నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. మండలికి మాత్రమే వైసీపీ సభ్యులు..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.. అయితే, ఇవాళ శాసన సభ, శాసన మండలి రెండూ సమావేశం అవుతాయి.. శాసన సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది. ఎమ్మెల్యే కూన రవి కుమార్ సభలో ధన్యవాదాలు తీర్మానాన్ని ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగం పై చర్చ జరుగుతుంది.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు.. ఇక, శాసన మండలిలో ఏపీ ఎంఆర్డీ సవరణ ఆర్డినెన్స్ మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది.. శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు ప్రసంగిస్తారు. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.. అయితే, ఇవాళ నుంచి జరుగుతున్న సమావేశాలను మాత్రమే మొదట రోజు సమావేశాలుగా అసెంబ్లీ రికార్డ్స్ లో. చూపిస్తూన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గవర్నర్ ప్రసంగానికి వచ్చినా కూడా మొదటి రోజు హాజరైనట్టు లెక్కలోకి రాదు అనే చర్చ జరుగుతోంది. అయితే, అసెంబ్లీ వర్గాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.. గవర్నర్ ప్రసంగించే రోజు కేవలం సమావేశాలు ప్రారంభమైన రోజు అని.. స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలు ప్రారంభమైన రోజును మొదటి రోజుగా గుర్తిస్తారని ఒక చర్చ జరుగుతోంది.. దీంతో జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ప్రసంగానికి రావడం తో మొదటి రోజు అధికారికంగా హాజరైనట్టా. లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది..
నేడు పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకుంటారు వైఎస్ జగన్.. అనంతరం పులివెందులలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఇక, రేపు ఉదయం 10 గంటలకు పులివెందుల పట్టణంలోని గుంత బజార్ లో ఉన్న వైఎస్సార్ పౌండేషన్ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునికరించిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభిస్తారు.. అనంతరం రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నారు వైఎస్ జగన్.. తిరిగి మార్చి 3వ తేదీ సోమవారం రోజు బెంగళూరు నుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లికి వచ్చే అవకాశం ఉంది.
వంశీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. నేడు పోలీసు కస్టడీకి..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఉచ్చు బిగిస్తోంది.. వంశీ 2014 నుంచి 2024 వరకు పదేళ్లపాటు గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు.. 2019 టీడీపీ నుండి గెలిచి వైసీపీకి జై కొట్టారు.. ఆ సమయంలో వంశీ, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కబ్జాలు మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడినట్లు విజిలెన్స్ ఇప్పటికే నివేదికలో గుర్తించినట్టు సమాచారం. దీనిపై త్వరలో కేసు నమోదు అవుతుందని భావిస్తున్న వేళ ప్రత్యేకంగా వంశీ చేసిన అక్రమాలపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం కొత్తగా నలుగురు అధికారుల బృందంతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఏలూరు డీఐజీగా ఉన్న అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సిట్ పని చేస్తుంది. వంశీ వ్యవహారాల వల్ల అక్రమాల వల్ల ప్రభుత్వానికి సుమారు 200 కోట్లు నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వేసినట్టు తెలుస్తుంది. ఇక, నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.. వంశీకి బెయిల్ ఇవ్వొద్దంటూ కౌంటర్ దాఖలు చేయనున్నారు పోలీసులు.. నేడు వాదనలు జరిగే అవకాశం ఉంది.. అయితే, వల్లభనేని వంశీనీ నేడు కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ నిమిత్తం వంశీ సహా మరో ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. అనుమతించింది కోర్టు.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వంశీని విచారించనున్నారు పోలీసులు.. ఈ నెల 27వ తేదీతో వల్లభనేని వంశీ మోహన్ పోలీస్ కస్టడీ ముగినుంది..
