ఏపీలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. నిన్నటి నిన్న పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌లు.. ఐపీఎస్‌లకు స్థానభ్రంశం తప్పని పరిస్థితి కాగా.. ఈ రోజు ఏకంగా 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీలు ఇలా ఉన్నాయి..
* శ్రీకాకుళం జిల్లా – కేవీ మహేశ్వర్‌రెడ్డి
* విజయనగరం- వకుల్ జిందాల్
* అనకాపల్లి- ఎం.దీపిక
* సత్యసాయి జిల్లా- వి.రత్న
* పార్వతీపురం మన్యం – ఎస్వీ మాధవరెడ్డి
* కాకినాడ- విక్రాంత్ పాటిల్
* గుంటూరు- ఎస్.సతీశ్ కుమార్
* బాపట్ల-తుషార్ దూది
* అల్లూరి సీతారామ రాజు జిల్లా – అమిత్ బర్దార్
* విశాఖపట్నం సిటీ-తుహిన్ సిన్హా
* తూర్పు గోదావరి జిల్లా – డి.నరసింహ కిషోర్
* అన్నమయ్య జిల్లా – వి. విద్యా సాగర్ నాయుడు
* అంబేద్కర్ కోనసీమ జిల్లా – బి. కృష్ణారావు
* కృష్ణా జిల్లా -ఆర్. గంగాధర్ రావు
* తూర్పు గోదావరి జిల్లా అద్నాన్ నయీమ్ అస్మీ
* విశాఖపట్నం సిటీ – శ్రీమతి అజిత వేజెండ్ల
* ఏలూరు జిల్లా – కె. ప్రతాప్ శివకిషోర్
* పల్నాడు జిల్లా – కె. శ్రీనివాసరావు
* విజయనగరం – మలికా గార్గ్
* ప్రకాశం జిల్లా – ఎ.ఆర్. దామోదర్
* కర్నూలు జిల్లా – జి. బిందు మాధవ్
* నెల్లూరు జిల్లా – జి. కృష్ణకాంత్
* నంద్యాల జిల్లా – అధిరాజ్ సింగ్ రాణా
* కడప జిల్లా – వి. హర్షవర్ధన్ రాజు
* అనంతపురం జిల్లా – కె.వి. మురళీ కృష్ణ
* ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ – గౌతమి సాలి
* తిరుపతి జిల్లా – ఎల్. సుబ్బరాయుడు
* అనంతపురం వి.గీతాదేవి
* ఇక, ఐపీఎస్ అధికారులైన జి.ఆర్. రాధిక, డి. మేరీ ప్రశాంతి, కె. ఆరిఫ్ హఫీజ్, కె. రఘువీరా రెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, గరుడ్ సుమిత్ సునీల్, పి. జగదీష్, S. శ్రీధర్, M.సత్తి బాబును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
టీటీడీ కీలక నిర్ణయం.. బల్క్ బుకింగ్ టిక్కెట్లు రద్దు..!
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాలన మొదలు పెడతామంటూ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అదుకు తగిన విధంగానే ముందుకు సాగుతున్నారు.. ఇక, టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. దర్శన టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో భక్తులకు పారదర్శకంగా కేటాయించే విధంగా చర్యలకు దిగుతోంది.. అందులో భాగంగా దళారులకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యంది.. అయితే, ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో దళారులు బల్క్ బుకింగ్‌గా పెద్ద ఎత్తున దర్శన టికెట్లతో పాటు వసతి గదులు పొందినట్లు గుర్తించింది టీటీడీ.. దీంతో.. బల్క్ బుకింగ్ కింద పొందిన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. అలాంటి వారి పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు టీటీడీ అధికారులు.. ఫేస్ రికగ్నిషన్ (ఫేషియల్ రికగ్నిషన్) విధానంలో భక్తులు టికెట్లు పొందేలా మార్పులు చేసేందుకు రెడీ అవుతున్నారు.. అంతేకాదు.. ఆధార్ అనుసంధానానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తోందట టీటీడీ.. అంటే.. టీటీడీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే.. మొత్తం దళారి వ్యవస్థకే పులిస్టాప్ పెట్టేలా ఉంటుంది.
