ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కొత్త కార్యక్రమం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతుల విద్యార్థులకు ఈ కార్యక్రమం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, కళాశాలల్లో కూడా ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ముస్తాబు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయగా, అక్కడ సత్ఫలితాలు కనిపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, వారి రోజువారీ అలవాట్లను పర్యవేక్షించడం, క్రమశిక్షణను పెంపొందించడం, మంచి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఈ కార్యక్రమం అమలు చేసే విధానం, పాటించాల్సిన నియమాలు, విధివిధానాలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ వెంటనే అమల్లోకి తేవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
నేడు నిడదవోలుకు పవన్ కల్యాణ్.. ‘అమరజీవి జలధారా’కు శంకుస్థాపన..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామంలో నిర్వహించనున్న అమరజీవి జలధారా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.20 గంటలకు మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరనున్న పవన్, ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి గ్రామ హెలిప్యాడ్‌కు బయలుదేరి, ఉదయం 10.50 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ఉదయం 10.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో అమరజీవి జలధారా కార్యక్రమం జరుగనున్న వేదికకు చేరుకుని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు వేదిక నుంచి బయలుదేరి, 1.05 గంటలకు పెరవలి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి, మధ్యాహ్నం 1.50 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతారు. ఈ పర్యటన నేపథ్యంలో పెరవలి గ్రామం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల.. కొత్త ఫొటోల్లో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్
మొత్తానికి లైంగిక నేరస్థుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంంధించిన ఫైల్స్ విడుదలయ్యాయి. దర్యాప్తుకు సంబంధించిన వేల పేజీల పత్రాలను అమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. ఎప్‌స్టీన్ దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను విడుదల చేయాలని ఇటీవలే ట్రంప్ ఆదేశిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదలైంది. లక్షలాది పత్రాలు ఉన్నాయని.. ప్రస్తుతం కొద్దిగా విడుదల చేస్తు్న్నామని.. రాబోయే వారాల్లో మరిన్ని విషయాలు వస్తాయని డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే వెల్లడించారు. ఇక తాజాగా విడుదలైన ఫొటోల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్ కనిపించారు. బిల్ క్లింటన్.. గుర్తుతెలియని మహిళతో జలకాలాటలు ఆడుతున్నట్లు కనిపించింది. బిల్ క్లింటన్ జాకుజీలో గుర్తుతెలియని మహిళతో పడుకుని ఉన్న ఫొటో ఎప్పుడూ.. ఎక్కడ తీశారో మాత్రం పత్రాల్లో పేర్కొనలేదు. ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నట్లుగా వెల్లడించలేదు. తాజాగా విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా బిల్ క్లింటన్ ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించిన చిత్రాలు మాత్రం కనిపించలేదు. ఇక దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కూడా అనేక చిత్రాల్లో కనిపించారు. అలాగే రోలింగ్ స్టోన్స్ ఫ్రంట్‌మ్యాన్ మిక్ జాగర్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులతో ఎప్‌స్టీన్ కనిపించారు. ఒక చిత్రంలో ట్రంప్ సంతకం చేసిన ఒక చెక్ కనిపించింది. ఎప్‌స్టీన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఆల్బమ్ చిత్రాల్లో ఇది కనిపించింది. ఈ చిత్రంపై వైట్‌హౌస్ స్పందించలేదు. ఇక అనేక పత్రాల్లో నగ్నంగా.. తక్కువ దుస్తులు ధరించిన చిత్రాలు కనిపించాయి. అలాగే ఎప్‌స్టీన్ గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో పోజులిచ్చిన అస్పష్టంగా ఉన్న ముఖాలు కనిపించాయి.
ఐసిస్ ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు
సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా దళాలు దాడులు చేస్తోంది. శుక్రవారం సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికన్ ఫైటర్ జెట్‌లు దాడి ప్రారంభించాయి. సిరియా అంతటా అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడులు చేస్తున్నాయి. డిసెంబర్ 13న పాల్మిరాలో ఇద్దరు అమెరికన్ ఆర్మీ సైనికులు, పౌర అనువాదకుడిని ఐసిసి మూకలు చంపిన తర్వాత అమెరికా ఈ దాడులకు దిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో సిరియాపై అమెరికన్ సైన్యం దాడి చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు, మౌలిక సదుపాయాలపై అమెరికా జెట్‌లు దాడులు చేస్తున్నాయి. సిరియా అంతటా అనుమానిత ఆయుధ నిల్వ సౌకర్యాలు, సరఫరా కేంద్రాలు, కార్యాచరణ భవనాలు వంటి అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ‘‘సిరియాలో ధైర్యవంతులైన అమెరికన్ దేశభక్తులను ఐసిస్ దారుణంగా హతమార్చిందని.. హంతక ఉగ్రవాదులపై అమెరికా చాలా తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నా. సిరియాలోని ఐసిస్ బలమైన ప్రాంతాలపై మేము చాలా బలంగా దాడి చేస్తున్నాము. రక్తంతో తడిసిన ఈ ప్రదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఐసిస్‌ను నిర్మూలించగలిగితే ఉజ్వల భవిష్యత్తు ఉంది. సిరియాకు గొప్పతనాన్ని తిరిగి తీసుకురావడానికి చాలా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి నేతృత్వంలోని సిరియా ప్రభుత్వం.. పూర్తిగా మద్దతు ఇస్తుంది.’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
భారత్ మార్కెట్‌లోకి కొత్త రింగ్.. బడ్జెట్‌లో హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్
