నేడు విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. గుర్లకు వెళ్లనున్న ఆయన.. డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. ఇక, విజయనగరం జిల్లా పర్యటనకు ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న జగన్.. ఉదయం 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు.. ఇక, డయేరియా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు వైఎస్ జగన్.. విజయనగరం జిల్లా పర్యటన ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు జగన్..
రిసెప్షన్‌కు వెళ్తుండగా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రాజానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు.. ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ప్రయాణికులు కర్నూల్ నుంచి తిరుపతికి రిసెప్షన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలంలో ఒకరు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కర్నూల్ జిల్లా ఎల్లూరు నగర్ కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్ (51), కర్నూల్ జిల్లా నరసింహారెడ్డి నగర్ చెందిన కామిశెట్టి సుజాత (40), ఎల్లూరు నగర్‌కు చెందిన రావూరి వాసవి (47) లు ఉన్నారు. క్షతగాత్రులను 108లో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఇక, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు పోలీసులు..
దూసుకొస్తున్న ‘దానా’ తుఫాన్.. ఉద్దానంలో వణుకు..!
తీరంవైపు దానా తుఫాన్ దూసుకొస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అధికార యంత్రాంగాన్ని, ప్రజలకు కీలక సూచనలు చేస్తోంది.. అయితే, దానా తుఫాన్ ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందనే అంచనాలతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత, అనుభవాల దృష్ట్యా.. దానా ఏం చేస్తుందో అనే టెన్షన్‌లో పడిపోయారు.. అయితే, 1999లో అతి తీవ్ర తుఫాన్ ఒడిశాలో తీరం దాటినప్పుడు ఈ ప్రాంతంలో 12 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి.. వేల ఎకరాల్లో జీడి తోటలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం దానా తుఫాన్ సైతం ఒడిశాలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.. తిత్లీ తుఫాన్ దెబ్బకు 16 లక్షల కొబ్బరి చెట్లు నాశనం కాగా.. 55 వేల ఎకరాల్లో జీడి తోటలు నామరూపాలు లేకుండా పోయాయి. ఇక, ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో 40 వేల ఎకరాల్లో కొబ్బరి, 60 వేల ఎకరాల్లో జీడి తోటలు సాగు చేస్తున్నారు.. పదేళ్ల తర్వాత ఖరీఫ్‌లో వరి సాగు బాగుండటంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. కానీ, వారికి దానా భయం పట్టుకుంది.. తుఫాన్ ప్రభావం పడితే 80 వేల ఎకరాల్లో పంటకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. 2018 అక్టోబర్‌లో తిత్లీ తుఫాన్ సంభవించిందని.. అదే నెలలో దానా అతి తీవ్ర తుఫాన్ సంభవిస్తుందనే సమాచారంతో రెండు నియోజకవర్గాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ క్షణాన ముప్పు వాటిల్లుతుందోనని మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ల వద్ద కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు.. 2013లో ఫైలిన్ తుఫాను సృష్టించిన విధ్వంసం కూడా ఉద్దానం ప్రాంత ప్రజలను వెంటాడుతూనే ఉంది. వేలాది కొబ్బరి చెట్లు కోల్పోయిన పరిస్థితి అది.. మరి దానా తుఫాన్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తోందోనని వణికిపోతున్నారు రైతులు, ప్రజలు..
నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రుణ మాఫీ, రైతు భరోసా పై బీఆర్ఎస్ పార్టీ పోరు బాటకు సిద్దమైంది. ఇవాళ జిల్లా కేంద్రంలోని రామ్ లీల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో రైతులు, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి శంఖారావం పూరించాలని బీఆర్ ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పంట రుణాలు మాఫీ చేయకపోవడం, రైతు భరోసా పథకం అమలు చేయకపోవడమే పోరాటానికి ప్రధాన ఎజెండా అని బీఆర్‌ఎస్ సభకు ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అధ్యక్షత వహిస్తుండగా.. కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, పెద్దపల్లి మాజీ ఎంపీ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొని పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టారు. రైతు పోరుబాట కార్యక్రమం నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణం పూర్తిగా గులాబీమయమైంది.
దానా ఎఫెక్ట్.. మరో 17 రైళ్లు రద్దు .. సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు..
ఒడిశా తీరప్రాంతంలో ‘దానా’ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా, తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేశారు. గురువారం నుంచి ఈ నెల 29 వరకు కొత్తగా రద్దయిన రైళ్లను నిలిపివేస్తున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. రద్దు చేయబడిన రైళ్ల సమాచారం కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 17 ముఖ్యమైన స్టేషన్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, ఖాజీపేట, ఖమ్మం, సామర్లకోట, వరంగల్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి, ఏలూరు, గూడూరు, నిడదవోలు, ఒంగోలు, తిరుపతి, రేణిగుంట, డోన్ స్టేషన్లలోని హెల్ప్‌లైన్ కేంద్రాలు ప్రయాణికులకు 24 గంటలూ అవసరమైన సమాచారాన్ని అందజేస్తాయని పేర్కొంది. ఈ తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 నగరాలు/పట్టణాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దాదాపు 200 రైళ్ల సర్వీసులను రద్దు, దారిమళ్లించినట్లు సమాచారం.
దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశా, బెంగాల్లో రైలు, విమాన సేవలకు అంతరాయం..