72 గంటలు గడుస్తున్నా.. 8 మంది ఆచూకీపై రాని క్లారిటీ!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుని 72 గంటలు (మూడు రోజులు) గడుస్తున్నా.. సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు. టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇప్పటికి క్లారిటీ రాలేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్‌లోకి వెళ్లి.. ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎల్ అండ్ టీ టన్నెల్ నిపుణులు, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు, జియాలజి నిపుణులు సహాయ చర్యల్లో ఉన్నా.. ఫలితం లేదు. టన్నెల్‌లో పూర్తిగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని రెస్క్యూ బృందాలు ఉన్నతాధికారులకు వివరించాయి. టీబీఎం మిషన్ సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. మిషన్ వెనకాల పెద్ద ఎత్తున మట్టి, బురద ఉండడంతో రెస్క్యూ బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. టీబీఎం మిషన్‌ను కదిలిస్తే.. పైకప్పు మరోసారి కుప్పకూలే అవకాశం ఉందని ఇంజనీర్లు అంటున్నారు. టన్నెల్‌లో 13.452 కిలోమీటర్ల తరువాత సీపేజ్ జోన్, డేంజర్ జోన్ ఉన్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. రెస్క్యూ బృందాలు టీబీఎం మిషన్ దాటి ముందుకు వెళ్లేందుకు సాహసం చేయలేకపోతున్నాయి. టన్నెల్ వద్దకు 8 మంది కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తమ వారిని కాపాడాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.
కోల్ కతాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో నమోదు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని చెబుతున్నారు. భూకంప కేంద్రం బంగాళాఖాతంలో ఉందని, దాని లోతు 91 కిలోమీటర్లు ఉందని అధికారులు తెలిపారు. భూకంపాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ కూడా నిర్ధారించింది. భూకంపం వల్ల జరిగిన నష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. కోల్‌కతాలో భూకంప కేంద్రం నగరానికి చాలా దూరంలో ఉంది. నేటి భూకంప కేంద్రం భూమికి 91 కిలోమీటర్ల దిగువన ఉంది.. కాబట్టి ఈ భూకంపం వల్ల నష్టం జరిగే అవకాశం తక్కువ. ఉపరితలం నుండి ఐదు లేదా 10 కిలోమీటర్ల దిగువన సంభవించే నిస్సార భూకంపాలు ఉపరితలం క్రింద చాలా లోతులో సంభవించే భూకంపాల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.
ఐదేళ్ల తర్వాత కూడా కరోనా ఎంత ప్రమాదకరం.. అమెరికా నుండి షాకింగ్ నివేదిక
ప్రపంచ పురోగతిని నిలిపివేసిన కరోనా వైరస్ భయం ఇప్పటికీ ప్రజలలో కొనసాగుతోంది. ఈ భయం గురించి అమెరికాలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. 21 శాతం మంది అమెరికన్లు కరోనా ఇప్పటికీ ఆరోగ్యానికి పెద్ద ముప్పు అని చెబుతున్నారు. ఈ ప్రజలు కరోనా భయం ఇప్పటికీ తమలో ఉందని భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది ప్రజలు కరోనాను ఇకపై సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు.. సర్వేలో పాల్గొన్న 63 శాతం మంది ప్రజలు అనారోగ్యంగా అనిపిస్తే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా వారు సకాలంలో చికిత్స పొందవచ్చని చెప్పారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వినాశనం సృష్టిస్తున్నప్పుడు, ప్రజలకు మాస్క్‌లు అతిపెద్ద సపోర్టునిచ్చాయి. అయితే, ప్రపంచంలో చాలా మంది ఇకపై మాస్క్‌లు ధరించడం లేదు. ప్యూ రీసెర్చ్ ప్రకారం.. 80 శాతం మంది అమెరికన్లు ఇకపై మాస్క్‌లు ధరించడానికి ఇష్టపడరు. 40 శాతం మంది అమెరికన్ పౌరులు అనారోగ్యానికి గురైనప్పుడు ముసుగు ధరిస్తారని ఖచ్చితంగా చెప్పారు. ఆసక్తికరంగా.. సర్వేలో పాల్గొన్న వారిలో 16 శాతం మంది ఏమి జరిగినా దేశంలో ఏమీ మారదని అన్నారు.
