అట్టహాసంగా భోగి వేడుకలు.. కాలు దువ్వుతున్న పందెం కోళ్లు..
తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా నిర్వహించేందుకు బెట్టింగ్ బాబులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు బరులు సిద్ధమయ్యాయి. ఒక్కో నియోజకవర్గ పరిధిలో పదుల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రధాన బరికి అనుబంధంగా మరో 10 చిన్నవి ఏర్పాటు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో సుమారు 30 ఎకరాల లే అవుట్‌లో భారీ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. రేయింబవళ్లూ పందేలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లు అమర్చారు. ప్రత్యేకంగా డ్రోన్లు, ఆధునిక కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. అతిథులకు సరికొత్త రుచులు అందించేలా ప్రత్యేకంగా వంట మనుషులను రప్పించారు. అమలాపురం పరిధిలోని ఎస్.యానాంలో సముద్ర తీరంలో నాలుగెకరాల నేలను సంక్రాంతి సంబరాల పేరిట చదును చేశారు. ఇక్కడ మూడు రోజులూ కోడి పందేలు నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది. కోనసీమలోని ఆత్రేయపురంలో పదిచోట్ల బరులు సిద్ధం చేశారు. కాకినాడ గ్రామీణంలోని నేమాం, సూర్యారావుపేటలో పెద్దబరులు ఏర్పాటయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం, గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లిలోనూ బరులు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల కూటమిలోని ప్రధాన పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు బయటపడుతోంది. మధ్యాహ్నం తర్వాత పందేల జోరు పెంచి మంగళవారం పెద్దఎత్తున నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. రూ.వందల కోట్లు చేతులు మారే అవకాశముంది.
ఏలూరులో కలకలం.. సినిమాలను తలదన్నే రేంజిలో చోరీ..
ఏలూరు నగరంలో శనివారం రాత్రి ఒక జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది. ఆ దుకాణంలో దొంగతనం తీరు వ్యాపారులనే కాదు స్థానికులను సైతం భయపడే విధంగా ఉంది. షాపుకు వెనుక వైపున పాడుబడిన భవనం ఉండడంతో ఇది గమనించిన దొంగలు గోడకి కన్నం వేసి ఉన్నదంతా దోచేశారు.. అపహ రించిన నగల విలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువ ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన మానేపల్లి మారుతీ రఘురామ్ మెయిన్‌బజార్‌లో లోకేశ్వరి జ్యూయలర్స్ అండ్ బ్యాంకర్స్ వెండి, బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు వెండి, బంగారపు వస్తువులను తాకట్టు పెట్టుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. షాపు ముందు ఎంతో అందంగా కనిపించిన ఆ షాపు వెనుక మాత్రం ఓ పాడుబడ్డ పురాతన భవనం. దొంగలకు అదే కలిసి వచ్చింది. బయటకు మాత్రం ప్రహరీ గోడ, ఓ చెక్క తలుపు ఉన్నాయి. దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి ప్రణాళిక ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు స్పష్టమవుతుంది. మారుతీరఘురామ్ యథావిథిగా ఈనెల 11న రాత్రి 10.30 గంటలకు షాపును కట్టివేసి తాళాలు వేసుకుని వెళ్లారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు షాపు వద్దకు వచ్చి తాళాలు, గేట్లు, తలు పులను తెరచి చూసేటప్పటికీ ఒక్కసారిగా కుప్పకూలి మారుతీ రఘురామ్ కిందపడిపోయాడు. ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరు కోవడంతో షాపులోపల గోడకు పెద్ద రంధ్రం ఉండడాన్ని గమనిం చారు. వెంటనే ఈ సమాచారాన్ని ఏలూరు వన్‌టౌన్ సీఐ జి సత్యనారాయణకు అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్, పోలీసు జాగిలాలతో పరిశీలింపచేయించారు. సుమారు పాతిక కేజీల వెండి, రెండున్నర కేజీల బంగారం అపహర ణకు గురైనట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. వెనుకవైపు ఉన్న పురాతన శిధిలం భవనం లోపలకు దొంగలు ప్రవేశించారు. భయంక రంగా ఉన్న ఆ లోపల నుంచి నాలుగు అడుగుల మందం కల్గిన గోడకు రంధ్రం పెట్టి షాపులోపలకు ప్రవేశించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ నగలను పట్టుకుపోయారు. రంగంలో దిగిన పోలీసు బృందాలు దొంగను పట్టుకుని పనిలో పడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించారని.. అయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు. జిల్లా కలక్టరేట్ లో అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించి, మీటింగ్ ని పక్కదారి పట్టించారని కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసును నమోదు చేశారు. ఇక, తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, బూతులు తిడుతూ దాడికి యత్నించారని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై సైతం పోలీసులు ఇంకో కేసు నమోదు చేశారు. వేరు వేరుగా మూడు కేసులను పోలీసులు నమోదు చేసుకున్నారు. అయితే, ఆదివారం నాడు కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరోకరు తోసుకోవడంతో సమావేశం గందరగోళంగా మారింది.
నేడు ఖమ్మం జిల్లాలో ఐదుగురు మంత్రుల పర్యటన..
