిన లేఖపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు మూసేసింది. ఇలా ఒక్కొక్కటిగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అనంతరం పాక్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పాకిస్థాన్ భారీగా నష్టపోయింది.
ఢిల్లీకి ఆస్ట్రేలియా స్ట్రోక్.. తప్పుకున్న స్టార్ ఆటగాడు
ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ సీజన్లో తేలిపోయింది. వరుస మ్యాచుల్లో ఓడి టేబుల్ టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.అయినా ఢిల్లీ ప్లేఆప్స్ అవకాశాలు కోల్పోదు. 11 మ్యాచుల్లో 6 గెలిచి 13 పాయింట్లతో ప్లేఆప్స్ ఆశలను సజీవం చేసుకుంది. సరిగా ప్లేఅఫ్స కి ముందు ఢిల్లీకి షాకిస్తూ ఆస్ట్రేలియన్ ప్లేయర్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.ఆ జట్టు స్టార్ ఆటగాడు జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ఐపీఎల్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు.ఇది ఢిల్లీకి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. అంతకుముందు భారత్ పాక్ ఉద్రిక్తత మధ్య బీసీసీఐ ఐపీఎల్ ని వాయిదా వేసింది.దీంతో విదేశీ ప్లేయర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. అయితే కొత్త షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐకి విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరు షాకిస్తున్నారు. తిరిగి భారత్ కు వచ్చేందుకు వెనకాడుతున్నారు. ఈ క్రమంలో మెక్‌గుర్క్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వెంటనే మరో ఆటగాడిని రీప్లేస్ చేస్తున్నట్లు ప్రకటించింది. మెక్‌గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశపరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ యువ బ్యాట్స్‌మన్ మొత్తం 6 మ్యాచ్‌ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 38 మాత్రమే.
అప్పుడు రాబిన్ హుడ్.. ఇప్పుడు తమ్ముడు.. నితిన్ త్యాగాలు..!
నితిన్ ను వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. రాబిన్ హుడ్ తో అనుకున్న సక్సెస్ రాలేదు. ఇప్పుడు తమ్ముడు సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ మూవీకి కూడా కష్టాలు ఆగట్లేదు. రాబిన్ హుడ్ ను వాస్తవానికి గత 2024 డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఆడుతోంది. బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉందని నిర్మాతలు రాబిన్ హుడ్ ను వాయిదా వేశారు. కానీ అదే రోజు మ్యాడ్ స్వ్కేర్ రిలీజ్ అవడంతో రాబిన్ హుడ్ మీద ఎఫెక్ట్ పడింది. అప్పటికే ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో మ్యాడ్ స్వ్కేర్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. అందరూ ఆ మూవీకే వెళ్లారు. రాబిన్ కు కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. పోనీ ఇప్పుడు తమ్ముడు సినిమాతో సోలోగా వద్దాం అనుకుంటే.. జులై 4కు కింగ్ డమ్ ను వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ రూపంలో నితిన్ కు మరో సమస్య వచ్చింది. సరేలే అని ఇప్పుడు జులై 4న ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమ్ముడు త్యాగం చేస్తున్నాడు. ఇలా నితిన్ కు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఏదో ఒక సమస్య రావడంతో ఆయన సినిమాలు వరుసగా వాయిదాలు పడుతూ చివరకు ఇబ్బందుల పాలవుతున్నాయి. తమ్ముడు మూవీతో గనక హిట్ పడకపోతే నితిన్ మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఓజీ షూట్ కు పవన్.. ‘ఉస్తాద్’ కూడా ముగిస్తాడా..?
పవన్ కల్యాణ్ ఎట్టకేలకు ఓజీ షూటింగ్ కు హాజరయినట్టు తెలుస్తోంది. చాలా నెలలుగా ఆగిపోయిన ఓజీ షూటింగ్ మొన్ననే రీ స్టార్ట్ అయింది. ఈ మేరకు మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు పవన్ కల్యాణ్ ఓజీ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సారి బ్రేక్ ఇవ్వకుండా మూవీని ముగించేయాలని ఫిక్స్ అయ్యారంట పవన్ కల్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లును ముగించేశాడు. ఇప్పుడు ఓజీ కూడా త్వరగానే ముగించబోతున్నారు. దీంతో హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా ఆశలు చిగురిస్తున్నాయి అభిమానులకు. ఈ మూవీ కూడా ఏపీ ఎన్నికల సమయంలోనే ఆగిపోయింది. మూవీ షూటింగ్ కొంత వరకు చేశారు. హరీశ్ శంకర్ ఈ మూవీని కంప్లీట్ చేసి ఎలాగైనా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ దీని తర్వాత స్టార్ట్ అయిన ఓజీ కోసం పవన్ డేట్లు కేటాయించేశాడు. వీరమల్లు, ఓజీ కంప్లీట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే పెండింగ్ లో ఉంటుంది. కాబట్టి త్వరలోనే దీన్ని కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడంట పవన్ కల్యాణ్. ఓజీ అయిపోయిన తర్వాత ఉస్తాద్ షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీన్ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్తారంట. వీలైనంత త్వరగా పెండింగ్ సినిమాలు అన్నీ కంప్లీట్ చేసేసి నిర్మాతల మీద భారం తగ్గించాలని చూస్తున్నాడంట పవన్ కల్యాణ్.