క్రియాశీలక సభ్యత్వ నమోదుకు సిద్ధమైన జనసేన.. 10 రోజుల పాటు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ప్రకటించిన పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా.. టీడీపీ-జనసేన-బీజేపీ ఒకే వేదికపైకి రావడంలో ఆయన పాత్ర ఎంతో కీలక పాత్ర పోషించారు.. ఆ తర్వాత కూటమి ఘన విజయాన్ని అందుకుంది.. పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలు, 21 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి ఊపుమీదున్న జనసేన.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సిద్ధం అవుతోంది.. ఈ నెల 18 నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం ఉంటుందని.. 10 రోజులపాటు ఈ నాల్గో విడత సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఆ పార్టీ ప్రకటించింది.. ఒక్కో నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్టు పేర్కొంది.. పవన్ కల్యాణ్ ఆశయ సాధనకు పని చేయాలని జనసేన పిలుపునిచ్చింది. సమష్టిగా పవన్ కల్యాణ్ ఆశయ సాధన కోసం పని చేద్దాం అంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మనమంతా ఉన్నామనే భరోసాను క్రియాశీలక సభ్యత్వం ఇస్తుందన్నారు నాదెండ్ల.. ఇంతింతై వలుడింతై అన్నట్టుగా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది.. గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చించుకునేలా పార్టీ విజయం సాధించడానికి అంతా సమిష్టిగా కష్టపడ్డాం అన్నారు.. పార్టీ అధినేత పవన్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలన్న ఆయన.. వేయి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం.. నేడు 6.47 లక్షల మందికి చేరింది.. ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం.. దీనికి అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలి.. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే సభ్యులను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.
ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం శుభవార్త..
హైదరాబాద్ జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగోను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరంత ఫీజు రీయింబర్స్మెంట్ పై మా పాలసీ ఏంటని ఆలోచిస్తున్నారు.. కారు ఎంత పెద్దది ఐనా.. దాంట్లో ఇంధనం ఉంటేనే విలువ అని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం సంక్షేమం మీదనే ఎక్కువ దృష్టి సారిస్తోంది.. అభివృద్ధి రెండో ప్రాధాన్యతగా మారిందని తెలిపారు. కొంత ఆర్థిక భారంతో రాష్ట్రం ఉందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ మొండిబకాయల కింద పడిందని సీఎం రేవంత్ తెలిపారు. మీరంతా ఆలోచించి వన్ టైం సెటిల్మెంట్ కి వస్తే బాగుంటుందన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిహితుడు అని చెప్పారు. వన్ టైం సెటిల్మెంట్ చేసే బాధ్యత శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నానన్నారు. ఈ ఏడాది నుంచి చేరే విద్యార్థులకు రెగ్యులర్ గా ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందని తెలిపారు. ప్రతీ ఏటా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్ష మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారని సీఎం చెప్పారు. ఈ లోపం మీలో.. మాలో ఉందన్నారు. దాన్ని గుర్తించి సమస్యను పరిష్కరిద్దామని విద్యార్థులకు సూచించారు.
బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ ఎంపీ..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొందరు కూడా పార్టీ మారుతారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్‌కు బైబై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు వార్తలపై వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీలో తాము చేరుతున్నట్లు.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం అవుతున్నట్లు కొన్ని పత్రికలు, ఛానెళ్లలో వెలువడుతున్న వార్తలు, కథనాలలో ఏ మాత్రం నిజం లేదన్నారు. అవి అభూత కల్పనలు అని ఎంపీ రవిచంద్ర కొట్టిపారేశారు. టీవీ ఛానెల్స్ కొన్ని బీఆర్ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, బలహీనపర్చేందుకు అదే పనిగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచారం చేయడం తీవ్ర విచారకరమని ఎంపీ వద్దిరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నలుగురు ఎంపీలు ఎవరు బీజేపీలోకి వెళ్లారని.. ఇది మైండ్ గేమ్ పాలిటిక్స్ అని ఆయన తెలిపారు.
కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..
