నేడు ఏపీ బడ్జెట్.. రూ.3.20 లక్షల కోట్ల అంచనాలతో..
ఇవాళ అసెంబ్లీ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 9గంటలకు కేబినెట్ అమోదించాక.. సభలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది. అందులో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత 10 గంటలకు శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్ధిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెడతారు.
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..
సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో అరెస్టయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై నేడు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు ఇవాళ కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరోవైపు మూడు రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో వంశీని నిన్న మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు… మెజిస్ట్రేట్ ఎదుట వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తమా సమస్య ఉన్నందునా.. జైల్‌లో నన్ను ఇతరులతో కలిపి ఉంచేలా ఆదేశించాలని కోర్టులో న్యాయాధికారిని కోరారు. వంశీ అభ్యర్థనను న్యాయాధికారి సత్యానంద్ తిరస్కరించారు. ఇతరులతోపాటు సెల్‌లో ఉంచేలా ఇన్‌ఛార్జి కోర్టు న్యాయాధికారిగా తాను ఆదేశాలు ఇవ్వలేనన్నారు. రేపు రెగ్యులర్ కోర్టు అయిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు. అయితే, కస్టడీలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అని న్యాయాధికారి ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వల్లభనేని వంశీ మోహన్ బదులిచ్చారు.
న్యాయమూర్తి ముందు పోసాని ఆవేదన..
న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి… పోసాని కృష్ణమురళికి 14రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రాజంపేట సబ్‌జైలుకు తరలించారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్నరాత్రి 9 గంటల 30 నిమిషాలకు రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. అయితే, తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన. నా భార్యను దూషించిన బాధతో నేను మాట్లాడిన వీడియోలను అలా చూపించారు.. నా భార్యను దూషించిన దూషణలను కట్ చేసి వారిని దూషించిన మాటలను మాత్రమే చూపించారు.. నా భార్యను దూషించిన బాధతోనే నేను అలా దూషించాల్సి వచ్చిందంటూ న్యాయమూర్తి ఎదుట తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని ఒప్పుకున్న పోసాని.. నా భార్యను దూషించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో లేకుండా చేశారు ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి..
నేటి నుంచి వరంగల్ నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ 25’ ఉత్సవాలు ప్రారంభం!
నేటి నుంచి వరంగల్ నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ 25’ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు (మార్చి రెండవ తేదీ వరకు) వసంతోత్సవాలు కొనసాగనున్నాయి. వసంతోత్సవాలను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రారంభించనున్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్ పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొననున్నారు. స్ప్రింగ్ స్ప్రీ 25 కోసం విద్యార్థులు వరంగల్ నిట్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నిట్ కళకళలాడుతోంది. వరంగల్ నిట్‌లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులు వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. నిట్‌లో దేశం, ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్‌లో.. వివిధ దేశాల సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకునేందుకు 1978లో వసంతోత్సవం ప్రారంభమైంది. ఈ వసంతోత్సవం దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్‌గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు ఫెస్ట్‌లో పాల్గొననున్నారు. నిట్‌లో మూడు రోజులపాటు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో స్ప్రింగ్ స్ప్రీ 25 ఉత్సవాలు జరగనున్నాయి.
144 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 144 గంటలుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో పోల్చితే.. గురువారం సహాయ చర్యల్లో వేగం పుంజుకుంది. టన్నెల్‌లో కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)ను ప్లాస్మా కట్టర్లతో రెస్క్యూ టీమ్ ముక్కలుగా కత్తిరింస్తోంది. మిషన్‌పై భారీగా ఉన్న బురద, మట్టి, రాళ్లను తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కోస్తున్నారు. సిల్ట్, మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. 12వ కిలోమీటరు నుంచి టన్నెల్‌లోని బురద, నీళ్లు, రాళ్లు, వ్యర్థాలను సైతం తొలగిస్తున్నారు. మట్టిలో కార్మికుల ఆనవాళ్ల కోసం రాడార్‌లతో సెర్చ్ చేస్తున్నారు. జీపీఆర్ యంత్రం రేడియో తరంగాలతో శిధిలాలను జల్లెడ పడుతుతోంది. కాన్వెర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలకు భూ ఉపరితలం నుంచి ఎటువంటి సాయం చేయవచ్చనే కోణంలోనూ అన్వేషణ జరుగుతోంది. శుక్రవారం కూడా రెస్క్యూ ఆపరేషన్లో మరింత వేగం పుంజుకోనుంది. బీఆర్‌వో, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ, ఆర్మీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, హైడ్రా, పలు ప్రైవేటు నిర్మాణ సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. రైల్వేశాఖ సైతం నిన్న ఓ బృందాన్ని పంపించింది. శుక్రవారం రెండో బృందం వెళ్లనుంది.
