నేడు జనసేన ఆవిర్భావ సభ.. 90 నిమిషాలు పవన్ ప్రసంగం..!
2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీగా ప్రతి ఏడాది ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ఈసారి మాత్రం అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో జనసేన అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చేయడానికి ప్లాన్ చేసింది. దానికి అనుగుణంగా ప్రోగ్రామింగ్ కమిటీ, ఆహ్వాన కమిటీ, డెకరేషన్ కమిటీ.. ఇలా రకరకాలుగా అందరినీ భాగస్వామ్యం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జనసైనికులు వచ్చే అవకాశం ఉంది. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి అర కిలోమీటర్ దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడానికి హెలిప్యాడ్ సిద్ధం చేశారు. సభా ప్రాంగణానికి వచ్చే మార్గాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సభ మానిటరింగ్ చేస్తారు. దానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. 250 మంది డయాస్‌పై ఉంటారు. వాహనాల పార్కింగ్‌కి ఐదు ప్రాంతాలను ఏర్పాటు చేశారు.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ ప్రసంగం 90 నిమిషాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే ఈ సభ ఉద్దేశం అంటున్నారు పార్టీ నేతలు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. పాల్గొన్న లోకేష్ దంపతులు
యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 12 గంటలకు నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి ప్రభుత్వం తరఫున నారా లోకేష్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోఛ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివార్లకు విష్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం రక్షాబంధనం, మధుపర్క నివేదన, స్వామివారి పాదపక్షాలన, విశేష అర్చన, మహా సంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ దంపతుల రాకను పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామ దేవాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ దంపతులకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
శ్రీశైలంలో సంప్రదాయబద్ధంగా గిరిప్రదక్షిణ, లక్ష కుంకుమార్చన
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈవో శ్రీన్నవాసరవు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.. శ్రీసామి అమ్మవారి మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఎక్కించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ధర్మప్రచార రథంలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చుకులు ప్రారంభించారు.. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయం రాజగోపురం నుంచి ప్రారంభమై.. గంగాధర మండపం, ఆంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, వీరభద్రస్వామి ఆలయం, పంచమఠాలు, మల్లన్న కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకుని తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది.. క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా దిరిగిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.. ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.. గిరి ప్రదక్షిణ ముగిసిన అనంతరం అమ్మవారి ఆలయంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి కావడంతో లక్షకుంకుమార్చన నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భక్తులు పరోక్షసేవగా కూడా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించడంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నుంచి భక్తులు పాల్గొన్నారు.. ఈ లక్ష కుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించి అర్చకులు, వేదపండితులు లక్షకుంకుమార్చన జరిపించారు.. ఈ పూజాకైకర్యాలతో ఆలయ ఈవో శ్రీనివాసరావు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
హోలీ వేడుకల్లో డప్పు కొట్టి డ్యాన్స్ చేసిన జగ్గారెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి పట్టంలోని రామ్ నగర్ కాలనీలో తన చిన్న నాటి మిత్రులతో కలిసి కాముని దహన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి దోస్తులతో కాసేపు ముచ్చిటించిన తర్వాత కాముని దహనం ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు కొడుతూ.. డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్లందరిని ఉత్సాహపరిచాడు. ఇక, హోలీ వేడుకల్లో జగ్గారెడ్డి పాల్గొంటే ఆ కిక్కే వేరప్పా అని అతడి స్నేహితులు, కాలనీ వాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. జగ్గారెడ్డి ఉన్న చోట సంతోషం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. ఇక, జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నా చిన్నప్పటి నుంచి ఇలా హోలీ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు కావాల్సిన ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు.. సంగారెడ్డి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జగ్గారెడ్డి తెలిపారు.
గ్రామ పెద్దలకు పోలీసుల నోటీసులు.. పిడిగుద్దులాటపై ఉత్కంఠ!
నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలం హున్సలో పిడిగుద్దులాట ఆగడం లేదు. హోలీ పండుగ రోజు నిర్వహించే ఆటకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. గ్రామంలోని యువకులు ఈ ఆటను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో పురుషులు తాళ్లకు ఇరువైపులా చేరుకొని పిడికిళ్లతో ఒకరిపై మరోకరు గుద్దుకుంటారు. ఈ ఆటను నిర్వహించకపోతే మా గ్రామానికి అరిష్టమని చెబుతున్నారు. ఇక, సంప్రదాయం పేరుతో, అనాదిగా వస్తున్న ఆచారం పేర్లు చెప్పి జరుపుకునే పిడిగుద్దులాట ప్రమాదకరమని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇలా, ఒకరిపై ఒకరు పడి పిడిగుద్దులతో విరుచుకు పడటంతో దెబ్బలు తగిలి గాయాలు కావడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. దీంతో ఈ ఆటకు అనుమతి లేదన్నారు. ఆట ఆడితే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ పెద్దలకు నోటీసులు అందజేశారు. సాంప్రదాయ పండగకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పట్ల గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగను ప్రశాంతంగా జరుపుకుంటాం అనుమతి ఇవ్వలంటున్న గ్రామస్తులు కోరారు. హున్సాలో పిడిగుద్దులు ఆటపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవ్వరు ఎన్ని ఆంక్షలు పెట్టిన పిడిగుద్దులాట అడి తీరుతామని గ్రామస్థులు తేల్చి చెప్పారు.
అమెరికన్ల మెడకు ఉచ్చుగా భారత్ పై ట్రంప్ విధించిన సుంకం.. ఎందుకంటే?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పలు దేశాలపై పన్నుల మోతమోగిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించిన ట్రంప్ ఏప్రిల్ రెండో తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. భారత వస్తువులపై భారత వస్తువులపై పరస్పర సుంకాలు విధించడం గురించి ట్రంప్ మాట్లాడారు. దీంతో అమెరికాలో ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున భారతదేశంపై ట్రంప్ విధించిన సుంకం అమెరికన్లకు మెడకు ఉచ్చుగా మారవచ్చని భావిస్తున్నారు. లక్షలాది మంది అమెరికన్లు తమ మందుల కోసం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చంటున్నారు. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలలో దాదాపు సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ మందులు బ్రాండ్ నేమ్ మందుల కంటే చాలా చౌకగా లభిస్తున్నాయి. అమెరికాలో వైద్యులు రోగులకు సిఫార్సు చేసే 10 మందులలో తొమ్మిది భారతదేశం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. కన్సల్టింగ్ సంస్థ IQVIA అధ్యయనం ప్రకారం, భారతీయ జనరిక్ మందులు 2022 నాటికి $219 బిలియన్ల ఆదాకు దారితీయవచ్చు. వాణిజ్య ఒప్పందం లేకుండా ట్రంప్ సుంకాలు కొన్ని భారతీయ జనరిక్ ఔషధాలను ఉపయోగం కానివిగా మారుస్తాయని నిపుణులు అంటున్నారు. దీని వలన కంపెనీలు మార్కెట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. దీంతో ఇప్పటికే ఉన్న ఔషధ కొరత మరింత తీవ్రమవుతుంది.
యువరాజ్ సింగ్ సిక్సర్ల మోత.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు!
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎమ్‌ఎల్) 2025లో ఇండియా మాస్టర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం రాయపూర్ వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన సెమీఫైనల్లో ఇండియా 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల ఛేదనలో ఆసీస్ 18.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా తరఫున యువరాజ్ సింగ్ (59; 30 బంతుల్లో 1×4, 7×6) సిక్సర్ల మోత మోగించగా.. షాబాజ్ నదీమ్ (4/15) బంతితో మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన షాబాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది. యువరాజ్ సింగ్ (59; 30 బంతుల్లో 1×4, 7×6) హాఫ్ సెంచరీ చేశాడు. యువీ తన మార్క్ సిక్సులతో విరుచుకుపడ్డాడు. సచిన్ టెండ్యూలర్ (42; 30 బంతుల్లో 7×4), స్టువర్ట్ బిన్నీ (36; 21 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించారు. ఆసీస్ బౌలర్లలో డోహర్టీ (2/30), డానియల్ క్రిస్టియన్ (2/40) వికెట్స్ తీశారు. ఛేదనలో షాబాజ్ నదీమ్ (4/15) సహా వినయ్ కుమార్ (2/10), ఇర్ఫాన్ పఠాన్ (2/31) విజృంభించడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. బెన్ కటింగ్ (39) టాప్ స్కోరర్. వెస్టిండీస్, శ్రీలంక మధ్య రెండో సెమీస్ విజేతతో ఇండియా ఫైనల్ ఆడుతుంది.