చిన్నచిన్న వివాదాల కారణంగా పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. వధూవరుల బంధువుల మధ్య వివాదాల కారణంగా మ్యారేజ్‌లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కొబ్బరికాయలు, మాంసాహారం, అతిథి మర్యాదలు ఇలా కాదేది అనర్హం అన్నట్లు, వధూవరులను విడదీస్తున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్‌లో మరో వివాహం క్యాన్సిల్ అయింది. దీనికి కారణం ఏంటంటే, కూలర్ వద్ద అతిథులు కూర్చోవడమే. కూలర్ దగ్గర కూర్చున్నందుకు అతిథులు, పెళ్లికూతురు కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో వధువు వరుడితో పెళ్లికి నిరాకరించింది. వరుడిని పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వధువు కట్టుబడి ఉంది. దీంతో విషయం గ్రామంలోని పంచాయతీకి చేరింది. అర్థరాత్రి వరకు చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో ఇరువర్గాల ప్రజలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. సమాచారం ప్రకారం.. చత్బరాగావ్ గ్రామంలో జరిగిన ఈ వివాదం ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. పోలీసులు మధ్యవర్తిత్వం వహించి సముదాయించే ప్రయత్నం చేసినా పరిష్కారం కాలేదు. చివరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పోలీసులు ఇరు వర్గాలకు రూ. 151 జరిమానా విధించి అక్కడి నుంచి పంపించేశారు.
ఎన్నికల ముందు ట్రంప్‌కి గుడ్‌న్యూస్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాపై ఆంక్షలు ఎత్తేసిన మెటా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి గుడ్ న్యూస్ చెప్పింది టెక్ దిగ్గజం మెటా. ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం తెలిపింది. 2021 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన తర్వాత మెటా ట్రంప్ అకౌంట్లపై నిషేధాన్ని విధించింది. తాజాగా నాలుగేళ్ల తర్వాత నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు తెలిపింది. ‘‘రాజకీయ వ్యక్తీకరణను అనుమతించడం మా బాధ్యత. అందుకే ఎన్నికల వేళ ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆలోచనలు, మాటలని అమెరికన్ ప్రజలు వినాలని కోరుకుంటున్నాం. అందరు వినియోగదారుల మాదిరిగానే అభ్యర్థులు కూడా నిబంధనలకు లోబడి సోషల్ మీడియాని వినియోగించుకోవాలి. హింసను ప్రేరేపించేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదు’’ అని మెటా పేర్కొంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నామినీగా, ఇకపై సస్పెన్షన్ ఉండు అని తెలిపింది.
జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. ఒక్క వికెట్ నష్టపోకుండా విక్టరీ
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని 3-1తో కైవసం చేసుకుంది. హరారేలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా అత్యధికంగా 46 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఎంతో శ్రమించి 153 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత్ ఆటగాళ్లు ఆ స్కోర్ ను చేధించారు. ఓపెనింగ్ జోడి శుభ్‌మన్ గిల్, జైస్వాల్ ఆటను ముగించారు. గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు (58 నాటౌట్) బాదాడు. యశస్వి జైస్వాల్ (93 నాటౌట్) ఈ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేశాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఇరగ్గొట్టాడు. ఛేదనలో ఈ జోడి తడబడ్డ సందర్భమే కనిపించలేదు. వీరిద్దరిని ఆతిథ్య జట్టు ఆడ్డుకోలేకపోయింది. 150 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించి.. భారత యువ కెరటాల సత్తాచాటారు. బౌలర్లు శివమ్ దూబే మరియు అభిషేక్ శర్మల అద్భుత ప్రదర్శన కారణంగా జింబాబ్వే 152 పరుగులకే పరిమితం అయ్యింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ భారత ఐదో బౌలర్ అభిషేక్ (20/1), ఆరో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన దూబే (11/1) చక్కటి బౌలింగ్‌తో జింబాబ్వేను ఒత్తిడిలోకి నెట్టారు. ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీ వెస్లీ మాధవెరె (24 బంతుల్లో 25 పరుగులు), తాడివనాషే మారుమణి (31 బంతుల్లో 32 పరుగులు)లను అవుట్ చేయడం ద్వారా అతను మిడిల్ ఓవర్లను నియంత్రించాడు. అయితే కెప్టెన్ రజా తన ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది జింబాబ్వేను 150 పరుగులకు పైగా స్కోరుకు తీసుకెళ్లాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మినహా భారత బౌలర్లందరికీ వికెట్లు దక్కాయి.
