జనసేనాని బహిరంగ లేఖ.. పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
ప్రియమైన జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం అంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ మధ్య కొన్ని విషయాల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీల మధ్య కామెంట్లు వివాదాస్పందంగా మారుతున్నాయి.. ఈ తరుణంలో ‘జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.. ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. ‘కూటమిలోని మూడు పార్టీల శ్రేణులూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున కూడా ఎవరైనా స్పందించినా, మరెవరూ ప్రతిస్పందించొద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు. బహిరంగంగా చర్చించొద్దు అని సూచిస్తూ.. జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ విడుదల చేశారు పవన్ కల్యాణ్.
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కొరతకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ లో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 5200 కోట్లతో 1000 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేయనున్నది. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలో బ్యాటరీ విద్యుత్ నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే, రాయలసీమ జిల్లాలలో దాదాపు 900 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ప్రధానంగా కడప జిల్లాలోని మైలవరం సోలార్ పార్కులో 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నుంచి గ్రిడ్ కు అనుసంధానం చేయకుండా 400 మెగావాట్ల విద్యుత్తును బ్యాటరీ స్టోరేజ్ విధానంలో నిలువ చేయనున్నారు. కర్నూలు జిల్లాలోని గని వద్ద 400 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పంలో 100 మెగావాట్లు, గోదావరి జిల్లాలో 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు…
జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి..!
నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. జైలు సూపరింటెండెంట్ శ్రీరామ్ రాజారావు అవినీతి, అక్రమాలపై అధికారులు నోరువెల్లబెడుతున్నారు.. రిమాండ్ ఖైదీల తాలుకు బంధువుల నుంచి నగదు, మద్యం డిమాండ్ చేసిన ఫోన్ సంభాషణ మరువకముందే వెలుగులోకి మరో అవినీతి బాగోతం వచ్చింది.. గత ఏడాది గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు కాశిని నెల్లూరు జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించింది న్యాయ స్థానం… అయితే, రిమాండ్ ఖైదీగా వచ్చిన కాశీని బాగా చూసుకునేందుకు, సకల సౌకర్యాలు కల్పించేందుకు ఉదయ్ అనే వ్యక్తి నుంచి 20 వేలు ఫోన్ పే వేయించుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.. ఇక, ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న భాస్కర్ అనే ఖైదీ పెరోల్‌పై బయటకు రాగా.. మద్యం బాటిల్ తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేశాడట రాజారావు.. మద్యం బాటిల్ తీసుకుని తన ఇంటి వద్దకు రావాలని భాస్కర్‌ను వేధించిన జైలు సూపరంటెండెంట్ శ్రీరామ్ రాజారావు సంభాషణ ఆడియోటేపులు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారాలపై విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగారు జైళ్ల శాఖ డీఐజీ.. భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీరామ్ రాజారావుపై శాఖ పరమైన చర్యలు ఉంటాయా? లేక చేతులు తడుపుకుని తుడిచేసుకుంటారా?అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, హోం మంత్రి ఈ అవినీతి జైల్ సూపరింటెండెంట్‌పై ఎటువంటి చర్యలు తీసుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం.. గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్!
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ఆదివారం రాత్రి ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టుపడ్డాడు. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుండి హైదరాబాద్‌కు విదేశీ గంజాయి స్మగ్లింగ్అయినట్లు తెలుస్తోంది. బెంగుళూర్ డెలాయిట్ సాఫ్ట్‌వేర్ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న శివరామ్ అనే వ్యక్తి ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అజయ్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఇద్దరు కలిసి ప్రతి వీకెండ్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. బెంగళూరులో లోకల్ గంజాయిని కొనుగోలు చేసి.. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సరఫరా చేశారు. గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, ఐటి క్యారిడార్ హాస్టల్స్‌లో ఉండే విద్యార్దులే టార్గెట్‌గా గంజాయి అమ్మకం చేస్తున్నారు. శివరామ్‌తో పాటు అజయ్‌పై పోలీసులు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడ్డ నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.
నా డీఎన్ఏ భారతీయుడిదే… ప్రధాని మోదీ ముందు ఇండోనేషియా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్య
ఈసారి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత సాయంత్రం ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారతదేశంతో తన కొత్త సంబంధం గురించి సరదాగా మాట్లాడుతూ.. ఇటీవలి DNA పరీక్షలో తన పూర్వీకులు భారతీయులని తేలిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ, ‘‘కొన్ని వారాల క్రితం, నేను నా డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నాను. అది నా డీఎన్ఏ భారతీయదని చూపించింది. నేను భారతీయ సంగీతం విన్నప్పుడు, నేను నృత్యం చేయడం ప్రారంభిస్తానని అందరికీ తెలుసు. ఇది నా భారతీయ జన్యువులలో భాగం అయి ఉండాలి’’ అని అన్నారు. అధ్యక్షుడు సుబియాంటో ఈ ప్రకటన విన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ సహా అతిథులు నవ్వడం ప్రారంభించారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఢిల్లీలో హాజరైన ప్రబోవో సుబియాంటో రెండు దేశాల మధ్య శాశ్వత సాంస్కృతిక, చారిత్రక సంబంధాల గురించి మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉమ్మడి వారసత్వాన్ని నొక్కి చెబుతూ, ‘మన భాషలో చాలా ముఖ్యమైన భాగం సంస్కృతం నుండి వచ్చింది. చాలా ఇండోనేషియా పేర్లు సంస్కృతంలో ఉన్నాయి. మన దైనందిన జీవితాల్లో ప్రాచీన భారతీయ నాగరికత ప్రభావం చాలా బలంగా ఉంది.