నిందితుడు చివరికిలా చిక్కాడు! అదే పట్టించింది
పూణె అత్యాచార నిందితుడు దత్తాత్రయ రాందాస్(36) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 75 గంటల పోలీసుల వేట తర్వాత దొరికిపోయాడు. నిందితుడి కోసం దాదాపు 13 పోలీస్ బృందాలు వేటాడాయి. పూణె సమీప ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వేటాడారు. డ్రోన్లు, డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే పూణె సమీప గ్రామాల్లో ఎత్తున చెరుకు తోటలో ఉన్నట్లుగా డ్రోన్ సాయంతో గుర్తించారు. ఆ దిశగా పోలీసులు వేటాడారు. అయితే అర్ధరాత్రి సమయంలో తీవ్రమైన ఆకలి వేయడంతో ఓ ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటికే నిందితుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. మొత్తానికి ఇంటి వారు పోలీసులకు రహస్యంగా సమాచారం ఇవ్వడంతో చాకచాక్యంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి నిందితుడు దత్తాత్రయ రాందాస్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహారాష్ట్రలో అతిపెద్ద బస్సు డిపోల్లో ఒకటైన పూణెలోని స్వర్గేట్ బస్టాండ్ దగ్గర మంగళవారం ఉదయం 6 గంటలకు బస్సు కోసం ఓ యువతి (26) నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న రాందాస్… చెల్లి అని సంబోధించాడు. మీ ఊరు వెళ్లే బస్సు ఇక్కడ లేదని.. ఫలానా చోటు ఉందని నమ్మించి తీసుకెళ్లాడు. బస్సులో ఎవరూ లేకపోవడంతో ఎక్కేందుకు సంకోచించింది. అయితే లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారని చెప్పడంతో లోపలికి వెళ్లింది. అంతే వెంటనే బస్సు డోర్ మూసివేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం వెంటనే బస్సులోంచి దూకేసి పారిపోయాడు. అయితే బాధితురాలు.. జరిగిన ఘోరాన్ని స్నేహితురాలితో పంచుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రాందాస్‌గా గుర్తించారు.
నేపాల్, పాకిస్థాన్.. ఉత్తర భారత్‌లో భూప్రకంపనలు
నేపాల్, పాకిస్థాన్, ఉత్తర భారత్‌లో భూప్రకంపనలు హడలెత్తించాయి. నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే బీహార్‌లోని పాట్నాలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించలేదు. సింధుపాల్‌చోక్‌లో భూకంప కేంద్రం ఏర్పడింది. తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. హిమాలయ ప్రాంతం అంతటా ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. బీహార్‌లోని పాట్నా, ముజఫర్‌పూర్ సమీప ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం.. భూకంప తీవ్రత 5.6 గా గుర్తించారు. భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం దీనిని 5.5 గా అంచనా వేసింది. అయితే బహుళ భూకంపాలు సంభవిస్తాయా? లేదా అనేది స్పష్టంగా తెలియచేయలేదు. అయితే భూప్రకంపనలకు ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్లల్లోంచి జనాలు బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదని నేపాలీ సీనియర్ అధికారి గణేష్ నేపాలీ మీడియాతో తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆసక్తికర సమరం.. అఫ్గానిస్థాన్ మరో షాకిచ్చేనా!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. సెమీ ఫైనల్ బెర్తు కోసం ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. గత మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్.. మరో సంచలన విజయం సాదిస్తుందేమో చూడాలి. 2024 టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడింది. అంతేకాదు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన అఫ్గాన్‌కు.. వరుసగా రెండో ఐసీసీ సెమీస్ చేరే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అఫ్గానిస్థాన్ ఒడిసిపడుతుందో లేదో మరి. ఇంగ్లండ్‌పై సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్.. 5 వికెట్లు తీసిన అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌లు ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీలకం కానున్నారు. ఈ ఇద్దరు మరోసారి చెలరేగితే అఫ్గాన్‌కు ఎదురుండదు. హష్మతుల్లా, గుర్బాజ్, నబీ, గుల్బదిన్, రషీద్ ఖాన్ కూడా మంచి ప్రదర్శన చేస్తే.. ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు. దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో.. అఫ్గాన్‌తో మ్యాచ్ కంగారులకు క్వార్టర్ ఫైనల్‌గా మారింది. ఎలాగైనా సెమీఫైనల్లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. బౌలింగ్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లో ఆసీస్ బలంగా ఉంది. హెడ్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్‌వెల్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
పోసానికి 14 రోజుల రిమాండ్
సినీనటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసారని పోసానిపై ఆంధ్రప్రదేశ్ లోని ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోగినేని మణి పెట్టిన ఫిర్యాదు ఆధారంగా పోసాని కృష్ణమురళిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లోని పోసాని ఇంటికి చేరుకున్న ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పలు వైద్య పరీక్షల అనంతరం పోసానిని గురువారం రాత్రి 9 గంటలకు రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోసాని తరపున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ ‘ బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసాని కృష్ణమురళికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. గురువారం రాత్రి 9 గంటల నుంచి శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల వరకు అంటే దాదాపు 7 గంటలుగా ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరువురి వాదనల అనంతరం పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో పోసాని కృష్ణమురళిని రాజంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ రోజు నుండి మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే సెక్షన్స్ పెట్టడంతోనే పోసాని రిమాండ్ విధించారని పొన్నవోలు కామెంట్స్ చేసారు.
‘రుద్ర’గా గర్జించబోతున్న కళ్యాణ్ రామ్
డెవిల్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. 2023 లో ఆయన చివరి సినిమా డెవిల్ రిలీజ్ అయి కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారట. ‘‘కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది. యాక్షన్ సినిమా కావడంతో టైటిల్ సెట్ అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు యూనిట్ నుండి అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకు ‘రుద్ర’అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నారు అని దాదాపు ఇదే ఖాయమని తెలిసింది. ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి మరోసారి పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.