ఒకే ఫ్రేములో సినీ-క్రికెట్ సూపర్ స్టార్లు..
ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్లో కనబడితే ఎలా ఉంటుంది. ఆ ఇద్దరి స్టార్ల అభిమానులకైతే ఒక రకంగా పండుగనే చెప్పాలి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో దాదాపు మీరు థంబ్ నైల్ ద్వారా చూసేసే ఉంటారు. అవును వారిలో ఒకరు క్రికెట్ సూపర్ స్టార్ ఎంఎస్ ధోని అయితే మరొకరు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు విషయం ఏమిటంటే నిన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం బాంబేలో ఘనంగా జరిగింది. అంబానీ అధికారిక నివాసంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెంకటేష్, మహేష్ బాబు, రాణా వంటి వాళ్ళు హాజరయ్యారు. అయితే స్పోర్ట్స్ నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ధోని, సచిన్ టెండూల్కర్ వంటి వాళ్లు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఎప్పుడు కలిశారు? ఏ క్షణాన కుదిరిందో తెలియదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ధోని ఫోటో దిగారు. అయితే ధోని మహేష్ బాబుతో దిగాలని అనుకున్నారో లేక మహేష్ బాబు ధోనితో దిగాలని అనుకున్నారో తెలియదు. కానీ ఒక ఫోటో అయితే దిగారు. దాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా హ్యాండిల్స్ మైంటైన్ చేసే మేనేజర్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశారు. ఇక అది సోషల్ మీడియాలో రిలీజ్ అయినప్పటి నుంచి వైరల్ అవుతుంది. ధోని మహేష్ బాబు ఫోటో ఒకరకంగా సోషల్ మీడియాలో వైరల్ కాదు ట్రెండ్ కూడా అవుతుంది అని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు ప్రస్తుతానికి రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నాడు ఎప్పుడూ మొదలవుతుందో తెలియని ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాని ఉల్లాసం చూశారా.. సెకండ్ సింగిల్ వచ్చేసింది!
‘సరిపోదా శనివారం’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ గరం గరం నేచురల్ స్టార్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మాస్ ఫీస్ట్ తర్వాత, మేకర్స్ ఈ రోజు (శనివారం) సినిమా సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్ ని రిలీజ్ చేశారు, ఇది మ్యాజికల్ ట్రీట్‌ను అందిస్తుంది. ఇది క్లాసికల్, జాజ్ మ్యూజిక్ ఫ్యూజన్, రొమాంటిక్ నెంబర్ ఇన్స్టంట్ గా హిట్ అవుతోంది. సాంగ్ మూడ్ లైట్ గా ఉంది, విన్న వెంటనే ట్యూన్‌తో లవ్ లో పడతారు. సనరే రాసిన లిరిక్స్ నాని, ప్రియాంక మోహన్‌ల ఫీలింగ్స్ ని బ్యూటీఫుల్ గా ఎక్స్ ప్రెస్ చేస్తోంది. సంజిత్ హెగ్డే తన వోకల్స్ తో పాటకు ప్రాణం పోయగా, కృష్ణ లాస్య ముత్యాల కూడా తన ఎక్స్ ప్రెస్సీవ్ వాయిస్ తో మ్యాజిక్ చేసింది. రిథమిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగున్నాయి, ఇంటర్‌లూడ్‌లు చాలా కూల్‌గా ఉన్నాయి. మ్యాజికల్ త్రయం (కంపోజర్, సింగర్, లిరిక్ రైటర్) మనల్ని హ్యాపీ ట్రాన్స్‌లోకి తీసుకువెళుతుంది. నాని, ప్రియాంక మోహన్‌ల జంట తమ నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ తో విజువల్స్‌కు బ్యూటీని యాడ్ చేశారు. లిజనర్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే ఈ పాటలో నాని గుడ్ మ్యూజిక్ టేస్ట్ మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. పాన్ ఇండియా అడ్రినలిన్ ఫీల్డ్ యాక్షన్-అడ్వెంచర్ సరిపోదా శనివారంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే నెలలో సినిమా రాబోతుంది, కాబట్టి మేకర్స్ దూకుడు పెంచారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి మురళి జి డీవోపీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.