బంగ్లాదేశ్ జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు ఎక్కడికి వెళ్లారు?
జూలై-ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో 800 మందికి పైగా ఖైదీలు వివిధ జైళ్ల నుండి తప్పించుకున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమై దాదాపు ఏడు నెలలు గడిచినా వారిలో 700 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలలో చాలా మంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మరణశిక్ష పడిన ఖైదీలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఖైదీలు ఎక్కడకి వెళ్లిపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, భారత వ్యతిరేక శక్తులు అక్కడ నిరంతరం బలపడుతున్నాయని.. భారతదేశానికి వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ ఖైదీలు భారతదేశంలోకి ప్రవేశించి ఉండవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భారతదేశంలో ఆందోళన మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం దీనిని ధృవీకరించింది. జూలై-ఆగస్టులో రాజకీయ గందరగోళం సమయంలో జైళ్ల నుండి తప్పించుకున్న దాదాపు 700 మంది ఖైదీల జాడ ఇప్పటికీ లేదని తెలిపింది. దాదాపు 700 మంది ఖైదీలు ఇంకా కనిపించడం లేదని హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఇక్కడ తెలిపారు. వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివరాలు ఇవ్వకుండానే, చాలా మంది ఖైదీలను తిరిగి అరెస్టు చేశారని అయితే పారిపోయిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
టాటా హారియర్ కొనాలని చూస్తున్నారా ఎంత డౌన్ పేమెంట్.. ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా ?
భారతదేశంలో SUV కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకంగా టాటా మోటార్స్ లాంటి కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునే కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. టాటా మోటార్స్ ప్రీమియమ్ ఎస్యూవీ మోడల్ టాటా హారియర్ తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లు, స్టైలిష్ లుక్, అధునాతన టెక్నాలజీతో మార్కెట్లో అదరగొడుతోంది. టాటా హారియర్ కారు ధర రూ.15.49 లక్షల నుంచి రూ.26.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది Pure, Adventure, Fearless, Dark Edition వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే లభించే ఈ SUV 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను కలిగి ఉంది.
బాలీవుడ్ సింగర్‌తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన మహమ్మద్ సిరాజ్!
టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవల ముంబైలోని బాంద్రాలో జనై 23వ పుట్టినరోజు వేడుకలు జరగగా.. సిరాజ్ హాజరయ్యాడు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ సింగర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. ఓ ఫొటోలో ఇద్దరూ (జనై, సిరాజ్) కాస్త సన్నిహితంగా ఉన్నట్లు ఉంది. దాంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు పలు వెబ్ సైట్‌లు వార్తలు రాసుకొచ్చాయి. జనై భోస్లేతో డేటింగ్ వార్తలు మహ్మద్ సిరాజ్ వద్దకు చేరాయి. దాంతో సిరాజ్ ఓ క్లారిటీ ఇచ్చాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని, దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని ఇన్‌స్టా స్టోరీలో సిరాజ్ పేర్కొన్నాడు. ‘జనై భోస్లే నాకు సోదరి. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే ఆమె వెయ్యి మందిలో ఒకరు’ అని సిరాజ్ పోస్టు చేశాడు. సిరాజ్ తనకు సోదరుడని జనై కూడా ఇన్‌స్టా స్టోరీలో తెలిపింది. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలే ఈ జనై. మరోవైపు సిరాజ్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఆ ఊహ కూడా నన్నెంతో బాధిస్తుంది.. అభిమాని ఎమోషనల్ లేఖ
ప్రస్తుతం ఫామ్ కోసం తెగ కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు తగ్గిందని, క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఫామ్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో రంజీ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇకపోతే, మరోవైపు రోహిత్ శర్మపై విపరీతంగా ప్రేమను కలిగిన ఓ 15 ఏళ్ల బాలుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో బాలుడు రోహిత్ శర్మపై ఉన్న తన అభిమానాన్ని, విశ్వాసాన్ని అద్భుతంగా వ్యక్తం చేశాడు. “నా ఆరాధ్య దేవుడు, నా ఫేవరెట్ క్రికెటర్, గ్రేటెస్ట్ బ్యాటర్ ఆఫ్ ఆల్ టైమ్! మీరు ఆడిన ప్రతి మ్యాచ్ నాకు ప్రత్యేకం. మీరే మా కలల హిట్‌మ్యాన్. లక్షలాది మంది అభిమానుల మనసులో మీకున్న ప్రేమను నేను ఈ లేఖ ద్వారా వ్యక్తం చేస్తున్నాను. ఫామ్ అనేది తాత్కాలికం, కానీ క్లాస్ పర్మనెంట్… మీ ఫామ్ తగ్గిందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో మీరు అద్భుతంగా రాణిస్తారు. రంజీ మ్యాచ్‌లో మీరు కొట్టిన మూడు సిక్సర్లు అద్భుతమైనవి. మీ మ్యాచ్‌ను చూడటానికి నేను నా మ్యాథ్స్ క్లాస్‌ను ఎగ్గొట్టాను కూడా. ఎందుకంటే, మీ ఆట చూడటం నాకు ముఖ్యం. మీ నాయకత్వం అన్నిటికంటే గొప్పది. ప్రతి ఫార్మాట్‌లోనూ మీరు ప్లేయర్‌గా, కెప్టెన్‌గా విజయవంతం అయ్యారని, మీరే మైదానంలోకి ఓపెనింగ్ చేయకపోతే నేను టీవీ ఆన్ చేయలేనని తన ఆవేదనను తెలిపాడు. అది ఊహించడం కూడా నాకు బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.
