రాజ్యసభ రాజకీయం.. విజయసాయిరెడ్డి రాజీనామాతో కొత్త చర్చ..!
రాజ్యసభలో పెద్దలుంటారు.. వయసులో కాదు.. హోదాలో.. అందుకే పెద్దల సభ అంటారు. మరిక్కడ ఏం జరుగుతోంది.. కొంతమంది. పెద్దల వ్యవహార శైలి ఎందుకు విచిత్రంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలైన.. టీడీపీ, వైసీపీల్లో రాజ్యసభ సభ్యుల తీరు మరింత ఆశ్చర్యంగా.. ఇంకొంచెం విచిత్రంగానూ ఉంది.. సాయిరెడ్డి రాజీనామాతో ఈ చర్చ బాగా ఎక్కువగా జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ పదవుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేది.. ప్రధానంగా చంద్రబాబు ఆచి తూచి కొన్ని సందర్భాల్లో ఒత్తిడితో పదవులు ఇచ్చారు.. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయినవారు చాలా మంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు.. రేణుక చౌదరి.. తులసి రెడ్డి.. సి రామచంద్రయ్య.. కిమిడి కళా వెంకట్రావ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి.. వంగా గీత.. మైసూరారెడ్డి.. మోహన్ బాబు.. ఇలా చాలా మంది రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోయిన పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు.. వాటిని సమర్ధంగా ఎదుర్కోవాలి.. కానీ, కేవలం. రాజ్యసభ సభ్యుల విషయంలో మాత్రం ఒక ప్రత్యేక ఎజెండా తెరపైకి వస్తోంది.. దీంతో పవర్ పోతే ఆటోమాటిక్ గా జంప్ అయిపోతున్నారు.. పార్టీకి ఎంతో లాయల్ గా ఉన్నారని రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తున్నారు.. కానీ, వాస్తవ పరిస్థితిలో వీటిని పక్కన పెట్టి జంప్ అవ్వడంతో ప్రాంతీయ పార్టీల్లో రాజ్యసభ సభ్యుల విషయంలో కొత్త చర్చ మొదలవుతోంది…
2027లో గోదావరి పుష్కరాలు.. రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు..
2027లో జరిగే పుష్కరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 271 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లు పిలిచింది. కాగా.. పుష్కరాల ప్రతిపాదనలతో వీటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం మంజూరు చేసింది. కాగా.. విజయవావడ రైల్వే డివిజన్ పరిధిలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అత్యంత ప్రధానమైంది. ఈ స్టేషన్ నుంచి నిత్యం వేల మంది ప్రయాణికులు విజయవాడ-విశాఖ-కాకినాడ-భీమవరం వైపు రాకపోకలు సాగిస్తుంటారు. వచ్చే 40 ఏళ్ల నాటికి సుమారు లక్ష మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి గమ్య స్థానాలకు చేరుకుంటారని అంచనా. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి హంగులతో తీర్చిదిద్దాలని గతంలో రైల్వే శాఖ నిర్ణయించింది. అమృత భారత్ స్టేషన్ పథకం కింద 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. పుష్కరాల నేపథ్యంలో కొత్త నిధులను కేంద్ర ప్రకటించింది.
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కోర్టులో దక్కని ఊరట.. విద్యార్థులపై భారం..
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకి కోర్టులో ఊరట దక్కలేదు. అటు ఇంటర్ బోర్డు కూడా వెనక్కి తగ్గడం లేదు. మిక్స్డ్ అక్యుపెన్సీ భవనాల్లో నడుస్తున్న కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం బోర్డు లక్ష రూపాయలు ఫైన్ వేసింది. దీంతో కొన్ని కాలేజి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రేపే ఇంటర్ ఫీజ్ కట్టేందుకు చివరి తేదీ కావడంతో ఈ లక్ష రూపాయలు కట్టేందుకు కళాశాలలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి విద్యార్థి వద్ద లేట్ ఫీ రూపంలో 2 వేల 500 రూపాయల ఎగ్జామ్ ఫీ చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా… ఈ ఏడాది ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు దకకపోవడంతో విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది. ఈ కాలేజీల్లో సెకండియర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఫస్టియర్ విద్యార్థుల విషయంపై మాత్రం ఎటూ తేల్చలేదు. ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు అనుమతివ్వాలన్న ప్రైవేట్ కాలేజీల విజ్ఞప్తితో ఈ ఒక విద్యాసంవత్సరానికి అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్ బోర్డు లక్ష రూపాయల ఫైన్ వేసింది. ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇంటర్ బోర్డు పెత్తనం ఏంటి అంటూ.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రశ్నించింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. లక్ష రూపాయలు కట్టమంటూ మొండిపట్టుపట్టాయి. లక్ష రూపాయలతో పాటు… విద్యార్థుల ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు ఒక్కో విద్యార్థికి 2 వేల 500 రూపాయల ఆలస్య రుసుము చెల్లించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సకలమ్మ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి తరలి వెళ్లారు. ఆమె భౌతికకాయానికి ఓల్డ్ అల్వాల్‌లోని టీఎస్‌ఆర్ గోల్డెన్ లీఫ్ అపార్ట్‌మెంట్‌కు తరలించినట్లు సమాచారం. శనివారం అంత్యక్రియాలు జరగనున్నాయి.
సైకిల్‌పై 15 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల బాలన్ తన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శివగామి (65) మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు. గత నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. కాకపోతే, ఈసారి ఆమె మరణం తరువాత కూడా అతని తల్లిని సైకిల్ పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల హృదయాలను కలిచివేసింది. శివగామి, తిరునల్వేలి జిల్లా నంగునేరి సమీపంలోని మీనావంకులం గ్రామానికి చెందిన మహిళా. ఆమె భర్త జెబామలై చాలా సంవత్సరాల క్రితం మరణించడంతో, శివగామి తన ముగ్గురు కుమారులతో జీవితాన్ని గడిపింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. అంతేకాదు, ఆమె చిన్న కుమారుడు బాలన్ కూడా స్వల్ప మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు.
