హయగ్రీవ ఫామ్స్ అండ్ విల్లాస్‌కు మరో షాక్..!
విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ సంస్థకు షాక్ మీద షాక్ తగులుతోంది. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన 12.5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న జిల్లా యంత్రాంగం.. వాటిని 22ఏ జాబితాలో చేర్చింది. నిషేధిత భూములుగా నోటిఫై చేయడంతో రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములతో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ కు విశాఖ జిల్లా యంత్రాంగం చుక్కలు చూపిస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన వ్యాపార భాగస్వాములతో కలిసి వేసిన స్కెచ్ మొదటికే మోసం తెచ్చింది. అక్రమాలపై విచారణలో నిజాలు నిగ్గు తేలడంతో 16 ఏళ్ల తర్వాత కేటాయింపులు రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇక, ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఎండాడలోని సుమారు 500కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకుని కంచేవేసింది రెవెన్యూ యంత్రాంగం. సర్వే నెంబర్ 92/3లోని 12.51 ఎకరాలను 22(A) జాబితాలో చేర్చడం ద్వారా నిషేధిత భూములుగా ప్రకటించింది. దీంతో హయగ్రీవకు సంబంధించిన క్రయవిక్రయాలు., రిజిస్ట్రేషన్ లు పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ముదినేనివడ్డెపల్లెలో ఈ నెల 2వ తేదీన జరిగిన తెలుగుదేశం పార్టీ నేత తిరుపతి వారాధి (77) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆ ఘటనపై ఆరా తీశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. దీంతో, పోలీసులు ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సంబేపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన తిరుపతి వారాధి (77) కొన్నేళ్ల క్రితం ముదినేనివడ్డెపల్లె కు వచ్చి స్థిరపడ్డారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులు చేసి పెడుతూ వస్తుండేవారు. ఇటీవల ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల పనులు చేయించేందుకు కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. రహదారి నిర్మాణానికి మరో 49 లక్షల విలువైన పని వచ్చిందని స్థానికులకు చెప్పారు. దీంతో అదే గ్రామానికి చెందిన మదనపల్లి చిన్నికృష్ణ, బంగారువాండ్లపల్లెకు చెందిన యోగానందరెడ్డి అలియాస్ ఆనంద్ రెడ్డిలు కాంట్రాక్టు పనుల కోసం పోటీ పడడమే కాకుండా ఎక్కడ నుంచో వచ్చి తమ గ్రామంలో పెత్తనం చెలాయిస్తున్నాడని వారు తిరుపతి వారాధి పై ద్వేషం పెంచుకున్నారు. ఈ నెల 2వ తేదీన మల్లూరమ్మ గుడి వద్ద వేప చెట్టు కింద తిరుపతి వారాధి నిద్రిస్తుండగా చిన్నికృష్ణ, ఆనంద రెడ్డిలు కలిసి బండరాయితో కొట్టి చంపినట్లు తమ విచారణలో తేలిందని రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్ఐ భక్తవత్సలం వివరించారు. హత్య కేసులోని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.
వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ వర్సిటీ.. 7 అంశాలలో..!
హైదరాబాద్ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది.. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది.. 2025 ఎడిషన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో సబ్జెక్టుల వారీగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏడు అధ్యయన అంశాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఎంపికకావడం విశేషంగా చెప్పుకోవాలి.. మార్చి 12వ తేదీన దీనికి సంబంధించిన ర్యాంకింగ్స్ విడుదల చేశారు.. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లోని 1,700 విశ్వవిద్యాలయాల్లో 55 విద్యా విభాగాలకు చెందిన విద్యార్థులు తీసుకున్న 18,300 కంటే ఎక్కువ వ్యక్తిగత విశ్వవిద్యాలయ కార్యక్రమాల పనితీరుపై విశ్లేషణతో ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు.. అయితే, హైదరాబాద్ యూనివర్సిటీ ఏడు సబ్జెక్టులలో ర్యాంక్ పొందింది.. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ (251-300), లింగ్విస్టిక్స్ (301-350), సోషియాలజీ (301-375), కెమిస్ట్రీ (451-500), ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్ (501-550), ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ (601-675), బయోలాజికల్ సైన్సెస్ (651-700).. ఇలా ఏడు సబ్జెక్టులలో ర్యాంక్స్ సొంతం చేసుకుంది.. దీనిపై స్పందించిన యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ ఫ్రొఫెసర్ బీజే రావు.. విశ్వవిద్యాలయానికి ఇది గర్వకారణం అన్నారు.. సబ్జెక్టుల వారీగా QS ప్రపంచ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఈ విజయంతో మేం గర్వపడుతున్నాం.. ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న విభాగాలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు బీజే రావు.. అయితే, మేం మా విజయాలతో సంతృప్తి చెందలేదు. మరిన్ని విషయాలను అందుకోవడానికి.. ఈ ర్యాంకింగ్స్‌లో మా ఉనికిని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. దాని కోసం మేం అవిశ్రాంతంగా పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం అన్నారు హైదరాబాద్ యూనివర్సిటీ వీసీ బీజే రావు..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు..