ఎలిమినేటర్‌లో గుజరాత్ చిత్తు.. ఫైనల్లో ముంబై ఇండియన్స్!
డబ్ల్యూపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో గురువారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్ 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. డేనియలీ గిబ్సన్ (34; 24 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్. లిచ్‌ఫీల్డ్ (31; 20 బంతుల్లో 4×4, 1×6), భార్తీ ఫుల్మాలి (30; 20 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు సరిపోలేదు. ముంబై బౌలర్లు హేలీ మాథ్యూస్ (3/31), అమేలియా కెర్ (2/28) రాణించారు. ఇక శనివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై ఢీకొంటుంది. ఎలిమినేటర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. నాట్‌సీవర్ (77; 41 బంతుల్లో 10×4, 2×6), హేలీ మాథ్యూస్ (77; 50 బంతుల్లో 10×4, 3×6) హాఫ్ సెంచరీలు చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36; 12 బంతుల్లో 2×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. చివరి ఐదు ఓవర్లలో ముంబై ఏకంగా 73 పరుగులు పిండుకుంది. గుజరాత్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగులోనూ విఫలమైంది. నాలుగు క్యాచ్‌లు వదిలేసి ముంబై భారీ స్కోరుకు బాటలు వేశారు. భారీ ఛేదనలో గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. పవర్‌ప్లే ముగిసే సరికి 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూనీ (6), యోల్ (8), గార్డ్‌నర్ (8) విఫలమయ్యారు. ఈ సమయంలో దశలో గిబ్సన్, లిచ్‌ఫీల్డ్ ధాటిగా ఆడారు కానీ.. ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. వీళ్లిద్దరూ ఔట్ అయ్యాక గుజరాత్ 12 ఓవర్లలో 107/5తో ఓటమి అంచన నిలిచింది. భార్తీ ఫుల్మాలి మెరుపులు మెరిపించినా.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. 47 పరుగుల తేడాతో గుజరాత్ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అందులో భాగం అవుతున్నందుకు భయంగా ఉంది..
సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ తో అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. చివరగా వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగ్రా’ మూవీతో అలరించింది.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాగా హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ‘ఆల్ఫా’ సినిమాతో తీరిక లేకుండా గడుపుతోంది ఈ భామ. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే గత సంవత్సరం ‘మెట్‌గాలా’ లో అదరగొట్టిన అలియా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు రెడీ అవుతోంది. త్వరలో కేన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ముస్తాబవుతుంది అలియా. ఇందులో భాగంగా తాజాగా ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘నేను ‘ఆల్ఫా’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మే 13 నుంచి మే 24, 2025 వరకు జరగబోయే 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియన్ స్టార్స్ ఎప్పటి నుంచో వస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, దీపికా పదుకొణె, సోనమ్ కపూర్ లాంటి వాళ్ళు రెగ్యులర్‌గా వస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గొప్ప పండుగ ఇది. ఈ ఏడాది ఇందులో నేను భాగం కావడం కొంచెం భయంగానే ఉంది కానీ.. కేన్స్లో తొలి అడుగు చేయబోతున్నందుకు ఉత్సాహంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది అలియా.
‘చరణ్ 16’ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ !
తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుల్లో రామ్ చరణ్ ఒకరు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తర్వాత దాదాపు మూడు ఏళ్లకు ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చరణ్. కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. కాగా చరణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో దర్శకుడు బుచ్చిబాబుతో ‘#RC16’ ఒకటి. ఈ గ్లోబల్ స్టార్ కు జతగా అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. దీంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో రివిల్ కాగా ఇందులో చెర్రీ.. బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతున్న ఈ వీడియో చూసిన అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్‌పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే భారీ ఆఫర్స్‌ని పలు టాప్ ఓటిటి సంస్థలు ఈ సినిమా ముందు ఉంచాయట. అందులో మెయిన్‌గా సోనీ లివ్ సంస్థ ఈ సినిమాకి రికార్డు మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌తో డీల్ ఫైనల్ చేసే ప్లానింగ్‌లో ఉన్నట్టు టాక్. రామ్ చరణ్ ఆలోచన కూడా ఇదే కావడంతో మేకర్స్ నెట్ ఫ్లిక్స్‌తో టైఅప్ కానున్నట్టుగా సమాచారం. మరి చూడాలి ఈ సినిమాను ఎవరు సొంతం చేసుకుంటారో .