జడ్పీటీసీ ఉప ఎన్నిక.. పులివెందులలో టెన్షన్.. టెన్షన్..
కడప జిల్లాలో రెండు జట్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. అయితే, తెల్లవారుజాము నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. పులివెందులలో అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు పోలీసులు. ఇక, వేంపల్లిలో సతీష్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.. టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి అరెస్ట్‌కు ప్రయత్నం.. హౌస్ అరెస్ట్ చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు.. ఎన్నికలు జరిగే గ్రామాలకు కూడా నేను వెళ్లనని తెలిపారు రామ్‌గోపాల్‌రెడ్డి.. ఇక, ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి పంచాయతీ సర్పంచ్ లక్ష్మీనారాయణను హైస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, పులివెందుల ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉండగా.. మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.. ఈ ఎన్నికల్లో 10,601 మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.. మరోవైపు, ఒంటిమిట్టలో ఎన్నికల బరిలోనూ 11 మంది అభ్యర్థులు ఉండగా.. మొత్తం 17 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.. ఇక్కడ 24,606 మంది ఓటర్లు ఉన్నారు.. పులివెందుల జడ్పీటీసీ ప ఎన్నికకు 550 మంది పోలీసులు, 4 ప్లటూన్లు, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.. అటు ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ఇప్పటివరకు పులివెందులలో 750 మంది పైన బైండోవర్ కేసులు నమోదు కాగా.. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.. ఇక, బ్యాలెట్ పద్ధతిలో జట్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతుండగా.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.. అయితే, అటు, వైసీపీ, ఇటు టీడీపీ నేతల అరెస్ట్‌లతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..
ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఉదయం 7 గంటలకే పులివెందులతో పాటు ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది.. అయితే, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.. పులివెందులలోని అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు.. దీంతో, ఆయన అరెస్ట్‌ను గ్రహించిన వైసీపీ శ్రేణులు అవినాష్ రెడ్డి ఇంటి వద్దే నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపిన పోలీసులు.. వైఎస్ అవినాష్‌రెడ్డి.. బలవంతంగా అరెస్ట్ చేశారు.. ఆయన్ను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసినంత పనిచేశారు.. అయితే, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. జడ్పీటీసీ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని మేం కోరుతూ వస్తున్నామని.. నేను ఇంట్లో ఉండగా వచ్చి అరెస్ట్ చేయడం దేనికి అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం, పోలీసులు విఫలం అయ్యారని దుయ్యబట్టారు.. అరెస్ట్ సమయంలో పోలీసులతో అవినాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, ఇంట్లోనే ఉంటానంటూ చెప్పినా పోలీసులు వినకుండా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సిట్టింగ్ ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు.. అయితే, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా పులివెందులలో ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి..
నేడు ఒంగోలు పోలీసుల విచారణకు ఆర్జీవీ.. హాజరుపై ఉత్కంఠ..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది.. అయితే, పోలీసుల విచారణకు ఆర్జీవీ వస్తాడా? రాడా? అనేది ఉత్కంఠగా మారింది.. కాగా, వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో వర్మ పై కేసు నమోదు అయ్యింది.. ఇదే సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా పలు పీఎస్‌లలో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి.. అయితే, ఈ కేసులో హైకోర్టులో బెయిల్ పొందారు వర్మ.. ఇదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేయగా.. గత ఫిబ్రవరిలో ఒంగోలు రూరల్ స్టేషన్ లో ఓ సారి విచారణకు హాజరయ్యారు వర్మ.. మరోసారి విచారణకు హాజరుకావాలంటూ గత నెల 22వ తేదీన వర్మకు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఇవాళ విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు వర్మ.. దీంతో వర్మ విచారణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.. అయితే, పోలీసుల విచారణకు ఆర్జీవీ హాజరవుతారా? లేదా చివరి నిమిషంలో ఇంకా ఏదైనా మెలిక పెడతారా? అనేది ఉత్కంఠగా మారింది..