భారత్, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో వేయండి.. లేదా హాస్పిటల్ బిల్లులైన చెల్లించండి!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన విజయయాత్రను కొనసాగించింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని 241 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్ధేశించింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 42.3 ఓవర్లలోనే సులభంగా ఛేదించింది. చివరి పరుగులను విరాట్ కోహ్లీ కొట్టి సెంచరీ సాధించడంతో భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ ఓటమితో పాకిస్థాన్ అధికారికంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించలేదు. కానీ, సెమీ ఫైనల్స్ అవకాశాలు మాత్రం ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే -1.087 నెట్ రన్ రేట్‌తో ఇబ్బందిలో ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్‌ను ఓడించేందుకు భారత్, బంగ్లాదేశ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, ఓ ఓటమితో పాకిస్థాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పాకిస్థాన్ అభిమాని ఐసీసీని ఉద్దేశించి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత జట్టుతో ప్రతిసారీ ఒకే గ్రూప్‌లో ఉంచి మళ్లీ మళ్లీ పరాజయాన్ని తలపెట్టొద్దని, ఇలా చేయడం తమకు మానసిక క్షోభ కలిగిస్తోందని అతను వ్యాఖ్యానించాడు.
అదే నా బలహీనతగా మారింది: కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ మైదానంలో అన్ని రకాల షాట్స్ ఆడుతాడు. ‘కవర్ డ్రైవ్’ బాగా ఆడతాడని కోహ్లీకి పేరు. అయితే ఇటీవల తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ షాటే తనకు బలహీనతగా మారిందని అంగీకరించాడు. ఇటీవలి కాలంలో కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ.. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుతున్న సంగతి తెలిసిందే. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌పై మాత్రం అద్భుత కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. దీనిపై విరాట్ స్పందించాడు. బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘గత కొన్నాళ్లుగా కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారింది. కవర్ డ్రైవ్ ఆడబోయి చాలాసార్లు అవుట్ అయ్యాను. గతంలో అదే షాట్‌తో నేను చాలా పరుగులు చేశాను. ఈ రోజు నేను నా షాట్లనే నమ్ముకున్నా. పాకిస్థాన్‌పై తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ ద్వారానే వచ్చాయి. అలాంటి షాట్స్ ఆడినపుడు నా బ్యాటింగ్ నియంత్రణలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నాకు ఇది మంచి ఇన్నింగ్స్. టీమిండియాకు ఇది మంచి విజయం. చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.
మహేష్ బాబు గుణం అలాంటిది: నాగేంద్రబాబు
చిరంజీవి తమ్ముడు అయినప్పటికీ… తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు . అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఆయన పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాగ బాబు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.. నాగబాబు మాట్లాడుతూ.. ‘ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి సమానంగా ఇండస్ట్రీలో హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ బాబు మాత్రమే. ముఖ్యంగా మహేష్ బాబుకి ఉన్నంత లేడీ ఫాలోయింగ్ ఏ హీరోకి లేదు. చెప్పాలంటే అందంలో ఆయనకు పోటీ ఇచ్చే మగాడు కూడా లేరు. మా భార్య కూడా మహేష్ బాబు కి పెద్ద ఫ్యాన్. తన తమ్ముడి గా భావిస్తూ ఉంటుంది. చిన్నతనంలో మహేష్ బాబు బాగా లావుగా ఉండేవాడు సన్నగా, నాజుగ్గా మారేందుకు అతను ఎంతో కష్ట పడేవాడో నాకు తెలుసు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో నాన్ స్టాప్ గా పరుగులు తీసే వాడు. ఏదైనా అనుకుంటే సాధించి తీరే వరకు నిద్రపోని గుణం మహేష్ లో ఉంది. ఆ గుణం నాకు నచ్చుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ రీ- రిలీజ్ డేట్ ఫిక్స్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం సలార్. 2023 డిసెంబర్ 22 న విడుదలయిన సలార్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా సలార్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్‍తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించింది. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందించారు. కాగా ఓటీటీ లోను సలార్ అద్భుతమైం స్పందన రాబట్టింది. ఏకంగా ఏడాది పాటు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. అనేక సూపర్ హిట్ సినీమాలు రీరిలీజ్ పేరుతో ఆడియెన్స్ ముందుకు వచ్చాయి.ఈ నేపథ్యంలో రెబల స్టార్ అభిమానుల ఎదురుచూస్తున్న సలార్ మరోసారి రిలీజ్ కు రెడీ అయింది. రానున్నమార్చి 21న సలార్ రెండు తెలుగు రాష్ట్రలో రిలీజ్ కానుంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సలార్ రీరిలీజ్ సెలెబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. మరోవైపు మహాశివరాత్రి కానుకగా రెబల్ స్టార్ నటించిన రెబల్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షో ప్లాన్ చేసారు మేకర్స్.