వాట్సాప్ యూజర్లకు షాక్.. ‘View Once’ ఫీచర్‌లో పెద్ద లోపం..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. అందులో “వ్యూ వన్స్” (View Once) ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. ఈ ఫీచర్ ద్వారా ఫొటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్‌లను పంపితే అవి అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా డిలీట్ అవుతాయి. ఇది వ్యక్తిగత ఫైల్స్, ప్రైవేట్ సమాచారం పంపించడానికి అనేకమంది ఉపయోగిస్తారు. అయితే, ఈ ఫీచర్‌లో ఓ పెద్ద లొసుగు ఉండడంతో యూజర్ల ప్రైవసీకి ప్రమాదం కలుగుతోంది. వాట్సాప్ ప్రకారం, “వ్యూ వన్స్” ఫీచర్‌లో పంపిన మీడియాను అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత అది తిరిగి కనిపించదు. కానీ, ప్రస్తుతం ఐఫోన్‌లలో ఓ లొసుగును ఉపయోగించి, “వ్యూ వన్స్” మీడియాను మళ్లీ చూడగలిగే అవకాశం ఉంది. ఈ లొసుగుతో ఈ ఫీచర్ ఉద్దేశం పూర్తిగా విఫలమవుతోంది. ఐఫోన్ యూజర్లు ఈ క్రింది పద్ధతిని అనుసరించి “వ్యూ వన్స్” మీడియాను మళ్లీ చూడవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసి Settings > Storage and Data > Manage Storage వెళ్లాలి. అక్కడ చూపబడే కాంటాక్ట్‌ల జాబితాలో మీకు అవసరమైన వ్యక్తి పేరు ఎంచుకోండి. Sort By > Newest First ఆప్షన్ ఎంచుకుంటే “View Once” మీడియా పునరుద్ధరించబడుతుంది. దాంతో, మళ్లీ ఆ ఫోటో లేదా వీడియోను చూడగలుగుతారు. ఈ లొసుగుతో “వ్యూ వన్స్” మీడియా నిజంగా ఒకసారి మాత్రమే కనిపిస్తుందన్న నమ్మకం దెబ్బతింటోంది. వ్యక్తిగతంగా, రహస్యంగా భావించిన సమాచారాన్ని పంపేవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ షేర్ చేసిన హీరో
సినీతారలు ఒక్కొకరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ పండండి బిడ్డకు జన్మనిస్తూ సెటిల్ అవుతున్నారు. అలానే టాలివుడ్ కు చెందిన హీరోయిన్ యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేసి తాను ప్రేమించిన వాడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది తిరిగే లోపే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకి ఆమె ఎవరు అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్న ఆగండి. పిల్ల జమీందార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ హరిప్రియా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా సూపర్ హిట్ తో తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది హరి ప్రియా. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన హిట్ సినిమా జై సింహ లోను కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి 2023 జనవరి 26న తాను ప్రేమించిన వాడు ప్రముఖ నటుడు వశిష్ట సింహను పెళ్లి చేసుకుంది హరి ప్రియ. పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత గత ఆదివారం ఈ జంటకు మగ బిడ్డ జన్మించాడు. ఆ విషయాన్నీ సోషల్ మీడియూలో ఆడియెన్స్ తో పంచుకుంటూ ఫోటోలు షేర్ చేసాడు హరి ప్రియా భర్త నటుడు వశిష్ట సింహ. ‘బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో హరిప్రియ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. మా జీవితంలో ఓక కొత్త అధ్యాయం మొదలైంది’ అని ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు వశిష్ఠ. పెళ్లి రోజునే బిడ్డకు జన్మనివ్వడంతో ఈ హరి ప్రియా వశిష్ఠ జంటకు అనందంలో మునిగి తేలుతున్నారు.