దానా తుపాను తీరం దాటక ముందే ఒడిశా సర్కార్ అలర్ట్ అయింది. అలాగే, ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి సుమారు 10 లక్షల మందిని తరలించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. ఈరోజు (గురువారం) లేదా రేపు (శుక్రవారం) భిటార్కనికా, ధమ్రా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. కాగా, 120 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను ఒడిశాలోని సగం జనాభాపై తీవ్ర ప్రభావం చూపే ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు ఉదయం వరకు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. ఈ తుపాన్ బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కిలో మీటర్ల దూరంలో, ధమ్రా (ఒడిశా)కి 360 కిలో మీటర్ల దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్నసెబీ చైర్మన్ మాధబి
సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ ఈరోజు (గురువారం) పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరుకానున్నట్లు సమాచారం. తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే పార్లమెంట్ కమిటీ మాధబికి నోటీసులు జారీ చేసింది. దీంతో సెబీ పని తీరుపై సమీక్షించేందుకు పీఏసీ రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న పార్లమెంట్ కమిటీ ముందు ఆమె హాజరుకానున్నారు. అయితే, ఈ చర్యలను భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యులు ఆరోపణలు చేశారు. కాగా, పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పని తీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కూడా హాజరు కావాల్సి ఉంటుంది.
ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్
ఇజ్రాయెల్, లెబనాన్ కు చెందిన హెజ్‌బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ క్షిపణులతో దాడి చేసింది. తాము చేసిన దాడుల్లో మిసైల్స్ ఖచ్చితమైన టార్గెట్లను చేరుకొన్నాయని తెలిపారు. ఈ మేరకు బుధావారం రాత్రి హెజ్‌బొల్లా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. లెబనాన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు నాలుగు మిసైల్స్‌ను హెజ్‌బొల్లా ప్రయోగించిందని వాటిలో రెండింటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. మరో రెండు నివాస స్థలాలకు దూరంగా పడిపోయాయని చెప్పుకొచ్చింది. ఈ మిసైల్స్ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఐడీఎఫ్ చెప్పుకొచ్చింది. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాన్ టీవీ న్యూస్ ఛానల్.. వెస్ట్ బ్యాంక్‌లోని కల్కిలియా నగరం సమీపంలో ఒక మిసైల్ పడిపోయినట్లు కథనం ప్రసారం చేసింది. ఆ మిసైల్ దాడికి ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా, ఒక కారు ధ్వంసమైనట్లు ప్రకటించింది. ఇక, సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజ్‌బొల్లాను అంతం చేయటమే లక్ష్యంగా లెబనాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులను కొనసాగిస్తుంది. అక్టోబరు నెల ఆరంభంలో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనీస్ సరిహద్దుకు సమీపంలో ఒక గ్రౌండ్ ఆపరేషన్‌ను కూడా చేసింది. హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను బలహీనపరచటమే లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తుంది.
విరాట్ కోహ్లీని దాటేసిన రిషబ్ పంత్! అగ్ర స్థానంలో బుమ్రా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్ములేపాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల జాబితాలో మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. పంత్ ఖాతాలో ప్రస్తుతం 745 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ 20, 99 పరుగులు చేశాడు.టెస్టు ర్యాంకింగ్స్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పంత్ అధిగమించాడు. ఒక స్థానం కిందకి పడిపోయిన విరాట్ (720).. ఎనిమిదో ర్యాంకు సాధించాడు. భారత్ vs న్యూజిలాండ్, పాకిస్థాన్ vs ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌లు ముగియడంతో ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (917) అగ్ర స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ (821), హ్యారీ బ్రూక్ (803) టాప్ 3లో ఉన్నారు. 780 పాయింట్లతో యశస్వి జైస్వాల్ నాలుగో స్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్ నుంచి టాప్ 10లో యశస్వి, విరాట్ మాత్రమే ఉన్నారు.
కంగువా సాంగ్‌లో దిశా డీప్ క్లీవేజ్.. ఆబ్జెక్ట్ చేసిన సెన్సార్ బోర్డ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. దాదాపు పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 14న కంగువా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. చిత్ర ప్రమోషన్లో భాగంగా సినిమా యూనిట్ రెండవ సింగిల్, “యోలో – యు ఓన్లీ లైవ్ వన్స్” దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన హై-ఎనర్జీ ట్రాక్‌ని విడుదల చేసింది. హీరోహీరోయిన్ల పై చిత్రీకరించబడిన ఈ పాట వారిద్దరి మధ్య బంధాన్ని ప్రదర్శిస్తూ హుక్ స్టెప్స్‌తో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పాటలో మూడు సెకన్లు, ప్రత్యేకంగా దిశా పటానీ “డీప్ క్లీవేజ్ ఎక్స్‌పోజర్” సన్నివేశాలను తొలగించాలని సూచించింది.
‘అమరన్’ మేజర్ ముకుంద్ కు ఘనమైన నివాళి..
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయిని మరోసారి పెంచింది. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ పరిశీలిస్తే నా ఎదురుగా ఎవరు ఉన్న సరే భయపడే ప్రశ్న లేదనే మేజర్ ముకుంద్ ఒరిజినల్ క్లిప్స్ ను చూపిస్తూ, ఈ నింగికి కడలికి మధ్య ఉన్న దూరమే మన నాకు తనకు అని సాయి పల్లవి చేప్పిన డైలాగ్స్ మనసుని హత్తుకున్నాయి. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథను కళ్ళకు కట్టినట్టు చుపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆర్మీలో చేసిన సేవలు, యుద్ధంలో ఆయన సాహసాలతో పాటు ఎమోషన్‌ని కూడా పర్ఫెక్ట్ చూపించారు. ప్రాణం కంటే దేశమే ముఖ్యం అనుకునే ముకుంద్ చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఇక జివి.ప్రకాశ్ కుమార్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, దర్శకుడి టేకింగ్ ఈ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న పాన్ ఇండియా బాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది అమరన్.