నైజీరియా సైన్యం ఊచకోత.. 79 మంది ఉగ్రవాదులు హతం
నైజీరియా సైన్యం శుక్రవారం తన తాజా భద్రతా ఆపరేషన్‌లో 79 మంది ఉగ్రవాదులు, కిడ్నాపర్‌లను హతమార్చినట్లు వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఈశాన్య నైజీరియాలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల తిరుగుబాటుదరు అలాగే నార్త్-వెస్ట్ ప్రాంతంలో సాయుధ గ్రూపుల దాడులను లక్ష్యంగా చేసుకుని చేపట్టబడింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈశాన్య ప్రాంతంలో దాదాపు 35,000 మంది పౌరులు మరణించారు. అలాగే 2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో, నైజీరియా తమ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో 252 మందిని అరెస్టు చేసినట్లు నైజీరియా ఆర్మీ అధికార ప్రతినిధి ఎడ్వర్డ్ బుబా ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న 67 మందికి విమోచనం కల్పించారు. నార్త్ వెస్ట్ ప్రాంతంలో కిడ్నాప్ ఒక సాధారణ వ్యవహారంగా మారింది. ఇక్కడ సాయుధ సమూహాలు గ్రామాలు, ప్రధాన రహదారులపై దాడి చేసి ప్రజలను అపహరిస్తున్నాయి. వీరిలో ఎక్కువ భాగం డబ్బులు చెల్లించిన తర్వాతే విడుదల అవుతారు. అరెస్టయిన వారిలో 28 మంది నిందితులు ముడి చమురు దొంగతనంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. నైజీరియాలో ముడి చమురు దొంగతనం అనేది పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల దేశం ప్రతీ ఏడాది కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోంది. 2009-2020 మధ్య నైజీరియా 46 బిలియన్ల డాలర్స్ కు పైగా నష్టపోయింది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
భారత్ జోరును ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా! నేడే రెండో టి20
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా, రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో పునరాగమనం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇకపోతే, చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు ఎక్కువ మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మరోసారి ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హార్దిక్ పాండ్యా రూపంలో రెండో పేసర్‌తో భారత్ బరిలోకి దిగనుంది. ఇక ఇరు జట్ల మధ్య టి20లో రికార్డ్స్ పరంగా చూస్తే.. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 25 టీ20 మ్యాచ్‌లు జరగగా.. వీటిలో టీమ్ ఇండియా 14 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చెలాయించగా, ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు భారత్‌పై 11 విజయాలు సాధించింది. ఇక చెన్నైలోని స్టేడియం ఇప్పటివరకు కేవలం రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్ ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1 పరుగు తేడాతో ఓడిపోగా, చివరిసారిగా 2018లో చెపాక్‌లో వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా తలపడింది. ఆ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. నేడు మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది.
మహా కుంభమేళాలో సన్యాసం తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్..
ఉత్తర్‌ప్రదేశ్‌లో మహా కుంభమేళా ఎంత ఘనంగా జరుగుతోందో మనకు తెలిసిందే. అయితే తాజాగా కుంభమేళాలో ఓ హీరోయిన్ సన్యాసం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..? మమతా కులకర్ణి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ 90లలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన హీరోయిన్ లో ఆమె కూడా ఒకరు. అప్పట్లో ఆమె అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది మమతా. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైన మమతా కులకర్ణి, ఇక ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల తర్వాత తిరిగి భారత్‌కి వచ్చింది. కాగా జనవరి 24న కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర డాక్టర్ లక్ష్మి నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. అంతేకాదు మమతా కులకర్ణి నుంచి తన పేరును శ్రీయామై మమత నందగిరిగా మార్చుకుంది. కాషాయ దుస్తులు ధరించి మెడలో రుద్రాక్ష మాల, భుజానికి వేలాడుతున్న జోలె వేసుకుని కనిపిస్తున్న మమతా కులకర్ణి. ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఇందుకు సంబందించిన ఫోటోలు కొన్ని వీడియోలను స్వయంగా మమతా నే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రజంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ అప్ డేట్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా వరుస ప్రాజుక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు మన డార్లింగ్. అయితే ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా కూడా చేయబోతున్న విషయం తెలిసిందే. సందీప్ తన డైరెక్షన్‌లో హీరోలను ఎంత పవర్ ఫుల్‌గా చూయిస్తాడో మనకు తెలిసిందే. ‘యానిమల్’ మూవీ దీనికి పూర్తి నిదర్శనం. దీంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ ‘స్పిరిట్’ మూవీని సందీప్ రెడ్డి వంగా తనదైన మార్క్‌తో పూర్తి పోలీస్ స్టోరీ కథగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందట. అంతేకాదు ఇప్పటివరకు చూడనివిధంగా ప్రభాస్‌ని ఒక కోణంలో చూపించబోతున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ ఇన్‌ట్రస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతుంది. ఎంటంటే ఈ మూవీ తొలి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సందీప్ రెడ్డి సిద్ధమవుతున్నాడట. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్‌ను ఇండొనేషియా రాజధాని జకార్తాలో చేయబోతున్నారనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలోని పోలీస్ సీన్స్ కొన్ని ఇక్కడ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తేలినప్పటికీ ఇక ఈ మూవీలో ప్రభాస్ లుక్ మాత్రం వెరె లెవల్ ఉంటుందట.