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో కేసులో నోటీసులు అందజేశారు. గతంలో నోటీసులకు న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చిన పోచంపల్లిని వ్యక్తిగతంగా హాజరు కావాలని మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైటెక్ సిటీలోని అపర్ణా ఆర్చిడ్స్ లోని ఆయన నివాసానికి వచ్చి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం గేటు వద్ద గోడకు పోలీసులు నోటీసు కాఫీ అతికించారు. ఇక, రేపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆయనకి ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇక, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4తో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. గతంలోనే ఫామ్ హౌస్ కు సంబంధించిన లీజు డాక్యుమెంట్లు మొయినాబాద్ పోలీసులకు పోచంపల్లి లాయర్లు అందజేశారు. లీజు డాక్యుమెంట్స్ పై కొన్ని అనుమానాలు ఉండడంతో వాటిని నివృత్తి చేసుకునేందుకు మరోసారి పోచంపల్లిని విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు పంపించారు.
శాంతి చర్చల్లో భాగంగా రష్యా ఏం చేసిందంటే…!
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగింపునకు అడుగులు పడుతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియాలో రష్యాతో చర్చలు జరుగుపుతోంది. తొలుత తమ పాత్ర లేకుండా చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. తాజాగా శాంతి చర్చలకు ఓకే చెప్పింది. ఇక రష్యా కూడా ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించడానికి సుముఖంగా ఉంది. అలాగే అమెరికాతో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ఒప్పందానికి సంబంధించిన డిమాండ్లను రష్యా.. అమెరికాకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే గత మూడు వారాలుగా రష్యన్-అమెరికా అధికారులు సౌదీ అరేబియాలో శాంతి చర్చలు జరుపుతున్నారు. కొందరు వ్యక్తితంగా.. ఇంకొందరు వర్చువల్‌గా కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదని.. అలాగే ఉక్రెయిన్ నుంచి విదేశీ దళాలు ఉపసంహరించుకోవాలని రష్యా డిమాండ్ చేసినట్లు సమాచారం. మొత్తానికి శాంతి చర్చలు సఫలీకృతం అయ్యేలా కనిపిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే… బాంబు మోతకు ఫుల్ స్టాఫ్ట్ పడనుంది.
హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. భారత్ తరఫున తొలి బంతి వేసిన ఘనత!
భారత మాజీ ఆల్‌రౌండర్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) కన్నుమూశారు. కెరీర్ అనంతరం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డ ఆయన అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అబిద్ అలీ బంధువు రెజా ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అబిద్ అలీ మృతి పట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్, భారత మాజీ క్రికెటర్ అండ్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌లు అబిద్ అలీ సేవలను గుర్తుచేసుకున్నారు. సయ్యద్ అబిద్ అలీ 1967-74 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 29 టెస్టుల్లో 20.36 సగటుతో 1018 పరుగులు చేశారు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేస్ బౌలింగ్‌తో 47 వికెట్లు (42.12 సగటు) తీశారు. 5 వన్డేల్లో 93 పరుగులు, 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాదు.. మేటి ఫీల్డర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. అబిద్ అలీ తక్కువ మ్యాచ్‌ల్లోనే తనదైన ముద్ర వేశారు. 1974 జూలై 13న లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తొలి వన్డే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో అబిద్ అలీ తొలి బంతిని వేసి చిరస్మరణీయ ఘనతను సొంతం చేసుకున్నారు. తొలి వన్డే ప్రపంచ కప్‌లో (1975) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయితే అదే మ్యాచ్ ఆయనకు ఆఖరి వన్డే అయింది.
నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరేదెవరో!
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో నేడు కీలక పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం అవుతుంది. డబ్ల్యూపీఎల్ 2025లో ఇప్పటికే గుజరాత్‌పై రెండుసార్లు గెలిచిన ముంబై.. ఎలిమినేటర్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అంతేకాదు సొంతగడ్డపై ఆడుతుండడం కూడా ముంబైకి కలిసొచ్చే అంశం. హేలీ మాథ్యూస్, నాట్‌సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్, యాస్టికా భాటియా వంటి బ్యాటర్లతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. ముఖ్యంగా హేలీ మెరుపు ఆరంభాలను ఇవ్వడమే కాకుండా.. తన ఆఫ్‌స్పిన్‌తోనూ రాణిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న నాట్‌సీవర్ టోర్నీలో ఇప్పటికే నాలుగు అర్ధ శతకాలు చేసింది. ఎనిమిది మ్యాచ్‌లల 416 పరుగులు చేయడమే కాకుండా.. 8 వికెట్లు పడగొట్టింది. హర్మన్‌ప్రీత్ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి చేసింది. బౌలింగ్‌లో అమేలియా కెర్, హేలీ, నాట్‌సీవర్ ముంబైకి బలం.
అనవరంగా జనాల కోసం ఇరికించొద్దు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒక ఉపు ఊపిన వారిలో కరీనా కపూర్ ఒకరు. తన నటన అందంతో దాదాపు అందరు హీరోలతో పని చేసిన ఈ హాట్ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక గత మూడు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న కరీనా గతేడాది ‘క్రూ’, ‘సింగమ్ అగైన్’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రజంట్ మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస చిత్రాలు, సిరీస్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించడం గురించి వైరల్ కామెంట్స్ చేసింది.. కరీనా మాట్లాడుతూ.. ‘ ప్రతి ఒక ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాల్ని అంగీకరించడానికి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే తెరపై అలా చేయడం అసౌకర్యంగా ఉంటుంది. నిజానికి నేను ఎప్పుడూ అలాంటి పాత్రల్లో నటించలేదు. ఇలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా ఇబ్బందులు పడినట్లు ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ తెలిపారు. కొంత మంది ఇబ్బంది ఉన్న తప్పదు అన్నట్టు చేస్తారు. కానీ ఇలాంటి బోల్డ్ సీన్స్ సినిమాకు కచ్చితంగా అవసరమనుకుంటే పెట్టాలి తప్ప ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి కావాలని వీటిని ఇరికించొద్దు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ చిత్రాలు మహిళల చుట్టూ ఇంటెన్స్ సన్నివేశాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ మన దేశంలో సంస్కృతి, సంప్రదాయాలకు విలువ లెక్కువ. అందుకే భారతీయ చిత్ర పరిశ్రమ అలాంటి సన్నివేశాలు కూడా తెరపై సంప్రదాయంగా చూపిస్తే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చింది కరీనా. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరో కొత్త కాన్సెప్ట్‌తో విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ టీజర్..
విజయ్ ఆంటోనీ గురించి పరిచయం అక్కర్లేదు.డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ హీరోలలో అతనొకడు. హీరోగానే కాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నాడు విజయ్. ‘సలీం’ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన విజయ్.. ‘బిచ్చగాడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయారు. ఇప్పుడు తన కెరీర్‌లో 25వ చిత్రంగా ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో ‘భద్రకాళి’, తమిళ్ లో ‘శక్తి తిరుమగన్’ అనే టైటిల్ తో రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా లేటెస్టుగా మూవీ టీజర్‌ను విడుదల చేశారు.. ‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్ధం, అహంకారం అంతం అవును’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో ఒక గ్యాంగ్ స్టర్‌గా, మోసగాడిగా, ఫ్యామిలీ మ్యాన్ గా, గవర్నమెంట్ ఆఫీసర్ గా, ఖైదీగా.. ఇలా రకరకాల కోణాల్లో హీరో ని చూపించారు. కానీ అసలు సినిమాలో అతని పాత్ర ఏంటనేది అర్థం కాకుండా, కథ ఏంటనేది హింట్ ఇచ్చేలా టీజర్‌ను కట్ చేసారు. మరి ఈ మూవీ తో అయిన విజయ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.