ఫిట్‌నెస్, హెల్త్‌పై ఫోకస్ పెరుగుతుంది.. అయితే, తమ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు ప్రతీసారి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తమ హెల్త్, ఫిట్‌నెస్ లెవల్ తెలుసుకోవడానికి ఎన్నో గాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి.. స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ రింగ్‌లు కూడా వచ్చేశాయి.. భారతీయ ధరించగలిగే కంపెనీ బోఆట్ తన కొత్త స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. ఆ కంపెనీ భారత మార్కెట్లో వాలర్ రింగ్ 1 ను విడుదల చేసింది, ఇది ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ ట్రాకింగ్ లక్షణాలతో వస్తుంది. మీరు ఎల్లప్పుడూ వాచ్ ధరించలేని వాచ్ స్థానంలో ఈ రింగ్‌ను ఉపయోగించవచ్చు. టైటానియం ఫ్రేమ్‌తో రూపొందించిన ఈ రింగ్.. హార్ట్‌బీట్ రేటు పర్యవేక్షణ, SpO2 ట్రాకింగ్, నిద్ర విశ్లేషణ, ఒత్తిడి వంటి వివరాలను ట్రాక్ చేస్తుంది. ఇది బహుళ స్పోర్ట్స్ మోడ్‌లు మరియు దీర్ఘ బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. బోఆట్ వాలర్ రింగ్ 1 ను కంపెనీ రూ.11,999 కు విడుదల చేసింది. ఈ రింగ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఫిట్‌నెస్ ట్రాకర్ కార్బన్ బ్లాక్ మ్యాట్ ఫినిష్‌లో వస్తుంది మరియు 7 నుండి 12 వరకు రింగ్ సైజులలో లభిస్తుంది. కంపెనీ సైజింగ్ కిట్‌ను కూడా అందిస్తోంది, ఇది వినియోగదారులు తమ ఇళ్ల నుండి సరైన సైజును ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఉంగరాన్ని కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారులు ఆరోగ్య ప్రయోజన ప్యాకేజీని అందుకుంటారని కూడా కంపెనీ చెబుతోంది.
నేడు టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్ గిల్ కష్టమేనా?
2026 టీ20 వరల్డ్ కప్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. 20 జట్లతో జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుంది. భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా అనే అంశంపై అందరి దృష్టి ఉంది. అందుకు తొలి అడుగు డిసెంబర్ 20, శనివారం పడనుంది. ఆ రోజు జాతీయ సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించనున్నారు. ముంబైలో అగార్కర్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అయితే జట్టులో పెద్ద మార్పులు జరిగే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన అదే 15 మంది ఆటగాళ్లే వరల్డ్ కప్ జట్టులో కూడా ఉండే అవకాశముంది. అయితే శుభ్‌మన్ గిల్ తాజా ఫామ్‌పై మాత్రం చర్చలు తప్పక వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఓపెనర్‌గా ఆడటం వరల్డ్ కప్‌కు సరైన వ్యూహమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైస్ కెప్టెన్‌గా మళ్లీ టీ20 జట్టులోకి వచ్చిన తర్వాత గిల్ ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. ప్రస్తుతం టెస్ట్, వన్డే కెప్టెన్‌గా ఉన్న 26 ఏళ్ల గిల్, కాలికి గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చి 37 పరుగులతో వేగంగా ఆడి ఆకట్టుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు శాంసన్ సరైన ఎంపిక అన్న అభిప్రాయం బలపడుతోంది. కాగా.. భారత టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన డిసెంబర్ 20, శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరుగుతుంది. ఈ ప్రకటన ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం నుంచి జరుగుతుంది. సెలక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
‘నాన్న పేరు నిలబెట్టాలి’ – రోషన్ ఎమోషనల్ స్పీచ్
శ్రీకాంత్ తనయుడిగా ‘నిర్మల కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ సినిమాలతో మెప్పించిన రోషన్ మేకా, ఇప్పుడు తన కెరీర్‌ను మలుపు తిప్పే ‘ఛాంపియన్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో మనముందుకు వస్తున్నారు. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రోషన్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి.. ‘ వారసత్వంతో రావడం అదృష్టమే కానీ, ఇక్కడ నిలబడాలి అంటే కష్టం కావాలి’ అని చెబుతూ, ఈ సినిమా కోసం తాను శారీరకంగా, మానసికంగా పడ్డ శ్రమను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి శ్రీకాంత్ కష్టాన్ని చూస్తూ పెరిగిన తాను, ఆయన పేరు నిలబెట్టేలా ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డానని రోషన్ చెప్పిన తీరు ఆయన పరిణతిని చాటిచెప్పింది. ఈ సినిమాలో రోషన్ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించబోతుండగా ఈ పాత్ర కోసం ఆయన చేసిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ మరియు ట్రైలర్‌లో చూపించిన ఎనర్జీ చూస్తుంటే రోషన్ కెరీర్‌కు ఇది కచ్చితంగా ఒక ‘టర్నింగ్ పాయింట్’ అనిపిస్తోంది. కేవలం ఆట మాత్రమే కాకుండా, ఒక క్రీడాకారుడి జీవితంలోని గెలుపు ఓటములు, రాజకీయాలు, మరియు ఎమోషన్స్‌ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న ట్రైలర్ చూస్తుంటే, రోషన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద నిజమైన ‘ఛాంపియన్’ అనిపించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజా సాబ్’ సెకండ్ ట్రైలర్ అప్‌డెట్ ..?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హారర్-కామెడీ మూవీ 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ప్రకటనలో భాగంగా కొన్ని నెలల క్రితం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్, సినిమాపై అంచనాలను పెంచారు. ఇప్పుడు మరో ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 27న జరగనుండగా, వేదికగా హైదరాబాద్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, వీ టీవీ గణేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ రిలీజ్ ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.