కృష్ణమ్మ పరవళ్లు.. మరోసారి శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత
ఓవైపు వర్షాలు, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కృష్ణా నదిలో వదర ప్రభావం కొనసాగుతోంది.. దీంతో, ఈ ఏడాదిలోనే వరుసగా మూడోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు అధికారు.. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుండగా.. ఈ ఏడాదిలో మూడోవ సారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు అధికారులు.. జలాశయం నాలుగు గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.. ఇక, శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 2,23,802 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,73,651 క్యూసెక్కులుగా ఉంది.. ఇక, శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటినిల్వ 204.7889 టీఎంసీలుగా ఉందని.. మరోవైపు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. దీంతో, మొత్తం 1,73,651 క్యూసెక్కులు నీరు ఔట్‌ఫ్లో రూపంలో ప్రాజెక్టు నుంచి వెళ్తుంది.. ఇక, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతుండగా.. 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 66,123 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 75,142 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే, ప్రస్తుత సామర్థ్యం 310.2522 టీఎంసీలుగా ఉంది.. అయితే, ఇప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తడంతో.. ఇన్‌ఫ్లో పెరుగుతుంది.. దాదాపు 1.73 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో మరిన్ని గేట్లను ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నేడు బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్‌కి వెళ్తారనే సమాచారంతో రామచందర్ రావును ముందస్తుగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ దుండగుడు పెద్దమ్మ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. నేడు పెద్దమ్మ టెంపుల్‌లో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామచందర్ రావు ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. షెడ్యూల్ ప్రక్రారం.. నేడు లాలాపేటలో, గోషామహల్ నియోజకవర్గంలో తిరంగా యాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉంది.
సింధు నదిపై ఆనకట్ట నిర్మిస్తే భారత్ తో యుద్ధమే..
పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ భారత్ తో యుద్ధం చేస్తానని బెదిరించారు. భారత్ సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసి సింధు నదిపై ఆనకట్ట నిర్మించడానికి ప్రయత్నిస్తే, పరిస్థితి యుద్ధానికి దారితీస్తుందని తెలిపాడు. భిట్ షాలో జరిగిన ‘షా లతీఫ్ అవార్డు’ ప్రదానోత్సవంలో హజ్రత్ షా అబ్దుల్ లతీఫ్ భిట్టై 282వ ఉర్సు సందర్భంగా బిలావల్ ఈ ప్రకటన చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై అనేక కఠినమైన చర్యలు తీసుకుందని, అందులో సింధు జల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. ఈ చర్యపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పుతిన్ మైండ్‌సెట్ నిమిషాల్లోనే తెలిసిపోతుంది.. అలాస్కా భేటీపై ట్రంప్ వ్యాఖ్య
ఆగస్టు 15న ట్రంప్-పుతిన్ సమావేశం అవుతున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. చర్చలు ఫలించలేదు. ఇప్పుడు స్వయంగా ట్రంపే రంగంలోకి దిగుతున్నారు. అలాస్కా వేదికగా ఆగస్టు 15న ఇద్దరూ భేటీ అవుతున్నారు. శాంతి ఒప్పందం జరుగుతుందా? లేదా? అనేది సస్పెన్ష్‌గా ఉంది. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. సోమవారం వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పుతిన్‌తో శాంతి ఒప్పందం సాధ్యమేనా కాదా అనేది నిమిషాల్లోనే తనకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకునేందుకే ఆగస్టు 15న పుతిన్‌తో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ త్వరగానే ముగుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని.. శాంతి ఒప్పందం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన మొదటి రెండు నిమిషాల్లోనే ఒప్పందం జరుగుతుందా? లేదా అనేది తెలుస్తుందన్నారు.
టెక్సాస్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్ టార్గెట్ పార్కింగ్ స్థలంలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోని టార్గెట్ స్టోర్ పార్కింగ్ స్థలం దగ్గర మానసిక రుగ్మతతో బాధపడుతున్న 30 ఏళ్ల యువకుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. సంఘటనాస్థలిలోనే ముగ్గురు ప్రాణాలు వదిలారు. అనంతరం నిందితుడు పారిపోతూ రెండు వాహనాలు దొంగిలించాడు. ఆస్టిన్ పోలీస్ చీఫ్ లిసా డేవిస్ మాట్లాడుతూ.. అనుమానితుడిని దక్షిణ ఆస్టిన్‌లో దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో పట్టుకున్నట్లు తెలిపింది.
వియన్నా కన్వెన్షన్ అంటే ఏమిటి?.. దీనిపై పాకిస్తాన్‌కు చాలాసార్లు గుణపాఠం నేర్పిన భారత్
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు వార్తాపత్రికలను డెలివరీ చేయడాన్ని పాకిస్తాన్ నిషేధించింది. దీనిని పాకిస్తాన్ సంకుచిత మనస్తత్వం కలిగిన చర్యగా, వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత్ అభివర్ణించింది. ఈ నేపథ్యంలో వియన్నా కన్వెన్షన్ అంటే ఏమిటి? దాని కింద ఏ హక్కులు ఇవ్వబడ్డాయి? ఆ వివరాలు మీకోసం.. స్వతంత్ర, సార్వభౌమ దేశాల మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించి 1961లో వియన్నా సమావేశం మొదటిసారి జరిగింది. దీని కింద, దౌత్యవేత్తలకు ప్రత్యేక హక్కులు కల్పించే అంతర్జాతీయ ఒప్పందానికి నిబంధన విధించారు. దీని ఆధారంగా, దౌత్యవేత్తల రక్షణ కోసం అంతర్జాతీయ చట్టాలకు నిబంధన విధించబడింది.