ఖమ్మం జిల్లాలో నేడు (జనవరి 13) ఐదుగురు మంత్రులు పర్యటించబోతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించబోతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంఖుస్థాపన చేయనున్నారు. అయితే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ఉదయం 9: 30గంటలకు హెలీకాప్టర్ ద్వారా ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకుంటారు. కలెక్టరేట్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలపై మంత్రులు, ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు రఘునాథపాలెం మండలం మంచుకొండలో జరిగే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాత్రి మధిరలో బస చేసి మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌కి తిరిగి వెళ్లనున్నారు. ఇక, ఖమ్మం జిల్లాలో ఐదుగురు మంత్రులు పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు జెడ్-మోడ్ టన్నెల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
జమ్మూ-కశ్మీర్ లోని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (జనవరి 13) ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్ ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి. అయితే, ఈ టన్నెల్ ఓపెనింగ్ కు ప్రధాని మోడీ రాక నేపథ్యంలో ఆదివారం అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక, కొన్ని ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని సైతం భారీగా మోహరించారు. పలు జిల్లాల్లోని ముఖ్యమైన కూడళ్లలో చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ జరుగుతున్న కారణంగా ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు, ఇతర వాహనాల తనిఖీలను ముమ్మరం కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్‌లతో సహా వైమానిక, సాంకేతిక నిఘా పెట్టినట్లు చెప్పారు. అలాగే, శనివారం నుంచి ఈరోజు (సోమవారం) వరకు శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిని అధికారులు బంద్ చేశారు. జెడ్-మోర్ సొరంగం సమీపంలో ఎస్పీజీ సిబ్బంది కార్యక్రమ వేదికను పూర్తిస్థాయిలో తమ అధీనంలోకి తీసేసుకుంది. గగాందీర్ దగ్గర ప్రధాని మోడీ బహిరంగ ర్యాలీలో ప్రసంగించే ఛాన్స్ ఉందని జమ్ము కాశ్మీర్ అధికారులు పేర్కొన్నారు.
నేటి నుంచి మహా కుంభమేళా షురూ..
గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్.. మహా కుంభ మేళాకు రెడీ అయింది. నేటి (జనవరి 13) నుంచి ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ప్రారంభం అయింది. పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభ్.. సుమారు 45 రోజుల పాటు జరగనుంది. రాజ స్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చారు. ఈ మహా కుంభమేళాకు 35 కోట్ల మంది భక్తులు తరలివచ్చే ఛాన్స్ ఉందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇక, మహా కుంభమేళాను ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ భారీగా ఏర్పాట్లు చేసింది. భద్రతతో పాటు సౌకర్యాల కోసం సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంది. కృత్రిమ మేధ సహకారంతో దీనిని డిజిటల్ కుంభమేళాగా మార్చింది. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు చేశామని.. 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
గ్యాస్ స్టేషన్‌లో పేలుడు.. 15 మంది మృతి, 67 మందికి గాయాలు
యెమెన్‌లోని ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో భారీ అగ్నిప్రమాదం సంభవించి కనీసం 15 మంది మృతి చెందారు. బయ్దా ప్రావిన్స్‌లోని జహెర్ జిల్లాలో శనివారం ఈ పేలుడు సంభవించిందని హౌతీ తిరుగుబాటుదారుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటన ప్రకారం, కనీసం 67 మంది గాయపడ్డారు, వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుడుకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆన్‌లైన్‌లో ప్రసారమైన ఫుటేజ్‌లో భారీ అగ్నిప్రమాదం కనిపించింది. మంటల కారణంగా వాహనాలు బూడిదయ్యాయి మరియు ఆకాశంలో పొగ మేఘాలు పైకి లేచాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో గ్యాస్ స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య హింస కొనసాగుతోంది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో హౌతీలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంతలో, ఇద్దరి మధ్య ఉద్రిక్తత ఎంతగా పెరిగిందంటే, ఇద్దరూ ఒకరిపై ఒకరు నేరుగా దాడి చేసుకుంటున్నారు.
డాకు మహారాజ్.. ఓటీటీ పార్టనర్ ఎవరో తెలుసా..?
ఇక తాజాగా ‘డాకు మహారాజ్’ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా ఈమూవీ డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ ఒకింత భారీ మొత్తం ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది. నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందట. సితార నిర్మాతలు స్పందిస్తే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సితార నిర్మాతలు తమ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఈ మూవీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు విక్రయిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో సైతం హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక బుట్టబొమ్మ పని అయిపోయినట్లేనా.. అదే ఆఖరి అవకాశమా ?
పూజా హెగ్డే కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరితోనూ కలిసి నటించింది. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్య, అఖిల్, వెంకటేష్ సహా టాప్ హీరోలు అవకాశాలిచ్చి ఆమెను ఎంకరేజ్ చేశారు. అయితే తను చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాపులు అవుతుండడంతో కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది. టాలీవుడ్ లో కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి రాకుండా పోయాయి. అదే సమయంలో పూజా తన స్టాఫ్ కి జీతభత్యాల పేరుతో ప్రొడ్యూసర్ల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కారణం ఏదైనా టాలీవుడ్ నుంచి పూజా అనూహ్యంగా కనుమరుగు అయింది. కోలీవుడ్ లోను అగ్ర హీరోలు అవకాశాలిచ్చినా కానీ కెరీర్ కు ఉపయోగపడే సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు అందుకోవడంలో వెనుకబడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే నటిస్తోంది. అక్కడ కూడా అరకొర అవకాశాలే దక్కుతున్నాయి. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన `దేవా`లో పూజా హెగ్డేకు అవకాశం దక్కింది. ఇందులో షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఇది కూడా తనకు అంతగా కలిసిరాదని అర్థం అవుతుంది.