స్టార్ పేసర్ ఎంట్రీ.. ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే!
యూఏఈలో సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఈనెల 19 లేదా 20న అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒకటి, రెండు స్థానాలకు మినహా జట్టుపై బీసీసీఐ సెలెక్టర్లు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. పనిభార నిర్వహణలో భాగంగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఆడిన బుమ్రా.. ఆసియా కప్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనున్న విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌ను బీసీసీఐ సెలక్టర్లు పర్యవేక్షించనున్నారు. సూర్య ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేస్తాడని సెలక్టర్లు నమ్మకంగా ఉన్నారు. వైస్ కెప్టెన్సీ కోసం అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు గిల్‌నే కెప్టెన్‌గా ఉంచాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైస్ కెప్టెన్సీ ఇచ్చి.. టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం కెప్టెన్‌గా చేసే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉందట. గతేడాది శ్రీలంకతో సిరీస్‌లో గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
టాలీవుడ్ లో9వ రోజుకు చేరుకున్న షూటింగ్స్ బంద్
టాలీవుడ్ లో కొనసాగుతున్న షూటింగ్స్ బంద్ 9వ రోజుకు చేరుకుంది. కానీ పరిస్కారం దొరకలేదు. నిన్న తెలంగాణ ఎఫ్ డి సి ఛైర్మెన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో విడి విడి గా చర్చించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాం అని ఫెడరేషన్ నాయకులకు మంత్రి కోమటి రెడ్డి హామీ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ లో దిల్ రాజు నేతృత్వంలో నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జారబోతున్నారు. ఈరోజు జరిగే చర్చలలో సానుకూల స్పందన వస్తుంది అని ఫెడరేషన్ నాయకుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీలో అంతిమ నిర్ణయం ఉంటుంది ఉంటుందన్నారు నిర్మాతలు మరియు ఫెడరేషన్ నాయకులు. మరోవైపు నిన్న ప్రసాద్ ల్యాబ్ లో రైజింగ్ నిర్మాతల సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు చెప్పారు. నిర్మాతల పెట్టిన 4 కండిషన్స్ కు ఫెడరేషన్ ఒకే అంటేనే వేతనాలు పెంచుతామని చెప్పారు నిర్మాతలు. 30 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని తేల్చి చెప్పారు ఫెడరేషన్ నాయకులు. అలాగే నిన్న సినిమా కార్మికుల సమస్యలు.. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు సంబంధించి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. ఏపీ లో సినీ పరిశ్రమ అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు మంత్రి కందుల దుర్గేష్. నేడు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగే నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల చర్చలపైనే అందరి దృష్టి ఉంది. త్వరగా ఈ సమస్యకు పరిస్కారం చూపి షూటింగ్స్ తిరిగి స్టార్ట్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు.
రజినీ ‘కూలీ’ ఈవెంట్.. తొలిసారి తెలుగులో ప్రసారం
మన దగ్గర ఒకప్పుడు సినిమాలు విడుదలకు ముందు ఆడియో వేడుకలు ఉండేవి. తర్వాత అవి ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా మారాయి. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం ఇప్పటికీ ఆడియో వేడుకలే కొనసాగుతున్నాయి. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’ కి మాత్రం ఈ సారి కొంచెం విభిన్నంగా, ఇంకా గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. “కూలీ అన్‌లీష్డ్” పేరుతో జరిగిన ఈ ఈవెంట్ యూట్యూబ్ లేదా ఇతర ఛానెల్స్‌లో లైవ్ ఇవ్వకుండా, సన్ టీవీ లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేశారు. ఈ ఈవెంట్‌లో మరో విశేషం ఏమిటంటే.. కూలీ ఈవెంట్ తెలుగులో కూడా ప్రసారం కానుంది. ఆగస్టు 15న రాత్రి 9:30 గంటలకు సన్ నెట్‌వర్క్‌లో భాగమైన జెమినీ టీవీపై ఇది ప్రసారం కానుంది. సాధారణంగా తమిళ సినిమాలకు తెలుగులో చిన్న ఈవెంట్లు లేదా ప్రెస్ మీట్లు చేస్తారు. కానీ చెన్నైలో జరిగిన ఒక పూర్తి స్థాయి తమిళ ఈవెంట్‌ను నేరుగా తెలుగులో ప్రసారం చేయడం చాలా అరుదు. బహుశా ఇది తొలిసారి అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ ఈవెంట్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తమిళంలో పాడిన పాటల బదులు కూలీ తెలుగు పాటలను వినిపించనున్నారు.